మార్చి 8 (సినీ చరిత్రలో ఈరోజు)...

* భార్యను కిడ్నాప్‌ చేసిన ఓ భర్త కథ


నగనగా ఓ అల్లుడు. తన మామగారి కార్ల కంపెనీలోనే సేల్స్‌మేన్‌గా పనిచేస్తుంటాడు. అతడికి అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు కావలసి వచ్చింది. దాంతో కిరాయి నేరస్థులతో తన భార్యనే కిడ్నాప్‌ చేయించే పథకం వేశాడు. కానీ ఆ వ్యవహారం సాఫీగా సాగలేదు. కిడ్నాపర్లు ఎదురుతిరగడంతో కథ అడ్డం తిరిగింది. ఓ పక్క పోలీసులు, మరో పక్క నేరస్థులు, ఛేజింగ్‌లు, రక్తపాతాలు, ఇంకో వైపు కుటుంబ బంధాలు... వీటన్నింటితో ఉత్కంఠ, హాస్య భరితంగా తెరకెక్కించిన ఓ సినిమా, ఆస్కార్‌ లాంటి అవార్డులు అందుకోవడంతో పాటు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అరుదైన పురస్కారాలు అందుకుంది. ఆ సినిమానే ‘ఫార్గో’ (1996). సినీ చరిత్రలో 100 మేటి చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఏడు మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 60.6 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.

* 70 ఏళ్ల సినీ ప్రస్థానం


సినీ రంగంలో ఏడు దశాబ్దాల పాటు కొనసాగే నటీమణులు అరుదుగానే ఉంటారు. అదీ హాలీవుడ్‌లో అయితే మరింత ఆసక్తికరం. అలాంటి అరుదైన నటే క్లెయిర్‌ ట్రెవర్‌. ఆస్కార్‌ లాంటి అవార్డులు అందుకున్న ఆమె అందాల నటిగా నాటక రంగం, టీవీ, సినీ రంగాల్లో పేరుతెచ్చుకుంది. న్యూయార్క్‌లో 1910 మార్చి 8న పుట్టిన ఈమె, ‘కీ లార్గో’, ‘ద హై అండ్‌ ద మైటీ’, ‘డెడ్‌ ఎండ్‌’, ‘స్టేజ్‌కోచ్‌’, ‘బోర్న్‌ టు కిల్‌’, ‘ప్రొడ్యూసర్స్‌ షోకేస్‌’, ‘కిస్‌మీ గుడ్‌బై’ లాంటి చిత్రాలతో మెప్పించింది. ఈమె గౌరవార్థం ఇర్విన్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగానికి ఈమె పేరునే పెట్టారు. ఈమె కాలిఫోర్నియాలో 2000 ఏప్రిల్‌ 8న తన 90వ ఏట మరణించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.