ఏప్రిల్‌ 7 (సినీ చరిత్రలో ఈరోజు)...

* సంచలనాల దర్శకుడు


సినిమా జనాలు ‘శివ’కి ముందు.. ‘శివ’ తరువాత అని మాట్లాడుకుంటుంటారు. ఆ సినిమా అంతగా భారతీయ చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపించింది. అలాంటి ట్రెండ్‌ సెట్టర్‌ని తీసిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మనే

‘లక్కుతో ‘శివ’ సినిమా తీసి..
‘షోలే’ని చెడగొట్టి..
పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ
హిచ్‌కాక్‌ సినిమాలు చూసి..

దెయ్యాల సినిమాలు తీసే రాంగోపాల్‌ వర్మ.. డైరెక్టరా ఖర్మ’ అంటూ తనపైన తానే సెట్టైర్‌ వేసుకున్నాడు. సంచలన విజయాల్ని అందుకొన్న ఆయనే... అంతకు రెట్టింపు స్థాయిలో ఫ్లాప్‌ సినిమాలు కూడా తీశాడు. కానీ... సక్సెస్‌ఫుల్‌ సినిమాకీ, ఫ్లాప్‌ సినిమాకీ నేను పడే కష్టం ఒకటే అని చెబుతుంటాడు వర్మ. మరో అడుగు ముందుకేసి నా సక్సెస్‌లన్నీ అనుకోకుండా వచ్చినవే అని కూడా చెబుతారాయన. ఆయన ఏ కథ ఎంచుకొన్నా ఒక సంచలనమే. ఆయన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే వార్తల్లో నిలుస్తుంటాయి. తెలుగులో ‘శివ’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన వర్మ ఆ తరువాత హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు తీశారు. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఆయన సంచలన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగానే కాకుండా, రచయితగా, నిర్మాతగా కూడా ఆయన చిత్ర పరిశ్రమలో ప్రయాణం చేశాడు. రామ్‌ గోపాల్‌ వర్మ 1962, ఏప్రిల్‌ 7న హైదరాబాద్‌లో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించాడు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించాడు. చిన్నప్పట్నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న ఆయన క్రమంగా సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. విడుదలైన ప్రతి సినిమానీ చూసి, స్నేహితులతోనూ, మావయ్యతోనూ వాటిలోని తప్పొప్పుల్ని విశ్లేషించేవారట. ఇంజినీరింగ్‌ తరువాత కొంతకాలం వీడియో దుకాణం నడిపాడు. తరువాత ‘రావుగారిఇల్లు’ అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది.

ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది. మొదట ‘రాత్రి’ సినిమా తీయాలనుకున్నా... దానిపై ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ‘శివ’ కథను సిద్ధం చేసి నాగార్జునకు వినిపించి ఒప్పించారు. ఆ సినిమా చేయడానికి నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం వెనక కథ గురించి ఆయన ‘నా ఇష్టం’ పుస్తకంలో క్షుణ్ణంగా రాసుకొచ్చారు. ఎట్టకేలకి ‘శివ’ కోసం నాగ్‌ని ఒప్పించి, ఆ సినిమాని పూర్తి చేసిన ఆయన ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం గురించి పొరుగు చిత్ర పరిశ్రమలు సైతం మాట్లాడుకున్నాయి. ఇప్పటికీ ‘శివ’ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంటారు. అందులో సాంకేతికత, కథ, చిత్రాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచింది. యువత ‘శివ’ స్టైల్‌కు ఫిదా అయిపోయింది. తాను కళాశాల చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఘటనలకు ఈ సినిమా ద్వారా దృశ్య రూపమిచ్చారు వర్మ. కథ, కథనం అంతా కొత్తగా ఉండటం ప్రతీ ఒక్కరినీ ఆకర్షించింది. వర్మ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతో చాలా పాపులర్‌ అయిపోయారు వర్మ. ‘శివ’ సినిమాతో తనదైన ముద్రవేసిన వర్మ ఆ తరువాత ‘క్షణ క్షణం’ తీశారు. వర్మ టేకింగ్‌ స్టైల్‌కు చిత్ర పరిశ్రమ మరోసారి ఫిదా అయిపోయింది. కీరవాణి స్వరపరిచిన ‘జామురాతిరి జాబిలమ్మ..’ పాట మార్మోగిపోయింది. ఆ తరువాత ‘అంతం’తో మరోసారి తన మార్కును చూపించారు. ఈ దశలోనే తాను మొదట అనుకున్న ‘రాత్రి’ సినిమాను తీసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చారు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. జగపతిబాబుతో తీసిన ‘గాయం’ కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. నిర్మాతగా వర్మ అందించిన ‘మనీ’.., ‘మనీ మనీ’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. ‘శివ’తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన వర్మ బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాడు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను రూపొందించాడు. ‘రంగీలా’ బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని నమోదు చేసింది. ప్రేమకథా, యాక్షన్‌ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో వర్మ తీసిన సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉండటం, విషయాన్ని లోతుగా అన్వేషించి చెప్పడం బాలీవుడ్‌కు బాగా నచ్చింది. తీసే ప్రతీ చిత్రంలో తనదైన మార్కును చూపేవారు వర్మ. ‘సత్య’, ‘జంగిల్‌’, ‘కంపెనీ’, ‘భూత్‌’, ‘నాచ్‌’, ‘సర్కార్‌’, ‘సర్కార్‌ రాజ్‌’, ‘డిపార్ట్‌మెంట్‌’, ‘ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో వర్మ మంచి పేరుతెచ్చుకున్నారు. వర్మ తొలి నుంచి చేసిన చిత్రాల్లో ఎక్కువ సినిమాలు వాస్తవ ఘటనల ఆధారంగా తీసినవే. ఏ విషయంపైనైనా సినిమా చేయాలనుకున్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన తనదైన శైలిలో వెండితెరపై ప్రెజెంట్‌ చేస్తారు వర్మ. ‘రక్త చరిత్ర’, ‘ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ ‘వీరప్పన్‌’, ‘వంగవీటి’ చిత్రాలు అందుకు కొన్ని ఉదాహరణలు. ఇటీవల ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ తెరకెక్కించారు. వివాదాలకి కేరాఫ్‌గా నిలుస్తుంటాడు వర్మ. ట్విట్టర్‌లో ఆయన చేసే వ్యాఖ్యలు వార్తల్లో నిలుస్తుంటాయి. వర్మ సినిమాలకే కాదు... ఆయన ఆలోచనలకి కూడా అభిమానులున్నారు. రామూయిజం అంటూ ఆ ఆలోచనల్ని పిలుచుకుంటుంటారు ఆయన అభిమానులు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డును రామ్‌ గోపాల్‌ వర్మని మూడుసార్లు వరించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘శివ’, ‘క్షణ క్షణం’ మరియు ‘ప్రేమకథ’ చిత్రాలకు నందులు వచ్చాయి. రామ్‌గోపాల్‌ వర్మ రత్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కూతురు రేవతి పుట్టాక విడిపోయారు. కూతురు ప్రస్తుతం వైద్యవృత్తిలో కొనసాగుతుంది. ఈమధ్యే కూతరు కూడా పుట్టింది. అంటే ఇక నుంచి రామ్‌ గోపాల్‌ వర్మ కాస్త తాతయ్య అయ్యాడన్నమాట. ఈ రోజు రామ్‌గోపాల్‌ వర్మ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* యాక్షన్‌.. కామెడీ... దేనికైనా రెడీ!


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* దక్షిణాది చిత్రాలతో.. ఉత్తరాదిన కథానాయకుడిగా!!


పే
రుకు ఉత్తరాది హీరో అయినా.. చేసిన ప్రతి పాత్రతో బాలీవుడ్‌ తెరపై దక్షిణాది సువాసనలు విరబూయించిన కథానాయకుడు జితేంద్ర. ఆయన స్టార్‌గా మారే క్రమంలో వేసిన ప్రతి అడుగులో, దాటిన ప్రతీ మలుపులో తెలుగుదనమే బాసటగా నిలిచింది. అందుకే ఆయన్ను బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ కృష్ణగా కీర్తించేవారు సినీప్రియులు. 1960 - 90ల మధ్య కాలంలో రాజేష్‌ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్‌లకు దీటుగా బాలీవుడ్‌ తెరపై స్టార్‌ హీరోగా వెలుగులు చిందించారు జితేంద్ర. రీమేక్‌ సినిమాల స్పెషలిస్ట్‌గా ఆయనకు బాలీవుడ్‌లో ఓ ప్రత్యేకత గుర్తింపు కూడా ఉంది. ఎందుకంటే ఆయన తన కెరీర్‌లో ఇంతవరకు 200 పైగా చిత్రాల్లో నటించగా.. వాటిలో 80కి పైగా సినిమాలు దక్షిణాది రీమేక్‌లే ఉండటం విశేషం. తాను బాలీవుడ్‌లో అగ్ర హీరోగా నిలబడటంలో.. ఎన్టీఆర్, కృష్ణ, ఎం.జి.రామచంద్రన్‌ వంటి అగ్రతారల సినిమాలే ఎంతో ఉపయోగపడ్డాయని జితేంద్రే ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు కూడా. తనదైన స్టైలిష్‌ నఠనతో, ప్రత్యేకమైన నృత్య ప్రతిభతో హిందీలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జితేంద్ర.. నిర్మాతగానూ చిత్రసీమలో సత్తా చాటారు. బాలాజీ టెలీఫిలింస్, మోషన్‌ పిక్చర్స్‌ను స్థాపించి అనేక బాలీవుడ్‌ సినిమాలను, సీరియళ్లను నిర్మించారు.

జితేంద్ర.. 1942 ఏప్రిల్‌ 7న పంజాబ్‌లోని అమర్‌నాథ్, కృష్ణ కపూర్‌ దంపతులకు జన్మించారు. అప్పట్లో బాలీవుడ్‌ చిత్రాలకు అవసరమైన గిల్టు నగలను, ఆభరణాలను తయారు చేసి సప్లై చేస్తుండేది వీరి కుటుంబం. తన చదువు పూర్తయ్యాక జితేంద్ర కూడా ఇదే వృత్తిని కొనసాగించారు. ఈ క్రమంలోనే ‘నవరంగ్‌’ (1959) సినిమాకు ఆభరణాలు సప్లై చేస్తున్న సమయంలో.. ఆ చిత్ర దర్శకుడు వి.శాంతారామ్‌తో ఏర్పడిన పరిచయం జితేంద్రను వెండితెరపైకి తీసుకొచ్చింది. ఇందులో ఆయన ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు శాంతారామ్‌ దర్శకత్వంలోనే వచ్చిన ‘గీత్‌ గాయా పత్తరోన్నే’ (1964)తో కథానాయకుడిగా బాలీవుడ్‌ తెరపై మెరిశారు జితేంద్ర. ఇది బాక్సాఫీస ముందు భారీ హిట్‌గా నిలవడంతో అవకాశాలు వరుస కట్టాయి. దీని తరువాత ‘ఫర్జ్‌’, ‘క్యారావాన్‌’, ‘హమ్‌జోలి’ చిత్రాలతో వరుస హిట్లు అందుకొని బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాల్లోని పాటలు, వాటికి ఆయన వేసిన స్టెప్పులు అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఇదే ఆయనకు అభిమానుల మదిలో ‘జంపింగ్‌ జాక్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ అనే పేరును తెచ్చిపెట్టాయి. జితేంద్ర తన కెరీర్‌ మొత్తంలో ఎక్కువగా దక్షిణాది రీమేక్‌ల్లోనే నటించగా.. ‘సంజోగ్‌’, ‘ఔలాద్‌’, ‘మజాల్‌’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘మవాలి’, ‘హిమ్మత్‌వాలా’, ‘జానీ దుష్మన్‌’, ‘తోఫా’ వంటివి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. జయప్రద, శ్రీదేవి వంటి అగ్రనాయికలతో అత్యధిక చిత్రాల్లో జోడీ కట్టిన జితేంద్ర.. రీనూ రాయ్, నీతూ సింగ్, హేమామాలిని, సులక్షణ పండిత్‌ వంటి స్టార్‌ హీరోయిన్లతోనూ తెరపై చక్కటి రొమాన్స్‌ పండించారు. తాతినేని ప్రకాశ్‌ రావు, కె.బాపయ్య, కె.రాఘవేంద్రరావు వంటి తెలుగు అగ్ర దర్శకుల చిత్రాల్లోనూ కథానాయకుడిగా నటించి మెప్పించారు. నటుడిగా ఆయన కనబర్చిన ప్రతిభకుగానూ.. ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు (2003), దాదాసాహెబ్‌ ఫాల్కే అకాడమీ అవార్డు (2007), మోస్ట్‌ ఎవర్‌ గ్రీన్‌ రొమాంటిక్‌ హీరోగా లయన్స్‌ గోల్డ్‌ పురస్కారాలు (2012) అందుకున్నారు జితేంద్ర. అప్పట్లో ఆయన హేమమాలినితో నడిపిన ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు పెళ్లిపీటల వరకు వెళ్లిన వీరి ప్రేమాయణం.. ఆ తరువాత అనుకోని కారణాల వల్ల విఫలమైంది. దీని తరువాత 1974 అక్టోబరు 18న శోభ కపూర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు జితేంద్ర. వీరికిద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నిర్మాతగా రాణిస్తున్న ఏక్తా కపూర్, నటుడు తుషార్‌ కపూర్‌ జితేంద్ర వారసులే.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తొలి యానిమేషన్‌ కార్టూన్‌


ప్పుడంటే చిన్నపిల్లలకు కూడా యానిమేషన్‌ అంటే ఏమిటో, గ్రాఫిక్స్‌ అంటే ఏమిటో, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంటే ఏమిటో... అన్నీ తెలుసు. ఈ సాంకేతికత ఏమీ లేని రోజుల్లో ఓ బొమ్మ కదలడమే వింత. ప్రపంచంలోనే తొలిసారిగా ఆ వింతను కళ్ల ముందు చూపించిన యానిమేటెడ్‌ కార్టూన్‌గా ‘హ్యూమరస్‌ ఫేజెస్‌ ఆఫ్‌ ఫన్నీ ఫేసెస్‌’ (1906) అనే మూకీ గురించి చెప్పుకోవాలి. సుద్దముక్కతో నల్లబల్లమీద ఓ చిత్రకారుడు గీస్తున్న బొమ్మలు అప్పటికప్పుడు కదలడం, ఓ జోకర్‌ టోపీ ఎగరేస్తూ విన్యాసాలు చేయడం, యజమాని ఆడిస్తుంటే ఓ కుక్క రింగ్‌లోంచి దూకడం, ఓ వృద్ధుడు అమ్మాయిని చూడగానే తబ్బిబ్బు పడడం, ఓ పక్క డస్టర్‌తో చెరిపేస్తున్నా కూడా ఆయా బొమ్మలు కదులుతూ నవ్వించడం లాంటి దృశ్యాలతో ఈ కార్టూన్‌ చిత్రం రూపొందింది. దీని నిడివి కేవలం 3 నిమిషాలు. యానిమేషన్‌ టెక్నిక్‌కి ఆద్యుడిగా పేరొందిన జేమ్స్‌ స్టువార్ట్‌ బ్లాక్‌టన్‌ దీనికి దర్శకుడు.

* గొప్ప దర్శకుడు కొప్పోలా!


ధునిక హాలీవుడ్‌లో గొప్ప దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పోలా. ఆయన తీసిన సినిమాలు, అవి సంపాదించిన అవార్డులే అందుకు తార్కాణాలు. దర్శకుడిగా, నిర్మాతగా, స్కీన్ర్‌ రైటర్‌గా, కంపోజర్‌గా ముద్రవేసిన కొప్పోలా, తీసిన ప్రతి సినిమాకీ ఏదో ఒక అవార్డును, పురస్కారాన్ని పొందడం విశేషం. ఈయన తీసిన ‘ద గాడ్‌ఫాదర్‌’ (1972) సినీ చరిత్రలోనే ఓ సంచలనం. దీనికి మూడు ఆస్కార్‌ అవార్డులు లభించాయి. దీనికి కొనసాగింపుగా తీసిన ‘గాడ్‌ఫాదర్‌2’ (1974), ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ గెల్చుకున్న తొలి సీక్వెల్‌ సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో పాటు ఈ సినిమాకు మరో మూడు ఆస్కార్లు వచ్చాయి. ‘ద కన్వర్‌సేషన్‌’ (1974) సినిమా కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మకమైన ‘పామేడియోర్‌’ పురస్కారం పొందింది. తదుపరి సినిమా ‘అపోకలిప్స్‌ నౌ’ (1979) కూడా కేన్స్‌ చిత్రోత్సవంలో అదే అవార్డు గెల్చుకుని కొప్పోలాకు ఓ రికార్డు సంపాదించింది. ఈయన తీసిన ‘ద రైన్‌ పీపుల్‌’, ‘ప్యాటన్‌’, ‘ద ఔట్‌సైడర్స్‌ అండ్‌ రంబుల్‌ ఫిష్‌’, ‘ద కాటన్‌ క్లబ్‌’, ‘ద గాడ్‌ఫాదర్‌3’, ‘బ్రమ్‌స్టాకర్స్‌ డ్రాక్యులా’ సినిమాలన్నీ సినీ అభిమానులను అలరించినవే. మిచిగాన్‌లో 1939 ఏప్రిల్‌ 7న పుట్టిన కొప్పోలా, చిన్నప్పుడే పోలియో బారిన పడడంతో బాల్యమంతా మంచం మీదే గడిచింది. ఆ సమయంలో బొమ్మలనే పాత్రలుగా ఊహించుకుంటూ సొంత కథలు కల్పించుకుని ఆడుకోవడం ఆయనలోని ఊహాశక్తికి పునాదులు వేసింది. పదిహేనేళ్ల వయసులో 8ఎమ్‌ఎమ్‌ కెమేరాతో చిన్న చిన్న చిత్రాలు తీశాడు. ఆ సమయంలోనే సంగీతం కూడా నేర్చుకున్నాడు. ఆ తరువాత నాటకాల రచయితగా, దర్శకుడిగా వ్యవహరించి సినిమా ప్రపంచానికి బాటలు వేసుకున్నాడు. ఫిలిం స్కూల్లో చేరి సినిమా కళను అభ్యసిస్తూనే సినిమాలు తీశాడు.

* గ్లాడియేటర్‌ వీరుడు


అం
తర్జాతీయంగా సినీ అభిమానులను అలరించిన ‘గ్లాడియేటర్‌’ సినిమాలో బానిస వీరుడిగా, అరాచక రాచరిక విధానాలపై ధ్వజమెత్తి ప్రాణాంతకమైన పోరాటాలు చేసిన రోమన్‌ జనరల్‌ మాక్సిమస్‌ పాత్రలో నటుడు రసెల్‌ క్రోవ్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాలో అతడి పాత్ర అంతగా ఆకట్టుకుంది. అందుకే ఈ పాత్రలో అతడికి ఉత్తమ నటుడిగా ఆస్కార్, బ్రాడ్‌కాస్ట్‌ ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్, ఎంపైర్, లండన్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డులు వచ్చి పడ్డాయి. న్యూజిలాండ్‌కి చెందినప్పటికీ ఆస్ట్రేలియాలో ఎక్కువ కాలం ఉన్న రసెల్‌ క్రోవ్, నటుడిగా, నిర్మాతగా, సంగీతకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ‘ద ఇన్‌సైడర్‌’ (1999) సినిమాలో అతడి నటనకు ఉత్తమ నటుడిగా అయిదు అవార్డులు, ఏడు నామినేషన్లు రావడం విశేషం. గణిత శాస్త్రవేత్త, నోబెల్‌ విజేత జాన్‌ ఎఫ్‌. నాష్‌ బయోపిక్‌ ‘ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌’ సినిమాలో రసెల్‌క్రోవ్‌ నటనను కూడా ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాకి బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ సహా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇంకా ‘రాంపర్‌ స్టాంపర్‌’, ‘ఎల్‌ఏ కాన్ఫిడెన్షియల్‌’, ‘మాస్టర్‌ అండ్‌ కమాండర్‌: ద ఫార్‌ సైడ్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’, ‘సిండ్రెల్లా మ్యాన్‌’, ‘అమెరికన్‌ గ్యాంగ్‌స్టర్‌’, ‘స్టేట్‌ ఆఫ్‌ ప్లే’, ‘రాబిన్‌ హుడ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’, ‘నోవా’లాంటి ఎన్నో సినిమాలతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. దర్శకుడిగా అతడి తొలి చిత్రం ‘ద వాటర్‌ డివైనర్‌’ కూడా అతడికి ఎన్నో పురస్కారాలు తెచ్చిపెట్టింది. మూడు సార్లు వరసగా ఆస్కార్‌ అవార్డులు (1999-2001) అందుకున్న నటుడిగా రికార్డు అతడిదే. న్యూజిలాండ్‌లో 1964 ఏప్రిల్‌ 7న పుట్టిన రసెల్‌క్రోవ్‌ తల్లిదండ్రులిద్దరూ సినీ సెట్‌ కళాకారులకు క్యాటరర్స్‌గా వ్యవహరించేవారు. ఆస్ట్రేలియాలో తల్లి తాత టీవీ సిరీస్‌ నిర్మాత కావడంతో రసెల్‌క్రోవ్‌ నటనా ప్రస్థానం చిన్నతనంలో ఐదేళ్లకే మొదలైంది. ఆ తర్వాత సంగీతం నేర్చుకుని మ్యుజీషియన్‌గా కెరీర్‌ ప్రారంభించినా, నటనను మాత్రం వదలలేదు. బుల్లితెరపై నటుడిగా మెప్పించి ‘ద క్రాసింగ్‌’ (1990) సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినిమాలు అతడిని నడిపిస్తే, అవార్డులు అతడి వెంట నడిచాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.