ఆగస్టు 22.. (సినీ చరిత్రలో ఈరోజు)

స్టార్‌ స్టార్‌.. మెగాస్టార్‌! 

అది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలుగు సినిమా పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చిరంజీవి నాలాగా ఫైట్స్‌ చేయగలరు, కమల్‌హాసన్‌లా డ్యాన్సులు చేయగలరు. అమితాబ్‌ బచ్చన్‌లా కామెడీ చేయగలరు..’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ మాటలు చాలు చిరంజీవి ప్రత్యేకతని తెలియజేయడానికి! సినిమాకి సంబంధించినంత వరకు ఓ పర్‌ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌ చిరంజీవి. ఆయన చిన్న డైలాగ్‌ చెబితే చాలు.. థియేటర్లు మార్మోగిపోతాయి. ఓ చిన్న స్టెప్పేస్తే చాలు.. తెరపై కనిపించిన మరుక్షణం నుంచే దాన్ని ఎంతోమంది అనుకరించడం మొదలుపెడతారు. ఆయన కామెడీ చేస్తే తలచుకొని తలచుకొని నవ్వుకొనేలా ఉంటుంది. ‘సెల్ఫ్‌ మేడ్‌ పర్సన్‌’గా గుర్తింపు పొంది పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 150పైగా చిత్రాలతో తిరుగులేని కథానాయకుడు అనిపించుకొన్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో మలుపులూ.. మధురానుభవాలూ.. అవార్డులూ.. అభిమాన జన నీరాజనాలు! ‘పద్మభూషణ్‌’గా.. ‘డాక్టర్‌’గా పలు మేలు నగిషీలు ఆ అభినయ శిల్పాన్నీ మలిచిన తీరు అనిర్వచనీయం. 1955, ఆగస్టు 22న పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకి తొలి సంతానంగా జన్మించారు చిరంజీవి. చెన్నైలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిప్లొమా పొందిన ఆయన 1978లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పునాదిరాళ్లు’ చిత్రంతో నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టారు. అంచలంచలుగా ఎదుగుతూ తిరుగులేని మాస్‌ కథానాయకుడిగా అవతరించారు. రాజకీయాల కోసం మధ్యలో కొంతకాలం సినిమా రంగానికి దూరమైనా.. ‘ఖైదీ నంబర్‌ 150’తో మళ్లీ పునః ప్రవేశించారు. ప్రస్తుతం తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. చిరు ఒక్కడే పరిశ్రమలోకి అడుగుపెట్టినా, ప్రస్తుతం ఆయన కుటుంమంతా చిత్ర పరిశ్రమకి అంకితమైంది. ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు, వివిధ సందర్భాల్లో ఆయన చెప్పి మాటలివి...*
వైవిధ్యమైన నటనను అందించి ప్రేక్షకుల మెప్పు పొందేందుకు నా కెరీర్‌లో ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసుకొన్నాను. చిరంజీవి ఇలాంటి తరహా పాత్రలు మాత్రమే చేస్తారని కాకుండా ఆయన ఎలాంటి పాత్రలైనా చేస్తారనిపించేలా కథల్ని ఎంపిక చేసుకొన్నా. ‘హిట్లర్‌’, ‘బావగారు బాగున్నారా’ వంటి సినిమాలను ఒప్పుకోవడానికి కారణం అదే. నేనేం చేసినా నా శ్రేయోభిలాషులైన అభిమానుల కోసమే. అలాగని ఇమేజ్‌ను మరిచి చేసేయడం కాదు. నాలో దాగున్న విలక్షణ నటనను ప్రదర్శించడం కోసమే.


*
‘ప్రాణం ఖరీదు’, ‘పునాది రాళు’్ల చిత్రాలతో తొలి అడుగులు వేసేనాటికి సినిమాల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ విధానం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు... ఇలా నా ముందు తరం నటులతో పనిచేసే అవకాశం దక్కించుకున్నాను. ఓ విధంగా పాత సినిమాకు, కొత్త సినిమాకు వారధిలాంటివాణ్ని. సినిమాలకు ప్రేక్షకులు ఎలా స్పందించే వాళ్లో తెలుసుకున్నాను. ముఖ్యంగా పాటలొచ్చేసరికి విసుగ్గా కనిపించేవారు. అలాగే ఫైట్స్‌కీ ఎక్కువగా డూప్స్‌నే వినియోగించేవారు. మహిళలకు ఫైట్స్‌ పెద్దగా నచ్చేవి కావు. నిజానికి పాటలు, ఫైట్స్‌ మాస్‌ అంశాలు. వాటిని జనానికి నచ్చేలా చేయాలని ప్రయత్నించాను, సాధించాను. కాలానుగూణంగా నా కెరీర్‌ను మార్చుకుంటూ వచ్చాను.


*
ప్రేక్షకుడికి, అభిమానికి ఏం కావాలో అది ఇచ్చేందుకో నేను కష్టపడతాను. అదే ఇష్టపడతాను. అంతేకాని స్టార్‌గా తృప్తిపడిన సందర్భం ఎక్కడా లేదు. విభిన్న పాత్రలు పోషించడం అన్ని రకాల, రంగాల వారికి మంచి వినోదాన్ని అందించేందుకే నా కృషంతా కూడా. తొలినుంచీ సహజమైన భావోద్వేగాల్ని చూపించాలన్న తపన ఉంది. అందుకే విభిన్నమైన పాత్రలు చేశాను. ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ పాత్రలు చేశాను. వినోదం కోసం ఏం కావాలో అది ఇచ్చేందుకు సిద్ధమయ్యాను.


*
‘ఇంద్ర’ సినిమా షూటింగ్‌ కోసం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో రాయలసీమకు వచ్చాను. పై నుంచి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు నా మనసుకెంతో హాయిగా అనిపించింది. రాయలసీమ నేలని ముద్దు పెట్టుకున్నప్పుడు నిజంగా నాకు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. దీనికి నాకు పాలస్తీనా నేత యాసర్‌ అరాఫత్‌ స్ఫూర్తి. ఆయన ఏ విదేశం వెళ్లినా తిరిగి తన దేశంలోని ఎయిర్‌పోర్టులో దిగుతూనే మాతృ భూమిని ప్రేమతో, మమకారంతో చుంబిస్తారు. రెండు మూడుసార్లు ఆ దృశ్యాన్ని టీవీలో చూసి ఆయన దేశభక్తికి ముగ్థుణ్ణయ్యాను. అటువంటి సందర్భం రావడంతో ఆయనను గుర్తుకు తెచ్చుకుని నటించాను. నిజంగా నేను కూడా ఆ నేల స్పర్శకు అంతలా పులకించిపోయాను.


*
కళా సేవే కాకుండా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పెట్టి ఎంతో కొంత మానవసేవ కూడా చేస్తున్నానన్న తృప్తి ఉంది. దీన్ని ఇంకా విస్తృతం చేయాలనుకున్నాం. చేశాం కూడా. గొప్ప ఫలితాలను ఇస్తోంది. అభిమానులు బ్లడ్‌ బ్యాంక్‌ సేవా కార్యక్రమాలు తమవిగా భావించి ముందుకు కదులుతున్నారు. వారిని చూస్తుంటే మంచి పనుల కోసం ఇంకా శ్రమిస్తారనిపిస్తుంది.


*
ఎవరైనా నన్ను పొడిగితే ఉప్పొంగిపోయే మనస్తత్వం కాదు నాది. ఎవరైనా బాగా పొడిగినప్పుడు ఇంటికెళ్లగానే నేల మీద పడుకుంటాను. ఎందుకంటే గర్వం రాకూడదని. సినిమాలు హిట్టయి పొగిడినప్పుడు ఆ విజయం ఎంతో మంది సమిష్టి కృషి అని ఫీలవుతానే తప్ప ఆ పొడగ్త నా ఒక్కడిది కాదని భావిస్తాను. హీరో కాబట్టి నన్ను ముందు పెట్టుకుని వారిని పొగుడుతున్నారనుకొంటాను. అలాగే విమర్శించినప్పుడు కూడా మేమంతా కలిసి ఆ సినిమా విషయంలో ఫెయిలయ్యామనే ఫీలవుతాను. చిరంజీవి ఫెయిల్‌ అయితే అది కూడా సమష్టిగా జరిగిందనే భావిస్తాను. ఈ రెండు విషయాల్లో నిజాయితీగా ఉంటాను కాబట్టే, నా మానసిక స్థితి రెండు సందర్భాల్లోనూ ఒక్కలాగే ఉంటుంది.*
తొలినాళ్లలో నా కోసం కష్టపడ్డ నేను ఆ తరువాత అభిమానుల ఆనందం కోసం కష్టపడ్డాను. వారి ఆనందమే నాకు కావాలి. ఇంతకుమించిన సంతృప్తి నాకు లేదు. మనమే కాకుండా సాటి మనుషులు కూడా బాగుండాలి. అందుకు తప్పక కృషి చేయాలి. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేస్తే అన్నీ విజయాలే లభిస్తాయి. నా మొదటి బలాబలాలు, ఆస్తిపాస్తులు అంతా అభిమానులే. నా అభిమానులంతా ధనవంతులు కాకపోవచ్చు. కానీ సహృదయ సంపన్నులు. చిరుద్యోగులు.. సామాన్య కుటుంబీకులు.. ఎదరో నా అభిమాన వర్గంలో ఉన్నారు. అయితే వారంతా కూడా సామాజిక సేవలో ముందుంటున్నారు.

.......................................................................................
*నలుగురు కుర్రాళ్ల సాహసం


అనగనగా ఒక ఊర్లో నలుగురు స్నేహితులు. అందరూ 15 ఏళ్ల లోపు వయసు వాళ్లే. ఓసారి ఆ ఊర్లో మరో కుర్రాడు కనిపించకుండా పోయాడని తెలిసి అతడిని వెతకాలని నలుగురూ నిర్ణయించుకుంటారు. ఎవరికీ చెప్పకుండా ఆ ఊరికి దగ్గర్లోని అడవుల్లోకి బయల్దేరుతారు. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న ప్రమాదాలేంటి? తెలుసుకున్న నిజాలేంటి? ఇంతకీ ఆ కుర్రాడు ఏమయ్యాడు? అనే కథతో వచ్చిన సినిమా ‘స్టాండ్‌ బై మి’ (1986). టీనేజి పిల్లల ఎదుగుదల, వారి ఆకాంక్షలు, అలవాట్లకు అద్దం పట్టే ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆ నలుగురు పిల్లలు తాము చేసే సాహస ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడం, నిజమైన స్నేహమంటే ఏంటో తెలుసుకోవడం లాంటి అంశాలు సినిమాను విజయవంతం చేశాయి. అమెరికా రచయిత స్టీఫెన్‌ కింగ్‌ రాసిన ‘ద బాడీ’ అనే నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు రాబ్‌ రీనెర్‌ దర్శకత్వం వహించాడు. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే ఈ సినిమాను 8 మిలియన్‌ డాలర్లతో తీస్తే 52.3 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడంతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.