ఆగస్టు 19.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఆయన ముద్ర చిరస్మరణీయం!
 అట్లూరి పుండరీకాక్షయ్య (జయంతి-1925)


నటనపై ప్రేమ... ఎన్టీఆర్‌తో పరిచయం ఆయనను సినీరంగంలోకి అడుగులు వేయించాయి. ఆపైన ఏ పని అయినా చిత్తశుద్ధితో చేయడం, కష్టపడడం ఆయనను విజయాల బాట పట్టించాయి. అంచెలంచెలుగా ఎదిగేలా చేశాయి. ఆయనే అట్లూరి పుండరీకాక్షయ్య. నిర్మాతగా, రచయితగా, నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘శ్రీకృష్ణావతారం’, ‘భలే తమ్ముడు’, ‘మనుషుల్లో దేవుడు’, ‘ఆరాధన’ విజయవంతమైన సినిమాలను అందించిన ఆయన 1925 ఆగస్టు 19న కృష్ణాజిల్లా కైకలూరు దగ్గరున్న మొకాసా కలవపూడిలో పుట్టారు. ఎనిమిదవ తరగతిలోనే చదువు ఆపేసినా, జీవితాన్ని క్షుణ్ణంగా చదివారు. నటనపై మక్కువతో నాటకాలు వేస్తుండగా ఎన్టీఆర్‌తో ఏర్పడిన పరిచయం ఆయనను మద్రాసు రైలెక్కించింది. ఎన్టీఆర్‌ సిఫార్సుతో విజయా సంస్థలో వంద రూపాయల జీతంపై పనిలో చేరి, ఆ తరువాత ఎన్టీఆర్‌ సొంత సినిమాలకు ప్రొడక్షన్‌ కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘కర్తవ్యం’ సినిమాలో మెత్తటి కత్తిలాంటి విలన్‌ వేషాన్ని రక్తి కట్టించారు. అలా ప్రారంభమైన నట ప్రస్థానం 20 సినిమాలకు పైగా సాగింది. కృషి ఉంటే ఏ పనితో జీవితం మొదలు పెట్టినా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చనడానికి ఉదాహరణగా నిలిచిన ఆయన 2012 ఫిబ్రవరి 2న అనారోగ్యంతో మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)       
                                                                                       

* ప్రపంచ ప్రేక్షకుల
మనసు దోచాడు


ఓ టీవీ సీరియల్‌ కోసం ఓ నటుడు ఎపిసోడ్‌కి మిలియన్‌ డాలర్ల పారితోషికం పొందాడంటే... ఆ సీరియల్, ఆ నటుడు ఎంతగా ఆకట్టుకున్నారో వేరే చెప్పక్కర్లేదు. అమెరికాలోనే కాకుండే అనేక దేశాల్లో పదేళ్ల పాటు ఇంటింటి టీవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన ఆ సీరియల్‌ ‘ఫ్రెండ్స్‌’ అయితే, అందులో చాండ్లర్‌ బింగ్‌ పాత్ర ద్వారా ఆకట్టుకున్న నటుడు మ్యాథ్యూ పెర్రీ. నటుడిగా, కమేడియన్‌గా, నాటక రచయితగా ప్రాచుర్యం పొందిన పెర్రీ వెండితెరై కూడా గుర్తుండిపోయే పాత్రల ద్వారా అభిమానులను అలరించాడు. ‘ఫూల్స్‌ రష్‌ ఇన్‌’, ‘ద హోల్‌ నైన్‌ యార్డ్స్‌’, ‘17 ఎగైన్‌’లాంటి సినిమాల ద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అమెరికాలో 1969 ఆగస్టు 19న పుట్టిన ఇతడు పదిహేనేళ్ల నుంచి నటనా రంగంవైపు ఆకర్షితుడయ్యాడు. టీవీ సీరియల్స్‌ ద్వారా ప్రాచుర్యం సంపాదించి వెండితెరపై వెలిగాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.