ఆగస్టు 13.. (సినీ చరిత్రలో ఈరోజు)

* తొలి మహిళా సూపర్‌స్టార్‌!
 శ్రీదేవి (జయంతి-1963)


బాలతారగానే మెరుపులు మెరిపించింది... పదహారేళ్ల వయసు వచ్చేసరికల్లా వెండితెరకే వన్నెలు దిద్దింది... అభినయానికి అందం తెచ్చింది... ఇలాంటి విశేషణాలేవైనా ఆమె సంపాదించిన ప్రాచుర్యం ముందు వెలవెల పోవాల్సిందే. ఏ భాషా చిత్రమైనా ఆమె నటిస్తే కాసులు కురిపించింది. శివకాశిలో 1963 ఆగస్టు 13న పుట్టిన శ్రీదేవి ఆరేళ్లకే తమిళ చిత్రంలో బాలమురుగన్‌గా ముద్దులు మూటగట్టించేలా నటించింది. భారతదేశంలోని దాదాపు అందరు అగ్రనటుల సరసన నటించిన శ్రీదేవి అందరి చేతా ప్రశంసలు పొందింది. ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* నటన గంభీరం... హాస్యం సునిశితం!
రావు గోపాలరావు (వర్థంతి-1994)‘మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలి. అస్తమానూ తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది?’ అంటూ గంభీరమైన కంఠస్వరంతో, మెత్తని కత్తి లాంటి నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రావు గోపాలరావు, సినీ రంగంలో మరిచిపోలేని ‘కళాపోసనే’ చేశారు. గోముఖ వ్యాఘ్రంలాంటి విలన్‌ పాత్రల్ని రక్తికట్టిస్తూనే, శరీరభాషతో సునిశిత హాస్యాన్ని ఆయన ఎన్నో సినిమాల్లో పండించారు. కాకినాడ దగ్గర గంగనాపల్లి గ్రామాంలో 1937 జనవరి 14న పుట్టిన రావుగోపాల రావు, మొదటి నుంచీ నటన మీద ఆసక్తి పెంచుకున్నారు. సొంత డ్రామా కంపెనీల ద్వారా నాటకాలు వేసేవారు. ఆయన నాటకం చూసిన ఎస్వీ రంగారావు సిఫార్సుతో గుత్తా రామినీడును కలిసి 1966లో ‘భక్త పోతన’ సినిమా మొదలుకొని కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత నటుడిగా మారి ‘జగత్‌ కిలాడీలు’ లాంటి సినిమాల్లో విలన్‌గా కనిపించారు. ‘ముత్యాల ముగ్గు’లో కుతంత్రాల కాంట్రాక్టర్‌గా విజృంభించారు. ‘భక్త కన్నప్ప’, ‘గోరంత దీపం’, ‘మనవూరి పాండవులు’, ‘అభిలాష’, ‘ఛాలెంజ్‌’, ‘వేటగాడు’, ‘యమగోల’ లాంటి ఎన్నో సినిమాల ద్వారా అలరించారు. నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 1994 ఆగస్టు 13న తన 57 ఏళ్ల వయసులో మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* సస్పెన్స్‌ సినిమాలకు ఆద్యుడు!
 ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ (జయంతి-1899)


ఒక్క సినిమా ఛాన్స్‌ కోసం తపించిన ఓ కుర్రాడు... ఆ ఛాన్స్‌ వచ్చాక సినిమాల గతినే మార్చేశాడు! సరికొత్త చిత్రీకరణ విధానాలకు నాంది పలికాడు! ప్రపంచవ్యాప్తంగా ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాడు! అతడే... ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌! ఇంగ్లండ్‌లో 1899 ఆగస్ట్‌ 13న పుట్టిన హిచ్‌కాక్, మేటి దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగి... బ్రిటిష్‌ ప్రభుత్వపు అత్యున్నత గౌరవ పురస్కారం అందుకునే వరకు అతడి జీవితంలోని ప్రతి దశలోను పట్టుదల, ప్రతిభ పెనవేసుకుని కనిపిస్తాయి. సినిమా చరిత్రలోనే ప్రభావశీలురైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హిచ్‌కాక్‌ను అందరూ ‘మాస్టర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌’ అంటారు. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో అతడు తీసిన 50 చిత్రాల్లో ఏది చూసినా ఓ కొత్తదనం, ఓ వైవిధ్యం కనిపిస్తాయి.ద ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఏదో ఒక టెక్నిక్‌ ఉంటుంది. ఆ టెక్నిక్‌... ప్రేక్షకుల వెన్నులో చలి పుట్టిస్తుంది. ఉత్కంఠ కలిస్తుంది. భయం పుట్టిస్తుంది. చివరికి ‘ఆహా...’ అనిపిస్తుంది. పదిహేనేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే కుటుంబం కోసం ఏవేవో పనులు చేశాడు. టెలిగ్రాఫ్‌ ఆఫీసులో క్లార్క్‌గా చేరి రాత్రిళ్లు చరిత్ర, చిత్రలేఖనం, ఆర్థిక, రాజకీయ శాస్తాల్రు చదువుకున్నాడు. మధ్యలో చిన్న చిన్న కథలను రాసి పత్రికలకు పంపేవాడు. అక్షరాలను అందంగా రాయడం ద్వారా ప్రకæనల సంస్థల్లో పనిచేసేవాడు. అలా నిశ్శబ్ద చిత్రాల్లో మధ్యలో వేసే డైలాగ్‌ కార్డ్‌లను (టైటిల్‌ కార్డు డిజైనర్‌) రాసేవాడు. అలా సినిమాలపై ఆసక్తి పెరిగింది. నెమ్మదిగా సహ రచయితగా, ఆర్ట్‌డైరెక్టర్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా 18 నిశ్శబ్ద చిత్రాలకు పనిచేశాడు. దర్శకుడిగా ‘ద ప్లెజర్‌ గార్డెన్‌’ (1925) అతడి మొదటి చిత్రం. ‘ద లాడ్జర్‌: ఎ స్టోరీ ఆఫ్‌ ద లండన్‌ ఫాగ్‌’ (1927) సినిమాతో వెండితెరకు తొలి ‘థ్రిలర్‌’ను పరిచయం చేశాడు. తొలి బ్రిటిష్‌ టాకీ ‘బ్లాక్‌మెయిల్‌’ (1929), ‘ద 39 స్టెప్స్‌’ (1935), ‘ద లేడీ వేనిషెస్‌’ (1938) చిత్రాలతో హిచ్‌కాక్‌ పేరు ప్రపంచ వ్యాప్తగా మార్మోగింది. 20వ శతాబ్దంలోనే గొప్ప బ్రిటిష్‌ చిత్రాలుగా ఇవి పేరొందాయి. దాంతో హాలీవుడ్‌ నుంచి పిలుపందుకున్నాడు. ఆపై ‘రెబెక్కా’ (1940), ‘ఫారెన్‌ కరెస్పాండెంట్‌’ (1940), ‘షాడో ఆఫ్‌ ఎ డౌట్‌’ (1943) ఇలా ఏది తీసినా హిట్టే. ‘రెబెక్కా’ 11 ఆస్కార్‌ నామినేషన్లు సాధించి ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అందుకుంది. హిచ్‌కాక్‌ తీసిన 53 చిత్రాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 223.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేశాయి. మొత్తం 46 ఆస్కార్‌ నామినేషన్లు పొంది 6 ఆస్కార్‌ అవార్డులను పొందాయి. ఆయన తీసిన సినిమాల్లో ‘రేర్‌ విండో’, ‘వర్టిగో’, ‘నార్త్‌ బై నార్త్‌వెస్ట్‌’, ‘సైకో’, ‘ద బర్డస్‌’ లాంటి సినిమాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దర్శకులకు వెండితెర పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తుంటరి జంట


బోనీ ఓ అందమైన అమ్మాయి... క్లైడ్‌ ఓ చలాకీ కుర్రాడు... ఇద్దరూ కలిశారు... ఒకర్నొకరు ఇష్టపడ్డారు... అంతవరకు బాగానే ఉంది. కానీ ఇద్దరూ నేర స్వభావం ఉన్నవాళ్లే. ఇంకేముంది? వాళ్ల ప్రేమతో పాటు, నేరాలకి కూడా పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సరదాగా, వినోదం కోసం, డబ్బు కోసం, థ్రిల్‌ కోసం ఇద్దరూ కలిసి చోరీలు, దోపిడీలు, ఆఖరికి హత్యలు కూడా మొదలు పెట్టారు. కార్ల దొంగతనం నుంచి బ్యాంకులను దోచుకోవడం వరకు అన్నీ మొదలుపెట్టారు. మరి చివరికి ఏమైంది? నేరాల బాట వాళ్లిద్దరినీ ఏ గమ్యం చేర్చింది? అదే... ‘బోనీ అండ్‌ క్లైడ్‌’ (1967) సినిమా. హాలీవుడ్‌ సినిమాల్లో కొత్త శకానికి నాంది పలికిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాతే హాలీవుడ్‌ నిర్మాతలు సినిమాల్లో మితిమీరిన శృంగారాన్ని, హింసను యదేచ్ఛగా చూపించడం ప్రారంభించారు. ‘సినిమాల చరిత్రలోనే అత్యంత రక్తపాతాన్ని, మరణ సన్నివేశాలను’ చూపించిన సినిమాగా పేరు తెచ్చుకుందిది. ఇంతలా వివాదాస్పదమైనా, రెండు ఆస్కార్‌ అవార్డులు సైతం చేజిక్కించుకుంది. దాదాపు 2.5 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే, 70 మిలియన్‌ డాలర్లను ఆర్జించడంతో పాటు, యువతకు విపరీతంగా నచ్చేసింది. వంద మేటి సినిమాల జాబితాలో ఏడు సార్లు స్థానం సంపాదించడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.