ఆగస్టు 11.. (సినీ చరిత్రలో ఈరోజు)

* తెలుగు ప్రేక్షకులను...
అలరించిన ‘గూఢచారి 116’!


హా
లీవుడ్‌ సినిమాల్లో మాత్రమే చూడగలిగే గూఢచారి కథను తెలుగు వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం అది. నటుడు కృష్ణ కెరీర్‌నే మలుపు తిప్పి అతడి విజయ పరంపరలకు నాంది పలికిన చిత్రం అంది. అదే ‘గూఢచారి 116’. తెలుగునాట అఖండ విజయం సాధించిన ఈ సినిమా 1966 ఆగస్టు 11న విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* మల్టీస్టారర్‌ మూవీలకు పెట్టింది పేరు!
సునీల్‌ శెట్టి (పుట్టినరోజు-1961)


రడుగుల ఎత్తు.. ఆరు పలకల దేహం.. అన్నిటికీ మించి ఆకట్టుకునే రూపం, అదరగొట్టే అభినయ నైపుణ్యాలు.. సునీల్‌ శెట్టి పేరు చెప్పగానే సినీ ప్రియుల మదిలో మెదిలే అద్భుత రూపమిదే. కథానాయకుడన్న పదానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత చిత్రసీమలో యాక్షన్‌ హీరోగా మెరుపులు మెరిపించాడు సునీల్‌. హిందీ, తమిళ్, మలయాళ, ఇంగ్లీష్‌ భాషల్లో కలిపి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించగా.. నిర్మాతగా అరడజను సినిమాలను నిర్మించి నిర్మాతగానూ సత్తా చాటాడు. 1961 ఆగస్టు 11న మైసూర్‌లో జన్మించిన సునీల్‌ శెట్టి అసలు పేరు సునీల్‌ వీరప్ప శెట్టి. ‘బల్‌వానా’ (1992) చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ కండల వీరుడు తొలి సినిమాతోనే ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోని చిత్రసీమలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో సునీల్‌కు జోడీగా దివ్యభారతి నటించగా.. దీపక్‌ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తరువాత అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘వక్త్‌ హమారా హై’ (1993)లో నటించగా అది కూడా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక సునీల్‌ శెట్టికి తొలి పరాజయాన్ని రుచి చూపించిన చిత్రం మాత్రం ‘పెహచాన్‌’. 1993లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్‌తో పాటు సైఫ్‌ అలీఖాన్‌ మరో కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్ర ఫలితం కొంత నిరాశ పరచినా సునీల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక 1994 వచ్చిన మరో మల్టీస్టారర్‌ ‘దిల్‌వాలే’తో సునీల్‌ బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయకుడిగా మారిపోయాడు. సునీల్, అజయ్‌ దేవగణ్‌ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా బాక్సాఫీస్‌ వద్ద రూ.12 కోట్లు వసూళ్లు సాధించి అప్పట్లో రికార్డుల మోత మోగించింది. ఈ చిత్రానికి గానూ సునీల్‌ ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. దీని తరువాత ‘అంత్‌’ (1994), ‘మొహ్రా’ (1994), ‘గోపి కృష్ణ’ (1994)లతో వరుస విజయాలు అందుకోవడంతో ఒకే ఏడాది నాలుగు హిట్‌ చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. వీటిలో ‘గోపి కృష్ణ’ చిత్రంలో సునీల్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఇక ఇక్కడి నుంచి అడపాదడపా పరాజయాలు పలకరిస్తున్నా ‘కృష్ణ’ (1996), ‘సపూట్‌’ (1996), ‘రక్షక్‌’ (1996), ‘బోర్డర్‌’ (1997), ‘భాయ్‌’ (1997), ‘ధడ్‌కన్‌’ (2000), ‘యహ్‌ తేరా గర్‌ యహ్‌ మేరా గర్‌’ (2001), ‘మైన్‌ హూనా’ (2004), ‘వెల్‌కమ్‌’ (2007), ‘రెడ్‌ ఎలర్ట్‌’ (2010) వంటి గుర్తుండిపోయే చిత్రాలతో అభిమానుల మదిలో యాక్షన్‌ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సునీల్‌ శెట్టి ఇప్పటి వరకు 110పైగా చిత్రాల్లో నటించగా వాటిలో ఎక్కువ శాతం మల్టీస్టారర్‌లే ఉండటం విశేషం. ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్ర కథానాయకులుగా ఉన్న అందరితోనూ సునీల్‌ తెరను పంచుకున్నాడు. గత కొన్నేళ్లుగా అతిథి పాత్రలతో అభిమానులకు కనువిందు చేస్తున్న ఈ హీరో ప్రస్తుతం కిచ్చా సుదీప్‌తో కలిసి ‘పహిల్వాన్‌’లో సర్కార్‌ అనే కీలకపాత్రలో నటిస్తున్నారు. హిందీలో ‘తానాజీ: ది అన్సంగ్‌ వారియర్‌’, మలయాళంలో ‘మరక్కర్‌: దిల లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ’, తమిళంలో రజనీకాంత్‌తో కలిసి ‘దర్బార్‌’లో అహ్మద్‌ ఇస్మాయిల్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. 2001లో వచ్చిన ‘ధడ్‌కన్‌’ చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా తొలి ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాన్ని దక్కించుకున్న సునీల్‌.. ఇదే చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా జీ సినీ అవార్డును అందుకున్నాడు. 2005లో ‘మైన్‌ హు నా’ చిత్రానికి జిఫా ఉత్తమ ప్రతినాయకుడిగా.. 2008లో ‘రెడ్‌ ఎలర్ట్‌..’ మూవీకి సైఫా ఉత్తమ నటుడిగా.. ఇదే చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా 2011లో ‘స్టార్‌డస్ట్‌ సెర్చ్‌ లైట్‌ అవార్డు’లను దక్కించుకున్నాడు. భారత చలన చిత్ర పరిశ్రమకు సునీల్‌ శెట్టి అందించిన సేవలకు గానూ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అతన్ని ‘రాజీవ్‌గాంధీ అవార్డు’తో సత్కరించింది.

* నటనంటే అతడికి పిచ్చి!


పన్నెండేళ్ల పిల్లాడు తన తొలి నాటకంలోనే 80 ఏళ్ల వృద్ధుడి పాత్ర ధరించి, ప్రశంసలు అందుకున్నాడు. నటనా ప్రస్థానంలో అది అతడి తొలి అడుగు. - తరువాత అతడు ప్రపంచంలోనే గొప్ప నటుడిగా పేరు పొందాడు. - తొలి సినిమాకే ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్నాడు. అతడే ‘పాల్‌ముని’. ‘పాత్రలో ఒదిగిపోయాడని’ చాలా మంది గురించి అలవోకగా రాస్తుంటారు. కానీ ఆ ప్రశంస సరిగ్గా అతికినట్టు సరిపోయే గొప్ప నటుడు పాల్‌ముని. ‘నటన అతడికి వ్యాపకం కాదు... పిచ్చి’ అని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక శ్లాఘించింది. ఏదైనా పాత్ర ధరించాలంటే అతడు దాని మీద పెద్ద పరిశోధనే చేసేవాడు. మేకప్‌ పరంగా, శరీర భాష పరంగానే కాదు కంఠస్వరాన్ని కూడా పాత్రలకు అనుగుణంగా మార్చుకునేవాడు. ఎక్కువగా ప్రముఖుల బయోపిక్స్‌లో నటించాడు. ఆయా వ్యక్తుల గురించి పుస్తకాలు చదవడం, వారి సంబంధీకుల దగ్గరకు వెళ్లి వివరాలు రాబట్టడం చేసేవాడు. ‘ద స్టోరీ ఆఫ్‌ లూయిస్‌ పాశ్చర్‌’ (1936) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. అతడు నటించిన ‘ద లైఫ్‌ ఆఫ్‌ ఎమిలే జోలా’ చిత్రం 1937 ఆగస్టు 11న విడుదలై ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అందుకుంది. ప్రపంచంలోని గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది.

* ఆస్ట్రేలియా నుంచి హాలీవుడ్‌కి


క్రి
స్‌ హెమ్స్‌వర్త్‌ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ‘స్టార్‌ట్రెక్‌’, ‘ద ఎవెంజర్స్‌’, ‘థార్‌’, ‘రష్‌’, ‘ఘోస్ట్‌బస్టర్స్‌’ చిత్రాల నటుడంటే ఇట్టే గుర్తుపడతారు. నాటకాలు, టీవీల ద్వారా నటుడైన ఇతడు మెల్‌బోర్న్‌లో 1983 ఆగస్టు 11న పుట్టి హాలీవుడ్‌లో యువతకు ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇతనికి ఎల్సా పతాకీ అనే నటితో పెళ్లైయింది. వీరికి ముగ్గురు సంతానం. ఈ సంవత్సరం విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ‘అవెంజెర్స్‌: ఎండ్‌గేమ్‌’ చిత్రంలో థోర్‌ పాత్రలో నటించారు. ప్రస్తుతం ‘ఢాకా’, ‘జాయ్‌ అండ్‌ సైలెంట్‌ బాబ్‌ రిబూట్‌’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

* భయానక నటుడు..


మూ
డు దశాబ్దాల పాటు హారర్‌ సినిమాల నటుడిగా గుర్తింపు పొందడం అంటే విచిత్రమే. ఆ ఘనత పీటర్‌ క్యుషింగ్‌దే. 1950ల నుంచి 70ల వరకు వచ్చిన అనేక భయానక చిత్రాల్లో పాత్రల ద్వారా ఆకట్టుకున్నాడు. డిటెక్టివ్‌ షెర్లాక్‌హోమ్స్‌ పాత్ర ద్వారా పలు సినిమాల్లో మెప్పించాడు. డ్రాకులా, స్టార్‌వార్స్, డాక్టర్‌ హూ చిత్రాల్లో పాత్రలు ఈయనకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. స్టార్‌వార్స్‌-4 సినిమాలో ‘గ్రాండ్‌ మాఫ్‌ టార్కిన్‌’ పాత్ర ద్వారా యువతరం ప్రేక్షకులకూ అభిమానపాత్రుడయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌’ గుర్తింపు పొందారు. ఇంగ్లండ్‌లో 1913 మే 26న పుట్టిన ఇతడు, చిన్నప్పుడే నాటకాల ద్వారా ఆకట్టుకున్నాడు. దాదాపు 60 ఏళ్ల పాటు వివిధ పాత్రలు పోషించి మెప్పించిన ఈయన క్యాన్సర్‌ వల్ల 11 August, 1994లో మరణించారు.

* కామెడీ అయినా...
క్యారెక్టర్‌ అయినా...


పక్క హాస్యం చిందించగలడు... మరో పక్క భావోద్వేగాలను పండించగలడు... అందుకే రాబిన్‌ విలియమ్స్‌ అంటే సినీ ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఓ ఆస్కార్‌ అవార్డు, రెండు ఎమ్మీ అవార్డులు, ఏడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు, రెండు స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు, నాలుగు గ్రామీ అవార్డులు అతడి ప్రతిభకు గీటురాళ్లు. 1951 జులై 21న షికాగోలో పుట్టిన రాబిన్‌ విలియమ్స్, అమ్మ నేర్పిన హాస్యప్రియత్వంతో చిన్నప్పుడే వేదికలపై హాస్య రూపకాలతో అలరించేవాడు. ఆ తర్వాత టీవీల్లో కామెడీ షోలతో ఆకట్టుకున్నాడు. ఓ పక్క నాటకాలలో నటిస్తూనే, మరో పక్క సినిమాల్లో రాణించాడు. ‘పాపియే’ (1980) సినిమాతో తొలిసారి సినీ ప్రేక్షకులను కీలకమైన పాత్రతో ఆకట్టుకున్న రాబిన్‌ విలియమ్స్, ‘గుడ్‌మార్నింగ్‌ వియత్నాం’, ‘డెడ్‌ పోయెట్స్‌ సొసైటీ’, ‘అలాద్దిన్‌’, ‘ద బర్డ్‌ కేజ్‌’, ‘గుడ్‌విల్‌ హంటింగ్‌’, ‘వరల్డ్స్‌ గ్రేటెస్ట్‌ డాడ్‌’, ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’, ‘జుమాంజీ’, ‘నైట్‌ ఎట్‌ ద మ్యూజియం’ లాంటి సినిమాలతో స్టార్‌డమ్‌ సాధించాడు. కమల్‌ హాసన్‌ నటించిన ‘భామనే సత్య భామనే’ సినిమాకు ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’ సినిమాయే స్ఫూర్తి. అందరినీ సున్నితమైన హాస్యంతో ఆకట్టుకున్న రాబిన్‌ విలియమ్స్‌ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల 2014 ఆగస్టు 11న ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతడి అభిమానులకు ఓ చేదు జ్ఞాపకం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.