డిసెంబర్‌ 3 (సినీ చరిత్రలో ఈరోజు)

* పూరిని పరిచయం చేసిన నిర్మాత..
 టి.త్రివిక్రమరావు  (వర్ధంతి)


‘జస్టిస్‌ చౌదరి’, ‘గూఢచారి నెం.1’, ‘దొంగ’, ‘కొండవీటి దొంగ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘బొబ్బిలి సింహం’, ‘సరదా బుల్లోడు’, ‘ఆహ్వానం’, ‘బద్రి’, ‘ప్రేమతో రా’... తదితర విజయవంతమైన చిత్రాల్ని రూపొందించిన అగ్ర నిర్మాత టి.త్రివిక్రమరావు. విజయలక్ష్మి ఆర్ట్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్‌కల్యాణ్‌ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు నిర్మించి విజయాల్ని అందుకొన్నారు. నేటి అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ని పరిచయం చేసిన నిర్మాత ఈయనే. ‘బద్రి’ చేస్తున్న సమయంలో సెట్‌లో పూరి పనిలో వేగాన్ని చూసి ‘నువ్వు అలవోకగా యాభై సినిమాలు చేస్తావు’ అని చెప్పారట. ఆ విషయాన్ని పూరి తరచూ చెబుతుంటారు. దర్శకుల పనితనాన్ని అంచనా వేయడంలో త్రివిక్రమరావు దిట్ట అనే విషయం స్పష్టమవుతోంది. శ్రీకాకుళం జిల్లా, పాలకొండలో జన్మించారు త్రివిక్రమరావు. అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు. తెలుగుతో పాటు, హిందీలోనూ కలిపి 20కిపైగా చిత్రాల్ని నిర్మించారు త్రివిక్రమరావు. ఆయనకి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డిసెంబరు 3, 2008లో గుండెపోటుతో మృతిచెందారు త్రివిక్రమరావు. ఈరోజు ఆయన వర్ధంతి.
................................................................................................................................................................

అందా‌నికి అందం ‌‘దేవా‌నంద’‌మ్‌ 
(వర్ధంతి - 2011)


 (ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...) 

* ఓ నటి జీవిత సినిమా! 


సినీ నటీనటులపై అభిమానం ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉండిపోతుంది. అందుకనే సావిత్రి జీవితంపై తీసిన ‘మహానటి’ సినిమా అంతలా ఆకట్టుకుంది. ఇలా ఓ హాలీవుడ్‌ నటి జీవితంపై వచ్చిన సినిమా ‘ఫ్రాన్సెస్‌’, 1982లో విడుదలై విమర్శకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనా, రెండు ఆస్కార్‌ నామినేషన్లు పొందడం విశేషం. ఫ్రాన్సెస్‌ ఫార్మర్‌ అనే హాలీవుడ్‌ నటి జీవిత కథ ఇది. 1930ల్లో ఓ డజన్‌ సినిమాలతో మంచి గుర్తింపు పొందినప్పటికీ, ఉన్నదున్నట్టు మాట్లాడడం, తాగుడు వ్యసనాల వల్ల మానసికంగా కుంగిపోయిన ఆమె జీవితంలో ఉత్థానపతనాలను విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించిందీ సినిమా. 8 మిలియన్‌ డాలర్లతో సినిమా తీస్తే కేవలం 5 మిలియన్‌ డాలర్లను మాత్రమే వసూలు చేసింది.

* జురాసిక్‌ పార్క్‌ నటి!


టీవీల్లో ప్రాచుర్యం పొందిన నటులకు వెండితెర ఎర్రతివాచీ పరవడం, సినిమాల్లో పేరు సంపాదించిన వారిని బుల్లితెర ఆహ్వానించడం అన్నిచోట్లా జరిగేదే. అలా టీవీల్లో ఆకట్టుకుని సినిమాల్లో మెరిసిన తార జులియానే మూర్‌. ‘ద లాస్ట్‌ వరల్డ్‌: జురాసిక్‌ పార్క్‌’ సినిమాలో కీలక పాత్రలో ఆకట్టుకున్న ఈమె 1960లో కాలిఫోర్నియాలో పుట్టి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్న స్థాయికి ఎదిగింది. ‘టేల్స్‌ ఫ్రమ్‌ ద డార్క్‌సైడ్‌: ద మూవీ’ (1990) సినిమాతో వెండితెర ప్రస్థానం మొదలుపెట్టి, ‘షార్ట్‌కట్స్‌’, ‘వన్య ఆన్‌ 42 స్ట్రీట్‌’, ‘నైన్‌ మంత్స్‌’, ‘బూగీ నైట్స్‌’, ‘ద ఎండ్‌ ఆఫ్‌ ద ఎఫైర్‌’, ‘క్రేజీ, స్టుపిడ్‌ లవ్‌’ ‘హంగర్‌ గేమ్స్‌’లాంటి సినిమాల ద్వారా గుర్తింపు సాధించింది. నటిగానే కాకుండా పిల్లల కోసం మంచి పుస్తకాలు రాసిన రచయితగా రాణించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.