డిసెంబర్‌ 6 (సినీ చరిత్రలో ఈరోజు)...

అలనాటి అపరూపనటి.. సావిత్రి (జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తమ్ముడికి విజయాన్నిచ్చి...


నందమూరి కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినవాళ్లలో చాలావరకు కథానాయకులుగా తెరపై వెలిగినవాళ్లే. నందమూరి జానకిరామ్‌ మాత్రం నిర్మాణ రంగంలో రాణించే ప్రయత్నం చేశారు. తన తమ్ముడు కల్యాణ్‌రామ్‌ స్థాపించిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆయన్నే కథానాయకుడిగా ఎంచుకొని సినిమాలు నిర్మించారు జానకిరామ్‌. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే గుర్తుండిపోయేలా ‘అతనొక్కడే’ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందించారు. కల్యాణ్‌రామ్‌ నటిస్తూ, నిర్మించే ప్రతి చిత్రం వెనుక ఉంటూ అన్నీ తానై నడి పించేవారు జానకిరామ్‌. నందమూరి హరికృష్ణ, లక్ష్మి దంపతులకి 1981, జూన్‌ 4న జన్మించిన జానకిరామ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అందుకొన్నారు. కల్యాణ్‌రామ్‌తోపాటు మరో తమ్ముడు ఎన్టీఆర్‌నీ కలిపి సినిమాలు నిర్మించాలనేది ఆయన కల. కానీ 2014లో విజయవాడ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో జానకిరామ్‌ ప్రాణాలు కోల్పోయారు. దాంతో నందమూరి కుటుంబంతో పాటు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. జానకిరామ్‌కి భార్య, ఇద్దరు కుమారులు. ఈ రోజు జానకిరామ్‌ వర్ధంతి.

* పూల దొంగ కథ 

వరైనా వజ్రాలో, బంగారమో, డబ్బో దొంగతనం చేస్తారు. కానీ పూలను ఎవరైనా దొంగిలిస్తారా? అలాంటి ఓ పూల దొంగపై ఓ పుస్తకం రావడం వింత అయితే, ఆ పుస్తకం ఆధారంగా సినిమా తీయడం ఓ విచిత్రం. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, బ్రిటిష్‌ అకాడమీ, బాఫ్తాలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించింది. పైగా హాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు నికొలాస్‌ కేజ్, మెరిల్‌ స్ట్రీప్, క్రిస్‌ కూపర్‌లాంటి వాళ్లు నటించిన ఈ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతమైంది కూడా. ఆ సినిమా ‘ఎడాప్టేషన్‌’ (2002). నిజానికి ఇది ఓ వాస్తవిక సంఘటన ఆధారంగా జరిగిన కథే. సుసాన్‌ ఓర్లియన్‌ అనే ఓ జర్నలిస్ట్‌ రాసిన ‘ద ఆర్కిడ్‌ థీఫ్‌’ రాసిన పుస్తకం దీనికి ఆధారం. అరుదైన ఆర్కిడ్‌ జాతి పుష్పాలను అక్రమంగా వేరే దేశాలకు రవాణా చేస్తున్నారనే ఆరోపణపై ఫ్లోరిడాలో 1994లో కొందర్ని అరెస్ట్‌ చేశారు. ‘ఘోస్ట్‌ ఆర్కిడ్స్‌’ అనే విలువైన పుష్పజాతి మొక్కలకు నకిలీలను సృష్టిస్తున్నారనే ఈ సంఘటనపై ఆ జర్నలిస్ట్‌ పరిశోధన చేసి వార్తా కథనాలతో పాటు పుస్తకాన్ని వెలువరించింది. పుస్తకంలోని విషయాల ఆధారం చేసుకునియ కల్పిత కథనాన్ని అల్లుకుని ఓ థ్రిల్లర్‌ సినిమాగా దీన్ని తీశారు. ఇందులో నికొలాస్‌ కేజ్‌ కవల సోదరుల పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ పుస్తకం ఆధారంగా ఓ సినీ స్కీన్ర్‌ప్లే రచయితను స్క్రిప్ట్‌ రాయమనడం, సరైన వివరాలు లేక అతడు రాయలేకపోతున్న తరుణంలో అతడి కవల సోదరుడు అతడి స్థానంలో రచయితగా రంగప్రవేశం చేసి సినిమా కథ అల్లేయడం లాంటి సంఘటనలతో ఇది ఓ వ్యంగ్మాత్మక, ఉత్కంఠభరిత చిత్రంగా రూపొందింది.
...............................................................................................................................................................

* నాలుగు రంగాలు... నలభై ఏళ్లు! 


రేడియో, నాటకం, టీవీ, సినిమా... ఇవి నాలుగూ వినోద రంగానికి నాలుగు స్తంభాలు. ఈ నాలుగు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసి నాలుగు దశాబ్దాల పాటు అలరించిన నటి ఆగ్నెస్‌ మూర్‌హెడ్‌. ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, ఆస్కార్‌ పురస్కారాలు అందుకుంది. ఆస్కార్‌ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా గౌరవాన్ని పొందింది. ఆమె నటించిన ‘సిటిజన్‌ కానే’, ‘ద మ్యాగ్నిఫిషెంట్‌ ఆంబర్‌సన్స్‌’, ‘డార్క్‌ పాసేజ్‌’, ‘ఆల్‌ దట్‌ హెవెన్‌ ఎలౌవ్స్‌’, ‘షో బోట్‌’, ‘హష్‌.. హష్‌’, ‘స్వీట్‌ చారియట్‌’లాంటి సినిమాలో ఆమె అభినయాన్ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అమెరికాలో 1900 డిసెంబర్‌ 6న పుట్టిన మూర్‌హెడ్, మూడేళ్ల వయసులోనే వేదికపై ప్రదర్శన ఇచ్చింది. వయసుతో పాటు నటి కావాలనే ఆమె కాంక్ష కూడా ఎదిగింది. మిమిక్రీ, గానం, నాట్యాలతో అందరినీ అలరించేది. నాటకాలు, రేడియో, టీవీల అవకాశాలతో అంచెలంచెలుగా ఎదిగింది. వెండితెరపై తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్వలింగ సంపర్కిగా తరచు వార్తల్లో నానుతూ ఉండేది. రాజకీయాల్లో కూడా వక్తగా రాణించింది. నలభై ఏళ్ల పాటు వినోద రంగంలో వెలిగిన మూర్‌హెడ్, 1974 ఏప్రిల్‌ 30న తన 73వ ఏట క్యాన్సర్‌తో మరణించింది.
..................................................................................................................................................................

* నగరంలో కొత్త పాప


టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటే అవార్డు వచ్చింది. వెండితెరపై నటిస్తే పురస్కారం లభించింది. యానిమేషన్‌ చిత్రానికి గళం అందిస్తే అవార్డు పొందింది. అడుగుపెట్టిన రంగాల్లో ‘ఉత్తమ’ గుర్తింపు సాధించిన ఆ యువ తరంగమే స్టెఫానీ స్కాట్‌. ‘యంగ్‌ ఆర్టిస్ట్‌ అవార్డు’ అందుకున్న ఆమె నటిగానే కాదు, గాయనిగా కూడా మెప్పించింది. ‘న్యూ గర్ల్‌ ఇన్‌ టౌన్‌’ పేరుతో ఆమె విడుదల చేసి సింగిల్స్‌ యువతకు ఉర్రూతలూగించాయి. ‘ఇన్సిడ్యుయస్‌: చాప్టర్‌3’, ‘ఫ్లిప్డ్‌’, ‘నో స్ట్రింగ్స్‌ ఎటాచ్డ్‌’, ‘రెడ్‌జోన్‌’, ‘కాట్‌’, ‘ఐటి’, ‘వన్‌ మైల్‌ టు యు’, ‘బ్యూటిఫుల్‌ బాయ్‌’, ‘గుడ్‌ గర్ల్స్‌ గెట్‌ హై’ లాంటి సినిమాల ద్వారా అందాల యువ నటిగా ఆకట్టుకుంది. అమెరికాలో 1996 డిసెంబర్‌ 6న పుట్టిన ఈమె యుక్త వయసులోనే తన చలాకీ తనంతో సెలబ్రిటీగా మారిపోయింది.

 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.