ఆగస్టు 23.. (సినీ చరిత్ర ఈరోజు)

* ఐటెం పాటలకు చిరునామా..
ఈ ‘కెవ్వు కేక’ భామ!

(మలైకా అరోరా పుట్టినరోజు-1973) 


‘‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు..’’ అని ఓ వాణిజ్య ప్రకటనలో అన్నట్లు.. చిత్రసీమలో పేరు, ప్రఖ్యాతులు కూడా అంత సులభంగా ఏం దక్కవు. ఎంతటి ప్రతిభ ఉన్నా.. దాన్ని చూపించ దగ్గ పాత్ర, సరైన సమయం రాకపోతే.. ఎన్నేళ్లయినా చిత్రసీమలో మరుగున పడిపోయి ఉండాల్సిందే. బాలీవుడ్‌ నటి మలైకా అరోరా కూడా ఇలాంటి కోవకు చెందినదే. 1973 ఆగస్టు 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ. 1998లో షారుఖ్‌ కథానాయకుడిగా నటించిన ‘దిల్‌ సే’ సినిమాతో వెండితెరపై తళుక్కున మెరిసింది. ఇందులో ‘‘చల్‌ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా’’ గీతానికి కింగ్‌ ఖాన్‌తో స్టెప్పులేసింది. తొలి ఐటెం గీతంతోనే కుర్రకారుకు కిరాకునెక్కించే కిక్కు అందించింది. ఏఆర్‌ రహమాన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ప్రత్యేక గీతంతో అలైకా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది. ‘దిల్‌సే’ విజయంలో ఎంతో కీలకంగా నిలిచిన ఈ పాట.. తరువాతి కాలంలో మలైకాను ఐటెం గీతాల మహరాణిగా మార్చివేసింది.


ఈ జోరులోనే ‘‘గురు నాలా ఇష్క్‌ మిఠా’’, ‘‘మాహీ వే..’’, ‘‘కాల్‌ ధమాల్‌..’’ వంటి ప్రత్యేక గీతాలతో బాలీవుడ్‌ సినీ ప్రియులను ఒక ఊపు ఊపేసింది. మత్తెక్కించే చూపులు, చూపు తిప్పుకోనివ్వని స్టెప్పులతో వెండితెరపై మలైకా చేసే మాయాజాలం సినీ ప్రియులపై ఓ సమ్మోహన అస్త్రంలా పనిచేసేది. ప్రతి చిత్రంలో మలైకా తెరపై కనిపించేది కొద్ది నిమిషాల పాటలోనే అయినా.. ఆ తక్కువ సమయంలోనే తన అందం, అభినయం, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేది. ఇక 2000 సంవత్సరం తర్వాత వచ్చిన ‘మా తుఝే సలామ్‌’, ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’, ‘ఈఎంఐ’, ‘హెలో ఇండియా’, ‘హౌస్‌ ఫుల్‌’ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో మెరిసినా అవి మలైకా కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇలాంటి సమయంలో తన భర్త అర్బాజ్‌ ఖాన్‌తో కలిసి నిర్మించిన ‘దబాంగ్‌’ చిత్రంతో మరోసారి దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసింది. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ‘‘మున్నీ బదనాం హూయి’’ ఐటెం సాంగ్‌తో సినీ ప్రియులను మరోసారి ఉర్రూతలూగించింది. ఈపాట అప్పట్లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న తొలి భారతీయ పాటగానూ అరుదైన రికార్డును దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాకు గానూ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది మలైకా. ఈ సినిమాను తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా ‘గబ్బర్‌ సింగ్‌’ పేరుతో తెరకెక్కించగా.. ఇందులో ‘‘కెవ్వు కేక’’ గీతంతో పవన్‌ సరసన స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకుల చేత కేకలు పెట్టించింది. ‘దబాంగ్‌2’, ‘డాలి కి డోలి’ ‘పటాఖ’ చిత్రాల తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైన ఈ ప్రత్యేక సుందరి. ప్రస్తుతం బుల్లితెరపై పలు డ్యాన్స్‌ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా చేస్తోంది. మరోవైపు కొత్త ప్రియుడు, తన కంటే చాలా చిన్నవాడైన అర్జున్‌ కూపూర్‌తో కలిసి ప్రేమ వ్యవహారం నడుపుతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* సంచలనాల పెళ్లి! 


వాళ్లిద్దరూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. కలిసి తిరిగినా, సహజీవనం చేసినా... దేశదేశాల్లో వార్తే. అలాంటిది ఆరేళ్ల అనుబంధం తర్వాత పెళ్లి చేసుకున్నారంటే ఎంత సంచలనం! అలా ఒకటైన జంటే ఏంజెలినా జోలీ, బ్రాడ్‌పిట్‌. వీళ్లిద్దరి వివాహం 2014 ఆగస్టు 23న ఫ్రాన్స్‌లో జరిగింది. అప్పటికి జోలీకి 39, బ్రాడ్‌పిట్‌కి 50 ఏళ్లు. వాళ్లిద్దరి పెళ్లికి వాళ్ల పిల్లలు ఆరుగురు ముఖ్య అతిథులు. ఇద్దరు పిల్లల చేయి పట్టుకుని జోలీ ముసిముసి నవ్వులతో వస్తుంటే, మరో ఇద్దరు పిల్లలు పువ్వులు జల్లారు. ఇంకో ఇద్దరు పిల్లలు పెళ్లి ఉంగరాన్ని తీసుకువచ్చారు. పిట్‌కిది రెండో వివాహం. మొదటి భార్య జెన్నిఫర్‌ అనిస్టన్‌ను 2000లో పెళ్లి చేసుకుని 2005లో వదిలేశాడు. జోలీ అంతకు ముందు బ్రిటిష్‌ నటుడు జోనీ లీమిల్లర్, బిల్లీ బాబ్‌ థోర్న్‌టన్‌లతో చెరో మూడేళ్లు వివాహబంధంలో ఉండి విడాకులిచ్చేసింది. జోలీ, పిట్‌లిద్దరూ 2005లో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌’ సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. జోలీ ఉత్తమ సహాయ నటిగా ‘గర్ల్‌ ఇంటరప్టెడ్‌’ (1999) సినిమాకు ఆస్కార్‌ అందుకోగా, పిట్‌ ఉత్తమ నిర్మాతగా ‘12 ఇయర్స్‌ ఎ స్లేవ్‌’ (2014) సినిమాకు ఆస్కార్‌ అందుకున్నాడు. ఈ ఇద్దరు ఆస్కార్‌ సెలబ్రిటీల అనుబంధం విడిపోవడాలు, కలవడాలతో ఇప్పటికీ వార్తల్లో ఉండడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

* అందాల తార
 (సైరాబాను పుట్టిన రోజు-1944)
(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* స్టెనోగ్రాఫర్‌తో ప్రేమాయణం


ఆ స్టెనోగ్రాఫర్‌ చాలా అందంగా ఉంటుంది. అందుకే ఆమె బాస్‌కి నచ్చింది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆపై ప్రేమలో పడ్డారు. ఆ బాస్, ఓ పెద్ద కంపెనీ యజమాని కొడుకే. బాస్‌ కుటుంబం హైక్లాస్‌. ఆమె కుటుంబం లోక్లాస్‌. వాళ్లు డబ్బు మనుషులైతే, వీళ్లు ప్రేమాభిమానాలకు విలువిచ్చే మనుషులు. బాస్‌ తండ్రి ఓ ప్రాంతంలో ఇళ్లన్నీ కొనేశాడు. ఒక ఇల్లు మాత్రం మిగిలింది. అది కూడా కొనేస్తే ఆ ఏరియాలో పెద్ద ప్రాజెక్ట్‌ చేపట్టవచ్చు. కానీ ఆ ఇంటిని అమ్మడానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఇంతకీ ఆ ఇల్లు ఆ స్టెనోగ్రాఫర్‌ వాళ్లదే. ఈ నేపథ్యంలో బాస్, స్టెనోగ్రాఫర్‌ల ప్రేమ కథ ఏమైంది? నిరాడంబరంగా, మానవ సంబంధాలకి మాత్రమే విలువిస్తూ, డబ్బును తృణప్రాయంగా చూసే వాళ్ల కుటుంబానికి, ఏది ఏమైనా అనుకున్నది సాధించి మరింత ఎత్తుకు ఎదగాలనే బాస్‌ తండ్రికి మధ్య ఏం జరిగింది? ఆమె ప్రేమ, ఆ కుటుంబం మొత్తాన్ని ఎలా మార్చింది? ఇదీ కథ! చాలు... బోలెడన్ని భావోద్వేగాలు, కుటుంబ అంతరాలు, అలవాట్లలో తేడాలు, ఉద్దేశాల్లో వైరుధ్యాలు... మధ్యలో ఓ అందమైన ప్రేమ కథ. ఇంతకన్నా ఏం కావాలి, ఓ మంచి సినిమాకి? అందుకనే ఈ కథతో వచ్చిన ‘యు కెనాట్‌ టేకిట్‌ విత్‌ యు’ (1938) సినిమా అందరికీ నచ్చేసింది. అందాల తార జీన్‌ ఆర్థర్‌ స్టెనోగ్రాఫర్‌. హుందాగా, అందంగా నటించే జేమ్స్‌ స్టివార్ట్‌ యువ బాస్‌. బాస్‌ తండ్రి సీనియర్‌ నటుడు లియోనల్‌ బారీమోర్‌. పులిట్జర్‌ బహుమతి అందుకున్న జార్జి ఎస్‌. కాఫ్‌మేన్‌ రాసిన నవల ఈ సినిమాకి ఆధారం. అన్నీ బాగా కుదరడంతో ఈ సినిమా రెండు ఆస్కార్‌ అవార్డులను అందుకుంది.

* ఓ డిటెక్టివ్‌ ప్రేమకథ


డిటెక్టివ్‌ కథలన్నీ ఉత్కంఠ కలిగించేవే. నేరాల చుట్టూ అల్లుకున్నవే. అలాంటి కథలో ఓ అందమైన ప్రేమకథను కలిపి అందించిన సినిమా ‘ద బిగ్‌ స్లీప్‌’ (1946). ఓ కోటీశ్వరుడు ఓ డిటెక్టివ్‌ని పిలిచి, తన కూతుర్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వారి గురించి తెలుసుకోవాలని చెబుతాడు. ఆ కేసు పరిశోధనలో ఆ డిటెక్టివ్‌ ఆయన కూతురితోనే ప్రేమలో పడతాడు. ఓ పక్క ప్రేమ, మరో పక్క పరిశోధనల మధ్య తుపాకి మోతలు, నేరగాళ్ల ముఠా సవాళ్లు, ఎత్తుకు పైఎత్తులు, అనుకోని మలుపులు... ఇలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది సినిమా. అమెరికన్‌ బ్రిటిష్‌ రచయిత రేమండ్‌ షాండ్లర్‌ 1939లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఆకట్టుకుంది. హంఫ్రీ బోగర్ట్‌ డిటెక్టివ్‌గా, లారెన్‌ బాకాల్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాకి క్లాసిక్‌ హాలీవుడ్‌ యుగంలో మేటి దర్శకుడిగా పేరొందిన హోవార్డ్‌ హాక్స్‌ దర్శకుడు. దాదాపు 1.6 మిలియన్‌ డాలర్ల వ్యయానికి నాలుగు రెట్లు లాభాలు ఆర్జించిందీ చిత్రం.

* హిచ్‌కాక్‌ సినిమాల హీరోయిన్‌


‘మాస్టర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌’గా పేరు పొందిన ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. వెరా మైల్స్‌. ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ‘సైకో’ (1960) సినిమాలో లైలాక్రేన్‌ పాత్రతో ఈమె పేరు మార్మోగిపోయింది. అదే పాత్రలో 1983లో వచ్చిన సైకో సీక్వెల్‌లో కూడా నటించింది. ఇంకా ‘టార్జాన్స్‌ హిడెన్‌ జంగిల్‌’, ‘ ద సెర్చెర్స్‌’, ‘ద రాంగ్‌మేన్‌’, ‘ద మేన్‌ హూ షాట్‌ లిబర్టీ వాలేన్స్‌’, ‘ఫాలోమీ బాయ్స్‌’, ‘సెర్జెంట్‌ రైకర్‌’, ‘మోలీ అండ్‌ లాలెస్‌ జాన్‌’లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అమెరికాలో 1929 ఆగస్టు 23న పుట్టిన వెరా హైస్కూలు రోజుల్లోనే ‘మిస్‌ కాన్సాస్‌’ అందాల పోటీల్లో నెగ్గి అందరి దృష్టినీ ఆకర్షించింది. అందాల పోటీల నుంచి టీవీలు, సినిమాల ప్రపంచంలోకి వచ్చింది. ఆమెకిప్పుడు 90 ఏళ్లు.

* పేదరికం నుంచి ఎదిగిన తార


పదహారేళ్ల వయసులో కేవలం పది డాలర్ల కోసం చర్చిల్లోను, నైట్‌క్లబ్స్‌లోను పాటలు పాడిన ఓ అమ్మాయి, అంచెలంచెలుగా ఎదిగి పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. గాయనిగా, నటిగా కోట్లకు పడగలెత్తింది. ఆమే బార్బరా ఈడెన్‌. అమెరికాలో 1931 ఆగస్టు 23న పుట్టిన బార్బరా, కుటుంబం ఆర్ధిక మాంద్యం ప్రభావం వల్ల పేదరికంలో కూరుకుపోయింది. అమ్మ ఆమెను గాయనిగా ప్రోత్సహించడంతో చిన్నతనం నుంచే పాటలు పాడుతుండేది. ఓ పక్క గాయనిగా ఎదుగుతూనే మరో పక్క అందాల పోటీల్లో తళుక్కుమంది. అలా టీవీ కార్యక్రమాలకు అవకాశాలు వచ్చాయి. ఆపై వెండితెర స్వాగతం పలికింది. ‘ఫ్రమ్‌ ద టెర్రేస్‌’, ‘నో డౌన్‌ పేమెంట్‌’, ‘విల్‌ సక్సెస్‌ స్పాయిల్‌ రాక్‌ హంటర్‌’, ‘ద వేవార్డ్‌ గర్ల్‌’, ‘ఎ ప్రైవేట్స్‌ ఎఫైర్‌’, ‘ఫ్లేమింగ్‌ స్టార్‌’, ‘వాయేజ్‌ టు ద బాటమ్‌ ఆప్‌ ద సీ’, ‘ద వండర్‌ఫుల్‌ వరల్డ్‌ ఆఫ్‌ ద బ్రదర్స్‌ గ్రిమ్‌’, ‘ఫైవ్‌ వీక్స్‌ ఇన్‌ బెలూన్‌’లాంటి సినిమాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’ సహా అనేక పురస్కారాలు, అవార్డులు పొందిన ఈమెకిప్పుడు 88 ఏళ్లు.

* తళుక్కుమన్నాడు... తరలిపోయాడు!


ఫీనిక్స్‌... అంటే బూడిదలోంచి ప్రాణం పోసుకున్న పక్షిగా చెబుతారు. ఆ పేరు పెట్టుకున్న అతడు కూడా అలాగే అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు. అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాడు. కానీ... విధివశాత్తూ కేవలం 23 ఏళ్లకే కనుమరుగైపోయాడు! వీధి మొగలో గిటారు పట్టుకుని, చెల్లితో కలిసి పాటలు పాడి వచ్చేపోయే వాళ్లు విసిరిన డబ్బులతో పొట్టపోషించుకున్న బాల్యం అతడిది. పేదరికంతో పూటకింత తిండి కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధ పడిన పరిస్థితుల్లో ఎదిగాడు. నటుడిగా, సంగీతకారుడిగా, జంతు పర్యావరణ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నాడు. అతడే రివర్‌ ఫీనిక్స్‌. అతడి తమ్ముడు జాక్విన్‌ ఫీనిక్స్, చెల్లెళ్లు రైన్‌ ఫీనిక్స్, లిబర్టీ ఫీనిక్స్, సమ్మర్‌ ఫీనిక్స్‌లు కూడా నటులుగా పేరు తెచ్చుకున్నావారే కావడం విశేషం. అమెరికాలో 1970 ఆగస్టు 23న పుట్టిన రివర్‌ ఫీనిక్స్‌ పదేళ్లకే టీవీ కార్యక్రమాల ద్వారా నటనా ప్రస్థానం మొదలు పెట్టాడు. పదిహేనేళ్ల వయసులో ‘ఎక్స్‌ప్లోరర్స్‌’ సినిమా ద్వారా వెండితెరపై మెరిశాడు. ‘స్టాండ్‌ బై’ (1986) సినిమాతో అతడి పేరు మార్మోగింది. ‘రన్నింగ్‌ ఆన్‌ ఎంప్టీ’ సినిమాలో నటనకు ఆస్కార్‌ నామినేషన్‌ పొందగలిగాడు. ‘మై ఓన్‌ ప్రైవేట్‌ ఇడాహో’ సినిమాకు వెనిస్‌ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మకమైన ‘వోల్పి కప్‌’ అందుకున్నాడు. మరోవైపు గాయకుడిగా, గీత రచయితగా, గిటారిస్ట్‌గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి యువతను ఉర్రూతలూగించాడు. మొత్తం మీద 24 సినిమాలు, టీవీ కార్యక్రమాల ద్వారా ‘టీన్‌ ఐడల్‌’గా పేరు తెచ్చుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని మందులు వికటించడంతో తన 23వ ఏట 1993 అక్టోబర్‌ 31న అకస్మాత్తుగా మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.