ఏప్రిల్‌ 12.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఆ హోటల్లో ఏం జరిగింది?సినిమా కథలు... ఫలానా రకంగానే ఉండాలనేం లేదు. చెప్పేతీరు సవ్యంగా ఉంటే దేన్నయినా తీయవచ్చు. విజయం సాధించవచ్చు. అలా ఓ హోటల్‌లో ఏం జరిగిందనే అంశంపెబిౖ తీసిన సినిమా ‘గ్రాండ్‌ హోటల్‌’ (1932). ఈ సినిమా ఆస్కార్‌ గెల్చుకోవడంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుని కాసులు కురిపించింది. ఆస్కార్‌ చరిత్రలో మరే ఇతర విభాగానికి నామినేట్‌ కాకుండా, కేవలం ఉత్తమ చిత్రానికి మాత్రమే నామినేషన్‌ పొంది అదే అవార్డు సాధించిన ఏకైక చిత్రంగా దీనికే రికార్డు. ఈ సినిమా ప్రభావం ఎలాంటిదంటే, దీన్ని 1945లో ‘వీకెండ్‌ ఎట్‌ ద వాల్డ్‌డార్ఫ్‌’గాను, 1989లో ఓ సంగీత రూపకంగాను రీమేక్‌ చేశారు. ‘వందేళ్లలో వంద గొప్ప సినిమాలు’ జాబితాలో ఇది స్థానం సంపాదించింది. ఓ విలాసవంతమైన హోటల్లో బస కోసం వచ్చిన వేర్వేరు అతిథుల మధ్య ఏం జరిగిందనేదే కథ. ఈ అతిథుల్లో ఓ వజ్రాల దొంగ, ఓ వైద్యుడు, ఓ సైనికాధికారి, ఓ అందాల తార, చనిపోతానని తెలిసి చివరి రోజులను విలాసంగా గడపాలని వచ్చిన ఓ రోగి... ఇలా రకరకాల మంది ఉంటారు. వీరి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని చాలా ఉత్కంఠ భరితంగా, వినోదాత్మకంగా చూపించిన ఈ సినిమాను అమెరికా ఫిలిం లైబ్రరీలో భద్రపరిచారు.

* ఏ తెర అయినా... అవార్డులు ఆమెవే


-మూడు ఎమ్మీ అవార్డులు...
-నాలుగు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు...
-రెండు స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు...
-‘ప్రపంచంలోని వందమంది ప్రభావశీలురు’లో ఒకరుగా టైమ్‌ పత్రిక గుర్తింపు...
-‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం...
ఇవి చాలు క్లైర్‌ డేన్స్‌ నటనా ప్రస్థానం ఎలాంటిదో చెప్పడానికి!

‘లిటిల్‌ ఉమెన్‌’, ‘హోమ్‌ ఫర్‌ ద హాలీడేస్‌’, ‘రోమియో జూలియట్‌’, ‘ద రైన్‌ మేకర్‌’, ‘బ్రోక్‌డౌన్‌ ప్యాలస్‌’, ‘ప్రిన్సెస్‌ మోనోనోక్‌’, ‘టెర్మినేటర్‌3: రైజ్‌ ఆఫ్‌ ద మెషిన్స్‌’, ‘షాప్‌ గర్ల్‌’, ‘స్టార్‌డస్ట్‌’, ‘బ్రిగ్స్‌బీ బేర్‌’, ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’ సినిమాలు ఆమె అందం గురించి, నటన గురించి చెప్పకనే చెబుతాయి. న్యూయార్క్‌లో 1979 ఏప్రిల్‌ 12న పుట్టిన డేన్స్, చిన్నప్పుడే డ్యాన్స్, నటన నేర్చుకుని పదేళ్ల వయసులోనే నాటకాల ద్వారా నటనా రంగంలోకి వచ్చింది. పదమూడేళ్లకే టీవీల్లో నటించింది. ఆపై వెండితెరపై వెలుగులీనింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.