ఆగస్టు 6.. (సినీ చరిత్రలో ఈరోజు)

 ఆ సినిమాలో ముద్దులే ముద్దులు!


సినిమా చరిత్రలోనే అత్యధిక ముద్దులున్న చిత్రం ఏది? అని అడిగితే, ఏదో కొత్త చిత్రమేమో అనుకోవచ్చు చాలా మంది. కానీ ఆ ఘనత దక్కించుకున్నది ఎప్పుడో 92 ఏళ్ల నాటి సినిమా అంటే నమ్మగలరా? అదే ‘డాన్‌ జువాన్‌’.ఆగస్టు 6, 1926న విడుదలైన ఈ సినిమాలో నేపథ్య సంగీతం ఉంటుంది కానీ మాటలుండవు. దీనికి ఇంకో ఘనత ఉంది. తెరపై బొమ్మల కదలికలకు అనుగుణంగా నేపథ్య శబ్దాలు వినిపించే ‘సౌండ్‌ ఆన్‌ డిస్క్‌’ సాంకేతికతను తొలిసారిగా వాడిన సినిమా ఇది. ఇందులో హీరో పాత్ర పోషించిన జాన్‌ బేరీమోర్‌ నిశ్శబ్ద చిత్రాల కాలంలో అందాల తారలుగా పేరొందిన మేరీ ఆస్టర్, ఎస్టెలీ టైలర్‌లతో సహా పలువురు మహిళలను 191 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. అంటే దాదాపు ప్రతి 53 సెకన్లకో ముద్దు అన్నమాట. అలాన్‌ క్రాస్‌లాండ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం.

 రాసి... తీసి... నటించి!


నటిగా పేరు పొందడం వేరు. తన పాత్రలను తానే రచించి, ఆ కథలను తానే తీసి, వాటిలో నటించడం ద్వారా విపరీతమైన ప్రాచుర్యం సాధించడమంటే అరుదైన విషయమే. అదే సాధించింది లూసిల్లే బాల్‌. నటిగా, మోడల్‌గా, స్టూడియో నిర్వాహకురాలిగా, నిర్మాతగా పేరొందిన ఈమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అందాల తారగా పేరొందింది. టీవీల్లో ‘ఐలవ్‌ లూసీ’, ‘ద లూసీ షో’, ‘హియర్‌ ఈజ్‌ లూసీ’, ‘లైఫ్‌ విత్‌ లూసీ’, ‘ద లూసీ దేశీ కామెడీ అవర్‌’లాంటి ధారావాహికలు, కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల్లో విపరీతైన క్రేజ్‌ సంపాదించుకుంది. వెండితెరపై రెండు దశాబ్దాల పాటు ఎన్నో పాత్రల ద్వారా అభిమానులను అలరించింది. న్యూయార్క్‌లో 1911 ఆగస్టు 6న పుట్టిన లూసీ, మూడేళ్లకే తండ్రిని కోల్పోయింది. కొన్నాళ్లకు తల్లి మరొకర్ని పెళ్లి చేసుకోవడంతో తాతయ్య ఇంట్లో పెరిగింది. సవతి తండ్రి ప్రోత్సాహంతో 12 ఏళ్ల వయసులో నాటకాల్లో ఆడిషన్స్‌కి వెళ్లి ఎంపికైంది. దాంతో ఆమె జీవితం మలుపు తిరగింది. ఆపై నాటకాలు, మోడలింగ్, టీవీలతో అంచెలంచలుగా ఎదిగింది. వెండితెరపై ‘రోమన్‌ స్కాండల్స్‌’, ‘రూమ్‌ సర్వీస్‌’, ‘రోబెర్టా’, ‘స్టేజ్‌డోర్‌’లాంటి సినిమాలతో పేరు సంపాదించింది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో రెండు స్టార్స్‌ గౌరవాన్ని పొందింది. ప్రెసిడెన్షియల్‌ అవార్డు, అంతర్జాతీయ లివింగ్‌ లెగసీ అవార్డు, టైమ్‌ పత్రిక వెలువరించే అత్యంత ప్రభావశీలుర గుర్తింపు పొందింది. ప్రభుత్వం ఆమె గౌరవార్థం స్టాంపును విడుదల చేసింది. అందం, సృజనాత్మకతలతో తనదైన ముద్ర వేసిన లూసీ, 1989 ఏప్రిల్‌ 26న కాలిఫోర్నియాలో తన 77వ ఏట మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.