ఆగస్టు 4.. (సినీ చరిత్రలో ఈరోజు)

 ఉక్కుమనిషి వసూళ్లు!


మూడేళ్ల పాటు వరసగా హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరో అతడు. అతడి సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల డాలర్లకుపైగానే ఆర్జించాయి. ఆ నటుడే రాబర్ట్‌ డౌనీ జూనియర్‌. ఇలా అంటే తెలియకపోవచ్చు కానీ ‘ఐరన్‌మ్యాన్‌’, ‘ఎవెంజెర్స్‌’, ‘ద ఇంక్రెడిబుల్‌ హల్క్‌’ సినిమాల నటుడంటే ఇట్టే తెలుస్తుంది. ఫోర్బ్స్‌ పత్రిక అంచనాల ప్రకారం 2012 నుంచి 2015 వరకు దాదాపు 80 మిలియన్‌ డాలర్ల ఆర్జనతో ఇతగాడు హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా గుర్తింపు పొందాడు. తండ్రి నిర్మాత కావడంతో డౌనీ ఐదేళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమయ్యాడు. ‘చాప్లిన్‌’ బయోపిక్‌లో నటనకు బాఫ్తా అవార్డు అందుకున్నాడు. ‘కిస్‌కిస్‌ బ్యాంగ్‌బ్యాంగ్‌’, ‘జోడియాక్‌’, ‘ట్రోపిక్‌ థండర్‌’, ‘అవెంజర్‌’ సిరీస్, ‘ఐరన్‌మ్యాన్‌’, ‘షెర్లాక్‌ హోమ్స్‌’ సినిమాలతో ఆకట్టుకున్నాడు.

నటన నుంచి రాచ కుటుంబానికి!అమెరికాలో పుట్టి... టీవీ, సినిమాల్లో తారగా వెలిగి... ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎదిగి... లింగవివక్షపై ఉద్యమించిన ఓ అందాల తార, బ్రిటిష్‌ రాచ కుటుంబంలో సభ్యురాలిగా మారింది. ఆమే రాచెల్‌ మేఘన్‌ మార్కిల్‌. బ్రిటిష్‌ రాణి ఎలిజెబెత్‌ మనవడు, ప్రిన్స్‌ చార్లెస్‌ తనయుడు అయిన ప్రిన్స్‌ హ్యారీని పెళ్లి చేసుకుంది. లాస్‌ఎంజెలిస్‌లో 1981 ఆగస్టు 4న పుట్టిన మేఘన్‌ చదువుకునే రోజుల్లోనే టీవీ సీరియల్స్‌లో నటించింది. మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. మరో పక్క ఫ్యాషన్‌ ప్రపంచంలో స్టైల్‌ ఐకాన్‌గా మెరిసింది. అంతర్జాతీయ ఛారిటీ సంస్థల కార్యక్రమాల్లో పాల్గొని ప్రభావవంతమైన మహిళగా ఎదిగింది. ‘గెట్‌ హిమ్‌ టు ద గ్రీక్‌’, ‘రిమెంబర్‌ మి’ ‘హారిబుల్‌ బాసెస్‌’ లాంటి సినిమాల ద్వారా ఆకట్టుకుంది. నిర్మాత, నటుడు ట్రెవర్‌ ఎంజెల్‌సన్‌ను పెళ్లాడినా తర్వాత విడిపోయింది. 2017లో ప్రిన్స్‌ హ్యారీతో ప్రేమలో పడింది. క్వీన్‌ ఎలిజెబెత్‌ అనుమతితో 2018 మే 19న ఇద్దరి వివాహం జరగడంతో మేఘన్‌ రాచకుటుంబీకురాలైంది. ప్రస్తుతం వీరికి ఒక బాబు పుట్టాడు.

 అపూర్వ సహోదరులు...


కవల సోదరులుగా పుట్టడం మామూలు విషయమే. కానీ ఇద్దరూ నటులుగా పేరు తెచ్చుకోవడం అరుదైన సంగతే. అది కోల్‌ స్ప్రౌస్, డైలన్‌ స్ప్రౌస్‌ విషయంలో జరిగింది. ఈ అపూర్వ సహోదరులిద్దరూ అటు బుల్లితెరపైన, ఇటు వెండితెరపైన కూడా సందడి చేశారు. కవల సోదరులతో అల్లిన కథలతో టీవీ, సినిమాల్లో కూడా నటించడం విశేషం. ఇటలీలో 1992 ఆగస్టు 4న పుట్టిన ఈ కవలలు ఎనిమిది నెలల నుంచే నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టడం విశేషం. నటి, డ్రామా టీచర్‌ అయిన నాయనమ్మ ఈ కవల మనుమలిద్దరినీ నటనకు పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి యాడ్స్‌లోను, వేదికల మీద, టీవీ కార్యక్రమాల్లోను, సినిమాల్లోను కలిసి నటించారు. పెద్దయ్యాక విడివిడిగా కూడా నటనా ప్రస్థానం కొనసాగించారు. ఇద్దరూ కూడా నటులుగా పురస్కారాలు అందుకున్నారు. ‘బిగ్‌ డాడీ’, ‘ద ఆస్ట్రోనాట్స్‌ వైఫ్‌’, ‘డైరీ ఆఫ్‌ ఎ సెక్స్‌ ఎడిక్ట్‌’, ‘ఐ సా మమ్మీ కిస్సింగ్‌ శాంటాక్లాజ్‌’, ‘ద మాస్టర్‌ ఆఫ్‌ డిస్‌గైజ్‌’, ‘ఎయిట్‌ క్రేజీ నైట్స్‌’, ‘యాపిల్‌ జాక్‌’లాంటి ఎన్నో సినిమాల్లో కలిసి నటించి మెప్పించారు.

 హుషారు గీతాలకు పెట్టింది పేరు!
 కిషోర్‌ కుమార్‌ (జయంతి)


బాలీవుడ్‌లో కిషోర్‌కుమార్‌ది ఒక శకం. నేపథ్య గాయకుడిగా, నటుడిగా, గీత రచయితగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్కీన్ర్‌ప్లే రచయితగా బహుముఖమైన సృజనాత్మకతను చూపించిన దిగ్గజం. గాయకుడిగా అతడు చేసిన ప్రయోగాలు అద్భుతం. శ్రావ్యమైన పాటలే కాదు, ప్రేమగీతాలు, హుషారైన పాటలు ఏమైనా కిషోర్‌కుమార్‌ పాడిన శైలి ఎప్పుడూ ఓ ప్రత్యేకతను చూపించింది. హిందీ, బెంగాలీ, మరాఠీ, అసామీస్, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి, మలయాళం, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడిన ఘనత అతడిది. బెంగాలీలో ఎన్నో ఆల్బమ్స్‌ను వెలువరించాడు. ఎనిమిది ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌ ఆయన పేరిట ఓ అవార్డును ప్రవేశపెట్టింది. కిషోర్‌కుమార్‌ పాడి, విడుదల కాని ఒక ఆఖరిపాటకు 2012లో వేలం నిర్వహిస్తే అది 15.6 లక్షలకు అమ్ముడైంది. నటుడిగా కూడా ‘నౌకరి’, ‘బాప్‌రే బాప్‌’, ‘చల్తీ కా నామ్‌ గాడీ’, ‘హాఫ్‌ టికెట్‌’, ‘పడోసన్‌’లాంటి ఎన్నో హిట్‌ సినిమాలను అందించాడు. రుమ, మధుబాల, యోగితా బాలి, లీనా చంద్రవర్కర్‌లను పెళ్లి చేసుకున్నాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 తొలి హాస్య తొలకరులు ఆయనవే!


ఓ దర్శకుడు ఓ సినిమా తీయాలని సంకల్పించాడు. సహాయ దర్శకుడు సహకరిస్తున్నాడు. కథానాయకుడిగా ఎవరూ కుదరడం లేదు. విసిగిపోయిన దర్శకుడు ‘ఆ పాత్ర నువ్వే ఎందుకు వేయకూడదు?’ అని సహాయ దర్శకుడిని అడిగాడు. ‘నా వల్ల కాదు బాబోయ్‌...’ అన్నాడు సహాయ దర్శకుడు. దర్శకుడు ఒప్పుకోలేదు. అలా తెరవెనుక నుంచి తెర మీదకి వచ్చిన అతడు, తెలుగులో తొలి హాస్య కథానాయకుడిగా మారాడు. అతడే లంక సత్యం. ఆ సినిమా 1940లో వచ్చిన ‘బారిష్టర్‌ పార్వతీశం’. మొక్కపాటి నరసింహ శాస్త్రి రాసిన ఈ నవలను సినిమాగా తీద్దామనుకున్న దర్శకుడు, తెలుగులో మొదటి మూకీ నిర్మించిన రఘుపతి వెంకయ్య కుమారుడు ప్రకాష్‌. అలా తొలి హాస్య కథానాయకుడైన లంక సత్యం పలు చిత్రాల్లో నటిస్తూనే దర్శకుడు కూడా అయ్యారు. ఆగస్టు 4న ఆయన జయంతి.


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.