ఏప్రిల్‌ 9.. (సినీ చరిత్రలో ఈరోజు)

* బుల్లితెర టు వెండితెర


ము
ద్దు ముద్దు మాటలతో పదహారేళ్ల వయసులోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కలర్స్‌ స్వాతి. బుల్లితెరపై యాంకర్‌గా మెరిసిన ఆమె... ఆ తరువాత వెండితెరపై సందడి చేసింది. తాను యాంకరింగ్‌ చేసిన కార్యక్రమం ‘కలర్స్‌’ పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. పలువురు అగ్రతారల్ని ఇంటర్వ్యూ చేసిన ఆమెకి చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు తలుపు తట్టాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘డేంజర్‌’తో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’ చిత్రంలో త్రిష చెల్లెలుగా నటించింది. ‘అష్టాచమ్మా’లో కథానాయికగా మెరిసిన ఆమె మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఆ చిత్రంతోనే నాని కథానాయకుడిగా పరిచయమయ్యారు. ‘అష్టాచమ్మా’ తరువాత స్వాతికి తమిళం నుంచి కూడా అవకాశాలు తలుపుట్టాయి. మలయాళంలోనూ నటించి పేరు తెచ్చుకున్నారామె. ‘త్రిపుర’, ‘కలవరమాయే మదిలో’, ‘కథ స్కీన్ర్‌ప్లే దర్శకత్వం అప్పలరాజు’, ‘మిరపకాయ్‌’, ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘లండన్‌ బాబులు’ తదితర చిత్రాల్లో నటించింది స్వాతి. ఆమె అసలు పేరు స్వాతిరెడ్డి. తండ్రి శివరామకృష్ణారెడ్డి నేవీ ఉద్యోగి. తల్లి ఇందిరాదేవి ఉన్నత విద్యావంతురాలు. తండ్రి ఉద్యోగం రీత్యా రష్యాలో ఉండగా అక్కడే 1987, ఏప్రిల్‌ 9న జన్మించారు స్వాతి. స్వెత్లానాగా అక్కడ నామకరణం చేశారు. తరువాత స్వాతిగా మార్చారు. కుటుంబం రష్యా నుంచి ముంబైకి, అక్కడ్నుంచి విశాఖపట్నంకి వచ్చి స్థిరపడింది. స్వాతి విద్యాభ్యాసం విశాఖలోనే సాగింది. ఇంటర్‌మీడియట్‌లో ఉండగా హైదరాబాద్‌కి వచ్చి స్థిరపడింది. బీఎస్సీ బయోటెక్నాలజీ చదివిని ఆమె, ఆ తరువాత ఫోరెన్సిక్‌లో పీజీ పూర్తి చేసింది. ఒక పక్క చదువుకుంటూనే, మరోపక్క యాంకరింగ్, యాక్టింగ్‌లపై దృష్టిపెట్టిందామె. నటిగానే కాకుండా, గాయకురాలిగా, డబ్బింగ్‌ కళాకారిణిగా కూడా స్వాతి రాణించింది. ‘జల్సా’లో ఇలియానా పాత్రకి స్వాతి డబ్బింగ్‌ చెప్పింది. ‘100%లవ్‌’తో పాటు... పలు చిత్రాల్లో గీతాలు ఆలపించారు. ఆమెకి సోదరుడు సిద్ధార్థ్‌ రెడ్డి ఉన్నారు. ఆ మధ్య వికాస్‌ వాసు అనే పైలెట్‌ని వివాహం చేసుకొంది స్వాతి.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* రెండు తరాలకి వారధి...
బాలయ్య (పుట్టిన రోజు-1930)


బ్లా
క్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి... డిజిటల్‌ యుగం వరకు సినిమాను అతి దగ్గర్నుంచి చూసిన వ్యక్తులు అరుదుగా కనిపిస్తుంటారు. అందులో మన్నవ బాలయ్య ఒకరు. ఆయన నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా రాణించారు. 1957 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఆయన 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు. గుంటూరు జిల్లా, అమరావతి మండలం, చావుపాడులో మన్నవ గురవయ్య చౌదరి, అన్నపూర్ణమ్మ దంపతులకి 1930 ఏప్రిల్‌ 9న జన్మించారు మన్నవ బాలయ్య. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్న ఆయన్ని, కాలేజీ రోజుల్లో నాటకాలతో ఏర్పడిన అనుబంధం సినిమా రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ఇంజినీరింగ్‌ తరువాత కొన్నాళ్లు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1957లో ప్రముఖ దర్శకుడు తాపీ చాణక్య మార్గనిర్దేశకత్వంతో నటుడిగా మారారు. ‘ఎత్తుకు పైఎత్తు’ అనే చిత్రంతో బాలయ్యని తెరకు పరిచయం చేశారు తాపీ చాణక్య. ఆ తరువాత చేసిన ‘పార్వతికళ్యాణం’, ‘భాగ్యదేవత’, ‘కుంకుమరేఖ’ ఆయన్ని నటుడిగా నిలెబట్టాయి. ‘భూకైలాస్‌’ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో కలిసి శివుడిగా నటించారు. 1970లో అమృత ఫిల్మ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసిన ఆయన ‘నేరము శిక్ష’, ‘అన్నదమ్ముల కథ’, ‘చెల్లెలి కాపురం’, ‘నిజం చెబితే నేరమా’ చిత్రాల్ని నిర్మించారు. స్వీయ దర్శకత్వంలో ‘పోలీస్‌ అల్లుడు’, ‘ఊరికిచ్చిన మాట’ తెరకెక్కించారు. 1991లో మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చిన ఆయన పలు చిత్రాల్లోనూ, టెలివిజన్‌ ధారావాహికల్లోనూ నటించారు. 2010లో బాలయ్యని ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం వరించింది. ఆయనకి అమ్మాయిలు హర్షలత, మోహనీలత, అబ్బాయి ఎమ్‌.తులసిరామ్‌ ప్రసాద్‌ ఉన్నారు. పాత తరానికి... కొత్త తరానికి వారధిగా ఉన్న సీనియర్‌ నటుడు, దర్శకుడు, నిర్మాత మన్నవ బాలయ్య పుట్టినరోజు ఈరోజు.

* ఓటమెరుగని జయం.. ఆమెకే సొంతం


లేలేత యవ్వనంలోనే వెండితెరకు పరిచయమైంది

సహజ నటనతో అభిమానుల్ని కట్టిపడేసింది
కన్నార్పలేని అందం ఆమెకే సొంతం
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విజయవంతమైన నాయిక
బాలీవుడ్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ భార్యగా అందలం
రాజ్యసభ సభ్యురాలిగా అప్రతిహత ప్రయాణం
మాజీ ప్రపంచ సుందరికే అత్త
..వెరసి ఆమే జయ బచ్చన్‌(బాధురి)

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెత జయ బచ్చన్‌కు అతికినట్టు సరిపోతందంటే అతిశయోక్తి కాదేమో. లేలేత యవ్వనంలోనే చిత్రరంగంలో ప్రవేశించింది. అందానికి తగ్గట్టే సహజ నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొంది. బాలీవుడ్‌ బాద్షా అమితాబచ్చన్‌తో కలిసి జంటగా వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తరువాత ఆయన్నే సొంతం చేసుకొంది. ఆమె ప్రతిభకు గురింపుగా 1992లో ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. రాజకీయాల్లోకి ప్రవేశించి రాజ్యసభ సభ్యురాలిగా సుదీర్ఘంగా నేటికీ సేవలందిస్తున్నారు.

సినీరంగం ప్రవేశం :
బెంగాలీ దర్శకుడు సత్యజిత్‌రే దర్శకత్వంలో 1963లో వచ్చిన సినిమా బెంగాలీ చిత్రం ‘మాహానగర్‌’. ఇందులో బాలనటిగా 15ఏళ్ల ప్రాయంలోనే మొదటిసారి తెరపై కనిపించారు. ఈ సినిమాలో సహాయ నటిగా కనిపించారు. ఆ తరువాత హృషీకేశ్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమాలు ‘గుడ్డి’, ‘ఉపహార్‌’, ‘కోషిష్‌’, ‘కోరాకాగజ్‌’ చిత్రాలు నటిగా గుర్తింపునిచ్చాయి. 1971లో వచ్చిన ‘గుడ్డి’ సినిమా ద్వారా నటిగా గుర్తింపు వచ్చింది. బాలీవుడ్‌ నటులు రాజేశ్‌ ఖన్నా, ధర్మేంద్రల సరసన నటించారు. అమితాబ్‌తో వివాహాం కంటే ముందే నటించిన సినిమా ‘బన్సీ బిర్జూ’. 1973లో అమితాబచ్చన్‌ను వివాహమాడారు. వివాహం తరువాత అమితాబ్‌తో కలిసి ‘జంజీర్‌’, ‘అభిమాన్‌’, ‘చుప్కే చుప్కే’, ‘మిలీ’, ‘షోలే’ చిత్రాల్లో కలిసి నటించారు. తరువాత సినిమాల్లో నటించేందుకు అమితాబ్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నటనకు విరామాన్నిచ్చారు. కుమారుడు అభిషేక్‌బచ్చన్, కుమార్తె శ్వేత బచ్చన్‌లు జన్మించటంతో పూర్తిగా ఇంటికే పరిమితమై ఇంటి భాధ్యతలు నిర్వహించారు.

సినీ రంగ పునఃప్రవేశం :
1998లో గోవింద్‌ నిహలాని చిత్రం ‘హజార్‌ చౌరాసి కి మా’తో వెండితెరపై మెరిశారు. ‘ఫిజా’, కభి ఖషి కభి గమ్‌’, ‘కల్‌ హో నా హో’, వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. 2011లో వచ్చిన బంగ్లాదేశ్‌ సినిమా ‘మెహర్జాన్‌’ చిత్రంలో నటించారు.

రాజ్యసభ సభ్యురాలిగా :
2004లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. ఉత్తర ప్రదేశ్‌నుంచి సమాజ్‌ వాదీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత నాలుగు పర్యాయాలు వరుసగా రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.

రాజకీయ వివాదాలు :
మహరాష్ట్రలోని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో జయ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. శివసేన అధ్యక్షుడు బాల్‌ఠాక్రే ఈ వాఖ్యలను జయ ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని లేకపోతే అమితాబ్‌ సినిమాలను ప్రదర్శించనివ్వమని హెచ్చరించి ఆందోళనకు దిగారు. జయ తరపున అమితాబ్‌ మరాఠా ప్రజలకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

అవార్డులు :
‘గుడ్డి’ (హిందీ) చిత్రానికి ఫిలింఫేర్‌ ప్రత్యేక అవార్డుతో పాటు బెంగాలీ జర్నలిస్టు అసోసియేషన్‌ అవార్డునందుకొన్నారు. ‘ఉపహార్‌’ చిత్రానికి ఉత్తమ నటిగా నామినేటయ్యారు. 2007లో ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య అవార్డును, 2010లో ‘టంగ్స్‌ ఆన్‌ ఫైర్‌’ లండన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో జీవిత సాఫల్య అవార్డునందుకొన్నారు. 2012లో జైపూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో జీవిత సాఫల్య అవార్డు, 2017లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డునందుకొన్నారు. మొత్తం 9 ఫిలిం ఫేర్‌ అవార్డులు అందుకొన్నారు. 1948 ఏప్రిల్‌ 9న మథ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన జయబచ్చన్‌ నేడు 72వ జన్మదినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అమెరికా కుంభకోణం


ప్ర
భుత్వాధినేతల్ని అతలాకుతలం చేసి పతనానికి గురి చేసే కుంభకోణాలు దేశదేశాల్లో జరుగుతుంటాయి. అలాంటివి బయటపడినప్పుడల్లా అవి సంచలనాత్మకమైన మార్పులకు దోహదం చేస్తాయి. అలా అమెరికాలో జరిగిన ఓ కుంభకోణం వల్ల అధ్యక్షుడు నిక్సన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ కుంభకోణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆల్‌ ద ప్రెసిడెంట్స్‌ మెన్‌’ (1976) వెండితెరపై కూడా సంచలనం సృష్టించింది. రెండు ఆస్కార్లు సహా అనేక పురస్కారాలు గెల్చుకోవడమే కాకుండా వాణిజ్య పరంగా 1.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 70.6 మిలియన్‌ డాలర్లు రాబట్టి విజయవంతమైంది. అమెరికా జరిగిన ఈ కుంభకోణాన్ని ‘వాటర్‌గేట్‌ స్కాండల్‌’ అంటారు. దీనిపై 1974లో ఇద్దరు జర్నలిస్ట్‌లు కార్ల్‌ బెర్న్‌స్టీన్, బాబ్‌ ఉడ్‌వార్డ్‌ రాసిన వాస్తవిక రచన ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ కుంభకోణాన్ని వెలికి తీసింది కూడా వీరిద్దరే కావడం విశేషం. అమెరికాలో 1972 ఎన్నికల సమయంలో ఇద్దరు జర్నలిస్ట్‌లు ‘ద వాషింగ్‌టన్‌ పోస్ట్‌’ పత్రికలో పనిచేస్తూ వాటర్‌గేట్‌ స్కాండల్‌ను ఎలా బహిర్గతం చేశారనేదే సినిమా కథ.

* పాత్ర ఒకటే... ప్రశంసలు బోలెడు


కే పాత్ర ధరించినందుకు అటు బుల్లితెర మీద, ఇటు వెండితెర మీద కూడా అవార్డులు ప్రశంసలు పొందిన ఘనత సింథియా నిక్సన్‌దే. నటిగా, ఉద్యమకారిణిగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్న నిక్సన్‌ హెచ్‌బీఓలో 1998 నుంచి 2004 వరకు ప్రసారమైన ‘సెక్స్‌ అండ్‌ ద సిటీ’ సీరియల్‌లో మిరండా హోబ్స్‌ అనే పాత్రలో విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె నటనకు ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డు లభించింది. ఇదే పాత్రను ఆమె ‘సెక్స్‌ అండ్‌ ద సిటీ’ (2008), ‘సెక్స్‌ అండ్‌ ద సిటీ2’ (2010) సినిమాల్లో కూడా ధరించి వెండితెర ప్రేక్షకులను కూడా అలరించింది. ఈమె ఇంకా ‘అమేడియస్‌’, ‘జేమ్స్‌ వైట్‌’, ‘ఎ క్వైట్‌ ప్యాషన్‌’లాంటి సినిమాల్లో కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. నాటక రంగంలో నటిగా టోనీ, ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ, గ్రామీ లాంటి అవార్డులెన్నో సాధించింది. న్యూయార్క్‌లో 1966 ఏప్రిల్‌ 9న పుట్టిన నిక్సన్‌ నటిగా పేరు తెచ్చుకుంటూనే స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడింది. మరో మహిళను పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. మానవ హక్కులపై పోరాటానికి కూడా ఆమె ఎన్నో అవార్డులు అందుకుంది.

* అందంలో మేటి...
ఆర్జనలో లేరు సాటి


సో
గకళ్లు... మురిపించే నవ్వు...
చూడగానే ఆకట్టుకునే అందం...
వీటికి సాయం చక్కని నటన...
ఇన్ని ఉంటే వెండితెరపై వెలుగుల ప్రస్థానానికి లోటేముంటుంది?
అందుకనే క్రిస్టీన్‌ స్టెవార్ట్‌ హాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల మనసులు దోచుకుంది.

ఆమె దూసుకుపోయిన తీరు గమనిస్తే...
- ఆమె నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 4.3 బిలియన్‌ డాలర్లను కురిపించాయి!
- ఒక దశలో అత్యధిక పారితోషికం అందుకున్న తారామణిగా పేరు తెచ్చుకుంది!
- ఫ్రాన్స్‌లో జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న తొలి అమెరికా నటిగా రికార్డు సృష్టించింది!
- నటిగా, మోడల్‌గా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేసింది!

కాలిఫోర్నియాలో 1990 ఏప్రిల్‌ 9న పుట్టిన క్రిస్టీన్, తొమ్మిదేళ్లకే వెండితెరకు పరిచయమైంది. ‘ప్యానిక్‌ రూమ్‌’ (2002), ‘స్పీక్‌’, ‘క్యాచ్‌ దట్‌ కిడ్‌’, ‘జతురా: ఎ స్పేస్‌ ఎడ్వంచర్‌’, ‘ఇన్‌టు ద వైల్డ్‌’లాంటి సినిమాల్లో నటించి బాఫ్టా లాంటి అవార్డులు అందుకుంది. ‘ద ట్విలైట్‌ శాగా’ సినిమాలు ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయిదు భాగాలుగా వచ్చిన ఈ సీక్వెల్‌ సినిమాలన్నీ కలిసి 3.3 బిలియన్‌ డాలర్లు వసూలు చేశాయి. ‘స్నోవైట్‌ అండ్‌ ద హంట్స్‌మ్యాన్‌’, ‘క్యాంప్‌ ఎక్స్‌రే’, ‘స్టిల్‌ ఎలైస్‌’, ‘ఈక్వెల్స్‌’, ‘పెర్సనల్‌ షాపర్‌’ సినిమాలు ఆమెకు స్టార్‌డమ్‌ తీసుకొచ్చాయి. ఫ్రెంచి సినిమా ‘క్లౌడ్స్‌ ఆఫ్‌ సిల్స్‌ మారియా’ సినిమాలో నటనకు ఆ దేశపు ప్రతిష్ఠాత్మకమైన ‘సీజర్‌’ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.