ఆగస్టు 2...(సినీ చరిత్రలో ఈరోజు)

* మాస్‌ బీటు అయినా... మెలోడీ అయినా 
 దేవిశ్రీ ప్రసాద్‌ (పుట్టినరోజు)


యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌. 20 యేళ్ల వయసులోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆయన తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాలకి స్వరాల్ని సమకూర్చారు. మెలోడీ అయినా.. మాస్‌ బీట్‌ అయినా దేవిశ్రీప్రసాద్‌ తన మార్క్‌ చూపించేవరకు వదిలిపెట్టరు. దేవి ఐటెమ్‌ పాటలంటే యువతకి మరింత ఇష్టం. స్వరాలు సమకూర్చడంతో పాటు, సాహిత్యం సమకూర్చడంలోనూ, గీతాలాపానలోనూ దేవిది అందెవేసిన చేయి. 19 యేళ్ల సినీ ప్రయాణంలో వందకిపైగా చిత్రాలకి స్వరాలు సమకూర్చారాయన. పలు గీతాలకి సాహిత్యం అందించడంతోపాటు, తన మార్క్‌తో ఆలపించారు కూడా. వేదికలపైన మంచి జోష్‌తో కనిపిస్తూ, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే దేవిశ్రీప్రసాద్‌ ‘కుమారి 21 ఎఫ్‌2 చిత్రంలోని ఓ పాటకి నృత్యాలు కూడా సమకూర్చడం విశేషం. ప్రముఖ రచయిత జి.సత్యమూర్తి, శిరోమణి దంపతులకి తొలి సంతానంగా రామచంద్రాపురం దగ్గర్లోని వెదురుపాకలో జన్మించారు. దేవిశ్రీప్రసాద్‌ అసలు పేరు ప్రసాద్‌. తన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్‌ని తీసుకొని దేవిశ్రీప్రసాద్‌గా మార్చుకొన్నారు. చిన్నటప్పుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకొన్న దేవిశ్రీప్రసాద్, మద్రాసులో మాండొలీన్‌ శ్రీనివాస్‌ దగ్గర మాండొలిన్‌ నేర్చుకొన్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘దేవి’తో స్వరకర్తగా పరిచయమైన దేవిశ్రీప్రసాద్, ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోలేదు. ‘నీకోసం’, ‘నవ్వుతూ బతకాలిరా’, ‘ఆనందం’, ‘కలుసుకోవాలని’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘వర్షం’.. ఇలా విజయవంతమైన పలు చిత్రాలకి పనిచేశారు. ‘‘జై లవకుశ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘ఎమ్‌.సి.ఎ’, ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మురిపించారు కూడా. కథానాయకుడిగా కూడా తెరపై సందడి చేయబోతున్నారనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అయితే సంగీత దర్శకుడిగా తీరిక లేకుండా ఉండటంతో ఆయన ఎంట్రీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. రామ్‌ హీరోగా వచ్చిన ‘హలో గురూ ప్రేమకోసమే’, మహేష్‌ ‘మహర్షి’ చిత్రానికి కూడా స్వరాలు సమకూర్చారు. ఈ ఏడాది వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి కూడా దేవినే సంగీతం అందిస్తున్నారు. ఈరోజు దేవిశ్రీ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అదరగొట్టిన హాస్య చిత్రం!


హాలీవుడ్‌ సినీ అభిమానులకు ‘స్టార్‌వార్స్‌’, ‘ఇండియానా జోన్స్‌’ సినిమాలు తెలియకుండా ఉండవు. అలాంటి సినిమాలను అందించిన దర్శకుడు ఓ హాస్య చిత్రాన్ని కూడా తీశాడంటే ఆశ్చర్యమే. అతడే జార్జ్‌లూకాస్‌. అతడు తీసిన హాస్యచిత్రం ‘అమెరికన్‌ గ్రాఫిటీ’ 1973 ఆగస్టు 2న విడుదలై అత్యంత లాభదాయకమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 7.77 లక్షల డాలర్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 2000 లక్షల డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. మొదటి సినిమా నిరాశ పరచగా, జార్జిలూకాస్‌ తీసిన ఈ రెండో సినిమా అతడికి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపింది.

* భారతీయ దర్శకుడి సత్తా!


ఇండియాలో పుట్టి అమెరికాలో దర్శకుడిగా ఎదిగిన మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన చిత్రం ‘ద సిక్త్‌ సెన్స్‌’. సూపర్‌ నేచురల్‌ హారర్‌ సినిమాగా ప్రపంచ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా 1999 ఆగస్టు 2న విడుదలైంది. చనిపోయిన వారు కనిపిస్తున్నారనీ, తనతో మాట్లాడుతున్నారనీ చెప్పే ఓ బాలుడి చుట్టూ కథ తిరుగుతుంది. అతడికి చికిత్స అందించే మనస్తత్వవేత్తగా బ్రూస్‌ విలీస్‌ నటించాడు. ఇది ఆ ఏడాది ‘స్టార్‌వార్స్‌’ తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం విశేషం. 40 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 672.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో పాటు ఆరు ఆస్కార్‌ నామినేషన్లు పొందింది.


* హత్య కథతో అయిదు ఆస్కార్లు!


అయిదు ఆస్కార్‌ అవార్డులు... రెండు సీక్వెల్స్‌... పైగా టీవీ సీరియల్‌ ప్రసారాలు... ఓ కథ విజయవంతం అయిందనడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏముంటాయి? ‘ఇన్‌ద హీట్‌ ఆఫ్‌ ద నైట్‌’ (1967) సాధించిందిదే. మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కెనడియన్‌ దర్శక నిర్మాత దర్శకత్వం వహించాడు. అమెరికా రచయిత జాన్‌ బాల్‌ 1965లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఓ హత్య చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దీనికి సీక్వెల్స్‌గా ‘దే కాల్‌మీ మిస్టర్‌ టిబ్స్‌’ (1970), ‘ద ఆర్గనైజేషన్‌’ (1971) సినిమాలు వచ్చాయి. ఆపై వీటి ఆధారంగా టీవీ సీరియల్స్‌ తీస్తే అవి కూడా విపరీతంగా ఆకర్షించడం విశేషం. అప్పట్లో 2 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా, 24.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఆస్కార్లతో పాటు గోల్డెన్‌గ్లోబ్, బాఫ్టాలాంటి ఎన్నో పురస్కారాలు అందుకుంది. వంద మేటి సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.