ఏప్రిల్‌ 6 (సినీ చరిత్రలో ఈరోజు)...

* శ్రీలంకలో పుట్టి...

(సుజాత వర్థంతి -2011)


కథానాయికగా ఒక తరం ప్రేక్షకులకు... క్యారెక్టర్‌ నటిగా మరో తరం ప్రేక్షకులకు సుపరిచితురాలు సుజాత. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారీమె. సాత్విక పాత్రలకి, ఆర్ద్రతతో కూడిన పాత్రలకి పెట్టింది పేరన్నట్టుగా వెండితెరపై సందడి చేశారు. ఎన్టీఆర్, శివాజీ గణేశన్, కమల్‌హాసన్, రజనీకాంత్, అనంతనాగ్, శ్రీనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్‌బాబు, కృష్ణ వంటి అగ్ర నటులతో కలిసి నటించారు. సుజాత డిసెంబరు 10, 1952న శ్రీలంకలో జన్మించారు. కేరళకి చెందిన ఈమె తండ్రి ఉద్యోగం రీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో, సుజాత అక్కడే పుట్టి పెరిగారు. తండ్రి పదవీ విరమణ తర్వాత మళ్లీ కేరళకి వచ్చారు. పద్నాలుగేళ్ల వయసులో ‘తబస్విని’ అనే చిత్రంతో తెరకు పరిచయమయ్యారు సుజాత. ఆ చిత్రం తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేశారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అవళ్‌ ఒరు తొడర్‌ కథై’ (తెలుగులో అంతులేని కథ)తో నటిగా పేరు తెచ్చుకున్న ఈమె, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘గోరింటాకు’తో తెలుగులో పరిచయమైంది. ఆ చిత్రం విజయవంతం కావడంతో తెలుగులోనూ బిజీ అయ్యారు సుజాత. ‘సంధ్య’, ‘సుజాత’, ‘ఏడంతస్తుల మేడ’, ‘పసుపు పారాణి’, ‘సర్కస్‌ రాముడు’, ‘సూరిగాడు’, ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘అహంకారి’, ‘జస్టిస్‌ చక్రవర్తి’, ‘సీతాదేవి’, ‘బహుదూరపు బాటసారి’ తదితర చిత్రాలు చేశారు. ‘సూత్రధారులు’, ‘శ్రీరామదాసు’, ‘పెళ్ళి’ చిత్రాలు సుజాతకి మంచి పేరు తీసుకొచ్చాయి. ‘పెళ్ళి’ సినిమాలో నటనకిగానూ ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం అందుకొన్నారు. సుజాత ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఇంటి యజమాని అబ్బాయి అయిన జయకర్‌ హెన్రీని ప్రేమించిన ఆమె, పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు. అక్కడి సంప్రదాయాలు నచ్చకపోవడంతో కాన్పుకోసం ఇండియాకి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లలేదు. ఈమెకి కుమారుడు సాజిత్, కుమార్తె దివ్య ఉన్నారు. 58 యేళ్ల వయసులో 2011, ఏప్రిల్‌ 6న... చెన్నైలోని సొంత ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అంతకుముందు కొన్నాళ్లు అనారోగ్యంతో బాధపడ్డారామె. ఈ రోజు సుజాత వర్ధంతి.

(ప్ర‌త్యేక వార్త కోసం క్లిక్ చేయండి)

* గతంలోకి ప్రయాణం

వర్తమానంలోంచి గతంలోకి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఎన్నో కథలకు, సినిమాలకు నాంది పలికింది. ‘ఆదిత్య 369’ సినిమాలో కథానాయకుడు వర్తమానంలోంచి ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలానికి వెళ్లి వినోదాన్ని అందించాడు. ఇలాంటి కథలకు పునాది వేసిన సినిమాగా ‘ఎ కనెక్టికట్‌ యాంకీ’ (1931)ను చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు 1889లోనే వచ్చిన ‘ఎ కనెక్టికట్‌ యాంకీ ఇన్‌ కింగ్‌ ఆర్థర్స్‌ కోర్ట్‌’ అనే నవల ఆధారం. దీన్ని ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్‌ ట్వైన్‌ రాశాడు. పందొమ్మిదో శతాబ్దానికి చెందిన ఓ ఇంజినీర్‌ తలకు తగిలిన దెబ్బ కారణంగా ఎప్పుడో 5వ శతాబ్దం నాటి కింగ్‌ ఆర్థర్‌ కాలానికి వెళ్లిపోవడం కథాంశం. అలా గతానికి వెళ్లిన ఆ ఇంజినీర్‌ ఓ ఇంద్రజాలికుడిగా చెలామణీ అవుతాడు. కింగ్‌ ఆర్థర్‌ని కూడా కలుసుకుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా కింగ్‌ ఆర్థర్‌ మరణాన్ని ఆపలేకపోతాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాసిన ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా పాఠకాదరణ పొందింది. ఈ కథ ఆధారంగా ఎన్నో నాటకాలు, సినిమాలు, రేడియో రూపకాలు, యానిమేటెడ్‌ కార్టూన్లు వచ్చాయి. దీని ఆధారంగా 1921లోనే ఓ మూకీ చిత్రాన్ని కూడా తీశారు. ఈ సినిమాను తీసిన ఫాక్స్‌ ఫిలిం కార్పొరేషన్‌ సంస్థే తిరిగి 1931లో టాకీని తీయడం విశేషం. ఈ మూకీ, టాకీలు రెండూ విజయఢంకా మోగించడం విశేషం.

* అంతరిక్ష గమనం

అంతుపట్టని అంతరిక్షం మనిషి ఊహల్నే కాదు, సినిమాలను కూడా ఊరిస్తూనే ఉంది. అందుకనే సినిమా కథలు ఏ రోదసీ నౌకలోనో ప్రయాణమై ప్రేక్షకుల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకుపోయి ఊహాలోకాలలో తిప్పి తీసుకువచ్చాయి. అలా వచ్చిన ఎన్నో సినిమాల్లో ‘స్టార్‌ట్రెక్‌’ చిత్రాలు ప్రత్యేకమైనవే. టీవీల్లో సీరియల్‌గా మొదలై ఆకట్టుకున్న ఈ కథలు, అవే పాత్రలతో వెండితెరకి ఎక్కి కనువిందు చేశాయి. గ్రహాంతర ప్రయాణాలు, వింత వింత అంతరిక్ష నౌకలు, గ్రహాంతర వాసులతో యుద్ధాలు, ఆధునికి ఆయుధాలు... ఇలాంటి ఊహలతో రోదసిలో సరిహద్దుల్ని చెరిపేసిన ఈ సినిమాలన్నీ కాసుల వర్షం కురిపించాయి. ఆ సినిమాల పరంపరలో పదకొండోదైన ‘స్టార్‌ట్రెక్‌’ రీబూటెడ్‌ సినిమా 2009లో విడుదలై 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి, ఏకంగా 385.7 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడం విశేషం. ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి స్టార్‌ట్రెక్‌ సినిమా కూడా ఇదే. దీనికి కొనసాగింపుగా ‘స్టార్‌ట్రెక్‌ ఇన్‌టు డార్క్‌నెస్‌’ (2013), ‘స్టార్‌ట్రెక్‌ బియాండ్‌’ (2016) సినిమాలు కూడా వచ్చి ప్రేక్షకులను మురిపించాయి.

* ‘స్టార్‌వార్స్‌’ నటుడు

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘స్టార్‌వార్స్‌’ సినిమాలను చూసే వారికి బిల్లీ డీ విలియమ్స్‌ గురించి చెప్పక్కర్లేదు. నటుడిగా, గాయకుడిగా పేరొందిన ఇతడు ‘ద ఎంపైర్‌ స్ట్రైక్స్‌ బ్యాక్‌’ సినిమాల నుంచి ఆ చిత్రాల పరంపరలో కనిపిస్తూనే ఉన్నాడు. వీటితో పాటు ‘బ్రియాన్స్‌ సాంగ్‌’, ‘లేడీ సింగ్స్‌ ద బ్లూస్‌’, ‘మహోగనీ’, ‘నైట్‌వాక్స్‌’, ‘బ్యాట్‌మ్యాన్‌’ లాంటి సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించిన విలియమ్స్‌ రాబోయే ‘స్టార్‌వార్స్‌: ఎపిసోడ్‌9‘ సినిమాలో మరోసారి వెండితెరపై కనిపించనున్నాడు. న్యూయార్క్‌లో 1937 ఏప్రిల్‌ 6న పుట్టిన విలియమ్స్‌ నాటకాలు, టీవీల ద్వారా ఆకట్టుకుని వెండితెరపైకి వచ్చి 81 ఏళ్ల వయసులో కూడా నటిస్తుండడం విశేషమే.

* కుర్రాడు మహా చురుకు


చీమ ఎంత చురుగ్గా ఉంటుందో అతడు కూడా అంతే. ఇదేం పోలిక అనిపిస్తే ‘యాంట్‌మేన్‌’ సినిమా గురించి చెప్పుకోవాలి. అందులో అతడే హీరో మరి. ఒక్క యాంట్‌మేన్‌గానే కాదు, ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌వార్‌’ , ‘యాంట్‌ మేన్‌ అండ్‌ ద వాస్ప్‌’, ‘ఎవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమాలు చూసినవారికి అతడెంత చురుకైన నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడిగా, కమేడియన్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, నిర్మాతగా కూడా అలరించిన అతడే పాల్‌ రడ్‌. ప్రపంచ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమాల్లో అతడు నటించి మెప్పించాడు. ‘క్లూలెస్‌’, ‘రోమియో ప్లస్‌ జూలియట్‌’, ‘వెట్‌ హాట్‌ అమెరికన్‌ సమ్మర్‌’, ‘యాంకర్‌మేన్‌: ద లెజెండ్‌ ఆఫ్‌ రాన్‌ బర్గుండీ’, ‘ద 40 ఇయర్‌ ఓల్డ్‌ వర్జిన్‌’, ‘నాక్డప్‌’, ‘దిస్‌ ఈజ్‌ 40’, ‘మ్యూట్‌’, ‘ఐడియల్‌ హోమ్‌’ లాంటి సినిమాల్లో అతడి నటనను అభిమానులు మర్చిపోరు. ఎన్నో టీవీ షోలు, నాటకాల్లో కూడా చురుకైన పాత్రలు పోషించాడు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకోవడంతో పాటు ‘హాలీవుడ్‌ వాక్‌ ఆప్‌ ఫేమ్‌’ గౌరవాన్ని కూడా పొందాడు. ఫోర్బ్స్‌ పత్రిక ప్రచురించే వంద మంది మేటి సెలబ్రిటీల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. న్యూజెర్సీలో 1969 ఏప్రిల్‌ 6న పుట్టిన ఇతడు, నటనను అభ్యసించి మరీ రంగంలోకి దిగాడు.

* యువ దర్శకుడు


మంచి దర్శకుడిగానే కాదు, నటుడిగా, స్క్రీన్‌ రైటర్‌గా, నిర్మాతగా కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందిన యువకుడు జక్‌ బ్రాఫ్‌. టీవీ సిరీస్‌ల్లో కూడా ఇంటింటి అభిమానులు సంపాదించుకున్నాడు. ‘ద బ్రోకెన్‌ హార్ట్స్‌ క్లబ్‌: ఎ రొమాంటిక్‌ కామెడీ’, ‘ద లాస్ట్‌ కిస్‌’, ‘ద ఎక్స్‌’, ‘ఇన్‌ డ్యూబియస్‌ బ్యాటిల్‌’లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ‘గార్డెన్‌ స్టేట్‌’ సినిమాతో మొదలు పెట్టి మంచి దర్శకుడిగా కూడా పేరొందాడు. దీనికి కథ, నటన, సంగీత దర్శకత్వం కూడా అతడే నిర్వహించాడు. ఈ సినిమాను ఇంట్లో 2.5 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తే, ఏకంగా 35 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడం విశేషం. దర్శకుడిగా ఎన్నో అవార్డులు పొందాడు. ఉత్తమ సౌండ్‌ట్రాక్‌ ఆల్బమ్‌కిగాను గ్రామీ అవార్డు కూడా అందుకున్నాడు. న్యూజెర్సీలో 1975 ఏప్రిల్‌ 6న పుట్టిన ఇతడు చిన్నప్పుడే దర్శకుడవ్వాలని కలలు కన్నాడు. అందుకు అనుగుణంగానే ప్రయత్నించి తన సృజనాత్మకత, కృషి కారణంగా కెరీర్‌కు సోపానాలు నిర్మించుకున్నాడు.

* అందంతో అందలానికి...


ఏడుసార్లు ఆస్కార్‌ నామినేషన్లు అందుకోవడం విశేషమే... అందులో అయిదు సార్లు వరసగా పొందడం ఓ రికార్డు... అలాంటి ఘనతతో పాటు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న నటి ఐలీన్‌ ఇవెలిన్‌ గ్రీర్‌ గార్సన్‌. ఒకప్పుడు ఈమె సినిమాలు అత్యధికంగా ఆర్జించిన ఘనత సాధించాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద మెరిట్‌ ఎంపైర్‌’ పురస్కారాన్ని పొందింది. ఇంగ్లండ్‌లో 1904 సెప్టెంబర్‌ 29న పుట్టిన గార్సన్‌ నాటక రంగంలో ఆకట్టుకుని, మోడలింగ్‌లో మెరిసి, వెండితెరపై వెలిగింది. ‘మిసెస్‌ మినివర్‌’ సినిమాకు ఆస్కార్‌ అందుకున్న ఈమె, ‘గుడ్‌బై మిస్టర్‌ చిప్స్‌’, ‘ప్రైడ్‌ అండ్‌ ప్రెజుడీస్‌’, ‘వెన్‌ లేడీస్‌ మీట్‌’, ‘బ్లోజమ్స్‌ ఇన్‌ ద డస్ట్‌’, ‘రాండమ్‌ హార్వెస్ట్‌’, ‘మేడమ్‌ క్యూరీ’, ‘జులియా మిస్‌ బిహేవ్స్‌’లాంటి సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను అలరించింది. ‘మిసెస్‌ మినివర్‌’ (1949) సినిమాకి ఆస్కార్‌ అందుకున్న ఈమె ఆ వేడుక వేదికపై 5 నిమిషాల 30 సెకన్ల పాటు మాట్లాడింది. అందుకు ఆమెకు ‘అతి ఎక్కువ సమయం మాట్లాడిన ఆస్కార్‌ అవార్డీ’గా గిన్నిస్‌ రికార్డు వచ్చింది. ఆ తర్వాత ఆస్కార్‌ కమిటీ అవార్డీలు మాట్లాడే సమయంపై ఆంక్షలు విధించడం విశేషం. అందం, అభినయంతో అందలం ఎక్కిన గార్సన్, 1996 ఏప్రిల్‌ 6న టెక్సాస్‌లో తన 91వ ఏట మరణించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.