ఏప్రిల్‌ 3 (సినీ చరిత్రలో ఈరోజు)...

* నటన నుంచి నాయకత్వం వరకు..
జయప్రద (పుట్టినరోజు-1962)


‘ఆ
రేసుకోబోయి పారేసుకున్నాను...’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె ఆడిపాడితే బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షమే కురిసింది. అటు కమర్షియల్‌ కథానాయికగానూ... ఇటు నటనకి ప్రాధాన్యమున్న కథల్లోనూ ఒదిగిపోయి మెప్పించిన నటి... జయప్రద. ఆమె అందం ఒకెత్తైతే... అభినయం మరో ఎత్తు. తెలుగు సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 250కిపైగా సినిమాలు చేసి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. 1970 నుంచి 90 దశకం ఆరంభం వరకు దక్షిణాదితో పాటు, ఉత్తరాది చిత్ర పరిశ్రమల్లో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగారు జయప్రద. కథానాయికగా ఊపుమీదున్న దశలోనే ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట రాజ్యసభ సభ్యురాలిగానూ, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ పార్లమెంటు సభ్యులుగా కొనసాగారు. జయప్రద అసలు పేరు రవణం లలితారాణి. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాక పేరు మార్చుకున్నారు. రాజమండ్రిలో సినీ ఫైనాన్షియర్‌ కృష్ణారావు, నీలవేణి దంపతులకి ఏప్రిల్‌ 3, 1962న జన్మించారు జయప్రద. చిన్న వయసులోనే సంగీతం, నృత్యం నేర్చుకుని పట్టు పెంచుకొన్నారు. 13 యేళ్ల వయసులో స్కూల్‌లో జరిగిన వేడుకలో నృత్య ప్రదర్శన చేయడం చూసిన దర్శకుడు కె.బి.తిలక్‌ తాను తీస్తున్న ‘భూమికోసం’ సినిమాలో అవకాశమిచ్చారు. మూడు నిమిషాల పాటలో నృత్యం చేసే ఆ పాత్రని చేయడానికి మొదట జయప్రద తిరస్కరించినా, ఆమె కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో సరే అన్నారు. ఆ చిత్రానికిగానూ జయప్రద అందుకున్న పారితోషికం రూ: 10. కానీ ఆ మూడు నిమిషాల పాటని చూశాక పరిశ్రమకి చెందిన పలువురు దర్శకులు జయప్రదకి అవకాశాలు ఇచ్చారు. అలా పదిహేడేళ్లకే ఆమె పెద్ద స్టార్‌గా అవతరించారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’, కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సిరి సిరి మువ్వ’ ఆమెని నటిగా నిలబెట్టాయి. ‘సీతాకళ్యాణం’, ‘అడవిరాముడు’ తదితర చిత్రాలతో జయప్రద పేరు మార్మోగిపోయింది. ‘యమగోల’, ‘కురుక్షేత్రం’, ‘రామకృష్ణులు’, ‘మేలుకొలుపు’, ‘రాజపుత్ర రహస్యం’, ‘అందమైన అనుభవం’, ‘రంగూన్‌ రౌడీ’, ‘సీతారాములు’, ‘సర్కర్‌ రాముడు’, ‘చండీప్రియ’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘స్వయంవరం’, ‘కృష్ణార్జునులు’, ‘సాగర సంగమం’, ‘సింహాసనం’, ‘దేవత’... ఇలా విజయవంతమైన చిత్రాలెన్నో చేశారు జయప్రద. కన్నడలో రాజ్‌కుమార్‌తోనూ, తమిళంలో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతోనూ, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి, హిందీలో అమితాబ్‌ బచ్చన్, జితేంద్ర, మలయాళంలో మోహన్‌లాల్‌... ఇలా అగ్ర కథానాయకుల సరసన నటించిన జయప్రద ఆయా భాషల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కథానాయికగా అవకాశాలు తగ్గాక వయసుకు తగ్గ పాత్రలు చేసి మెప్పించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆమె 1996లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకి ఎంపికయ్యారు. తెలుగు మహిళ విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడుతో విభేదాలు రావడంతో, సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. కొన్నాళ్ల క్రితం ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. జయప్రదకి ‘అంతులేని కథ’కిగానూ ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఆమె బుల్లితెరతోనూ అనుబంధం పెంచుకొని లోకల్‌ టీవీలో ‘జయప్రదం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. జయప్రద అప్పటికే వివాహితుడైన శ్రీకాంత్‌ నహతాని వివాహం చేసుకన్నారు. రాజకీయాలతో బిజీ కావడంతో మధ్యలో కొంతకాలం సినిమా రంగానికి దూరమయ్యారు. ఇటీవల ‘శరభ’ చిత్రంతో ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు జయప్రద పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌..
ప్రభుదేవా (పుట్టినరోజు- 1973)


‘నే
ఆడితే లోకమే ఆడదా అన్నట్టు..’ ప్రభుదేవా డ్యాన్స్‌ ఆడటం మొదలు పెట్టారంటే లోకం మొత్తం ఊగిపోవల్సిందే. ఆయన చిన్నగా కాలు కదిపినా చాలు... అందులో ఓ లయ కనిపిస్తుంది. అందులో ఓ ప్రత్యేకమైన కళ కనిపిస్తుంది. ఇక ఆయన ఆడిపాడటానికే రంగంలోకి దిగారంటే క్లాసూ మాసూ అనే తేడా లేకుండా అందరూ ఒకటైపోవల్సిందే. ఇండియన్‌ మైఖైల్‌ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించే ఇదంతా! భారతీయ సినిమాల్లో నృత్యాల శైలినే మార్చేసిన ఘనత ప్రభుదేవాది. ‘‘చికుబుకు చికుబుకు రైలే...’’ అంటూ ఆయన డ్యాన్స్‌తో దూసుకొచ్చాడు. ఆ తరువాత కథానాయకుడయ్యాడు, దర్శకుడయ్యాడు. నిర్మాతగా కూడా విజయాల్ని అందుకొన్నాడు. టీనేజ్‌లోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన నృత్య దర్శకుడిగా ఎంతో ఖ్యాతి గడించాడు. రెండుసార్లు జాతీయ పురస్కారాల్ని అందుకొన్నాడు. నృత్య కళలో ఆయన చేసిన సేవలకిగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రభుదేవా 1973 ఏప్రిల్‌ 3న మైసూరులో జన్మించాడు. ఆయన తండ్రి సుందరం ప్రముఖ నృత్య దర్శకుడు. తండ్రితో పాటు చిన్నప్పుడు సినిమా షూటింగ్‌లకి వెళ్లడం ప్రభుదేవాకి అలవాటుగా ఉండేదట. అలా డ్యాన్స్‌పై మక్కువ పెంచుకొన్న ఆయన ఆ తరువాత లక్ష్మీనారాయణ మాస్టర్, ధర్మరాజు మాస్టర్ల దగ్గర నృత్యంలో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తరువాత తండ్రి దగ్గరే సహాయకుడిగా చేరాడు. తండ్రి పలు సినిమాలతో బిజీగా ఉండటంతో, కొన్ని చిత్రీకరణలకి ప్రభుదేవానే వెళ్లి నృత్యాలు సమకూర్చేవారట. అలా ఆయన నృత్యంపై పట్టు పెంచుకొన్నాడు. పూర్తిస్థాయి నృత్య దర్శకుడిగా మారి, టీనేజ్‌లోనే చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్‌వంటి అగ్ర కథానాయకులతో స్టెప్పులేయించాడు. ఆ తరువాత ‘ఇదయం’, ‘జెంటిల్‌మేన్‌’ సినిమాల్లో ప్రభుదేవా తెరపై పాటలకి స్టెప్పులేస్తూ కనిపించాడు. అవి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన్ని దర్శకుడు పవిత్రన్‌ ‘ఇందు’ అనే చిత్రంతో కథానాయకుడిని చేశాడు. ఆ తరువాత శంకర్‌ దర్శకత్వంలో ‘ప్రేమికుడు’ చేశాడు. ‘ప్రేమికుడు’ ఘన విజయం సాధించడంతో ప్రభుదేవా పేరు మార్మోగిపోయింది. అప్పట్నుంచి నృత్య దర్శకుడిగా, నటుడిగా కొనసాగుతూ వచ్చాడు. ‘వర్షం’ సినిమా చిత్రీకరణ సమయంలో నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు ‘ఒక సినిమాకి దర్శకత్వం చేస్తావా?’ అని అడగటంతో వెంటనే ఒప్పుకున్నాడు ప్రభుదేవా. అలా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో దర్శకుడిగా మారాడు ప్రభు. దర్శకత్వం వహించిన తొలి చిత్రమే ఘన విజయం సాధించడంతో ప్రభుదేవాకి మరిన్ని అవకాశాలొచ్చాయి. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’, చిరంజీవితో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రాలు చేశారు ప్రభు. బాలీవుడ్‌లోనూ సల్మాన్‌ఖాన్, అజయ్‌ దేవగణ్, అక్షయ్‌కుమార్‌ వంటి అగ్ర నటుల చిత్రాలకి దర్శకత్వం వహించాడు. గత ఏడాది సల్మాన్‌తో ‘దబాంగ్‌ 3’ని తెరకెక్కించారు. ప్రభుదేవా వృత్తి పరమైన విషయాలతోనే కాకుండా... వ్యక్తిగత జీవితం పరంగా కూడా పలుమార్లు వార్తల్లోకెక్కాడు. రామలతని వివాహం చేసుకున్న ఆయన 2010లో ఆమె నుంచి విడిపోయాడు. కథానాయిక నయనతారతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొన్నారు కానీ.. నాæకీయ పరిణామల మధ్య 2012లో ఈ ఇద్దరూ విడిపోయారు. ప్రభుదేవాకి ఇద్దరు కుమారులున్నారు. ఆయన తమ్ముళ్లు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌... ఇద్దరూ కూడా నటులుగా, నృత్య దర్శకులుగా రాణిస్తున్నారు. దక్షిణాదిలో ప్రయాణం మొదలుపెట్టి... బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న ప్రభుదేవా పుట్టినరోజు ఈ రోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* మధుర గాయకుడు..
హరిహరన్‌ (పుట్టినరోజు-1955)


రిహరన్‌... ఈ పేరు వినని భారతీయ సంగీత ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. మలయాళంతో పాటు హిందీ, కన్నడ, మరాళీ, భోజ్‌పురి, తెలుగు భాషల్లో వేలాది పాæలు ఆలపించారు. గజల్‌ గాయకుడిగా హరిహరన్‌కి ఎంతో పేరుంది. విదేశాల్లోనూ ఈయనకి అభిమానులున్నారు. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారరంతో సత్కరించింది. తొలినాళ్లలో టెలివిజన్‌లో ప్రదర్శనలు ఇస్తూ ప్రాచుర్యం పొందిన హరిహరన్‌ ఆ తరువాత సినీ నేపథ్య గాయకుడిగా మారాడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఆయన్ని 1992లో తమిళ చిత్ర సీమకి పరిచయం చేశాడు. ‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాల్లో పాటలు పాడి దేశవ్యాప్తంగా శ్రోతల్ని అలరించాడు. రెహమాన్‌ సంగీతంలో పాటలు పాడిన గాయకుల్లో ముఖ్యులు హరిహరన్‌. తెలుగులో ‘జాబిలికి వెన్నెలనిస్తా... (అశోక్‌), ‘హిమ సీమల్లో హల్లో యమగుంది ఒళ్లో... (అన్నయ్య), ‘హరిమ హరిమ... (రోబో), ‘ఇంకా ఏదో కావాలంటూ... (నిన్నే పెళ్లాడతా), ‘ఈ రేయి తీయనిదీ.. (జానీ), ‘చిన్నగ చిన్నగ... (ఠాగూర్‌), ‘చంద్రకళ చంద్రకళ... (అదుర్స్‌), ‘భద్ర శైల రాజ మందిర... (శ్రీరామదాసు), ‘అత్తారింటికి నిన్నెత్తుకుపోతా.. (ఒక్కడు), ‘ఆడపిల్ల.. అగ్గిపుల్ల’ (సైనికుడు) తదితర పాటలు పాడి అలరించారు. హరిహరన్‌ కేరళలోని తిరువనంతపురంలో 1955 ఏప్రిల్‌ 3న ఓ తమిళ అయ్యర్‌ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అలమేలు, హెచ్‌.ఎ.ఎస్‌.మణి ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీతకారులు. ముంబయిలోనే పెరిగారు హరిహరన్‌. పైన్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీల్ని పూర్తి చేసిన ఆయన చిన్న తనంలోనే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. హిందూస్థానీ సంగీతంలోనూ శిక్షణ పొందారు. మెహ్దీహసన్, జగ్జీత్‌ సింగ్‌ వంటి గాయకుల ప్రభావంతో గజల్‌ సంగీతం నేర్చుకున్నారు. ప్రతి రోజూ 13 గంటలకిపైగా సాధన చేసేవారట. లెస్లే లెవిస్‌తో కలిసి కొలోనియల్‌ కజిన్స్‌ పేరుతో బ్యాండ్‌ని ఏర్పాటు చేసిన హరిహరన్‌ పలు ఆల్బమ్‌లు రూపొందించారు. పలు చిత్రాలకి సంగీతం అందించారు. సినీ నేపథ్య గాయకుడిగా పలుమార్లు జాతీయ పురస్కారాలు పొందిన ఆయన దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. భక్తిగీతాలకి పెట్టింది పేరైన హరిహరన్‌ పుట్టినరోజు ఈ రోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* రెండు దశాబ్దాల సినీ ప్రస్థానం


టిగా, గాయనిగా, జంతు సంక్షేమ ఉద్యమకారిణిగా తనదైన ముద్ర వేసింది డోరిస్‌ డే. గాయనిగా దాదాపు 650 పాటల్ని పాడి 20వ శతాబ్దపు మేటి కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. వెండితెరపై హాలీవుడ్‌ స్వర్ణయుగపు నటిగా ప్రాచుర్యం పొందింది. ‘రొమాన్స్‌ ఆన్‌ ద హైసీస్‌’ (1948)తో మొద లైన ఆమె ప్రస్థానం 20 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘ద మ్యాన్‌ హూ న్యూ టూ మచ్‌’ సినిమాలో జేమ్స్‌ స్టివార్ట్‌తో కలిసి నటించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ‘కెలామిటీ జాన్‌’, ‘పిల్లో టాక్‌’, ‘మూవీ ఓవర్‌ డార్లింగ్‌’లాంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది. ప్రతిష్ఠాత్మక సిసిల్‌ బి.డెమిల్లే జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది. అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ నుంచి ప్రెసిడెన్షియల్‌ మెడల్‌అవార్డు, ఫిలిం క్రిటిక్స్‌ కెరీర్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డులు అందుకుంది. ఒహియోలో 1922 ఏప్రిల్‌ 3న పుట్టిన డోరిస్‌ డే మే 13, 2019న కాలిఫోర్నియాలోని కార్మిల్‌ వ్యాలీలలో కన్నుమూశారు. ఈ రోజు ఆమె జయంతి.

* ప్రపంచ మేటి నటుడు


ప్ర
పంచ వ్యాప్తంగా మేటి నటులుగా అలరించిన వారి జాబితా తయారు చేస్తే అందులో మార్లన్‌బ్రాండో పేరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. అంతగా ప్రాచుర్యం సంపాదించిన ఇతడి నటన ఎలాంటిదో తెలియాలంటే ‘గాడ్‌ఫాదర్‌’ (1972) సినిమా చూస్తే చాలు. ఆ సినిమాతో అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఇతడు ఆరు దశాబ్దాల పాటు వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అభిమానులను అలరించాడు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో ‘ఆన్‌ ద వాటర్‌ ఫ్రంట్‌’ (1954), ‘స్ట్రీట్‌ కార్‌ నేమ్‌డ్‌ డిజైర్‌’, ‘ద వైల్డ్‌ వన్‌’, ‘వివా జపాటా’, ‘సయొనారా’, ‘వన్‌ ఐడ్‌ జాక్స్‌’, ‘లాస్ట్‌ ట్యాంగో ఇన్‌ ప్యారిస్‌’, ‘ద మిస్సోరీ బ్రేక్స్‌’, ‘ద ఫార్ములా’, ‘సూపర్‌ మ్యాన్‌’, ‘అపొకలిప్స్‌ నౌ’ లాంటి సినిమాలు అతడి అభినయానికి దర్పణంగా నిలుస్తాయి. ప్రపంచంలోని ‘టాప్‌టెన్‌ మనీ మేకింగ్‌ యాక్టర్స్‌’ జాబితాలో ఒకడుగా స్థానం సంపాదించుకున్నాడు. ఆస్కార్‌లాంటి ఎన్నో అవార్డులను అందుకున్న ఇతడు ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావశీలురలో ఒకడుగా నిలిచాడు. అమెరికాలో 1924 ఏప్రిల్‌ 3న పుట్టిన మార్లన్‌ బ్రాండో, స్కూలు రోజుల్లోనే నాటకాలలో పాత్రలు ధరించాడు. సినీ చరిత్రను తన అభినయ కౌశలంతో సుసంపన్నం చేసిన ఇతడు, కాలిఫోర్నియాలో 2004 జులై 1న తన 80వ ఏట మరణించాడు.

* నటుల కుటుంబం నుంచి...


బా
లీవుడ్‌లో రాజ్‌కపూర్‌ అన్నదమ్ముల లాగే హాలీవుడ్‌లో కూడా ఓ నట కుటుంబం ఉంది. అదే బాల్డ్‌విన్‌ ఫ్యామిలీ. ఇందులో నలుగురు అన్నదమ్ములూ నటులే. వారిలో పెద్ద వాడు అలెక్‌ బాల్డ్‌విన్‌. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, కమేడియన్‌గా పేరుతెచ్చుకున్నాడు. ‘బీటిల్‌ జ్యూస్‌’, ‘ద హంట్‌ ఫర్‌ రెడ్‌ అక్టోబర్‌’, ‘ద మ్యారీయింగ్‌ మ్యాన్‌’, ‘గ్లెంగరీ గ్లెన్‌ రాస్‌’, ‘ద షాడో’, ‘ద ఏవియేటర్‌’, ‘ద డిపార్టెడ్‌’, ‘ద కూలర్‌’లాంటి సినిమాలతో మెప్పించాడు. న్యూయార్క్‌లో 1958 ఏప్రిల్‌ 3న పుట్టిన అలెక్, నాటకాలతో నటనా ప్రస్థానం ప్రారంభించాడు. ఆపై బుల్లితెరపై నటించిన పాత్రలు అతడికి రెండు ఎమ్మీ, మూడు గోల్డెన్‌గ్లోబ్, 7 స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు తెచ్చిపెట్టాయి. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమాల్లో నటించాడు. ఇతడి సోదరులు డేనియల్, విలియం, స్టీఫెన్‌ కూడా నటులుగా పేరు తెచ్చుకున్నవారే.

* నవ్వుల నటుడు


సి
నిమాలో అతడుంటే నవ్వులు ఉన్నట్టే... ఈ అభిప్రాయం ఏ ఒక్క చిత్రసీమలోనిదో కాదు, ప్రపంచం మొత్తం సినీ ప్రేక్షకుల మనసుల్లో ముద్రవేసుకున్నది! అంతటి గుర్తింపు సాధించిన నటుడు ఎడ్డీ మర్ఫీ. కమేడియన్‌గా, నటుడిగా, స్కీన్ర్‌ రైటర్‌గా, గాయకుడిగా, నిర్మాతగా హాలీవుడ్‌లో ముద్రవేశాడు. సందేహముంటే, అతడు నటించిన ‘48 అవర్స్‌’, ‘ద బెవర్లీ హిల్స్‌ కాప్‌’ సిరీస్, ‘ట్రేడింగ్‌ ప్లేసెస్‌’, ‘ద నట్టీ ప్రొఫెసర్‌’, ‘డ్రీమ్‌గర్లస్‌’, ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌లవ్‌’, ‘కమింగ్‌ టు అమెరికా’, ‘వాంపైర్‌ ఇన్‌ బ్రూక్లిన్‌’ సినిమాల్లో దేన్నయినా చూడండి. అతడు నవ్వుల నటుడని ఒప్పుకుంటారు. ‘నట్టీ ప్రొఫెసర్‌’ సినిమాలో ఎడ్డీమర్ఫీ ఎన్ని పాత్రలు వేశాడో గుర్తుందా? అమ్మ, అమ్మమ్మ, నాన్న, సోదరుడు పాత్రలు వేసి మెప్పించిన గుర్తు చేసుకున్నా చాలు నవ్వులు పూయడానికి. ఇంకా ‘బౌఫింగర్‌’, ‘ద అడ్వెంచర్స్‌ ఆఫ్‌ ప్లూటో నాష్‌’, ‘నార్బిట్‌’, ‘మీట్‌ డేవ్‌’ లాంటి సినిమాల్లో మంచి నటుడిగా అంతర్జాతీయ ప్రాచుర్యం సాధించాడు. ఒక దశలో అతడి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 6.6 బిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించాయి. న్యూయార్క్‌లో 1961 ఏప్రిల్‌ 3న పుట్టిన ఎడ్డీమర్ఫీ, చిన్నప్పుడు ఓ కామెడీ ఆల్బమ్‌ చూసి, పెద్దయ్యాక పెద్ద కమేడియన్‌ అయిపోవాలనుకున్నాడు. అనుకోవడమే కాదు, ఆ దిశగా తన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుని కోరుకున్నది నెరవేర్చుకున్నాడు. చిన్నప్పుడు ఎవరిని చూసినా వెంటనే వారిని అనుకరిస్తూ స్నేహితుల్లో నవ్వులు పంచేవాడు. టాలెంట్‌ షోలు, వేదికలపై ప్రదర్శనలు, నైట్‌క్లబ్‌ల్లో స్కిట్‌ ప్రదర్శనలు... ఇలా ఏ అవకాశం దొరికినా వినియోగించుకున్నాడు. సొంతంగా హాస్యంతో కూడిన ఆల్బమ్స్‌ చేసి విడుదల చేసేవాడు. అలా బుల్లితెరపై ‘శాటర్‌ డే నైట్‌ లైవ్‌’ కార్యక్రమంలో అవకాశం సంపాదించి అమెరికా మొత్తం మీద గుర్తింపు పొంది, చిత్రసీమ దృష్టిలో పడ్డాడు. తొలి సినిమా ‘48 అవర్స్‌’ (1982)తోనే వెండితెరపై మెరిసి సినీ ప్రేక్షకులను మురిపించాడు. ఆపై ఒకో సినిమా అతడిని ఒకో మెట్టు ఎక్కించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.