ఏప్రిల్‌ 4 (సినీ చరిత్రలో ఈరోజు)...

* లేడీ సూపర్‌స్టార్‌


నా
జూకు నడుము... చూడగానే కట్టిపడేసే కళ్లు. ప్రత్యేకమైన అందం... అందుకు దీటైన అభినయం. కమర్షియల్‌ కథానాయిక అనే మాటకి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే అందాల తార సిమ్రన్‌. 1990, 2000 దశకంలో దక్షిణాది నుంచి బాలీవుడ్‌ వరకు స్టార్‌ కథానాయికగా ఓ ఊపు ఊపేసిన కథానాయిక ఈమె. తెలుగులో శరత్‌ దర్శకత్వం వహించిన ‘అబ్బాయిగారి పెళ్లి’ చిత్రంతో పరిచయమైంది. ఆ తరువాత జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్‌ని కొనసాగించింది. ‘ప్రియా ఓ ప్రియా’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘ఆటోడ్రైవర్‌’, ‘సమర సింహారెడ్డి’, ‘అన్నయ్య’, ‘కలిసుందాంరా’, ‘నువ్వు వస్తావని’, ‘యువరాజు’, ‘మృగరాజు’, ‘నరసింహనాయుడు’, ‘ప్రేమతోరా’... ఇలా విజయవంతమైన పలు చిత్రాల్లో సిమ్రన్‌ నటించింది. ‘సీతయ్య’, ‘ఒక్క మగాడు’ చిత్రాల్లో సీనియర్‌ నటుడు హరికృష్ణ సరసన నటించి అందాలు ఒలికించారామె. 2004 వరకు అగ్ర కథానాయికగా కొనసాగిన ఈమె ఆ తరువాత ప్రత్యేక గీతాల్లోనూ సందడి చేసింది. ఏప్రిల్‌ 4, 1976లో ముంబైలో జన్మించిన సిమ్రన్‌ అసలు పేరు రిషిభామా. తండ్రి శోక్‌ నవల్, తల్లి శారద. పంజాబీ కుటుంబానికి చెందిన వీళ్లు ముంబైలో స్థిరపడ్డారు. అక్కడే సిమ్రన్‌ విద్యాభ్యాసం సాగింది. డిగ్రీ తరువాత మోడలింగ్‌లోకి ప్రవేశించిన సిమ్రన్‌ ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె మొదట హిందీలో ‘సన్‌ హార్‌జాయె’ అనే చిత్రంలో నటించింది. ‘తేరే మేరే సప్నె’ సినిమాతో హిందీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. దక్షిణాదిలో మలయాళ చిత్రం ‘ఇంద్రప్రస్థం’తో ప్రయాణం ప్రారంభించింది. తరువాత తమిళం, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. తమిళంలో లేడీ సూపర్‌స్టార్‌గా ఈమెకి పేరుంది. అక్కడ నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా కూడా సినిమాలు చేసి విజయాలు అందుకోవడంతో సిమ్రన్‌ రెండు భాషల్లోనూ విశేషంగా పేరు సంపాదించింది. 2003లో చిన్ననాటి స్నేహితుడైన దీపక్‌ని వివాహం చేసుకొంది సిమ్రన్‌. ఈ జంటకి అదీప్, ఆదిత్‌ అనే ఇద్దరబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తరువాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన సిమ్రన్‌ పలు కీలక అవకాశాల్ని చేజిక్కించుకొంది. 2019లో రజనీకాంత్‌తో కలిసి ‘పేట’లో నటించి మెప్పించింది. సిమ్రన్‌కి సోదరుడు సుమిత్‌తో పాటు, చెల్లెళ్లు జ్యోతి నావల్, మోనాల్‌ ఉన్నారు. భరతనాట్యం, సల్సాల్లో ప్రావీణ్యం సంపాదించిన సిమ్రన్‌ పంజాబీ, హిందీ, ఇంగ్లిష్, తమిళం అనర్గళంగా మాట్లాడుతుంది. ఈరోజు సిమ్రన్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* సైకో నటుడు


‘ఫా
దర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌’గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శక నిర్మాత ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘సైకో’ గురించి ఇప్పటికీ సినిమా అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి మెప్పించిన నటుడు ఆంథోనీ పెర్కిన్స్‌. నటుడిగా, గాయకుడిగా గురింపు పొందిన ఇతడు ‘ఫ్రెండ్లీ పెర్స్యుయేషన్‌’, ‘ఫియర్‌ స్టైక్స్ర్‌ ఔట్‌’, ‘ద మ్యాచ్‌మేకర్‌’, ‘ఆన్‌ ద బీచ్‌’, ‘టాల్‌ స్టోరీ’, ‘ద ట్రయల్‌’, ‘ఫైవ్‌ మైల్స్‌ టు మిడ్‌నైట్‌’, ‘ప్రెట్టీ పాయిజన్‌’, ‘మర్డర్‌ ఆన్‌ ద ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘ద బ్లాక్‌ హోల్‌’ లాంటి సినిమాలతో అలరించాడు. న్యూయార్క్‌లో 1932 ఏప్రిల్‌ 4న పుట్టిన ఇతడు నాటకాల ద్వారా నటుడై వెండితెరకు పరిచయమయ్యాడు.

* అత్యధిక పారితోషికం అతడిదే


మెరికాలో యువతను ఎక్కువగా ఆకట్టుకున్న నటుడిగా రాబర్ట్‌ జాన్‌ డౌనీ (జూ)ని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఫోర్బ్స్‌ పత్రిక జాబితా ప్రకారం మూడేళ్ల పాటు (2012-2015) హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడు కూడా అతడే. ఆ దశలో అతడి మొత్తం సంపాదన 80 మిలియన్‌ డాలర్లకు పైగానేనని అంచనా. ఇతడు నటించిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 11.6 బిలయన్‌ డాలర్లు వసూలు చేయడం విశేషం. నటుడు, నిర్మాత అయిన రాబర్ట్‌ జాన్‌ డౌనీ (సీనియర్‌)కి, నటి అయిన తల్లి ఎల్సీయాన్‌కి 1955 ఏప్రిల్‌ 4న పుట్టిన డౌనీ అయిదేళ్లకే వెండితెరపై కనిపించాడు. తండ్రి తీసిన ‘ద పౌండ్‌’ (1970) అతడి తొలి సినిమా. టీనేజ్‌లో ‘వియర్డ్‌ సైన్స్‌’, ‘లెస్‌ దేన్‌ జీరో’ లాంటి సినిమాల్లో నటించాడు. ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌ బయోపిక్‌ ‘చాప్లిన్‌’ (1992) సినిమాలో నటించి ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మకమైన బాఫ్టా అవార్డు అందుకున్నాడు. టీవీ సిరీస్‌ల్లో నటించి గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు అందుకున్నాడు. అతడు నటించిన ‘కిస్‌ కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘జోడియాక్‌’, ‘ట్రోపిక్‌ థండర్‌’, ‘ఐరన్‌మ్యాన్‌’, ‘ద ఇంక్రెడిబుల్‌ హల్క్‌’, ‘ద ఎవెంజర్స్‌’, ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌’, ‘షెర్లాక్‌ హోమ్స్‌’ సినిమాలు అతడికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే ఇతడి తండ్రి మాదక ద్రవ్యాలకు బానిస. ఆయన డౌనీకి చిన్నతనంలోనే డ్రగ్స్‌ అలవాటు చేయడం ఓ విషాదం. ఆ అలవాటు వల్ల డౌనీ కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్నాడు. తరువాత ఆ వ్యసనం నుంచి బయటపడి తిరిగి నటుడిగా వెండితెరపై ఆకట్టుకున్నాడు.

* వేణువై వచ్చి గాలిలో కలిసిన...
పర్వీన్‌ బాబి (జయంతి-1949)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అక్కకు తగిన చెల్లెలు


కుటుంబంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే కెరీర్‌లో ఉండడం వింతైన విషయం కాదు కానీ, అరుదైనదే. అలాంటి అక్కాచెల్లెళ్లే బ్రిట్నీస్పియర్స్, జామీ లిన్‌ స్పియర్స్‌. ఇద్దరూ గాయనులుగా, నటులుగా పేరుతెచ్చుకున్నవారే. అక్కకు తగిన చెల్లెలుగా జామీ నటిగా, గాయనిగా, గీత రచయిత్రిగా ఎదిగింది. మిస్సిసిపీలో 1991 ఏప్రిల్‌ 4న పుట్టిన జామీ, ప్యారమౌంట్‌ పిక్చర్స్‌ ‘క్రాస్‌రోడ్స్‌’ (2002) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఓ పక్క ఆల్బమ్స్, మరో పక్క టీవీ సిరీస్‌లతో ముందుకు సాగింది.

* చలాకీ నటి


అం
దంతో, చలాకీతనంతో ఆకట్టుకుంది నటాషా లియోనే. టీవీ, నెట్‌ఫ్లిక్స్, వెండితెరపై ఆమె ప్రస్థానమే అందుకు సాక్ష్యం. ప్రపంచ యువతను విపరీతంగా ఆకట్టుకునేలా ‘అమెరికన్‌ పై’ పేరుతో వచ్చిన 8 సీక్వెల్‌ సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. నటిగానే కాక నిర్మాతగా కూడా ఆకట్టుకున్న నటాషా, ‘ఎవ్రీవన్‌ సేస్‌ ఐ లవ్యూ’, ‘స్లమ్స్‌ ఆఫ్‌ బెవెర్లీ హిల్స్‌’, ‘డెట్రాయిట్‌ రాక్‌ సిటీ’, ‘బట్‌ ఐయామే ఛీర్‌లీడర్‌’, ‘స్కారీ మూవీ2’, ‘ద గ్రే జోన్‌’, ‘కేట్‌ అండ్‌ లియోపాల్డ్‌’, ‘పార్టీ మాన్‌స్టర్‌’, ‘డై మమ్మీ డై’, ‘బ్లేడ్‌: ట్రినిటీ’, ‘రోబోట్స్‌’, ‘ఆల్‌ ఎబౌట్‌ ఈవిల్‌’, ‘స్లీపింగ్‌ విత్‌ అదర్‌ పీపుల్‌’, ‘హలో మై నేమ్‌ ఈజ్‌ డోరిస్‌’, ‘షో డాగ్స్‌’లాంటి ఎన్నో సినిమాలతో అలరించింది. న్యూయార్క్‌లో 1979 ఏప్రిల్‌ 4న పుట్టిన నటాషా, చిన్నతనంలోనే నటన పట్ల అభిరుచిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే పిల్లల టీవీ కార్యక్రమాలతో పాటు మోడలింగ్‌లో కూడా పాల్గొంది. బాలనటిగా నటించింది. ఎమ్మీ సహా ఎన్నో అవార్డులను అందుకుంది.

అచిర కాలంలోనే...


- అకాడమీ అవార్డ్‌...

- ఇంటర్నేషనల్‌ అవార్డ్‌...

- ఫిలిం క్రిటిక్స్‌ అవార్డ్‌...

- గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డ్‌...

- బాఫ్తా అవార్డ్‌...

ఇవన్నీ ఓ నటుడికి లభించిన పురస్కారాలైతే వింతేమీ లేదు. కానీ అవన్నీ ‘మరణానంతర’ అవార్డులు కావడమే విషాదం!
అచిరకాలంలోనే మంచి నటుడిగా పేరుపొందినా, కేవలం 28 ఏళ్ల చిన్న వయసులోనే మరణించిన నటుడు హీత్‌ లెడ్జెర్‌. చిన్నతనంలోనే వేదికలపై నటించిన ఇతడు టీవీలు, వెండితెరపై పేరు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాలో 1979 ఏప్రిల్‌ 4న పుట్టిన ఇతడు ‘19 థింగ్స్‌ ఐ హేట్‌ ఎబౌట్‌ యు’, ‘ద ప్యాట్రియట్‌’, ‘ఎ నైట్స్‌ టేల్‌’, ‘మాన్‌స్టర్స్‌ బాల్‌’, ‘లార్డ్స్‌ ఆఫ్‌ డాగ్‌టౌన్‌’, ‘బ్రోక్‌బ్యాక్‌ మౌంటేన్‌’, ‘కాసనోవా’, ‘ద డార్క్‌ నైట్‌’, ‘ద ఇమాజినేరియమ్‌ ఆఫ్‌ డాక్టర్‌ పర్నాసుస్‌’ లాంటి 19 సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే 2008 జనవరి 22న కొన్ని మందులు వికటించడంతో అనూహ్యంగా మరణించాడు.

* ఆస్కార్‌ తొలి నామినేషన్‌అందుకున్న నటి!


మూ
కీ చిత్రాల యుగంలో ఆమె స్టార్‌ స్టేటస్‌ అందుకుంది... ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది... అవార్డులతో పాటు అభిమానుల జేజేలనూ అందుకుంది...ఆమే గ్లోరియా స్వాన్‌సన్‌. ‘సన్‌సెట్‌ బౌలెవార్డ్‌’ (1950) నాటి మూకీలో నోమా డెస్మాండ్‌ పాత్రలో ఆమె అభినయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు పాత్రమైంది. ఆ సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ నామినేషన్‌తో పాటు, గోల్డెన్‌గ్లోబ్‌ పురస్కారం గెలుచుకుంది. హాలీవుడ్‌ ప్రఖ్యాత దర్శకుడు సిసిల్‌ బి.డెమిల్లే దర్శకత్వంలో 1920ల్లో ఆమె నటించిన చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో ఉత్తమ నటిగా నామినేషన్‌ అందుకున్న తొలి నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆపై నిర్మాతగా మారి ‘ద లవ్‌ ఆఫ్‌ సన్యా’ (1927), ‘సాడీ థామ్సన్‌’ (1928) చిత్రాలను నిర్మించింది. ‘ద ట్రెస్పాసర్‌’ సినిమాతో టాకీల్లోకి అడుగుపెట్టింది. షికాగోలో 1899 మార్చి 27న పుట్టిన స్వాన్‌సన్, అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పరిచయమై క్రమంగా తారగా ఎదిగిన ఈమె, ‘డోన్ట్‌ ఛేంజ్‌ యువర్‌ హస్బెండ్‌’, ‘మేల్‌ అండ్‌ ఫిమేల్‌’, ‘వై ఛేంజ్‌ యువర్‌ వైఫ్‌’లాంటి డెమిల్లే సినిమాలతో అందాల తారగా ఆకట్టుకుంది. రెండేళ్ల కాలంలోనే స్టార్‌డమ్‌ అందుకున్న ఆమెను వదులుకోడానికి నిర్మాతలు వెనుకాడేవారు. దాంతో ఆమె కోరిన పారితోషికంతో పాటు ఏది అడిగితే దాన్ని సమకూర్చేవారు. అందంతో, అభినయంతో, అంతకు మించిన స్టైల్‌తో ఆకట్టుకున్న ఆమె, న్యూయార్క్‌లో 1983 ఏప్రిల్‌ 4న తన 84వ ఏట మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.