ఆగస్టు 7.. (సినీ చరిత్రలో ఈరోజు)

పెద్దింటి అబ్బాయి...
పేదింటి అమ్మాయి


తీసింది 30 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో...

వసూలు చేసింది 238.5 మిలియన్‌ డాలర్లు!
దీనికి సాయం ప్రశంసలు... పురస్కారాలు!
‘క్రేజీ రిచ్‌ ఆసియన్స్‌’ (2018) సినిమా సాధించిన విశేషాలివి.

ఓ సాధారణ మధ్య తరగతి అమ్మాయి, ఓ భాగ్యవంతుడితో ప్రేమలో పడడం, అందుకు ఏర్పడిన అవాంతరాలతో అన్ని భాషల్లోనూ అనేక సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమానే ఇది. అమెరికా రచయిత కెవిన్‌ క్వాన్‌ 2013లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు జోన్‌ ఎమ్‌. చు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మరో విశేషం ఉంది. అదేంటంటే, సినిమా నటీనటుల్లో అత్యధికులు ఆసియాకు చెందిన వారే.

కథలోకి తొంగి చూస్తే... న్యూయార్క్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసే ఓ అమ్మాయి, సింగపూర్‌కి చెందిన ఓ అబ్బాయితో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడుతుంది. ఆపై ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా మరో స్నేహితురాలి పెళ్లి కోసం సింగపూర్‌ వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక, తను ప్రేమించిన అబ్బాయి అక్కడ చాలా సంపన్నవంతమైన కుటుంబానికి చెందిన వాడని, సమాజంలో పైస్థాయికి చెందిన వాడని తెలుస్తుంది. అబ్బాయి ఆమెను తన తల్లికి పరిచయం చేస్తాడు. ఆమెకు తన కొడుకు ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం ఉండదు. తన కొడుకును మర్చిపొమ్మని హెచ్చరిస్తుంది. ఆమె తిరిగి న్యూయార్క్‌ ప్రయాణమవుతుంటే ఆ అబ్బాయి వచ్చి, ఆమె కోసం కుటుంబాన్నే వదులుకుంటానని చెబుతాడు. ఇలాంటి సన్నివేశాల మధ్య అనేక మలుపులతో రొమాంటిక్‌ కామెడీగా కథ నడుస్తుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో దీనికి కొనసాగింపుగా ‘చైనా రిచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’, ‘రిచ్‌ పీపుల్‌ ప్రోబ్లెమ్స్‌’ అనే సినిమాలను రూపొందిస్తున్నారు.

ఆనందోబ్రహ్మ..
సుత్తివేలు (జయంతి-1947)


కు
రుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. - నవతరం ప్రేక్షకులకు ఈ పేరు చెబితే ఆయనెవరు అనేవాళ్లే ఎక్కువ. అదే సుత్తివేలు అంటే మాత్రం ఎవ్వరైనా గుర్తుపడతారు. హాస్య ప్రధానమైన పాత్రలతో ఒక తరం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన నటుడు సుత్తివేలు. 1947 ఆగస్టు 7న మచిలీపట్నం సమీపంలో భోగిరెడ్డిపల్లిలో జన్మించారు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నప్పుడు సన్నగా ఉండేవారట. దాంతో ఆయన పిన్ని జానకాంబ వేలు అని పిలిచేవారట. నటుడు అయ్యాక ‘నాలుగు స్తంభాలాట’లో సుత్తి అనే పాత్రని పోషించారు. అప్పట్నుంచి ఆయన పేరు సుత్తివేలు అయ్యింది. 200 పైచిలుకు చిత్రాలతో పాటు, టెలివిజన్‌ ధారావాహికల్లో నటించిన సుత్తివేలు నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. చిన్నప్పట్నుంచి నాటకాలపై మక్కువ పెంచుకొన్న ఆయన స్నేహితులతో కలిసి నాటకాల్లో అభినయించేవారు. 1981లో విశాఖ డాక్‌ యార్డులో ఉద్యోగం రావడంతో తన మకాంని బాపట్ల నుంచి విశాఖకి మార్చారు. ‘మనిషి నూతిలో పడితే’ అనే నాటకంలో ఆయన పాత్రని చూసిన జంధ్యాల తన ‘ముద్దమందారం’లో రిసెప్షనిస్టు పాత్రని ఇచ్చారు. ఆ తరువాత జంధాల్య చిత్రాల్లోనే ‘మల్లెపందిరి’, ‘నాలుగు స్తంభాలాట’లో పాత్రలు దక్కాయి. ఆ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకొన్నారు. ఉద్యోగం పోయిన తరువాత నటననే తన వృత్తిగా భావించి ‘ఆనంద భైరవి’, ‘రెండు జెళ్ళ సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చంటబ్బాయి’ తదితర విజయవంతమైన చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. ‘త్రిశూలం’ చిత్రం తరువాత అవకాశాలు తగ్గినా టి.కృష్ణ వరుసగా తన చిత్రాల్లో అవకాశాలు ఇవ్వడంతో విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆస్కారం లభించింది. ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’, ‘కలికాలం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ చిత్రాల్లో సుత్తివేలు పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘వందేమాతరం’ చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు సుత్తి. ‘దేవాలయం’, ‘ గీతాంజలి’, ‘మాస్టారి కాపురం’ చిత్రాలకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా పురస్కారాలు స్వీకరించారు. సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు కలిసి నటించారంటే ఇక ఆ సినిమాలో నవ్వులు గ్యారెంటీ అనుకొనేవారు అప్పట్లో. ఆనందో బ్రహ్మ, లేడీ డిటెక్టివ్‌ ధారావాహికలు సుత్తివేలుకి మంచి పేరు తీసుకొచ్చాయి. లక్ష్మీరాజ్యంతో సుత్తివేలు వివాహం జరిగింది. వీరికి ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. అనారోగ్యంతో బాధపడుతూ 2012, సెప్టెంబరు 16న మద్రాసులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుత్తివేలు జన్మదినం ఈ రోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

మరిచిపోలేని
హాస్య నటుడు!


బం
గాళా దుంపలాంటి మొహం... లావుపాటి శరీరం... ఇదీ అతడి రూపం. ఈ రూపంతోనే అతడు దశాబ్దాల తరబడి వెండితెరపై నవ్వులు పూయించాడు. అతడే ఆలివర్‌ హార్డీ. ఇలా ఇతడొక్కడి పేరూ చెబితే తెలియదేమో కానీ, ‘లారెల్‌ అండ్‌ హార్డీ’ సినిమాల్లో బండగాడంటే ఇట్టే గుర్తుకొచ్చేస్తాడు. సన్నగా రివటలాగా ఉండే లారెల్‌తో కలిసి ఇతగాడు హాస్యాన్ని పండించాడు. ఇద్దరూ కలిసి 1927 నుంచి 1951 వరకు 107 లఘుచిత్రాలు, ఫీచర్‌ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. 1892 జనవరి 18న జార్జియాలో పుట్టిన హార్డీ, పద్దెనిమిదేళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు వాళ్ల ఊళ్లో ఓ సినిమా హాలు వెలిసింది. అందులో ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా, గేట్‌కీపర్‌గా, హాలు తుడిచేవాడుగా, మేనేజర్‌గా అన్ని పనులకూ హార్డీ కుదిరాడు. పనితో పాటు సినిమాలు చూడ్డమే పని. చూసి, చూసి... తెరపై కనిపిస్తున్న నటుల కంటే తానే బాగా చేయగలననే నమ్మకం ఏర్పడిపోయింది. ఓ స్నేహితుడు సలహాపై సినిమా షూటింగులు తరచు జరిగే ఫ్లోరిడాకు చెక్కేశాడు. అక్కడి క్లబ్బుల్లో రాత్రుళ్లు హాస్య వేషాలతో నవ్విస్తూ, పాటలు పాడుతూ, పగలు ఏదో కంపెనీలో పనిచేస్తూ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1914లో తొలిసారి ‘ఔట్‌ విట్టింగ్‌ డాడ్‌’లో కనిపించాడు. ఆరడుగుల ఒక్క అంగుళం పొడవుతో, 136 కిలోల భారీ శరీరంతో ఉండే హార్డీ... విలన్‌ వేషాలు, నవ్వించే పాత్రలు వేస్తూ ఉండేవాడు. 1915 కల్లా ఒక్కొక్కటీ ఒక్క రీలు నిడివి మాత్రమే ఉండే 50 చిత్రాల్లో నటించాడు. తర్వాత లాస్‌ఏంజెలిస్‌ వచ్చేసి మరో 40 సినిమాల్లో నటించాడు. 1921లో తొలిసారి లారెల్‌తో కలిసి ‘ద లక్కీ డాగ్‌’ సినిమాలో కనిపించాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి హాస్య జంటగా పేరు పొందింది మాత్రం 1927లో వచ్చిన ‘స్లిప్పింగ్‌ వైవ్స్‌’తోనే. ఇక అక్కడి నుంచి వాళ్ల ఇద్దరి మ్యాజిక్‌ మొదలైంది. వాళ్లిద్దరి ఆఖరి చిత్రం 1951లో వచ్చిన ‘ఎటోల్‌కె’. తరువాత ఆరోగ్య సమస్యల వల్ల 1957 ఆగస్టు 7న 65 ఏళ్ల వయసులో నవ్వుల హార్డీ కన్నుమూశాడు.

అందం, ప్రతిభ...
ఆమె సొంతం!


ప్ర
పంచంలోని వందమంది ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందింది. ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ లాంటి అవార్డులెన్నో ఆమె నటనకు గీటురాళ్లు. నటిగా, నిర్మాతగా ఎదిగిన ఆమే చార్లిజ్‌ థెరాన్‌. 1990ల్లో వచ్చిన ‘ద డెవిల్స్‌ అడ్వొకేట్‌’, ‘మైటీ జో యంగ్‌’, ‘ద సైడర్‌ హౌస్‌ రూల్స్‌’లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ‘మాన్‌స్టర్‌’ సినిమాలో సీరియల్‌ కిల్లర్‌ పాత్రలో నటనకు ఆస్కార్‌ అందుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన మొదటి మహిళైంది. ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’, ‘ద ఫేట్‌ ఆఫ్‌ ద ఫ్యూరియస్‌’, ‘తుల్లి’, ‘గ్రింగో’, ‘ఎ ప్రైవేట్‌ వార్‌’, లాంగ్‌ షాట్‌’, ‘మర్డర్‌ మిస్టిరీ’ లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ది ఆడమ్స్‌ ఫ్యామిలి’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌9’లో నటిస్తుంది. దక్షిణాఫ్రికాలో 1975 ఆగస్టు 7న పుట్టిన థెరాన్‌ నర్తకిగా, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుని వెండితెరపైకి వచ్చింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.