డిసెంబర్‌ 14.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కలమే బలంగా ఎదిగి...

‘దేవత’, ‘ఖైదీ నంబర్‌ 786’, ‘అభిలాష’, ‘పోలీస్‌ లాకప్‌’, ‘ఛాలెంజ్‌’ వంటి విజయవంవతమైన చిత్రాలకి కథలందించిన రచయిత జి.సత్యమూర్తి. 1980తో పాటు, 90 దశకంలో వచ్చిన ‘బంగారు బుల్లోడు’, ‘భలే దొంగ’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అమ్మ దొంగా’, ‘చంటి’, ‘శ్రీనివాసకళ్యాణం’, ‘పెదరాయుడు’, ‘మాతృదేవోభవ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల వెనక సత్యమూర్తి ఉన్నారు. ‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘చైతన్య’ సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. 90కిపైగా సినిమాలకి కథా రచయితగా, మాటల రచయితగా పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలంలోని వెదురుపాక సత్యమూర్తి స్వస్థలం. 1953 మే 24న జన్మించిన సత్యమూర్తి రామచంద్రపురంలో బీఎస్సీ చేశారు. సాహిత్యం అంటే మక్కువతో ‘చైతన్యం’తో నవలా రచయితగా ప్రయాణం ప్రారంభించారు. ‘పవిత్రులు’, ‘పునరంకితం’, ‘ఎదలోయలో నిదురించే’, ‘దిగంబర అంబరం’, ‘అధర గరళం’ వంటి రచనలు చేశారు. మొదట గేయ రచయిత కావాలనుకొన్నారు. ‘దేవత’తో కథారచయితగా పరిచయమయ్యారు. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. చెన్నైలోని సాలి గ్రామంలోనే స్థిరపడిన ఆయన తన 62 యేళ్ల వయసులో 2015లో డిసెంబరు 14న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయన వర్ధంతి. జి.సత్యమూర్తికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులిద్దరూ సంగీత ప్రపంచంలో రాణిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా కొనసాగుతుండగా, మరో తనయుడు సాగర్‌ గాయకుడిగా రాణిస్తున్నారు.

* భళా భల్లాల..  (రానా - పుట్టినరోజు)

సినిమా కుటుంబంలోనే పుట్టి పెరిగిన దగ్గుబాటి రానా తొమ్మిది సంవత్సరాలుగా కథానాయకుడిగా ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే ఆయన తెలుగుతో పాటు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాతో పాటు... టెలివిజన్‌ తెరపైనా ఆయన సందడి చేస్తూ ఆయన ఇంటింటికీ చేరువయ్యారు. మొదట తన తాత, ప్రముఖ నిర్మాత రామానాయుడు అడుగు జాడల్లో నడుస్తూ ‘బొమ్మలాట’ అనే చిత్రాన్ని నిర్మించారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహంచిన ఆ చిత్రానికి ఉత్తమ చలన చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. అలా తొలి సినిమాతోనే జాతీయ పురస్కారం అందుకొన్నారు రానా. ఆయనకి విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన ఓ కంపెనీ కూడా ఉంది. మహేష్‌బాబు కథానాయకుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైనికుడు’ చిత్రానికి రానా స్వయంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా కూడా వ్యవహరించి, ఆ చిత్రానికిగానూ నంది పురస్కారాన్నీ అందుకొన్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు, లక్ష్మి దంపతులకి 14 డిసెంబరు 1984న చెన్నైలో జన్మించారు. సినిమా కుటుంబంలోనే పుట్టి పెరగడంతో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీతో పాటు పలు విభాగాలపై అవగాహన పెంచుకొన్నారు. కొన్నాళ్లు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీని నిర్వహించారు. నటనపై మక్కువతో 2010లో ‘లీడర్‌’తో తెరంగేట్రం చేశారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రం విజయవంతం కావడంతోపాటు, రానాకి మంచి పేరొచ్చింది. ఆ తరువాతి ఏడాదిలోనే హిందీలో ‘దమ్‌ మారో దమ్‌’ అనే చిత్రం చేశారు. అలా హిందీ, తెలుగు భాషలపై దృష్టిపెడుతూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. ‘ఆరంభం’ చిత్రంతో తమిళంలోకీ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ‘బెంగుళూరు నాట్కల్‌’ అనే చిత్రం కూడా చేశారు. తెలుగులో ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’తో నటన పరంగా ఆకట్టుకొన్న ఆయనకి ‘బాహుబలి’తో తిరుగులేని మలుపు లభించింది. అందులో భల్లాల దేవగా రానా అభినయం ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తరువాత ‘రుద్రమదేవి’, ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ చిత్రాలతో రానా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘హాతి మేరే సాథి’ ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో విడుదల కానుంది. ‘హిరణ్య’ అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూ: 200 కోట్ల వ్యయంతో తెరకెక్కనుంది. నెంబర్‌ వన్‌ యారీ అనే టెలివిజన్‌ కార్యక్రమంతోనూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఈ రోజు రానా పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* పీజె శర్మ (వర్థంతి - 2014)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* భారతీయ సినిమాకు దిక్సూచి
(శ్యామ్‌ బెనగల్‌ పుట్టినరోజు - 1934)

దాదాపు 50 ఏళ్ల సినీ కెరీర్‌...
తీసింది పట్టుమని 25 చిత్రాలే కావచ్చు..
వీటిలో వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్నవి 14..
జాతీయ ఉత్తమ హిందీ చిత్రాలుగా కీర్తి కిరీటాన్ని ధరించినవి 7..
ఇక అంతర్జాతీయ వేదికలపై అనేక విశిష్ఠ పురస్కారాలతో సత్తా చాటిన చిత్రాలు 20కి పైగానే ఉన్నాయి..
ఉత్తమ విదేశీ చిత్రంగా భారత తరపున ఆస్కార్‌ రేసులో నిలిచినవి 2..
ఇవన్నీ ఓ తెలుగు వ్యక్తి సాధించిన ఘనతలు..
తెలంగాణ గడ్డపై పుట్టి బాలీవుడ్‌లో తెలుగు సువాసనలు విరజిమ్మి.. ప్రపంచ వేదికలపై భారతీయ చిత్రసీమ కీర్తిని రెపరెపలాడించిన ఆ గొప్ప దర్శక,రచయిత శ్యామ్‌బెనగల్‌.


భారత చిత్ర పరిశ్రమలో సత్యజిత్‌ రే, మృణాల్‌ సేన్, అపర్ణా సేన్‌ వంటి దిగ్గజాలకు సరిసమానంగా కీర్తి గడించిన దిగ్గజ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌. కమర్షియల్‌ హంగులు.. వసూళ్ల లెక్కలు.. గ్లామర్‌ సొబగులు ఆయన చిత్రాల పరమావధి కాదు. కళలతో సమాజాన్ని మేలుకొలపడమే ఆయన లక్ష్యం. సమాజంలోని చీకటి శక్తులపైనే ఆయన నిరంతర పోరాటం. ఈ పోరుకు తాను ఎంచుకున్న మార్గం మెగాఫొన్‌. దాని వెన్నుదన్నుతోనే 50ఏళ్లుగా చిత్రసీమలో అనేక దృశ్యకావ్యాలను తీసుకొచ్చారు. తాను తీసిన ప్రతి చిత్రంతో ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించారు. దర్శకత్వ శాఖకు గొప్ప కీర్తిని.. కొత్త ఒరవడిని అందించారు శ్యామ్‌ బెనగల్‌. 70, 80, 90వ దశకాల్లో భారతీయ సినిమాకు ఒక దిక్సూచిగా ప్రత్యామ్నాయ సినిమాకు పునాది వేసిన దర్శకుడిగా శ్యామ్‌ బెనగల్‌కు చిత్రసీమలో గొప్పకీర్తి ఉంది. అందుకే సినీ వర్గాలంతా ఆయన్ని ‘మిడిల్‌ సినిమా’ అని అభివర్ణిస్తుంటారు.
1934 డిసెంబరు 14న నిజాం రాజ్యంలో ఉన్న సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో పుట్టారు శ్యామ్‌ బెనగల్‌. తన విద్యాబ్యాసమంతా తెలంగాణ ప్రాంతంలోనే కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎకనమిక్స్‌లో ఎంఏ పట్టా తీసుకున్న తరువాత ఇక్కడే ఓ ఫిల్మ్‌ సొసైటీని స్థాపించారు. చిత్రసీమలోకి రాకముందు కొన్నాళ్లపాటు అడ్వర్టైజింగ్‌ సంస్థలో పని చేసిన ఆయన.. ఆ తరువాత 1966 - 73 మధ్య పూణే ఫిలిం, టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో లెక్చరర్‌గా, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్మించారు. ఆ సమయంలోనే డాక్యుమెంటరీలను తెరకెక్కించడం ప్రారంభించారు. అలా తొలిసారి ‘ఎ చైల్డ్‌ ఆఫ్‌ ది స్ట్రీట్‌’తో అందరి ప్రశంసలు పొందాడు. శ్యామ్‌ మొదటి నుంచీ సమాజంలో పేరుకుపోయిన అనేక సామాజిక రుగ్మతలనే కథా వస్తువులుగా ఎంచుకున్నారు. ఆయన తెరకెక్కించిన తొలిచిత్రం ‘అంకుర్‌’ (1973)తో తెలంగాణలోని ఆర్థిక, లైంగిక దోపిడీని కళ్లకు కట్టిన శ్యామ్‌.. ఈ సినిమాతో షబానా ఆజ్మీ వంటి గొప్ప నటిని భారతీయ చిత్రసీమకు పరిచయం చేశారు. ఈ చిత్రంతో తొలిసారి జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో భారత తరపున అకాడమీ అవార్డుల రేసులో నిలిచారు. ఆ తరువాత ‘నిషాన్త్‌’ (1975) కర్కశ జమిందారీ వ్యవస్థను.. ‘మాన్తాన్‌’ (1976)తో గుజరాత్‌లో అభివృద్ధి చెందుతున్న పాడి పరిశ్రమ నేపథ్యాన్ని మనసులకు హత్తుకునేలా వెండితెరపై ఆవిష్కరించారు శ్యామ్‌ బెనగల్‌. ఈ రెండు చిత్రాలు ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీల్లో జాతీయ అవార్డులను అందుకోగా.. ‘మన్తాన్‌’ ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్‌ తరపున ఆస్కార్‌ రేసుకు పోటీపడింది. ఇక హన్సా వాడ్కర్‌ జీవితాధారంగా శ్యామ్‌ తెరకెక్కించిన ‘భూమిక’ భారతీయ చిత్రసీమలో బయోపిక్‌ ట్రెండ్‌కు గొప్ప ఊపునిచ్చిందనే చెప్పాలి. ఇందులో హన్సాగా స్మితా పాటిల్‌ కనబర్చిన నటన.. శ్యామ్‌ దర్శకత్వ ప్రతిభ బాక్సాఫీస్‌ వద్ద సినీ ప్రియుల్ని కట్టిపడేశాయి. ఫలితంగా మరోసారి జాతీయ స్థాయిలో శ్యామ్‌ బెనగల్‌ దర్శకత్వ ప్రతిభ వెలుగులు విరజిమ్మింది. శ్యామ్‌ తీసిన ‘జునూన్‌’, ‘అరోహన్‌’, ‘త్రికాల్‌’, ‘మమో’, ‘సమర్‌’, ‘మండీ’, ‘సర్దారీ బేగం’ ఇలా ప్రతిదీ దేనికదే ఓ ఆణిముత్యం అని చెప్పాలి. తన ప్రతి సినిమాతో ఓ గొప్ప సామాజిక సందేశాన్ని అందిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. వరుస జాతీయ అవార్డులు అందుకుంటూ భారతీయ చిత్రపరిశ్రమ కీర్తిని నలుదిశలకు విస్తరింపజేశారు. కేవలం సినిమాలే కాక ‘సత్యజిత్‌ రే: ఫిల్మ్‌ మేకర్‌’, ‘జవహర్‌లాల్‌ నెహ్రూ’, ‘నోట్స్‌ ఆన్‌ ద గ్రీన్‌ రెవెల్యూషన్‌’, ‘రాగ మెలోడి’, ‘తాళ అండ్‌ రిథమ్‌’ వంటి 50 వరకు మెచ్చుకోదగ్గ డాక్యుమెంటరీస్‌లను అరడజను వరకు లఘు చిత్రాలను తెరకెక్కించారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శ్యామ్‌ చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం నుంచి దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ (1976), పద్మ విభూషణ్‌ (1991) అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు దేశ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు (2005), ఏయన్నార్‌ జాతీయ అవార్డు (2013) శ్యామ్‌ బెనగల్‌ కీర్తి కిరీటంలో చేరాయి. వీటితో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గౌరవాలు శ్యామ్‌ను వరించాయి. కేంద్రప్రభుత్వం తరపున సెన్సార్‌బోర్డు పునర్‌వ్యవస్థీకరణ కమిటీకి అధ్యక్షుడిగా సేవలందించారు.

* రాజ్‌కపూర్‌ (జయంతి - 1924)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...) 

* ఎయిడ్స్‌ సినిమా... ఆస్కార్‌ విజేత!


యిడ్స్, స్వలింగ సంపర్కం అంశాలపై సినిమా తీయడమే విశేషమనుకుంటే, అది ఆస్కార్‌ అవార్డులు అందుకునేంత గొప్పగాఉండడం మరో విశేషం. ఆ సినిమానే ‘ఫిలడెల్ఫియా’ (1993). హాలీవుడ్‌ ప్రముఖులు టామ్‌హ్యాంక్స్, డెంజెల్‌ వాషింగ్టన్‌ నటించిన ఈ చిత్రానికి దర్శకుడు జోనాధన్‌ డెమ్మీ. టామ్‌హ్యాంక్స్‌కి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ లభించింది. ఇందులో పాటకి మరో ఆస్కార్‌ దక్కింది. ‘ఫిలడెల్ఫియా లా ఫర్మ్‌’ అనే పెద్ద సంస్థలో లాయర్‌గా పనిచేసే ఆండ్రూ బెకెట్‌ అనే వ్యక్తి స్వలింగ సంపర్కుడు. ఫలితంగా ఎయిడ్స్‌కి కూడా గురవుతాడు. ఆ సంగతి బయట పడకుండా జాగ్రత్త పడుతుంటాడు. అయితే ఎయిడ్స్‌ వల్ల వచ్చిన కురుపు కారణంగా విషయం పొక్కి అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అది అన్యాయమని కోర్టుకు ఎక్కుతాడు. అతడి తరఫున వాదించేందుకు ఎవరూ దొరకకపోయినా చివరకి జోమిల్లర్‌ అనే లాయర్‌ ముందుకు వస్తాడు. అప్పటి సామాజిక పరిస్థితులు, ఎయిడ్స్‌పై అప్పటి దృక్పథం, వ్యక్తిగత స్వేచ్ఛ, లైంగిక స్వాతంత్య్రం లాంటి విషయాలను స్పృశిస్తూ వాదప్రతివాదాలు సాగుతాయి. చివరకి ఏమైందనేదే సినిమా. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా 26 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి, 206 మిలయన్లకు పైగా ఆర్జించి వాణిజ్యపరంగా కూడా విజయవంతమైంది.
...............................................................................................................................................................

* ఆయన గీతాలు... అజరామరాలు!


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...) 
..............................................................................................................................................................

* నక్షత్ర పోరాటాలు! 


‘స్టార్‌వార్స్‌’ సినిమాలంటే ఇక చెప్పేదేముంది? అంతరిక్షంలో ప్రయాణాలు, వింతవింత గ్రహాలు, విచిత్ర ఆయుధాలు, గ్రహ రాజ్యాల మధ్య యుద్ధాలు... కాసుల గలగలలు! ‘స్టార్‌వార్స్‌’ పేరుతో వచ్చిన సీక్వెల్‌ సినిమాలో ఏడోదిగా వచ్చిన ‘ద ఫోర్స్‌ ఎవేకెన్స్‌’ సినిమా 2015లో విడుదలై కాసులు కురిపించి బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఆస్కార్‌ అందుకున్న ఈ సినిమాను 258 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.