ఏప్రిల్‌ 11.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అమర గాయకుడు (సైగల్‌ జయంతి-1904)


టాకీ యుగం ప్రారంభమైన 1932 నుండి 1946 మధ్య కాలాన్ని హిందీ చలనచిత్ర రంగం ‘సైగల్‌ యుగం’గా గుర్తించింది. హిందీ చిత్రపరిశ్రమ కలకత్తా నగరంలో పరిఢవిల్లిన రోజుల్లో సూపర్‌ స్టార్‌ హోదా సాధించిన ప్రధమ చలనచిత్ర కళాకారుడు కుందన్‌ లాల్‌ సైగల్‌. ఆయన తరువాతే రాజేష్‌ ఖన్నా, అమితాబ్‌ బచన్‌లు ఆ హోదా పొందగలిగారు. మహమ్మద్‌ రఫీ, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ వంటి పేరున్న గాయకులకే గాయకుడు సైగల్‌. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లేకుండా పుట్టుకతోనే తన గాత్ర మాధుర్యంతో సంగీత ప్రియులను కట్టిపడేసి అనతికాలంలోనే సంగీత సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగిన కుందన్‌ లాల్‌ సైగల్‌ ఒక మహానుభావుడు. సిల్కు బట్టలా, మఖమల్‌ వస్త్రంలా సుతిమెత్తని మంద్రస్వరానికి ఉచ్ఛస్వరానికి మధ్యలో మెలిగే సున్నితమైన స్వరంతో సైగల్‌ ఆలపిస్తుంటే జోలపాడినట్లుండేది. తలత్‌ మహమూద్, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ వంటి ఎంతోమంది భావితరం గాయకులకు ఆయన ఒక బెంచ్‌ మార్క్‌గా భాసిల్లారు. సాంకేతిక లేని ఆ రోజుల్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన సైగల్‌ పాటలు ఈ రోజుల్లో కూడా వింటూ ఆనందించే సంగీత ప్రియులు ఎందరున్నారో లెక్కకట్టలేం. అప్పటిదాకా తన గాత్రంతో అఖండ భారతాన్ని ఉర్రూతలూగించిన సైగల్‌ నటుడుగా పరకాయ ప్రవేశం చేసి ‘దేవదాసు’ వంటి పాత్రను అద్భుతంగా పోషించి మంచి నటుడు కూడా అనిపించు కున్నారు. అంతటి మహనీయుని 115వ జయంతి ఈరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఓ బ్రహ్మచారి కథపెళ్లికాని ప్రసాద్‌ల కథలు వెండితెరపై వినోదాన్ని పంచుతూనే ఉన్నాయి. అలనాటి అక్కినేని నుంచి ఈనాటి వెంకటేష్‌ వరకు ఇలాంటి కథలతో అలరించిన వారే. ఇలాంటి నడివయసు బ్రహ్మచారి ప్రేమ కథ ఒకటి ఎప్పుడో 64 ఏళ్ల క్రితమే హాలీవుడ్‌లో నాలుగు ఆస్కార్‌ అవార్డులతో పాటు, ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ చిత్రోత్సవం అత్యున్నత పురస్కారాన్ని కూడా పొందింది. ఆ సినిమానే ‘మార్టీ’ (1955). రొమాంటిక్‌ డ్రామా కథగా తెరకెక్కించిన ఈ సినిమాను ఓ టీవీ నాటకం ఆధారంగా అదే పేరుతో తీశారు. ఇది అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకర్షించి కాసుల వర్షం కురిపించింది. ముప్పై నాలుగేళ్లు వచ్చినా పెళ్లికాని ఓ బ్రహ్మచారి, ఇంటా బయటా వెటకారాలకు, జోకులకు కేంద్రస్థానమవుతూ ఉంటాడు. మంచి మనసున్నా, బొద్దుగా ఉండే శరీరంతో నవ్వుల పాలయ్యే అతడికి ఓ పార్టీలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ అమ్మాయి పరిచయమవుతుంది. ప్రేమించి మోసపోయిన ఆమెను ఓదారుస్తూ అతడు ఆమెకు చేరువవుతాడు. అతడి మంచి మనసు గ్రహించిన ఆమె కూడా ఇష్టపడుతుంది. తీరా పెళ్లి వరకు వచ్చేసరికి కొన్ని కుటుంబపరమైన ఆటంకాలు ఎదురవడం, వాటిని వాళ్లిద్దరూ ఎలా అధిగమించారనే అంశాలతో సినిమా వినోదాన్ని పండిస్తూనే ఉత్కంఠభరితంగా సాగుతుంది. బ్రహ్మచారిగా ఎర్నెస్ట్‌ బోర్గ్‌నైన్, టీచర్‌గా బెట్సీ బ్లైర్‌ నటించిన ఈ సినిమా వారిద్దరి కెరీర్‌ను మలువుతిప్పింది.

* సూపర్‌ హీరోలందరూ కలిస్తే?


ఐరన్‌మ్యాన్‌... ఇంక్రెడిబుల్‌ హల్క్‌... థార్‌... కెప్టెన్‌ అమెరికా... హాకియే... బ్లాక్‌ విడో... వీళ్లందరూ ఎవరో తెలుసుగా? అమెరికా సూపర్‌ హీరోలు! కామిక్‌ పుస్తకాల నుంచి సినిమాల వరకు ఎవరికి వారు విడివిడిగా సందడి చేసి కాసుల వర్షం కురిపించినవారే. వీరిలో ఎవరి శక్తులు వారివే. ఎవరి రూపాలు వారివే. ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగి, దుండగులు పేట్రేగిపోయినా వీళ్లు ఉన్నట్టుండి ఏ ఆకాశంలోంచో ఊడిపడి తమ శక్తులతో ఎదురొడ్డి పోరాటాలు చేసి ధర్మసంస్థాపన చేసిన వారే. కానీ ఇప్పుడు ఈ సూపర్‌హీరోలందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి మరీ పోరాడాల్సిన అవసరం వచ్చింది. కారణం గ్రహాంతర వాసులు! అందమైన భూమిని కనుగొన్న వాళ్లంతా ఒక సైన్యంలాగా బయల్దేరి ఆక్రమణకు సిద్ధమయ్యారు. ఈ దాడి నుంచి భూగోళాన్ని కాపాడడానికి సూపర్‌హీరోలందరూ ఒకటైపోయారు. ఇంకేముంది? అద్భుతమైన గ్రాఫిక్స్, విచిత్రమైన ఆకారాలు, వింత శక్తులు, ఊహాతీతమైన అంతరిక్ష నౌకలు, చిత్రవిచిత్ర ఆయుధాలు, ఒళ్లు గగుర్పొడిచే పోరాటాలు... వీటన్నింటితో ఓ సినిమా తయారైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసి, థియేటర్లోంచి అలా అంతరిక్షంలోకి తీసుకుపోయి మరీ ఊపిరి బిగపట్టించేంత ఉత్కంఠ కలిగించి... కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమానే ‘ద ఎవెంజర్స్‌’ (2012). వాల్ట్‌డిస్నీవాళ్లు అందించిన ఈ సినిమా ఆస్కార్‌ అవార్డు సహా ఎన్నో పురస్కారాలు అందుకోవడమే కాకుండా 220 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఏకంగా 1.519 బిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ‘వంద మేటి సినిమాలు’ జాబితాలోకి ఎక్కింది. దీనికి కొనసాగింపుగా ‘ఎవెంజర్స్‌: ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’ (2015), ‘ఎవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ (2018) సినిమాలు వచ్చి అవి కూడా విజయవంతమయ్యాయి. మరో సీక్వెల్‌ ‘ఎవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.