* అమర గాయకుడు! ఘంటసాల (జయంతి)
 ‘‘గాన కళా సరస్వతికి మణిహారం ఘంటసాల...
తిరుగులేని అతడి గళం కురిపించెను నవరసాల...
అవనిని పులకింపజేయు ఆలాపన అతడి సొత్తు...
అతడి కీర్తి హిమగిరి శిఖరాగ్ర శృంగమంత ఎత్తు!’’
-అంటూ శ్లాఘించాడు ఘంటసాల అభిమాని అయిన ఓ మహాకవి!
ఆ మాటలు అక్షర సత్యాలని ఆయన పాటలు విని మైమరిచిపోయే అందరూ అంగీకరిస్తారు. నేపథ్యగాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన అందించిన సుమధు గీతాలు ఏనాటికీ తెలుగు నాట మార్మోగుతూనే ఉంటాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తులు, హిందీ భాషల్లో సినీ గీతాలతో పాటు భక్తిగీతాలు, ప్రైవేటు గీతాలు పాడిన ఘంటసాల ‘గాన గంధర్వుడు’గా పేరు పొందారు. ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించడంతో పాటు ఆయన గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును వెలువరించింది. ఆయన అమెరికా, ఇంగ్లండ్, జెర్మనీలలో కూడా సంగీత కార్యక్రమాలలో పాడి అక్కడి శ్రోతలను కూడా మురిపించారు. కృష్ణాజిల్లా చౌటపల్లిలో 1922 డిసెంబర్ 4న పుట్టిన ఘంటసాల దశాబ్దాల పాటు శ్రోతలను తన మధుర కంఠంతో మైమరపించి, అద్భుత గీతాలను అందించి తన 51 ఏళ్ల వయసులో 1974 ఫిబ్రవరి 11న మరణించారు.
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...)
|
* చరిత్రకు దర్పణం! బొబ్బిలి యుద్ధం
 పరాయి దేశీయులు ఆక్రమణకు సిద్ధపడినప్పుడు ఎదురొడ్డి నిలిచిన వీరగాథలే కాదు, సలాములు కొట్టి పంచన చేరిన నయవంచనలకూ చరిత్ర ఆలవాలమవుతుంది. అలా ఫ్రెంచీ దేశీయులు మన దేశంలోకి చొచ్చుకు వచ్చి ఇక్కడి రాజ్యాల మధ్య చిచ్చుపెట్టిన నేపథ్యంలో జరిగిన ‘బొబ్బిలి యుద్ధం’ ఓ చారిత్రక విషాదం. ఈ సంఘటనను తీసుకుని అప్పటి విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం పూర్వాపరాలను అద్భుతంగా కళ్ల ముందుంచిన చిత్రం ‘బొబ్బిలి యుద్ధం’. ఎన్టీరామారావు బొబ్బిలి రాజు రంగరాయుడుగా, రాజనాల విజయనగరం రాజు విజయరామరాజుగా, ఎస్వీ రంగారావు ఫ్రెంచి సైనికులను గడగడలాడించిన తాండ్ర పాపారాయుడుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1964లో విడుదలై ఆకట్టుకుంది.
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...)
|
* మోడలై మెరిసి... నటిగా మురిపించి!
 ప్రపంచ ప్రఖ్యాత మోడల్... బుల్లితెర ప్రముఖురాలు... నిర్మాత... వ్యాపారవేత్త... సినీనటి... రచయిత...గాయని! ఇవన్నీ టైరా బ్యాంక్స్ గుర్తింపులు! ‘టైమ్’ పత్రిక ఏటా ప్రకటించే ‘ప్రపంచంలోని ప్రభావశీలుర జాబితా’లో పలుమార్లు స్థానం సంపాదించిన ఈమె కాలిఫోర్నియాలో 1973లో పుట్టి పదిహేనేళ్లకే మోడలింగ్ రంగంలో రాణించింది. ఇరవై ఏళ్లకే టీవీ రంగంలో ప్రవేశించింది. ‘హయ్యర్ లెర్నింగ్’ (1995) ద్వారా వెండితెరపై కనిపించి ‘లైఫ్ సైజ్’, ‘కొయోట్ అగ్లీ’, ‘లవ్ అండ్ బాస్కెట్‌బాల్’, ‘హలోవీన్: రిసరెక్షన్’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్‌పై ఆమె నిర్మించిన టీవీ రియాలిటీ షో ఎంతో హిట్టయింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ హోస్ట్‌గా వ్యవహరించింది. మోడలింగ్‌పై ఆమె రాసిన ‘మోడల్లల్యాండ్ నవల అత్యధిక కాపీలు అమ్ముడైంది.
|
* అమ్మానాన్నల బాటలో...
 నాన్న నటుడు... అమ్మ నటి, కవయిత్రి. వారి ముగ్గురి పిల్లల్లో ఇద్దరు నటులయ్యారు. వారిలో ఒకడే జెఫ్ బ్రిడ్జెస్. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా హాలీవుడ్లో ‘ఓహో’ అనిపించుకున్నాడు. నాటకాలు, టీవీలు, సినిమాల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్నాడు. ప్రపంచ సినీ అభిమానులను ఆకట్టుకున్న ‘క్రేజీ హార్ట్’ సినిమాతో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. ఇంకా అనేక పురస్కారాలు పొందాడు. ‘ద లాస్ట్ పిక్చర్ షో’, ‘థండర్‌బోల్ట్ అండ్ లైట్ఫుట్’, ‘స్టార్‌మ్యాన్’, ‘ద కాంటెండర్’, ‘ట్రూ గిఫ్ట్’, ‘హెల్ ఆర్ హైవాటర్’, ‘ట్రోన్’, ‘జాగ్గ్డ్ ఎడ్జ్’, ‘ద ఫ్యాబ్యులస్ బేకర్ బాయ్స్’, ‘ద ఫిషర్కింగ్’, ‘ఫియర్లెస్’, ‘ద బిగ్ లెబ్యూస్కి’, ‘సీ బిస్కట్’, ‘ఐరన్‌మ్యాన్’, ‘ట్రోన్: లెగసీ’, ‘ద గివర్’లాంటి సినిమాలతో మంచి నటుడనిపించుకున్నాడు. కాలిఫోర్నియాలో 1949 డిసెంబర్ 4న పుట్టిన ఇతడి తండ్రి లాయిడ్ బ్రిడ్జెస్ 150 సినిమాల్లో నటించి మెప్పించినవాడు. తల్లి డొరోతీ బ్రిడ్జెస్ నటిగానే కాకుండా కవయిత్రిగా కూడా ప్రాచుర్యం పొందింది. ఇతడి సోదరుడు బ్యూ బ్రిడ్జెస్ కూడా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
|