ఆగస్టు 14.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అభినయం... విలక్షణం!
 షమ్మీకపూర్‌ (వర్థంతి-2011)


బాలీవుడ్‌లో అత్యంత వినోదాత్మక కథానాయకుడు ఎవరంటే, అది షమ్మీకపూర్‌ అనే చెప్పుకోవాలి. డైలాగ్స్‌ చెప్పడంలో, పాటలకు నృత్యం చేయడంలో, భావ ప్రకటనలో ఎలా చూసినా ఇతర కథానాయకుల తీరుకు భిన్నంగా విలక్షణంగా అతడు చేసిన అభినయం దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రఖ్యాత కపూర్‌ల వంశానికి చెందిన యువకుడిగా షమ్మీకపూర్‌ వెండితెర శకం ఓ చెరిగిపోని చరిత్ర. పృథ్వీరాజ్‌ కపూర్‌ ముగ్గురు కొడుకుల్లో ఒకడుగా, సోదరులు రాజ్‌కపూర్, శశికపూర్‌లకు తీసిపోని విధంగా షమ్మీకపూర్‌ బాలీవుడ్‌ను ఏలాడు. 1953లో ‘జీవన్‌జ్యోతి’తో పరిచయం అయిన తర్వాత నాలుగేళ్ల పాటు అతడు నటించిన సినిమాలన్నీ నిరాశపరిచినవే. 1957లో వచ్చిన ‘తుమ్‌సా నహి దేఖా’, 1959 నాటి ‘దిల్‌ దేకే దేఖో’ సినిమాలతో అతడికి సరికొత్త ఇమేజ్‌ వచ్చింది. అతడి సరదా నటన, వినూత్నమైన స్టైల్‌ యువతరాన్ని వెర్రెక్కించాయి. ‘జంగ్లీ’, ‘కాశ్మీర్‌ కి కలి’, ‘తీస్రీ మంజిల్‌’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘కాలేజ్‌ గర్ల్‌’, ‘సింగపూర్‌’, ‘బాయ్‌ఫ్రెండ్‌’, ‘దిల్‌ తేరా దివానా’, ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’, ‘చైనా టౌన్‌’, ‘ఏన్‌ ఈవెనింగ్‌ ఇన్‌ ప్యారిస్‌’, ‘అందాజ్‌’, ‘జాన్వర్‌’, ‘రాజ్‌కుమార్‌’, ‘బ్రహ్మచారి’ లాంటి సినిమాల్లో అతడి నటనను అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత బరువు పెరగడంలో సహాయ పాత్రలకు పరిమితమైన షమ్మీ కపూర్‌ నటించిన ఆఖరి చిత్రం ‘రాక్‌స్టార్‌’ (2011). 1931 అక్టోబర్‌ 21న పుట్టిన షమ్మీకపూర్, 2011 ఆగస్టు 14న తన 79వ ఏట మరణించాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* నల్లగులాబీ విరిసింది!


అమ్మకి ఆసుపత్రిలో పని... నాన్న బస్‌ డ్రైవర్‌... ఇలాంటి కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, కష్టాల మధ్యే చిరునవ్వును సంతరించుకుంది. అగచాట్ల మధ్యే అందాన్ని సమకూర్చుకుంది. అందుకే మోడలింగ్‌లో మెరిసింది. అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. వెండితెరపై వెలిగింది. ఆమే బ్లాక్‌రోజ్‌గా పేరొందిన ‘హల్లే బెర్రీ’. ఉత్తమ నటిగా ‘మాన్‌స్టర్‌ బాల్‌’ (2011) సినిమాకు ఆస్కార్‌ అవార్డు అందుకుంది. ఒక దశలో హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం పొందింది. ‘బూమరాంగ్‌’ (1992) సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, ‘ద ఫ్లింట్‌స్టోన్స్‌’, ‘ద బుల్‌వర్త్‌’, ‘స్టోర్మ్‌ ఇన్‌ ఎక్స్‌మెన్‌’, ‘స్వార్డిష్‌’, ‘డై ఎనదర్‌ డే’, ‘క్లౌడ్‌ అట్లాస్‌’, ‘ద కాల్‌’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. 1966 ఆగస్టు 14న పుట్టిన హల్లేబెర్రీ గృహహింసను చూస్తూ ఎదిగింది. చిన్నప్పుడు తాగి వచ్చిన నాన్న, అమ్మను అమానుషంగా కొడుతుంటే బెదిరిపోయిన బాల్యం నుంచి తేరుకుని ఆత్మవిశ్వాసం తొణికిసలాడే అందాల పోటీల దాకా సొంతంగానే ఎదిగింది. నాలుగేళ్లకే నాన్న నుంచి విడిపోయిన అమ్మ ఒడిలోనే ధైర్యాన్ని నేర్చుకుంది. బడిలో ఛీర్‌లీడర్‌గా, స్కూలు న్యూస్‌పేపర్‌ ఎడిటర్‌గా చురుకుదనం పెంచుకుంది. చిన్నపిల్లల డిపార్ట్‌మెంటల్‌ దుకాణంలో సేల్స్‌గర్ల్‌లాంటి పనులు చేస్తూ డబ్బుల్లేని పేదరికం నుంచి, నివాసమంటూ లేని పరిస్థితుల నుంచి ఎదిగింది. ‘మిస్‌ యుఎస్‌ఏ’, ‘మిస వరల్డ్‌’ పోటీల్లో పాల్గొని, చక్కని సమాధానాలతో విజేతగా నిలిచింది. టీవీ సీరియల్స్‌లో నటించి వెండితెరకి 1991లో ‘జంగిల్‌ ఫీవర్‌’ ద్వారా పరిచయమైంది.

* ఓ హత్య... ఓ నవల...
రెండు సినిమాలు


అమెరికాలో 1906లో ఓ స్కర్ట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ అమ్మాయి హత్య జరిగింది. సంచలనం సృష్టించిన ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని 1925లో థియొడోర్‌ డ్రైసర్‌ అనే రచయిత ‘ఏన్‌ అమెరికన్‌ ట్రాజెడీ’ అనే నవల రాస్తే అది అందరినీ ఆకట్టుకుంది. ఆ కథ ఆధారంగా నాటకం రూపొందిదే ప్రేక్షకులు విరగబడి చూశారు. అదే కథ ఆధారంగా వెండితెరపై రెండు సినిమాలు వచ్చాయి. మొదటగా 1931లో వచ్చిన ‘ఏన్‌ అమెరికన్‌ ట్రాజెడీ’ సినిమా జనాదరణ పొందింది. అదే నవల ఆధారంగా 1951లో ‘ఎ ప్లేస్‌ ఇన్‌ ద సన్‌’ అనే సినిమాను తీశారు. జార్జి స్టీవెన్స్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలై ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆరు ఆస్కార్‌ అవార్డులు, ఒక గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు సహా అనేక పురస్కారాలు గెలుచుకుంది. దీన్ని అప్పట్లో 2.3 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే 7 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ఈ సినిమాలో అందాల తారలు ఎలిజెబెత్‌ టేలర్, షెల్లీ వింటర్స్‌ నటించారు.
కథ విషయానికి వస్తే ఓ పేద యువకుడు పట్నంలో తన మేనమామ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వస్తాడు. అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఎవరితోనూ చనువుగా ఉండకూడదనే షరతు విధిస్తారు. కానీ ఆ యువకుడు తన తోటి పేద యువతితో ప్రేమలో పడతాడు. మరో పక్క అతడు కష్టపడి పని చేస్తూ మేనమామ ఆదరణ పొంది ఉద్యోగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఓ పెద్ద పార్టీలో అతడికి మరో అందమైన యువతి తారసపడుతుంది. ఆమె అతడిని ఇష్టపడుతుంది. ఈ ఇద్దరు యువతులతో సాన్నిహిత్యం అతడి జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది, ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనేదే సినిమా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.