డిసెంబర్‌ 7.. (సినీ చరిత్రలో ఈరోజు)...

*నవ్వుల వరం.. ధర్మవరపు
(సుబ్రహ్మణ్యం వర్థంతి-2013)


యన తెరపై కనిపించగానే నవ్వొస్తుంది...ఆయన ఇక డైలాగ్‌ చెప్పాడా, పగలబడి నవ్వాల్సిందే. చక్కని టైమింగ్‌తో, శరీరభాషతో హాస్యానికి వన్నె తెచ్చిన హాస్యనటుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. నటుడిగా, దర్శకుడిగా కూడా రాణించిన ఈయన నటించిన 870 చిత్రాల్లో దేన్ని చూసినా ఆయన పాత్రపోషణలో రవ్వంత లోపం కనిపించదు. ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెంలో 1960 సెప్టెంబర్‌ 20న పుట్టిన ధర్మవరపు, ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూనే నాటకాల ద్వారా పేరు తెచ్చుకున్నారు. దూరదర్శన్‌లో వచ్చిన ‘ఆనందోబ్రహ్మ’ హాస్యకదంబం ద్వారా ఆయన పేరు ఇంటింటా మార్మోగింది. తొలిసారిగా జంధ్యాల దర్శకత్వంలో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (1989)లో కనిపించిన ఆయన అటుపై వెండితెరపై నవ్వుల వెన్నెలలు వెదజల్లారు. విలక్షణ హాస్యనటుడిగా పేరొందిన ధర్మవరపు 2013 డిసెంబర్‌ 7న 53 ఏళ్ల చిన్న వయసులోనే కనుమరుగై హాస్యప్రియుల గుండెలు కలుక్కుమనిపించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* వెండితెరకెక్కిన బుల్లితెర సీరియల్‌! 


టీవీ సీరియల్స్‌ తీరు వేరు...సినిమాల దారి వేరు... కానీ ఓ టీవీ సీరియల్‌ కథ, అందులో నటించిన వారితోనే వరస సినిమాలుగా వచ్చిన సంగతి విన్నారా? అవే ‘స్టార్‌ట్రెక్‌’ సినిమాలు. ఇదే పేరుతో అమెరికా టెలివిజన్లలో 1966 నుంచి 1969 వరకు ఓ సీరియల్‌ వచ్చింది. మొదట్లో మంచి రేటింగ్స్‌తో ఆకట్టుకున్నా, ఆ తర్వాత ప్రేక్షకుల ఆసక్తి తగ్గడంతో దీన్ని నిలిపివేశారు. ఆ సీరియల్స్‌ నిర్మాత హాలీవుడ్‌ చిత్రనిర్మాణ సంస్థ ప్యారమౌంట్‌ పిక్చర్స్‌ వారితో సంప్రదించడంతో ఇద్దరి భాగస్వామ్యంతో సినిమాల సందడి మొదలైంది. ఆ టీవీ సీరియల్‌ నటులే వెండితెర నటులుగా మారిపోయారు. అలా 1979లో వచ్చిన మొదటి సినిమానే ‘స్టార్‌ట్రెక్‌: ద మోషన్‌ పిక్చర్‌’. భూమ్మీదకు దూసుకు వస్తున్న ఓ అత్యాధునిక గ్రహాంతర వాసుల అంతరిక్షనౌకను ఎదుర్కోడానికి మన వాళ్లు ఎలాంటి వ్యూహాలతో సిద్ధమయ్యారనేది కథాంశం. కథంతా స్పేస్‌షిప్‌లు, వ్యోమగాములు, వారి ఆయుధాలు, ఉత్పాతాల మధ్య ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇది విజయవంతమవడంతో దీని పేరుతో ఏకంగా 11 సినిమాలు వచ్చాయి. ఇవన్నీ మొత్తం 720 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కు 2.3 బిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టాయి.

* ఎగ్జార్సిస్ట్‌ నటి! 


ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన సినిమాగా పేరు పొందిన ‘ఎగ్జార్సిస్ట్‌’ సినిమా గుర్తుందా? అందులో నటించి ఆస్కార్‌ అవార్డు సాధించిన నటి ఎల్లెన్‌ బర్‌స్టిన్‌. మిచిగాన్‌లో 1932లో పుట్టిన ఈమె రెండు దశాబ్దాల పాటు జనాదరణ పొందిన సినిమాలు, నాటకాలు, టీవీ పాత్రల్లో మెప్పించి రెండు ఆస్కార్‌ అవార్డులతో పాటు టోనీ, ఏడు గోల్డెన్‌గ్లోబ్, రెండు ఎమ్మీలాంటి పురస్కారాలు అందుకుంది. ‘ద లాస్ట్‌ పిక్చర్‌ షో’, ‘ఎలైస్‌ డజన్ట్‌ లివ్‌ హియర్‌ ఎనీమోర్‌’, ‘సేమ్‌ టైమ్‌ నెక్స్ట ఇయర్‌’, ‘రిసరెక్షన్‌’, ‘రెక్వియమ్‌ ఫర్‌ ఎ డ్రీమ్‌’ లాంటి సినిమాల్లో మెప్పించింది.
................................................................................................................................................................

 * అరవై ఏళ్ల సినీ ప్రయాణం


నటుడిగా, దర్శకుడిగా ఆరు దశాబ్దాల పాటు అలరించిన హ్యారీ మోర్గాన్ పాతతరం హాలీవుడ్‌ సినిమాల అభిమానులకు చిరపరిచితుడే. అటు టీవీల్లో, ఇటు సినిమాల్లో అనేక పాత్రలతో ఆకట్టుకున్నాడు. దాదాపు 100 హాలీవుడ్‌ సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను మెప్పించాడు. అమెరికాలో 1915 ఏప్రిల్‌ 10న పుట్టిన హ్యారీ, ఇరవై ఏళ్లకే నాటకాల్లో పాత్రలు ధరించడం మొదలుపెట్టాడు. ఆపై అతడి ప్రస్థానం టీవీ రంగానికి ఎదిగింది. ‘టు ద షోర్స్‌ ఆఫ్‌ ట్రిపోలి’ చిత్రంతో సినీ ప్రయాణం మొదటు పెట్టి, ‘ఆర్కెస్ట్రా వైవ్స్‌’, ‘ద గ్లెన్‌ మిల్లర్‌ స్టోరీ’, ‘వింగ్‌ అండ్‌ ఎ ప్రేయర్‌’, ‘ఎ బెల్‌ఫర్‌అడానో’, ‘డ్రాగన్‌విక్‌’, ‘ద గ్యాంగ్‌స్టర్‌’, ‘హైనూన్‌’, ‘బెండ్‌ ఆఫ్‌ ద రివర్‌’, ‘హౌ ద వెస్ట్‌ వాజ్‌ వన్‌’, ‘మూన్‌రైజ్‌’లాంటి ఎన్నో సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో మెరిశాడు. వినోద రంగంలో అరవై ఏళ్ల పాటు అలరించిన హ్యారీ, 2011 డిసెంబర్‌ 7న తన 96వ ఏట మరణించాడు. ఈరోజు అతడి వర్థంతి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.