ఏప్రిల్‌ 26.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఆ సినిమా ఓ అద్భుతం!


ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందిన బీబీసీ వాళ్లు కిందటేడు ఓ అంతర్జాతీయ సర్వే చేశారు. ఆ సర్వేలో భాగంగా ‘ప్రపంచంలోనే అత్యంత గొప్ప విదేశీ చిత్రం ఏది?’ అని అడిగితే, అత్యధికమైన ఓట్లు ఓ సినిమాకి పడ్డాయి. ఆ సినిమా ఏంటో తెలుసా? జపాన్‌ వాళ్ల ‘సెవెన్‌ సమురాయ్‌’. ఎప్పుడో 1954 నాటి ఈ సినిమాను ఈనాటికీ అత్యధికులు గుర్తు పెట్టుకున్నారనడానికి ఈ సర్వే ఓ నిదర్శనం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? అంతర్జాతీయంగా మేటి దర్శకుడిగా పేరొందిన అకిరా కురొసావా. ఎన్నో మంచి సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని జనం కొన్నాళ్లు గుర్తుపెట్టుకుని వదిలేస్తారు. కానీ ఈనాటికీ సినీ ప్రేక్షకులు ఈ సినిమాను గుర్తుపెట్టుకున్నారంటే దాని ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. జపాన్‌లో 1586 ప్రాంతంలో జరిగిన ఓ చారిత్రక సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆధారంగా ఎన్నో రీమేక్‌లు, అనుకరణలు, అనుశీలనలు ఎన్నో భాషల్లో వచ్చాయి.

కథ విషయానికి వస్తే... బందిపోటు దొంగలు దాడి చేయబోతున్నారని తెలిసి ఓ పల్లెటూరి వాళ్లు, వారిని ఎదుర్కోడానికి ఎలా సిద్ధమయ్యారనేదే కథ. ఆనాటి కాలంలో బందిపోట్ల దొంగల బెడద అధికంగా ఉండేది. బందిపోటు దొంగలు దాడికి సిద్ధమైతే, వాళ్ల నాయకుడు కొన్నాళ్లు ఆగుదామని, అప్పటికి పంటలన్నీ పండుతాయని చెబుతాడు. ఈ సంభాషణ విన్న ఆ పల్లెటూరి యువకుడు తన గ్రామస్థులను అప్రమత్తం చేస్తారు. అప్పుడు వాళ్లందరూ తమ రక్షణ కోసం వృద్ధుడైన ఓ ‘సమురాయ్‌’ని సంప్రదిస్తారు. సమురాయ్‌ అంటే యుద్ధవీరుడు అని అర్థం. ఆ సమురాయ్‌ తనలాంటి ఏడుగురు సమురాయ్‌లను ఓ బృందంగా తయారు చేస్తే వాళ్లందరినీ గ్రామస్థులు పోషించడానికి సిద్ధమవుతారు. ఆ ఏడుగురూ కలిసి గ్రామస్థులకు యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తారు. ఆయుధాలు ఉపయోగించడం, వ్యూహాలు పన్నడంలో రాటు దేలుస్తారు. చివరకు అందరూ కలిసి ఊరిపైకి ఆయుధాలతో దండెత్తి వచ్చిన 40 మంది బందిపోట్లను ఎలా ఎదుర్కొని తరిమికొట్టారనేదే కథ. ఈ కథ వినగానే బాలీవుడ్‌లో వచ్చిన ‘షోలే’ గుర్తొచ్చిందా? నిజానికి ఈ సినిమా ఆధారంగా ఒక్క ‘షోలే’ మాత్రమే కాదు, ‘ద గన్స్‌ ఆఫ్‌ నవరోన్‌’, ‘ద మ్యాగ్నిఫిషియెంట్‌ సెవెన్‌’, ‘ఎ బగ్స్‌ లైఫ్‌’, ‘ద ఇన్విజిబుల్‌ సిక్స్‌’ లాంటి ఎన్నో సినిమాలు రూపొందాయి. ఈ సినిమాను అకిరా కురొసావా తెరకెక్కించిన విధానాన్ని ఈనాటికీ గొప్పగా చెప్పుకుంటారు. సినిమాను తీయడానికి అప్పట్లోనే వేర్వేరు కోణాల్లో ఎక్కువ కెమేరాలను దర్శకుడు ఉపయోగించడం విశేషం. ఈ సినిమాను జపాన్‌ కరెన్సీ ప్రకారం 125 మిలియన్‌ యెన్‌లతో తీస్తే అప్పట్లోనే 268 మిలియన్‌ యెన్‌లను ఆర్జించింది. వీడియోలు, సీడీలు, డీవీడీలు, డిస్క్‌లు, బ్లూరేలలో ఇప్పటికీ ఈ సినిమా అమితంగా అమ్ముడుపోతుండడం విశేషం. కథనంలోను, సృజనాత్మక చిత్రీకరణలోను, సాంకేతికంగాను ప్రపంచ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా దీన్ని పేర్కొంటారు.

* ఉక్కుమనిషి సందడి


హాలీవుడ్‌ సినిమాల్లో సూపర్‌హీరోల హడావుడి, వాళ్ల సీక్వెల్‌ సినిమాల సందడి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామిక్‌ పుస్తకాల్లోంచి పుట్టుకొచ్చిన ఐరన్‌మ్యాన్‌ కూడా వెండితెరపై కావలసినంత హంగామా చేశాడు. తొలిసారిగా 2008లో వెండితెరపైకి దూకిన ఐరన్‌మ్యాన్, దాని సీక్వెల్‌ సినిమాతో 2010లో మళ్లీ వచ్చేశాడు. ఓ ఫార్ములా కోసం దుండగులు బంధించిన తండ్రిని విడిపించుకోవడం కోసం ఐరన్‌మ్యాన్‌ తొడుగును కనిపెట్టి, దాని సాయంతో వారిని ఎదుర్కోవడం మొదటి సినిమా కథ అయితే, ఈసారి ఆ తొడుగును సైనికులకు అందించాలని ప్రభుత్వం నుంచే ఒత్తిడి వస్తుంది. ఈలోగా కొందరు దుండగులు విజృంభించడం, తిరిగి ఐరన్‌మ్యాన్‌ తన శక్తులన్నీ చూపించడం రెండో సినిమాలో కథ. ఈ సినిమాను 200 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే, ఏకంగా 623.9 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. అత్యధిక పారితోషం తీసుకునే నటుడిగా పేరొందిన రాబర్ట్‌ డౌనీ జూనియర్, అందాల తార గ్వినెత్‌ పాల్ట్రో జంటగా నటించిన ఈ సినిమాకు జాన్‌ ఫావ్రో దర్శకుడు.

* మరో మార్షల్‌ వీరుడు!


అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్, ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచి, ‘‘నువ్వు నా పెర్సనల్‌ బాడీగార్డ్‌గా ఉంటావా?’’ అని అడిగాడు.

అందుకా కుర్రాడు ఏమన్నాడో తెలుసా?

‘‘నేను ఎవరికీ బాడీగార్డ్‌గా ఉండి కాపాడను. పెద్దయ్యాక నా వందకోట్ల మంది చైనీయుల్ని రక్షిస్తాను’’!

చిన్నతనంలోనే చైనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనలో పేరు తెచ్చుకుని, అమెరికా అధ్యక్షుడి ముందు ప్రదర్శన ఇచ్చినప్పుడు ఓ కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటన ఇది.

అమెరికా అధ్యక్షుడికి అంత ధైర్యంగా సమాధానం చెప్పిన ఆ కుర్రాడు, పెద్దయ్యాక వెండితెర నటుడై వందకోట్ల మంది చైనీయులకే కాదు, ప్రపంచ సినీ అభిమానులకే వినోదాన్ని పంచి పెట్టాడు.

అతడే జెట్‌లీ! బ్రూస్‌లీ, జాకీచాన్‌ తర్వాత వెండితెరపై మార్షల్‌ ఆర్ట్స్‌ వీరుడిగా అలరించిన నటుడు. నటుడిగా, నిర్మాతగా, మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌గా అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఇతడి అసలు పేరు లిలియాన్‌జీ. పందొమ్మిదేళ్లకే అతడు నటించిన ‘షాలొలిన్‌ టెంపుల్‌’ (1982) అతడికి అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. ఆపై అతడు నటించిన ‘లెథల్‌ వెపన్‌4’, ‘రోమియో మస్ట్‌ డై’, ‘కిస్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌’, ‘అన్‌లీష్‌డ్‌’, ‘ద వన్‌’, ‘వార్‌’, ‘ద ఫర్బిడెన్‌ కింగ్డమ్‌’, ‘ద ఎక్పెండబుల్స్‌’, ‘ద మమ్మీ: టూంబ్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌ ఎంపెరర్‌’ సినిమాలు అతడికి స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టాయి.

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన జెట్‌లీ, నలుగురి సంతానంలో చివరి వాడిగా కుటుంబంతో పాటు పేదరికం అనుభవించాడు. ఎనిమిదేళ్ల వయసులో బడి వేసవి శిబిరంలో ‘ఉషు’ అనే మార్షల్‌ ఆర్ట్‌ నేర్చుకుంటున్న ఇతడిలోని వేగం, ఉత్సాహం ప్రముఖ కోచ్‌లను ఆకట్టుకున్నాయి. దాంతో వాళ్లు అతడిని చేరదీశారు. పోషకాహారం సమకూర్చే స్థోమత కూడా లేని ఆ కుటుంబం పరస్థితి గమనించి వాళ్లకి ఆహారాన్ని కూడా వాళ్లే సమకూర్చారు. ఆ విద్యే అతడిని అందలాలు ఎక్కించింది. ఆ విద్యలో పన్నెండేళ్లకే ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. అలా అతడు 15 బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించి అంతర్జాతీయ గుర్తింపును పొందాడు. ఆ గుర్తింపే అతడికి వెండితెరకు బాటలు వేసింది. ఓ పబ్లిసిటీ కంపెనీ ఇతడి అసలు పేరు పలకడం కష్టంగా ఉందని భావించి, జెట్‌ స్పీడుతో దూసుకుపోతున్న ఇతడికి జెట్‌లీ అనే పేరు పెట్టింది. అదే అతడి వెండితెర పేరయింది. ఆపై ఇతడు జాకీఛాన్, సిల్వస్టర్‌ స్టాలోన్‌ లాంటి అగ్రతారలతో కూడా తెరను పంచుకున్నాడు. బీజింగ్‌లో 1963 ఏప్రిల్‌ 26న పుట్టిన జెట్‌లీ... నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎన్నో అవార్డులు అందుకుంటూ జెట్‌ వేగంతో దూసుకుపోతూనే ఉన్నాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.