ఆగస్టు 9 (సినీ చరిత్రలో ఈరోజు)

 రికార్డుల శ్రీమంతుడు!
మహేష్‌బాబు (పుట్టిన రోజు-1975)మ...హే..ష్‌. - ‘ఆ పేరులో మత్తుంది, వైబ్రేషన్స్‌ ఉన్నాయంటూ ‘అష్టాచమ్మా’లో స్వాతి మెలికలు తిరుగుతుంటుంది. స్వాతినే కాదు... నవతరం అమ్మాయిల్లో చాలామంది పరిస్థితి అదే. కలల రాకుమారుడు మహేష్‌. ఆయన రూపం.. ఆయన స్టైల్‌ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంటుంది. పేరు... స్టైల్‌లోనే కాదు... మహేష్‌ నటనలోనూ ప్రత్యేకమైన వైబ్రేషన్స్‌ ఉంటాయి. ఒక చిన్న చిరునవ్వుతోనూ... తనకి మాత్రమే ప్రత్యేకమైన ఓ చూపుతోనూ, మేనరిజమ్‌తోనూ సన్నివేశాల్ని పండించగల దిట్ట మహేష్‌. అందుకే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు... పలు పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

జూనియర్‌ ఖుష్బూ!
హన్సిక (పుట్టినరోజు-1991)


తెలుగు తెరకు ‘దేశముదురు’ చిత్రంతో పరిచయమైన లేలేత సోయగాల ముద్దుగుమ్మ హన్సిక. కుర్రాళ్ల హృదయాల్ని సుతిమెత్తగా కుట్టిన ‘కందిరీగ’ ఈమె. అందం, అభినయం.. ఈ రెండింట్లో ‘దేనికైనా రెడీ’ అని చాటింది. ‘మస్కా’, ‘కంత్రి’ తదితర చిత్రాల్లో నటించి అందంతో అదరగొట్టింది. ప్రస్తుతానికి తమిళంలో జోరు మీదున్నా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని అందం... హన్సిక. కశ్మీరీ ఆపిల్‌ని తలపించే ఛాయతో వెండితెకి మరింత వెలుగునిస్తుంటుంది హన్సిక. ఈమె 1991, ఆగస్టు 9న ముంబైలో జన్మించింది. ప్రదీప్‌ మోత్వానీ, మోనా మోత్వానీ తల్లిదండ్రులు. ఇద్దరూ విడిపోవడంతో హన్సిక తన తల్లి సంరక్షణలోనే పెరిగింది. చిన్నప్పుడే వెండితెరతో అనుబంధం పెంచుకొన్న హన్సిక పలు ధారావాహికల్లోనూ, సినిమాల్లోనూ బాలనటిగా అభినయించింది. ‘హవా’, ‘కోయి మిల్‌ గయా’, ‘అబ్రక దబ్రా’, ‘జాగో’ వంటి చిత్రాల్లో బాలనటిగా మెరిసింది. 2007లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘దేశముదురు’తో తెలుగు తెరకి పరిచయమైంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో హన్సిక ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత వరుసగా ఆమెని అవకాశాలు తలుపుతట్టాయి. అయితే విజయాలు మాత్రం లభించలేదు. దాంతో తమిళంపై దృష్టిపెట్టింది. అక్కడ కూడా సులువుగా విజయాలు లభించలేదు కానీ... ఆమె బొద్దైన అకారం తమిళ తంబీలకి బాగా నచ్చేసింది. దాంతో పరాజయాలు ఎదురైనా ఆమెని వరుసగా అవకాశాలు పలకరించాయి. ఈలోపు ఫామ్‌ని సొంతం చేసుకొని విజయాల్ని అందుకొంది. మళ్లీ తిరిగి తెలుగులోనూ అవకాశాల్ని అందుకొని ‘దేనికైనా రెడీ’, ‘సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌’ వంటి చిత్రాలతో విజయాల్ని సొంతం చేసుకొంది. విజయ్, సూర్యవంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. జూనియర్‌ ఖుష్బూగా గుర్తింపు తెచ్చుకొన్న హన్సిక అప్పుడప్పుడు తెలుగులో అవకాశాలు అందుకొంటూనే ఉంది. కానీ విజయాలు మాత్రం లభించడం లేదు. చివరిగా ఆమె ‘లక్కున్నోడు’, ‘గౌతమ్‌ నందా’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో కూడా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తోంది. తమిళ కథానాయకుడు శింబుతో పీకల్లోతు ప్రేమలో పడిన హన్సిక, ఒక దశలో ఆయన్ని పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకొంది. ఇంతలో ఇద్దరిమధ్య బంధం బెడిసి కొట్టడంతో కటీఫ్‌ చెప్పుకొన్నారు. ప్రస్తుతం సినిమా కెరీర్‌పైనే దృష్టిపెట్టింది హన్సిక. అనాథ పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్లకు చేయూతనిస్తున్న హన్సిక పుట్టినరోజు ఈ రోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

పదం తేలిక... భావం జీవిక!
 జాలాది రాజారావు (జయంతి- 1932)


‘అతడు జాలాది... రసవాది... పరుసవేది’ అని కీర్తించారు తనికెళ్ల భరణి. గీత రచయిత జాలాది రాజారావు రాసిన ఏ పాట విన్నా ఓ జీవిత సత్యం మనసులోకి దూసుకుపోయి చెరగని ముద్ర వేసేస్తుంది. ‘దేవుడి గుడిలోనైనా... పూరిగుడిసెలోనైనా... గాలి విసిరి కొడితే, ఆ దీపముండదు...’ అని వింటే అందులోని వాస్తవం, వైరాగ్యాన్ని పరిచయం చేస్తుంది. కృష్ణాజిల్లా గుడివాడలో 1932లో పుట్టిన జాలాది 1976లో వచ్చిన ‘పల్లెసీమ’ ద్వారా గీత రచయితగా పరిచయమయ్యారు. 270 సినిమాల్లో దాదాపు 1500 పాటలు రాశారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 నాట్యంలో పాదరసం!
జ్యోతిలక్ష్మి (వర్థంతి -2016)


జ్యోతిలక్ష్మి పాట లేకపోతే సినిమా లాగదండీ...’ అనేవారు సినిమా పంపిణీదారులు ఒక దశలో. అలా సినిమా ఎలాంటిదైనా ఏదో ఒక సందర్భం కల్పించి జ్యోతిలక్ష్మి పాట పెట్టేవారు నిర్మాతలు. తదేకంగా సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడికి జ్యోతిలక్ష్మి పాట ఓ ఉత్పేర్రకం... ఓ ఉద్రేకం... ఓ ఉత్సాహం. ఆమె పాట రాగానే నిశ్శబ్దంగా ఉండే సినిమాహాలు ఈలలతో దద్దరిల్లేది... ముసిముసి నవ్వులతో మురిసిపోయేది. దక్షిణాది భాషల్లో 130 సినిమాలు చేసిన జ్యోతిలక్ష్మి కొన్ని మహిళాప్రాధాన్య చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. 1948 నవంబర్‌2న పుట్టిన జ్యోతిలక్ష్మి, 2016 ఆగస్టు 9న మరణించింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

గిన్నిస్‌ రికార్డు ఆమె సొంతం!


గాయనిగా, నటిగా రాణించిన వాళ్లు చాలా మందే ఉండవచ్చు. కానీ అత్యధిక అవార్డులు గెలుచుకున్న కళాకారిణిగా ‘గిన్నిస్‌ ప్రపంచ రికార్డు’ సాధించినది మాత్రం ఆమె ఒక్కరే. ఆమే విట్నీ ఎలిజబెత్‌ హౌస్టన్‌. న్యూజెర్సీలో 1963 ఆగస్టు 9న పుట్టిన విట్నీ, చిన్నతనంలోనే పాటలు బాగా పాడేది. గాయనిగా ఆమె ఆల్బమ్‌లు ఏకంగా 20 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ‘ద బాడీ గార్డ్‌’ (1992)తో వెండితెరకు పరిచయమై ‘వెయిటింగ్‌ టు ఎక్స్‌హేల్‌’, ‘ద ప్రీచర్స్‌ వైఫ్‌’ లాంటి సినిమాలతో నటిగా కూడా ఆకట్టుకుంది. విట్నీ సాధించిన అవార్డులకు లెక్కే లేదు. ఎమ్మీ, గ్రామీ, బిల్‌బోర్డ్, అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డులు సహా మొతం 415 అవార్డులు అందుకుని ప్రపంచరికార్డు సాధించింది.

కరిగిపోయిన అందాల కల!


పట్టుమని చేసింది 12 సినిమాలు... అందాల తారగా మెచ్చుకోళ్లు... అభినయానికి పురస్కారాలు...
కానీ, ఇవన్నీ కలగా కరిగిపోయాయి, కేవలం 26 ఏళ్లకే!
ఆ వయసులో ఆ అందాల తార అనూహ్యంగా హత్యకు గురైంది!
ఇది హాలీవుడ్‌ తార షరాన్‌ టేట్‌ విషాద గాథ!
నటిగా, మోడల్‌గా, టీవీ తారగా, వెండితెర వర్థమాన అభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆమె పూర్తి పేరు షరాన్‌ మేరీ టేట్‌ పొలానస్కీ. టెక్సాస్‌లో 1943 జనవరి 24న పుట్టిన ఈమె, ఆరు నెలల వయసులోనే ‘మిస్‌ టినీటాట్‌ ఆఫ్‌ డల్లాస్‌ పీజెంట్‌’ అందాల పోటీలో గెలుపొందడం విశేషం. అలాంటి ముద్దుల చిన్నారి పదహారేళ్లకల్లా ‘మిస్‌ రిచ్‌ల్యాండ్‌’ పోటీల్లో అందాల యువతిగా నిలిచింది. ఆపై ఆమెను మోడలింగ్, టీవీ అవకాశాలు ముంచెత్తాయి. వెండితెర కూడా సాదరంగా అక్కున చేర్చుకుంది. ప్రముఖ పత్రికలపై ఆమె ఫొటోలు ముఖచిత్రాలై మురిశాయి. హాలీవుడ్‌లో 1961లో తొలిసారిగా ‘బరబ్బాస్‌’ చిత్రంలో ఆంథోనీ క్విన్‌తో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆపై ‘ఐ ఆఫ్‌ ద డెవిల్‌’, ‘వేలీ ఆఫ్‌ ద డాల్స్ ’లాంటి సినిమాల్లో నటించింది. ఆమె నటించిన చివరి చిత్రం ‘12+1’, ఆమె మరణానంతరం 1969లో విడుదలైంది. ‘ద ఫియర్‌లెస్‌ వాంపైర్‌ కిల్లర్స్‌’ సినిమా దర్శకుడు రోమన్‌ పొలాన్‌స్కీని 1968లో పెళ్లాడిన షెరాన్, 1969 ఆగస్టు9న ఇంట్లోనే మరో నలుగురితో పాటు హత్యకు గురైంది. ఆ సమయానికి ఆమె ఎనిమిదిన్నర నెలల గర్భవతి కావడం విషాదం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.