* వినోద రంగంలో రారాజు!
 చిన్నప్పటి నుంచీ బొమ్మలు వేసే ఆసక్తి అతడిలోని సృజనాత్మకతను తీర్చిదిద్దింది... ఇంటింటికీ పేపర్లు పంచుతూ చదువుకున్న అతడి నేపథ్యం, అతడిలోని సృజనాత్మకతకు కృషిని జత చేసింది... నిరంతరం నేర్చుకునే తత్వం అతడి జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్త దారులు తొక్కించింది... ఫలితంగా ఆ కుర్రాడు...
- ప్రపంచ వినోద రంగంలో రారాజుగా మారాడు! - యానిమేషన్ రంగానికి ఆద్యుడుగా ఎదిగాడు! - 22 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు! -గోల్డెన్‌గ్లోబ్, ఏమ్మీ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల గ్రహీతగా అరుదైన గౌరవం పొందాడు! -అన్నింటినీ మించి, ప్రపంచ వ్యాప్తంగా తరతరాలుగా పిల్లల్ని, పెద్దల్ని అలరించిన విశిష్టవ్యక్తిగా ఎనలేని కీర్తి సాధించాడు! అతడే వాల్ట్ డిస్నీ! ఆకట్టుకునే కార్టూన్ పాత్రలతో, అద్భుతమైన యానిమేషన్ సినిమాలతో, దేశదేశాల్లో స్థాపించిన విహార స్థలాలైన డిస్నీల్యాండ్లతో వినోద రంగంలో ఏనాటికీ మర్చిపోలేని ముద్ర. సినీ రారాజు అతడు!
షికాగోలో 1901 డిసెంబర్ 5న పుట్టిన వాల్టర్ ఎలియాస్ డిస్నీకి ఊహ తెలిసినప్పటి నుంచీ బొమ్మలంటే ఎంతో ఇష్టం. వీలున్నప్పుడల్లా బొమ్మలు వేసేవాడు. ఓసారి పక్కింటాయన పెరట్లో గుర్రాన్ని చూసి బొమ్మ వేస్తే ఆయన మెచ్చుకుని డబ్బులిచ్చాడు. ఆ తొలి బహుమతి అతడిలోని సృజనాత్మకతకు ఊపిరిలూది, భవిష్యత్తులో అతడు కోటానుకోట్ల డాలర్లను ఆర్జించడానికి బాటలు వేసింది. తల్లిదండ్రులైన ఎలియాస్ డిస్నీ, ఫ్లోరా దంపతుల అయిదుగురి సంతానంలో నాలుగోవాడైన వాల్ట్‌డిస్నీ, ఉదయం నాలుగున్నరకే లేచి తండ్రి ఏజెన్సీ తీసుకున్న దినపత్రికలను ఉదయం, సాయంత్రం ఇంటింటికీ పంచి మధ్యాహ్నం వేళల్లో స్కూలుకి వెళ్లేవాడు. తీరిక లేని శ్రమ వల్ల స్కూల్లో కునికిపాట్లు పడుతూనే కష్టపడి చదువుకునేవాడు. స్కూలు న్యూస్పేపర్లో కార్టూన్లు, బొమ్మలు వేస్తూ ఆకట్టుకునేవాడు. ఇంత తీరిక లేకున్నా ఆసక్తి కొద్దీ రాత్రి వేళల్లో షికాగో ఎకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్స్ట్‌లో చేరి చిత్రకళకు మెరుగులు దిద్దుకునేవాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశం తరఫున రెడ్‌క్రాస్‌లో చేరి అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలందించాడు. ఆ అంబులెన్స్పైన, ఆర్మీ న్యూస్పేపర్లోను కార్టూన్లు, బొమ్మలు వేసి ఆకట్టుకున్నాడు. యుద్ధం తర్వాత సోదరుడు రాయ్‌తో కలిసి డిస్నీ బ్రదర్స్ స్టూడియో నెలకొల్పి కొందరు యానిమేటర్లతో కలిసి కార్టూన్ సిరీస్ రూపొందించడం మొదలు పెట్టాడు. ఎలైస్, ఓస్వాల్డ్, లక్కీ రాబిట్ లాంటి కార్టూన్ పాత్రలతో వినోదం పంచాడు. అయితే వ్యాపార భాగస్వాములు కొన్ని కార్టూన్ పాత్రల హక్కులతో పాటు యానిమేటర్లను కూడా అక్రమంగా సొంతం చేసుకోవడంతో డిస్నీ మోసపోయాడు. ఆ నిరాశలో ఇంటికి వస్తూ రైల్లో తిరుగుతున్న ఎలుకను చూసి తోచక బొమ్మ వేస్తే అది బాగా కుదిరింది. అదే ‘మిక్కీమౌస్’గా మారి డిస్నీకి కొత్త ప్రాచుర్యాన్ని తీసుకువచ్చి సృజనశీలురకు ఓటమి ఉండదని చాటి చెప్పింది. మిక్కీమౌస్తో 1928లో రూపొందించిన ‘స్టీమ్‌బోట్ విల్లే’ తొలి కార్టూన్ శబ్ద చిత్రంగా ఆకట్టుకుంది. ఇక ఆపై డిస్నీ వెనుదిరిగి చూడలేదు. యానిమేషన్ చిత్రాలకు శబ్దాన్ని, రంగులతో పాటు ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు జత చేస్తూ అతడు రూపొందించిన ‘స్నో వైట్ అండ్ సెన్ డార్ఫ్స్’, ‘పినోచియో’, ‘ఫాంటాసియా’, ‘బాంబీ’, ‘డుంబో’, ‘సిండ్రెల్లా’, ‘మేరీ పాపిన్స్’, ‘ఎలైస్ ఇన్ వండర్ల్యాండ్’, ‘పీటర్ప్యాన్’, ‘ట్రెజర్ ఐల్యాండ్’, ‘101 డాల్మేషియన్స్’, ‘స్లీపింగ్ బ్యూటీ’... ఇలా ఒకటా రెండా, వేలాది సినిమాలు పిల్లల మనసుల్ని, పెద్దల ప్రశంసల్ని దోచుకున్నాయి. ఇప్పటికీ దోచుకుంటూనే ఉన్నాయి. అలా ఆసక్తి, శ్రమ, పట్టుదల, నేర్చుకునే తత్వం, సృజనాత్మక ఆలోచనలతో ఒక వ్యక్తి స్థాయి నుంచి సంస్థగా, వ్యవస్థగా ఎదిగాడు వాల్ట్‌డిస్నీ. కోట్ల డాలర్ల విలువైన వినోద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన డిసీన తన 65వ ఏట 1966 డిసెంబర్ 15న మరణించాడు. ..............................................................................................................................................................
* సాహస నాయకి.. జయలలిత (వర్ధంతి - 2016)
 (ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...)
|
* అభిరుచిగల నిర్మాత

తెలుగు చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగిన నిర్మాత... బెల్లంకొండ సురేష్. అగ్ర కథానాయకులతో పాటు... కథాబలమున్న చిన్న చిత్రాల్నీ నిర్మించి తన అభిరుచిని చాటుకొన్నారు. ‘ఆది’తో ఆయన ప్రయాణం మొదలైంది. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకొన్న ఆయన ఆ తర్వాత ‘చెన్న కేశవరెడ్డి’, ‘లక్ష్మీనరసింహ’ తదితర భారీ చిత్రాల్ని నిర్మించి విజయాల్ని అందుకొన్నారు. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’, ‘భలేదొంగలు’, ‘శంభో శివ శంభో’ వంటి కథాబలమున్న చిత్రాల్నీ నిర్మించి తన అభిరుచిని ప్రదర్శించారు. ‘గోలీమార్’, ‘నాగవల్లి’, ‘కందిరీగ’, ‘బాడీగార్డ్’, ‘తడాఖా’, ‘జబర్దస్త్’, ‘రభస’ తదితర చిత్రాలు ఆయన్నుంచి వచ్చాయి. మధ్యలో మారుతి దర్శకత్వంలో ‘బస్‌స్టాప్’ అనే చిన్న చిత్రాన్నీ నిర్మించి విజయాన్ని అందుకొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రాల్లో చాలా వరకు మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకొన్నాయి. 2014లో తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘అల్లుడుశీను’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తనయుడి కెరీర్‌పైనే దృష్టిపెడుతూ ఆయన చిత్రాల వెనుక ఉంటూ నడిపిస్తున్నారు. 1967 డిసెంబరు 5న జన్మించిన బెల్లంకొండ సురేష్‌కి భార్య బెల్లంకొండ పద్మావతితో పాటు, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, గణేష్‌బాబు తనయులు. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతగా రాణిస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ సురేష్ పుట్టినరోజు. ................................................................................................................................................................
* సుకుమార నయనతార... నాదిరా (జయంతి - 1932)
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...)
|
* దోపిడీ దొంగల హంగామా!

దోపిడీల కథలు వెండితెరకు పసందైన సరుకే. వీటి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి. బాలీవుడ్లో ‘థూమ్’ సీక్వెల్ సినిమాలు సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇలాంటి సినిమాలకు హాలీవుడ్ ఎప్పుడో తెర తీసింది. అలా వచ్చిన వాటిలో ఒకటి ‘ఓషన్స్ ఎలెవన్’ (2001). ఇందులో ప్రముఖ నటులు బ్రాడ్‌పిట్, జార్జి క్లూనీ, మట్ డామన్, జులియా రాబర్ట్స్లాంటి మహామహులు నటించారు. ఈ సినిమా 85 మిలియన్ డాలర్ల పెట్టుబడికి 450 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా విజయంతో దీనికి కొనసాగింపుగా ‘ఓషన్స్ ట్వెల్వ్’ (2004), ‘ఓషన్స్ థర్టీన్’ (2007) సినిమాలు కూడా వచ్చాయి. అంతేకాదు, మహిళలే దోపిడీలు చేసే కథాంశంతో 2018లో ‘ఓషన్స్ 8’ సినిమా కూడా రావడం విశేషం. ఇంతకీ ‘ఓషన్స్ ఎలెన్’ కథేంటి? నిజానికి ఇది 1960లో ఇదే పేరుతో వచ్చిన సినిమాకు రీమేక్. డేనీ ఓషన్ అనే ఓ నేరస్థుడు పేరోల్ మీద బయటకి వచ్చి పోలీసుల కళ్లుగప్పి పారిపోయి తన స్నేహితులైన పాత నేరస్థులను కలుపుకుని 11 మంది బృందంగా ఏర్పడి లాస్ గాస్లో ఉండే అత్యంత విలాసవంతమైన మూడు జూదగృహాలను ఒకేసారి దోచుకోవడం కథాంశం. ఇలా దోచుకోడానికి వాళ్లు వ్యూహాలు, ఆటంకాలను ఎదర్కొనే పథకాలతో ఈ సినిమాల సీక్వెల్స్ అన్నీ కలిపి 350 మిలియన్ డాలర్ల పెట్టుబడికి 1.4 బిలియన్ డాలర్లకు పైగా కాసులు కురిపించి సంచలనం సృష్టించాయి.
|