డిసెంబర్‌ 1 (సినీ చరిత్రలో ఈరోజు)

 ఏడేళ్ల వయసు నుంచే...
శివమణి (పుట్టిన రోజు)


శివమణి... సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియనివాళ్లు ఉండరేమో. నేనాడితే లోకమే ఆడదా... అన్నట్టు ఈయన డ్రమ్స్‌ వాయిస్తే లోకమంతా హుషారుతో ఊగిపోవల్సిందే. డ్రమ్స్, అక్టోబాన్, దర్బుకా, ఉడుకాయి, కాంజీరాలతో సహా పలు వాయిద్యాలని ఉపయోగించే అరుదైన సంగీత కారుడు శివమణి. చెన్నైకి చెందిన ప్రముఖ పెర్క్యూసన్‌ వాద్యకారుడు ఎస్‌.ఎమ్‌.ఆనందన్‌ తనయుడే శివమణి. 1959 డిసెంబరు 1న జన్మించారు. ఏడేళ్ల వయసులోనే డ్రమ్స్‌ వాయించడం ప్రారంభించిన శివమణి, 11 యేళ్ల వయసులోనే సంగీత వృత్తిలోకి ప్రవేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చి భారతదేశానికి పేరు తీసుకొచ్చారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ జట్టులో ఒకరైన శివమణి దక్షిణాదితో పాటు, బాలీవుడ్‌లోనూ ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి పనిచేశారు. ‘రోజా’, ‘రంగ్‌ దే బసంతి’, ‘తాల్‌’, ‘లగాన్‌’, ‘దిల్‌సే’ ‘గురు’, ‘కాబూల్‌ ఎక్స్‌ప్రెస్‌’ తదితర చిత్రాల సంగీతంలో ఈయన ప్రముఖ పాత్ర పోసించారు. పలు ఆల్బమ్‌లకి పనిచేశారు. శివమణి చలన చిత్రాల్లో కూడా తళుక్కున మెరిశాడు. ‘పడమటి సంధ్యారాగం’, ‘సిరివెన్నెల’, ‘ఆరిమ నంబి’, ‘కణితన్‌’, ‘మెర్సల్‌’ తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొన్నారు. తమిళనాడు ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మకమైన కలైమామణి పురస్కారాన్ని 2009లో స్వీకరించారు. బాలసుబ్రహ్మణ్యంని తన గురువుగా భావించే శివమణి పుట్టినరోజు ఈ రోజు.
(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

ఆడ వేషంలో మగనటుడి పాట్లు!


మగవారు, ఆడ వేషం వేసుకోవాల్సి రావడం, ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో రాజేంద్రప్రసాద్‌ నటించిన ‘మేడమ్‌’, కమలహాసన్‌ నటించిన ‘భామనే సత్యభామనే’ ఇలాంటివే. ఇలాంటి సినిమా ఒకటి 1982లోనే హాలీవుడ్‌లో విడుదలై విజయవంతమైంది. అదే ‘టూట్సీ’. ఇది ఓ నటుడి కథ. మంచి నటుడైనా మితిమీరిన నాణ్యత ఉండాలని శాసించే అతడితో పనిచేయడం కష్టమని ఎవరూ వేషాలు ఇవ్వరు. దాంతో అతడికి అవకాశాలు ఉండవు. ఖాళీగా ఉన్న సమయంలో తన స్నేహితుడి నాటకం కోసం నిధులు సాధించడానికి అతడు ఆడవేషంలో పాల్గొంటాడు. మగవారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ఆడవేషంలో అతడు నటించిన తీరు, వ్యక్తం చేసిన భావాలు మహిళలందరికీ నచ్చుతాయి. దాంతో అతడు, ఆమె వేషంలో విపరీతమైన ప్రాచుర్యం సంపాదిస్తాడు. అలా ఆడవేషంలో ఉండే అతడిని ఓ అమ్మాయి ఇష్టపడుతుంది. ఇతడు తన సహనటి ప్రేమలో పడతాడు. ఆ సహనటి తండ్రి ఇతడిపై కోరిక పెంచుకుంటాడు. మరో సహనటుడు అతడి అభిమానాన్ని కోరుకుంటాడు. ఇలా ఆడ వేషంలో ఓ మగ నటుడు ఎలాంటి పాట్లు పడ్డాడనేదే కథ. ఈ సినిమా విశేషమైన ఆదరణ పొంది పది ఆస్కార్‌ నామినేషన్లు పొందింది. ఈ సినిమా 21 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కి 177 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది.

 చురుకైన పోలీసు కథ!


ఉత్సాహం ఉండాలే కానీ, ఎవరైనా ఏ పనిలోనైనా పరిధులు దాటి రాణించవచ్చు. అలాంటి ఉత్సాహం ఉన్న ఓ తెలివైన పోలీసు కథలు కాసుల వర్షం కురిపించాయి. అవే ‘బెవర్లీహిల్స్‌ కాప్‌’ సీక్వెల్‌ సినిమాలు. మూడు సినిమాలుగా వచ్చిన ఈ సీక్వెల్స్‌ అన్నీ కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుని 85 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కి 735 మిలియన్‌ డాలర్లకు పైగా కురిపించాయి. నటుడు ఎడ్డీమర్ఫీకి అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి. వాటిలో ఒకటిగా 1984లో విడుదలైన ‘బెవర్లీహిల్స్‌ కాప్‌’ సినిమా 15 మిలియన్‌ డాలర్లకు 316 మిలియన్‌ డాలర్లు రాబట్టింది. డెట్రాయిట్‌లో ఉండే ఓ పోలీసు తన పరిధిలోకి రాని కేసుల్ని కూడా ఉత్సాహంగా పరిశోధించేస్తూ ఉంటాడు. అందుకోసం ఎంత దూరమైనా వెళతాడు. ఓ పక్క యాక్షన్, మరో పక్క హాస్యంతో ఈ సినిమా ఆకట్టుకుంది. ఓ స్నేహితుడి ఆహ్వానంపై బెవర్లీహిల్స్‌కి వెళ్లిన ఇతగాడు, తన కళ్ల ముందే ఆ స్నేహితుడు హత్యకు గురవడంతో సొంతంగా నేర పరిశోధన మొదలు పెడతాడు. ఓ పక్క స్థానిక పోలీసులు, మరో పక్క వాళ్లు నియోగించిన డిటెక్టివ్‌ల మధ్య నుంచి తప్పించుకుంటూ ఇతడు ఆ కేసును ఎలా పరిష్కరించాడనేదే కథ.

* వంద కోట్ల డాలర్లు కొల్లగొట్టిన సినిమా!


‘లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌’ అంటే చాలు... ప్రపంచ సినీ అభిమానులకు ఇక వేరే ఏమీ చెప్పక్కర్లేదు. మూడు సీక్వెల్‌ సినిమాలుగా వచ్చిన ఇవన్నీ అంతర్జాతీయంగా పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షించి కాసుల వర్షం కురిపించినవే. జె.ఆర్‌.ఆర్‌.టాల్కీన్‌ అనే రచయిత రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలు వింత పాత్రలు, విచిత్ర శక్తులతో ఆకట్టుకున్నాయి. ఈ మూడు సినిమాలూ కలిసి దాదాపు 330 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కితే, ఏకంగా 291 కోట్ల డాలర్లకు పైగా ఆర్జించాయి. 30 ఆస్కార్‌ అవార్డులను నామినేషన్లు సాధించి, 17 ఆస్కార్‌ అవార్డులను కొల్లగొట్టాయి. మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈ సీక్వెల్‌ సినిమాల్లో చివరదిగా వచ్చిన ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌: ద రిటర్న్‌ ఆఫ్‌ ద కింగ్‌’ సినిమా 2003లో విడుదలై 100 కోట్ల డాలర్లకు పైగా ఆర్జించడంతో పాటు, 11 ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుని, అత్యధిక ఆస్కార్లు గెలుచుకున్న సినిమాగా ‘బెన్‌హర్‌’, ‘టైటానిక్‌’ సినిమాల సరసన చేరి రికార్డు స్థాపించింది.

* స్పైడర్‌మ్యాన్‌ సృష్టికర్తలకు నివాళి


సాలీడు లక్షణాలతో చకచకా భవనాల మధ్య నుంచి ఎగిరిపోతూ సందడి చేసే స్పైడర్‌మ్యాన్‌ అభిమానులు ప్రపంచమంతా ఉన్నారు. దశాబ్దాల తరబడి తరతరాలను అలరిస్తున్న ఈ స్పైడర్‌మ్యాన్‌ను సృష్టించిన ఘనత రచయిత స్టాన్‌లీ, చిత్రకారుడు స్టీవ్‌ డిట్కోలకే దక్కుతుంది. వీళ్లిద్దరూ కలిసి 1962లో ఈ పాత్రకు కామిక్‌ పుస్తకాల్లో తొలిసారిగా రూపం కలిపించి జీవం పోశారు. ఆ స్పైడర్‌మ్యాన్‌ పుస్తకాలు, టీవీలు, సినిమాల ద్వారా విజృంభించి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 25.6 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేశాడు. అలాంటి స్పైడర్‌మ్యాన్‌ సృష్టికర్తలిద్దరూ 2018లోనే మరణించారు. వీరికి నివాళిగా మార్వెల్‌ కామిక్‌ సంస్థ కంప్యూటర్‌ యానిమేషన్‌ విధానంలో ఓ సినిమాను రూపొందించింది. అదే ‘స్పైడర్‌మ్యాన్‌: ఇన్‌టు ద స్పైడర్‌ వెర్స్‌’. ఈ సినిమా రూపకల్పనలో 140 మంది యానిమేటర్లు శ్రమించారు. దీన్ని 2018 డిసెంబర్‌ 1న విడుదల చేశారు. సుమారు 90 మిలియన్‌ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 375.5 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రంగా ఆస్కార్‌ అవార్డు, యానీ అవార్డులు, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు పొందింది. కొత్తగా స్పైడర్‌మ్యాన్‌గా మారిన ఓ హైస్కూలు కుర్రాడు, పాత స్పైడర్‌మ్యాన్‌ దగ్గర శిక్షణ పొంది ఎలాంటి సాహసాలు చేశాడనేదే కథ.

* అందంతో అలరించి...

అందాల నటిగా ఆమె అలనాటి ప్రేక్షకులను అలరించింది. మంచి అభినేత్రిగా ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకొంది. ఆమే మేరీ మార్టిన్‌. నటిగా, గాయనిగా అభిమానులకు ఉర్రూతలూగించింది. టెక్సాస్‌లో 1913 డిసెంబర్‌ 1న పుట్టిన మార్టిన్‌ చిన్నప్పుడే గాయనిగా మెప్పించింది. ఆపై నాటకాల్లో పాత్రల ద్వారా ఆకట్టుకుంది. అమెరికన్‌ థియేటర్‌ హాల్‌ ఆఫ్‌ ఫ్రేమ్, కెనడీ సెంటర్‌ హానర్స్, డొనాల్డ్‌సన్, టోనీ, ఎమ్మీ లాంటి అవార్డులెన్నో కైవశం చేసుకుంది. ‘ద షాప్‌వోర్న్‌ ఏంజెల్‌’, ‘ద గ్రేట్‌ విక్టర్‌ హెర్బెర్ట్‌’, ‘రిథిమ్‌ ఆఫ్‌ ద రివర్‌’, ‘లవ్‌ థై నైబర్‌’, ‘కిస్‌ ద బాయిస్‌ గుడ్‌బై’, ‘బర్త్‌ ఆఫ్‌ ద బ్లూస్‌’లాంటి సినిమాల ద్వారా అందాల నటిగా అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. పలు రంగాల్లో ప్రతిభ చూపిన ఈమె కాలిఫోర్నియాలో 1990 నవంబర్‌ 3న తన 76వ ఏట మరణించింది.

* ఆరు దశాబ్దాలు...
అనేక పురస్కారాలు


దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, కమేడియన్‌గా ఆరు దశాబ్దాల పాటు అలరించిన గనత ఉడీ అలెన్‌కి దక్కుతుంది. హాస్య రచయితగా పుస్తకాలు రాసి, టీవీ కార్యక్రమాలకు స్కిట్లు అందించిన ఇతడు నాటకాలు, సినిమాల ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. వ్యక్తులను అనుకరిస్తూ హాస్య ప్రసంగాలతో అనేక ప్రదర్శనలు ఇచ్చిన ఉడీ అలెన్, ‘వంద మంది మేటి కమేడియన్‌’లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ‘అన్నీ హాల్‌’, ‘మన్‌హటన్‌’, ‘హన్నా అండ్‌ హెర్‌ సిస్టర్స్‌’, ‘క్రైమ్స్‌ అండ్‌ మిస్‌డెమీనర్స్‌’, ‘మిడ్‌నైట్‌ ఇన్‌ ప్యారిస్‌’, ‘మ్యాచ్‌ పాయింట్‌’ లాంటి సినిమాలు చూసిన వారెవరూ ఇతడి అభినయాన్ని మర్చిపోలేరు. ‘చిత్ర సీమకు పెన్నిధి’ అనే పేరు సంపాదించుకున్నాడు. దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా నాలుగు ఆస్కార్‌ అవార్డులు, తొమ్మిది బ్రిటిష్‌ అకాడమీ ఫిలిం పురస్కారాలు అందుకున్న ఇతడి జీవితంపై టీవీలో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రసారమైంది. న్యూయార్క్‌లో 1935 డిసెంబర్‌ 1న పుట్టిన ఉడీ అలెన్, స్కూలు రోజుల్లోనే పేకముక్కలతో మ్యాజిక్‌లు చేసి ఆకట్టుకునేవాడు. దినపత్రికల్లో జోక్స్, చమత్కారాలతో కాలమ్‌ రాసేవాడు. పదిహేడేళ్లకల్లా తన రచనలతో బాగా సంపాదించగలిగే స్థాయికి ఎదిగాడు. ఆ హాస్య చతురతే ఉడీ అలెన్‌ జీవితానికి బంగారు బాటలు పరిచి, అంచెలంచెలుగా అనేక రంగాల్లో ఎదిగేలా తీర్చిదిద్దింది.

* కష్టాలు దిగమింగాడు...
నటించి నవ్వించాడు...


కమేడియన్‌గా, నటుడిగా, రచయితగా అలరిస్తూ అనేక అవార్డులు అందుకున్న వాడు రిచర్డ్‌ ప్రియర్‌. వేదికలపై ప్రదర్శనలు, టీవీ కార్యక్రమాలు, నాటకాల్లో వేషాలు, సినిమాల్లో పాత్రలతో వేర్వేరు రంగాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇతడి జీవితంపై ‘రిచర్డ్‌ ప్రియర్‌: లైవ్‌ అండ్‌ స్మోకింగ్‌’ అనే సినిమా ప్రత్యేకంగా రావడం విశేషం. ఇతడి హాస్య కార్యక్రమాల కదంబంగా ‘రిచర్డ్‌ ప్రియర్‌: లైవ్‌ ఇన్‌ కాన్సెర్ట్‌’, ‘రిచర్డ్‌ ప్రియర్‌: లైవ్‌ ఆన్‌ ద సన్‌సెట్‌ స్ట్రిప్‌’, ‘రిచర్డ్‌ ప్రియర్‌: హియర్‌ అండ్‌ నౌ’ లాంటి కార్యక్రమాలు, సినిమాలు రూపొందాయి కూడా. వెండితెరపై ‘సిల్వర్‌ స్ట్రీక్‌’, ‘బ్లూ కాలర్‌’, ‘సూపర్‌మ్యాన్‌3’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఒక ఎమ్మీ అవార్డు, అయిదు గ్రామీ అవార్డులు, రైటర్స్‌ గిల్డ్‌ అమెరికా అవార్డు, కెనడీ సెంటర్‌ మార్క్‌ ట్రైన్‌ ప్రైజ్‌ ఫర్‌ అమెరికన్‌ హ్యూమర్‌ పురస్కారం అందుకున్నాడు. అమెరికాలో 1940 డిసెంబర్‌ 1న పుట్టిన ఇతడి బాల్యం దుర్భరమైన పరిస్థితుల్లో గడిచింది. అమ్మమ్మ నడిపే వ్యభిచార గృహంలో పెరిగాడు. వ్యభిచారి అయిన తల్లి నిరంతరం తనను తాగుతూ పట్టించుకునేది కాదు. అమ్మమ్మ చీటికీ మాటికీ కొడుతుండేది. ఏడేళ్ల వయసులో లైగింగ వేధింపులకు గురయ్యాడు. పద్నాలుగేళ్లకి స్కూలు నుంచి డిబార్‌ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీలో చేరాడు. అక్కడ కూడా వర్ణ వివక్షను ఎదుర్కొన్నాడు. ఇలాంటి కష్టాల్లో అతడు హాస్యాన్ని ఆశ్రయించి ఓదార్పు పొందాడు. ఆ హాస్య చతురతే అతడి జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకు వచ్చింది. ఆర్మీ నుంచి వచ్చాక క్లబ్్్సలో హాస్య కార్యక్రమాలు ప్రదర్శిస్తూ కాస్తో కూస్తో సంపాదించుకునేవాడు. కన్నీళ్లు దాచుకుని నటించి నవ్వించేవాడు. అలా ప్రాచుర్యం పొందడంతో టీవీల్లో అవకాశాలు వచ్చాయి. వాటితో మరింత పేరు పొందాడు. ఆపై సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కష్టాలకు ఓర్చుకుని, నవ్వించడం నేర్చుకుని, జీవితాన్ని తీర్చుకున్న ఇతడు 2005 డిసెంబర్‌ 10న తన 65వ ఏట కన్నుమూశాడు.

* అవార్డుల అమ్మాయి...

అయిదు దశాబ్దాల ప్రస్థానం... మూడు గ్రామీ అవార్డులు... నాలుగు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు... మూడు ఎమ్మీ అవార్డులు... ఓ టోనీ అవార్డు... ఇవన్నీ బెట్టీ మిడ్లర్‌ ప్రతిభకు గీటురాళ్లు. గాయనిగా, గీత రచయిత్రిగా, నటిగా, కమేడియన్‌గా, నిర్మాతగా మెప్పించిన ఈమె గీతాలు ప్రపంచ వ్యాప్తంగా 30 మిలియన్లు అమ్ముడు పోవడం విశేషం. సంగీత పరంగా నాలుగు గోల్డ్, మూడు ప్లాటినమ్, మూడు మల్టీ ప్లాటినమ్‌ బహుమతులు అందుకుంది. వెండితెరపై ‘ద రోజ్‌’, ‘డౌన్‌ అండ్‌ ఔట్‌ ఇన్‌ బెవర్లీహిల్స్‌’, ‘రూత్‌లెస్‌ పీపుల్‌’, ‘ఔట్రేజియస్‌ ఫార్చ్యూన్‌’, ‘బిగ్‌ బిజినెస్‌’, ‘బీచెస్‌’, ‘హోకస్‌ పోకస్‌’, ‘ద ఫస్ట్‌ వైవ్స్‌ క్లబ్‌’, ‘ద స్టెప్‌ఫోర్డ్‌ వైవ్స్‌’, ‘పేరెంటల్‌ గైడెన్స్‌’, ‘ఫర్‌ ద బాయిస్‌’, ‘జిప్సీ’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. హవాయిలో 1945 డిసెంబర్‌ 1న పుట్టిన ఈమె, చిన్నప్పుడే నాటకాల ద్వారా నటనా రంగంవైపు ఆకర్షితురాలైంది. పాటలు పాడుతూ గాయనిగా పేరు పొందింది. టీవీల్లో అలరించింది. సినిమాల్లో మెరిసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.