ఆగస్టు 15.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మరిచిపోలేని వినోదం!


ఎన్టీఆర్‌ బందిపోటు. కృష్ణకుమారి రాకుమారి. బందిపోటును పట్టడానికి బయల్దేరి, అతడి దోపిడీల వెనుక కారణాలను, పేదలకు మేలు చేసే మంచి మనసును గ్రహించి ప్రేమిస్తుంది. రాజ ప్రతినిధిగా దుండగాలు సాగిస్తున్న మేనమామ కుతంత్రాలకు ఎదురుతిరిగి బందిపోటును వరిస్తుంది రాకుమారి. ఇంతకన్నా జనరంజకమైన కథ జానపద చిత్రాలకి ఇంకేం కావాలి? అందుకనే విఠలాచార్య దర్శకత్వంలో 1963 ఆగస్టు 15న విడుదలైన ‘బందిపోటు’ సినిమా ప్రేక్షకులను అలరించింది. మరి ఆ సినిమా సంగతులేంటి?

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఓ సంచలనం!


బాలీవుడ్‌లోనే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఆ సినిమా ఓ సంచలనం. అదే 1975 ఆగస్టు 15న విడుదలైన ‘షోలే’. బ్రిటిష్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ 2002లో మేటి పది చిత్రాల కోసం నిర్వహించిన సర్వేలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. రమేష్‌ సిప్పీ దర్శకత్వంలో సంజీవ్‌కుమార్, ధర్మేంద్ర, అమితాబ్‌ బచ్చన్, హేమమాలిని, అమ్జాద్‌ఖాన్‌ నటించిన ఈ సినిమా విడుదలైన వెంటనే వ్యతిరేక వ్యాఖ్యలకు గురైనా, నెమ్మదిగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దేశంలోని ఎన్నో థియేటర్లలో చాలా కాలం ఆడుతూనే ఉంది. ముంబైలోని మినర్వాలో వరసగా ఐదేళ్ల పాటు ఆడింది. అప్పట్లో షోలే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. భారతీయ సినిమాల్లో స్టీరియోఫోనిక్‌ శబ్ద వ్యవస్థతో, 70 ఎమ్‌ఎమ్‌లో నిర్మితమైన తొలి సినిమా ‘షోలే’. దేశంలోని వంద థియేటర్లలో సిల్వర్‌ జూబ్లీ, 60 థియేటర్లలో గోల్డెన్‌ జూబ్లీ జరుపుకున్న చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. బీబీసీ ఇండియా షోలేను ‘ఫిల్మ్‌ ఆఫ్‌ ద మిలీనియం’గా గుర్తించింది. 2014 జనవరిలో షోలే త్రీడీ వెర్షన్‌ను తిరిగి విడుదల చేశారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* సినీ, సాహిత్య రంగాల్లో చెరగని ముద్ర!
 ఎం.ఎస్‌.రెడ్డి (జయంతి -1924) మల్లెమాలగా సుప్రసిద్ధుడైన ఎం.ఎస్‌. రెడ్డి నిర్మొహమాటస్థుడిగా, నికార్సయిన సాహిత్య వేత్తగా ముద్ర వేశారు. నిర్మాతగా, దర్శకుడిగా, స్కీన్ర్‌ప్లే రచయితగా, గీత రచయితగా సేవలందించాడు. 1924 ఆగస్టు 15న నెల్లూరు దగ్గరి అలిమిలిలో పుట్టిన మల్లెమాల 1966లో ‘కన్నెపిల్ల’ అనువాదంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘భార్య’ (1968)తో నిర్మాతగా మారారు. ‘శ్రీకృష్ణ విజయం’, ‘ఊరికి ఉపకారి’, ‘కోడెనాగు’, ‘రామయతండ్రి’, ‘దొరలు దొంగలు’, ‘ముత్యాల పల్లకి’, ‘నాయుడు బావ’, ‘తాతయ్య ప్రేమలీలలు’, ‘ఏకలవ్య’, ‘కళ్యాణవీణ’, ‘పల్నాటి సింహం’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘అమ్మోరు’, ‘రామాయణం’ లాంటి సినిమాలను అందించారు. ప్రతిష్ఠాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

విలక్షణ నటుడు రాళ్లపల్లి!
(జయంతి -1945)


నాటక రంగం నుంచి వచ్చి... వెండితెరపై మెరిస్తున్న మరో సుప్రసిద్ధ నటుడు రాళ్లపల్లి. చిన్న తనం నుంచి నటనే వృత్తిగా, ప్రవృత్తిగా చేసుకొన్నారు రాళ్లపల్లి. ఎనిమిదివేలకి పైగా నాటకాల్లో నటించారు. ఆయన నాటకాల్ని వదిలిపెట్టలేదు. సినిమాతో పాటు, టెలివిజన్‌పైనా తనదైన ముద్ర వేశారు. ఆగస్టు 15, 1945లో అనంతపురంలో జన్మించారు. రాళ్లపల్లి 600కిపైగా చిత్రాల్లో నటించారు. కన్యాశుల్కం నాటకంతో పేరు తెచ్చుకొన్న ఆయన, చదువుకొనే రోజుల్లో కళాశాలలో జరిగిన పోటీల కోసమని ‘మారని సంసారం’ పేరుతో సొంతంగా నాటిక రాశారు. ఆ నాటికకిగానూ రచన, నటన పరంగా భానుమతి నుంచి పురస్కారాలు అందుకొన్నారు. కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన ‘హారతి’ అనే నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్టు పత్రికలో వచ్చిన ప్రకటనని చూసి భార్య ప్రోత్సాహంతో దరఖాస్తు చేశారు. దాంతో ‘ఊరుమ్మడి బతుకులు’ అనే చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఆ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఒక పక్కన నాటకాల్లో నటిస్తూనే ‘స్త్రీ’, ‘చిల్లర దేవుళ్లు’, ‘చలిచీమలు’ చిత్రాలు రాళ్లపల్లికి తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టాయి. దేవదాస్‌ కనకాల దర్శకత్వం వహించిన ‘నాగమల్లి’తో హాస్య నటుడిగా గుర్తింపొచ్చింది. జంధ్యాల, వంశీ చిత్రాల్లో ఎక్కువగా నటించి ప్రేక్షకుల్ని నవ్వించారు. పరిశ్రమలోని అగ్ర నటులందరితోనూ కలిసి నటించారు రాళ్లపల్లి. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘బొంబాయి’లో హిజ్రాగా నటించి మెప్పించారు. డబ్బింగ్‌ కళాకారుడిగానూ పేరు తెచ్చుకొన్నారు. ‘చలిచీమలు’ చిరత్రంలో ఒక పాట కూడా పాడారు రాళ్లపల్లి. క్యారెక్టర్‌ నటుడిగా, హాస్య నటుడిగా విలక్షణమైన నటన, డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెలుగు విశ్వవిద్యాలయం నుంచి నాటకరంగంపై ఎం.ఫిల్‌ పట్టా కూడా అందుకొన్నారు. ‘జననీ జన్మభూమి’ అనే టెలీఫిల్మ్‌కిగానూ నంది అవార్డు అందుకొన్నారు. ‘గణపతి’ అనే ధారావాహికలో నటనకిగానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది అందుకొన్నారు. నటుడిగానే వంటలోనూ చేయితిరిగిన నిష్ణాతుడు రాళ్లపల్లి. కమల్‌హాసన్, కె.విశ్వనాథ్, బాలకృష్ణ, కోదండిరామిరెడ్డి, గొల్లపూడి మారుతీరావు తదితర సినీ ప్రముఖులు రాళ్లపల్లి చేతి వంటని తిని మెచ్చుకొన్నారు. తనికెళ్ల భరణి, అలీ వంటి ప్రముఖులకి మార్గదర్శకులుగా ఉన్నారు రాళ్లపల్లి. ఈరోజు ఆయన జయంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

హాసిని.. సుహాసిని...
మణిరత్నం (పుట్టిన రోజు-1961)అందం... అభినయం మేళవించిన తార సుహాసిని. కథానాయికగా ఎనభై, తొంభై దశకాల్లో ఆమె దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగారు. నాలుగు భాషల్లోనూ అగ్ర కథానాయకులతో కలిసి నటించారు. ప్రముఖ నటుడు చారు హాసన్‌ కూతురైన సుహాసిని పరమకుడిలో ఆగస్టు 15, 1961లో జన్మించారు. మద్రాసులోని ఎమ్‌.జి.ఆర్‌ గవర్నమెంటు ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీకి సంబంధించిన విద్యని అభ్యసించారు. ఆ తరువాత అశోక్‌కుమార్‌ దగ్గర సహాయ కెమెరామెన్‌గా ప్రయాణం ఆరంభించారు. ఆ తర్వాత పలు చిత్రాలకి మేకప్‌ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. 1980లో ‘నెంజతై కిల్లతే’ అనే తమిళ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నాలుగు భాషల నుంచీ అవకాశాలు అందుకొన్నారు. తమిళ చిత్రం ‘సింధుభైరవి’లో నటనకిగానూ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకొన్నారు. ‘స్వాతి’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రాలతో ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారాలు అందుకొన్నారు. తమిళనాడు, కేరళ, కన్నడ భాషల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకొన్నారు సుహాసిని. సుప్రసిద్ధ నటుడు కమలహాసన్‌ అన్న కూతురైన ఆమె, 1988లో ప్రముఖ దర్శకుడు మణిరత్నంని పెళ్లి చేసుకొన్నారు. 1995లో ‘ఇందిర’ అనే చిత్రం తెరకెక్కించారు. ఒక టీవీ షోకి కూడా దర్శకత్వం వహించారు. ‘రావణన్‌’ ‘ఇరువర్‌’, ‘తిరుడ తిరుడ’ చిత్రాలకి మాటల రచయితగా పనిచేశారు. ఈ చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. ప్రస్తుతం సుహాసిని, ఆమె భర్త కలిసి సొంత చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌ నిర్వహణ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సుహాసిని పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* వెండితెర షేర్‌ఖాన్..‌
 శ్రీహరి (జయంతి-1964)


‘కమ్ముకొన్న ఈ కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయ్‌ రా... నీ ప్రేమని గెలిపించుకోవడానికి మళ్లీ పుడతావ్‌రా’. - ‘మగధీర’ చిత్రంలో షేర్‌ఖాన్‌గా శ్రీహరి చెప్పిన సంభాషణలు ఇవి. ఆయన అభిమానులు కూడా మీపై మాకున్న ప్రేమని చూసైనా మళ్లీ పుట్టండి షేర్‌ఖాన్‌ అంటున్నారు. రియల్‌స్టార్‌గా శ్రీహరి తెలుగు తెరపైనా, ప్రేక్షకులపైన వేసిన ముద్ర అలాంటిది. స్టంట్‌ మాస్టర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టిన శ్రీహరి అంచలంచలుగా ఎదిగారు. తమిళంలో ‘మాపిళ్ళై’తో, తెలుగులో ‘ధర్మక్షేత్రం’తో సినీ ప్రయాణం ఆరంభించిన శ్రీహరి విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా రాణించారు. ఒక సంభాషణ చెప్పినా... కళ్లెర్రజేసి చూసినా ఆ సన్నివేశాలు ఇట్టే పండిపోయేవి. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న శ్రీహరి 1964, ఆగస్టు 15న సత్యనారాయణ, సత్యవతికి జన్మించారు. కృష్ణాజిల్లా, యలమర్రులో ఏడవ తరగతివరకు విద్యాభ్యాసం కొనసాగించిన ఆయన కుటుంబంతో పాటే, హైదరాబాద్‌కి మకాం మార్చారు. యుక్త వయసు నుంచే శారీరక ధారుఢ్యంపై ఆసక్తి పెంచుకొన్న శ్రీహరి హైదరాబాద్‌లో నిర్వహించిన శారీరక ధారుడ్య పోటీల్లో పాల్గొని పలుమార్లు మిస్టర్‌ హైదరాబాద్‌గా పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. జాతీయ స్థాయిలో పాల్గొని పలు బహుమతులు సొంతం చేసుకొన్నారు. ఏషియన్‌ గేమ్స్‌లో భారతదేశం తరఫున ఆడాలనే కోరిక ఉన్నా తీరలేదనేవారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మనాయుడు’తో ఆయనకి తెలుగులో నటించే అవకాశం దక్కింది. ‘తాజ్‌మహల్‌’ చిత్రంతో పూర్తిస్థాయి విలన్‌ పాత్రలో నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, కామెడీ విలన్‌గా నటించి పేరు తెచ్చుకొన్న శ్రీహరి, 2000వ సంవత్సరంలో ‘పోలీస్‌’తో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ‘గణపతి’, ‘అయోధ్య రామయ్య’, ‘శ్రీశైలం’, ‘భద్రాచలం’, ‘హనుమంతు’, ‘విజయరామరాజు’ చిత్రాలతో కథానాయకుడిగా విజయాల్ని అందుకొన్నారు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే, మరోపక్క సహాయ పాత్రల్లో ఒదిగిపోయేవారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బృందావనం’, ‘ఢీ’, ‘కింగ్‌’, ‘మగధీర’, ‘తుఫాన్‌’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. తెలంగాణ యాస పలకడంలో శ్రీహరి శైలే వేరు. హైదరాబాద్‌లో పెరిగిన శ్రీహరికి యాసపై మంచి పట్టుంది. తెలంగాణ యాసకి గౌరవాన్ని తెచ్చిపెట్టిన నటుల్లో శ్రీహరి ఒకరు. ‘తాజ్‌మహల్‌’లో నటనకిగానూ ఉత్తమ విలన్‌గా, ‘శ్రీరాములయ్య’, ‘పోలీస్‌’, ‘రామసక్కనోడు’, ‘విజయ రామరాజు’ చిత్రాలకిగానూ ఉత్తమ నటుడిగా స్పెషల్‌ జ్యూరీ, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’కి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకొన్నారు. నటి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు శ్రీహరి. వీరికి అక్షర అనే పాప పుట్టిన నాలుగు నెలలకే అకాల మరణం చెందారు. అక్షర పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు మేడ్చల్‌ పరిధిలోని నాలుగు గ్రామాల్ని దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకి ఇద్దరబ్బాయిలు ఉన్నారు. ఈ మధ్యనే పెద్దకుమారుడు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా ‘రాజ్‌దూత్‌’ చిత్రంలో నటించాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించిన శ్రీహరి హిందీలో ‘రాబో రాజ్‌కుమార్‌’ చిత్రంలో నటిస్తూ అస్వస్థతకి గురయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజున పేదలకి దుస్తుల పంపిణీతోపాటు, ఆర్థిక సహాయం అందజేసేవారు శ్రీహరి. స్వాతంత్య్రదినోత్సవం రోజున పుట్టాను కాబట్టి, నాలో దేశభక్తి మెండు అనేవారు. ఈరోజు శ్రీహరి జన్మదినం.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* క్రీడాకారిణిగా... నటిగా... గాయనిగా...
 టీజీ. కమలాదేవి (వర్థంతి - 2012)


క్రీడాకారిణిగా, నటిగా, గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రతిభతో రాణించిన టి.జి.కమలాదేవి, అలనాటి చిత్రాల ప్రేక్షకులకు చిరపరిచితురాలే. 1930 డిసెంబర్‌ 29న చిత్తూరు జిల్లా కారవేటినగరంలో పుట్టిన ఆమె అసలు పేరు తోట గోవిందమ్మ. సినిమారంగంలోకి రావడంతో తన అసలు పేరును సంక్షిప్త అక్షరాలుగా చేసుకుని కమలాదేవిగా మారారు. బిలియర్డస్‌ క్రీడాకారిణిగా జాతీయ స్థాయిలో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచిన కమలాదేవి, నాటకాలలో రాణించారు. అలెగ్జాండర్‌ పాత్ర ద్వారా పేరు సంపాదించడం విశేషం. తరువాత సినిమాల్లోకి వచ్చి దాదాపు 30 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించారు. ‘దక్షయజ్ఞం’, ‘బాలనాగమ్మ’, ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’, ‘చక్రపాణి’ ‘వెలుగునీడలు’ లాంటి సినిమాల్లో నటించారు. డబ్బింగ్‌ కళాకారిణిగా కథానాయికలు పద్మిని, బి.సరోజాదేవి, లలిత సహా పలువురికి గాత్రదానం చేశారు. 2012 ఆగస్టు 15న మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తెరపై జెంటిల్‌మేన్‌!
 అర్జున్‌ (పుట్టిన రోజు-1964)యాక్షన్‌ కింగ్‌గా పేరు తెచ్చుకొన్న కథానాయకుడు అర్జున్‌. కన్నడ, తమిళం, తెలుగు.. ఈ మూడు భాషల్లోనూ సమంగా అభిమాన గణాన్ని సొంతం చేసుకొన్న అతి కొద్ది మంది కథానాయకుల్లో అర్జున్‌ ఒకరు. ప్రతినాయకుడిగా, సహాయ నటుడుగా, కథానాయకుడిగా 150కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయనలో ఎంత మంచి నటుడున్నాడో... అంతకుమించిన దర్శకుడు, నిర్మాత, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ఉన్నారు. ఆగస్టు 15, 1964లో కర్ణాటకలోని మధుగిరిలో జన్మించారు అర్జున్‌. ఆయన అసలు పేరు శ్రీనివాస సర్జా. సినిమాల్లోకి వచ్చాక అర్జున్‌గా మార్చుకొన్నారు. ఆయన తండ్రి శక్తి ప్రసాద్‌ కన్నడ నటుడు. తల్లి ఉపాధ్యాయురాలు. అర్జున్‌ సోదరుడు కిషోర్‌ సర్జా కన్నలో పలు చిత్రాలకి దర్శకత్వం వహించారు. నివేదితా థామస్‌ని పెళ్లి చేసుకొన్నారు అర్జున్‌. నివేదితా కన్నడలో ‘రథసప్తమి’ చిత్రంలో నటించారు. కన్నడ నటుడు రాజేష్‌ కూతురు నివేదితా. అర్జున్, నివేదితా దంపతులకి ఐశ్వర్య, అంజన అనే అమ్మాయిలున్నారు. ఐశ్వర్య కూడా కథానాయికగా రాణిస్తున్నారు. బ్రూస్‌లీ కథానాయకుడిగా నటించిన ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ స్ఫూర్తితో అర్జున్‌ కరాటే నేర్చుకొని బ్లాక్‌ బెల్ట్‌ సాధించారు. ఆయనకి పోలీసు ఆఫీసర్‌ కావాలనేది చిన్నప్పటి కల. కానీ అనుకోకుండా నటుడు అయ్యాడు. హనుమాన్‌ భక్తుడైన అర్జున్‌ చెన్నైలో 35 అడుగుల ఏకశిలా విగ్రహంతో కూడిన దేవాలయాన్ని నిర్మించారు. 140 టన్నుల బరువుతో, కూర్చుని ఉన్న హనుమాన్‌ విగ్రహం ఇండియాలో ఎక్కడా లేదు. నిర్మాత రాజేంద్రసింగ్‌ బాబు బలవంతంతో నటుడిగా మారిన అర్జున్‌ ‘సింహద మరి సైన్య’ అనే కన్నడ చిత్రంతో తెరప్రవేశం చేశారు. ఆ తరువాత ‘ఆశా’, ‘పూజ ఫలే’, ‘ప్రేమ జ్యోతి’, ‘మలే బంటు మలే’, ‘ప్రళయటక’, చిత్రంలో నటించారు. ‘నండ్రి’తో తమిళ తెరపై మెరిసన ఆయన ఆ తరువాత పలు చిత్రాల్లో అవకాశాలు అందుకొన్నారు. తెలుగులో ‘మా పల్లెలో గోపాలుడు’తో పరిచయమయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆయనకి మంచి పేరొచ్చింది. ఆ తరువాత ‘బంగారు చిలక’, ‘ప్రతిధ్వని’, ‘కోటిగాడు’, ‘నగర దేవత’, ‘కోనసీమ కుర్రాడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘మనవాడొస్తున్నాడు’, ‘న్యాయానికి సంకెళ్లు’ చిత్రాల్లో నటించారు. ‘ప్రతిస్పందన’, ‘గర్జించిన గంగ’, ‘రాక్షస సంహారం’, ‘డాక్టర్‌ గారి అబ్బాయి’ ఇలా వరుసగా అవకాశాలు అందుకొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ‘జైహింద్‌’, ‘జెంటిల్‌మేన్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘ద్రోహి’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘శ్రీమంజునాథ’, ‘పుట్టింటికి రా చెల్లి’, ‘శ్రీఆంజనేయం’, ‘శివకాశి’ తదితర చిత్రాలతో తెలుగులో అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించుకొన్నారు. ‘లై’, ‘అభిమన్యుడు’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా కూడా మురిపించారు. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో తండ్రి పాత్రలో మురిపించారు. ‘ముదల్‌ ఉదయమ్‌’, ‘కర్నా’, ‘పరశురామ్‌’, ‘జైసూర్య’ చిత్రాల్లో పాటలు కూడా ఆలపించారు. ఉత్తమ నటుడిగా తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచి నాలుగుసార్లు పురస్కారాలు అందుకొన్నారు.

* ఓ గొప్ప సినిమా!


సినిమా చరిత్రలోనే గొప్ప సినిమాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినిమా ‘ద విజార్డ్‌ ఆఫ్‌ ఓజెడ్‌’ 1939 ఆగస్టు 15న విడుదలైంది. 1900లో ఎల్‌.ఫ్రాంక్‌ బావుమ్‌ రాసిన పిల్లల నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఆరు ఆస్కార్‌ నామినేషన్లు పొంది రెండు గెలుచుకుంది. టెక్నికలర్‌లో మరిచిపోలేని పాత్రలను ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమా అమెరికా సంస్కృతిని ప్రతిబింబిస్తూ వినోదాన్ని పంచింది. సినీ చరిత్రలోనే ప్రేక్షకులు ఎక్కువగా పదే పదే చూసిన సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది. పిల్లలు తప్పనిసరిగా చూడాల్సిన 50 గొప్ప సినిమాల జాబితాలో చోటు సంపాదించింది.

* అందచందాల తార!


ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా రెండేళ్ల పాటు నిలిచిన అందచందాల తార జెన్నిఫర్‌ లారెన్స్‌. 1990 ఆగస్టు 15న పుట్టిన ఈమెను ‘ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర’లో ఒక వ్యక్తిగా టైమ్స్‌ పత్రిక గుర్తించింది. చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉండే జెన్నిఫర్‌ క్రీడలు, నాటకాలు, సంగీత కార్యక్రమాల్లో పాల్గొనేది. పద్నాలుగేళ్లకే టాలెంట్‌ హంట్‌లో ఎంపికై టీవీ కార్యక్రమాలలో మెరిసింది. ‘గార్డెన్‌ పార్టీ’ (2008) సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టి, ‘వింటర్స్‌ బోన్‌’, ‘ఎక్స్‌మెన్‌’, ‘హంగర్‌ గేమ్స్‌’, ‘సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌’, ‘జాయ్‌’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. చిన్న వయసులోనే ఆస్కార్‌ అందుకున్న రెండో నటిగా నిలిచింది. ఈ ఏడాది జూన్‌ 7న సైమన్‌ కెన్‌బెర్గ్‌ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ‘డార్క్‌ ఫోనెక్స్‌’ చిత్రంలో రావెన్‌ డార్క్‌హోల్మ్‌గా అలరించింది.
.....................................................................................................................................................................

* కాసుల వెంట...
అవార్డుల పంటదర్శకుడు చూస్తే... హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించిన ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పొలా. ఇక నటుల విషయానికి వస్తే... ప్రపంచ సినీ అభిమానుల మెప్పు పొందిన మార్లన్‌ బ్రాండో, రోబర్ట్‌ డువాల్, మార్టిన్‌ షీన్, ఫ్రెడెరిక్‌ ఫారెస్ట్‌ లాంటి హేమాహేమీలు. రూపొందింది యుద్ధం నేపథ్యంలో అడుగడుగునా ఉత్కంఠ కలిగించేలా. ఇన్ని హంగులు ఉన్న సినిమా ‘అపొకలిప్స్‌ నౌ’ (1979). ప్రఖ్యాత బ్రిటిష్‌ రచయిత జోసెఫ్‌ కొన్రాడ్‌ 1899లో రాసిన ‘హార్ట్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ నవలలోని అంశాల ఆధారంగా వియత్నాం యుద్ధం నేపథ్యంలో అల్లుకున్న కథతో సినిమా సాగుతుంది. కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మకమైన ‘పామె డి ఓర్‌’ పురస్కారంతో పాటు, ఎనిమిది ఆస్కార్‌ నామినేషన్లు పొంది రెండు అవార్డులను అందుకుంది. మేటి పది ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 31 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా, 150 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.
........................................................................................................................................................................

* అవార్డులే గీటురాళ్లు


రెండు అకాడమీ అవార్డులు... మూడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు... రెండు బాఫ్టా అవార్డులు... రెండు స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు... ఇవన్నీ బెన్‌ అఫ్లెక్‌ ప్రతిభకు గీటురాళ్లే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రైటర్‌గా హాలీవుడ్‌ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చిరపరిచితుడు. ‘ఆర్మెగెడాన్‌’, ‘ఫోర్సెస్‌ ఆఫ్‌ నేచర్‌’, ‘పెర్ల్‌ హార్బర్‌’, ‘ద సమ్‌ ఆఫ్‌ ఆల్‌ ఫియర్స్‌’, ‘డేర్‌డెవిల్‌’, ‘గిగ్లి’, ‘హాలీవుడ్‌ ల్యాండ్‌’, ‘గాన్‌ బేబీ గాన్‌’, ‘ద టౌన్‌’, ‘ఆర్గో’, ‘గాన్‌ గర్ల్‌’, ‘బ్యాట్‌మేన్‌ వెర్సెస్‌ సూపర్‌మేన్‌’, ‘జస్టిస్‌ లీగ్‌’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. కాలిఫోర్నియాలో 1972 ఆగస్టు 15న పుట్టిన బెన్‌ అఫ్లెక్, చిన్నతనంలోనే అమ్మ, సోదరుడితో కలిసి నాటకాల్లో పాత్రలు వేయడం మొదలుపెట్టాడు. ఆపై టీవీల్లోను, తర్వాత వెండితెర మీద విలక్షణ నటుడిగా ఆకట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.