ఫిబ్రవరి 25.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కెమేరాతో మాయాజాలం!
విన్సెంట్‌ 
(వర్థంతి-2015)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* డ్యాన్సర్‌గా వచ్చి.. స్టార్‌ హీరోగా ఎదిగి...
 షాహిద్‌ కపూర్‌ (పుట్టినరోజు-1981)


ఓవైపు తల్లిదండ్రుల నుంచి వచ్చిన నట వారసత్వం.. మరోవైపు డ్యాన్స్‌పై ఉన్న మక్కువ.. వీటికి తోడు కథానాయకుడన్న పదానికి నిర్వచనంలా కనిపించే రూపం.. ఇవే షాహిద్‌ కపూర్‌ను బాలీవుడ్‌ తెరపై హీరోగా నిలబెట్టాయి. హుషారైన స్టెప్పులతో కిరాకు పుట్టిస్తూ.. కుర్రకారుకు ష్యాషన్‌ ఐకాన్‌లా.. రొమాంటిక్‌ చిత్రాలతో అమ్మాయిల మదిలో కలల రాకుమారుడిగా సినీప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేశాడు షాహిద్‌.

1981 ఫిబ్రవరి 25న బాలీవుడ్‌ నటులు పంకజ్‌ కపూర్, నీలిమా అజీం దంపతులకు జన్మించిన షాహిద్‌.. తల్లి నాట్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని డ్యాన్సర్‌గా మారాడు. చిన్నతనంలో షైమక్‌ డవర్‌ డ్యాన్స్‌ అకాడమీలో డ్యాన్సర్‌గా ఓనమాలు దిద్దుకున్న తరువాత 1990ల్లో పలు బాలీవుడ్‌ చిత్రాలకు నేపథ్య డ్యాన్సర్‌గా పనిచేయడంతో పాటు కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్, టీవీ ప్రకటనల్లో నటించాడు. ఈ క్రమంలోనే ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘తాళ్‌’ చిత్రాలతో డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు షాహిద్‌ కపూర్‌. డ్యాన్సర్‌గా చిత్రసీమలోకి వచ్చిన దాదాపు పదేళ్లకు నటుడిగా తెరపైకి మెరిశాడు. 2003లో కెన్‌ ఘోష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్‌ విష్క్‌’తో తొలిసారిగా కథానాయకుడిగా మారాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ నటుడిగా షాహిద్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా (డెబ్యూ) తొలి ఫిలింఫేర్‌నూ అందుకున్నాడు. దీని తరువాత ‘ఫిదా’, ‘దిల్‌ మాంగే మోర్‌’, ‘షికార్‌’, ‘36 చెన్నై టౌన్‌’వంటి చిత్రాలు చేసినా అవి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. మధ్య మధ్యలో ‘జబ్‌ వియ్‌ మెట్‌’, ‘కమీనే’ వంటి చిత్రాలతో నటుడిగా అందరినీ మెప్పించాడు. ఈ క్రమంలోనే షాహిద్‌కు తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడానికి 2013 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆ మధ్య షాహిద్‌ చేసిన ‘ఆర్‌.. రాజ్‌కుమార్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కమర్షియల్‌గానూ విజయం సాధించింది. ఆ వెంటనే ‘హైదర్‌’ చిత్రంలో తనదైన నటనతో విమర్శకులను మెప్పించి ఉత్తమ నటుడిగా మరో ఫిలింఫేర్‌ను అందుకున్నాడు. అయితే చిత్రసీమలో వరుస పరాజయాలు పలకరిస్తున్నా యువతరంలో షాహిద్‌కు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్కువగా రొమాంటిక్‌ పాత్రలకే పరిమితమైన ఈ యువహీరో ఆ తరువాత నుంచి యాక్షన్‌ చిత్రాలతోనూ మెప్పించాడు. ఈ క్రమంలోనే ‘షాన్‌దార్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘రంగూన్‌’, ‘పద్మావత్‌’, ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో ప్రేక్షకుల్ని మురిపించాడు. ముఖ్యంగా ‘ఉడ్తా పంజాబ్‌’లో షాహిద్‌ కనబర్చిన నటనకు ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్‌) ఫిలింఫేర్‌ను దక్కడం విశేషం. ఈస్టన్ర్‌-ఐ వారపత్రిక ఏటా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఆన్‌లైన్‌ పోటీలో 2017గానూ ఆసియాకు చెందిన అత్యంత శృంగార పురుషుడిగా షాహిద్‌కు అత్యధిక ఓట్లను దక్కాయి. కొన్నాళ్లు కరీనా కపూర్‌తో చెట్టాపట్టాలేసుకోని తిరిగిన ఈ యువహీరో.. ఆమెతో విడిపోయాక, దిల్లీకి చెందిన విద్యార్థిని మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* వెండితెరపై తోక చుక్క..
దివ్యభారతి 
(జయంతి-1974)


16 ఏళ్లకు సినీరంగ ప్రవేశం..
కేవలం 3 ఏళ్ల సినీ ప్రస్థానం..
4 భాషల్లో అగ్రనాయికగా ఏకఛత్రాధిపత్యం..
అన్నింటిలో కలిపి చేసింది 20 చిత్రాలే..
కానీ, ఆమె ప్రతి చిత్రం వెండితెరపై ఓ సంచలనమైంది..
ఊహ తెలియని వయసులోనే ఊహకందనంత స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది..
అతిలోక సుందరికి చెల్లెలుగా కీర్తి దక్కించుకొంది..
అతి తక్కువ కాలంలోనే సినీప్రియుల మదిలో కలల రాణిగా వెలుగులు విరజిమ్మింది.
కానీ, ఆ కాంతులు చూసి ఆ కాలానికే కన్నుకుట్టిందేమో..19 ఏళ్లకే ఆ టీనేజ్‌ స్టార్‌ గర్ల్‌ను కారు చీకట్లలోకి లాగేసింది.
సినీ ప్రియులను శోకసంద్రాన్ని మిగిల్చి... ఆమె జ్ఞాపకాల వాకిట ఒంటరిగా నుంచోబెట్టింది..ఇదే అందాల తార దివ్యభారతి జీవిత చిత్రం.

దివ్యభారతి.. రెండు దశాబ్దాల క్రితం వెండితెరపై ఈ పేరు ఓ సంచలనం. ఓవైపు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అతిలోక సుందరి శ్రీదేవి జమానా నడుస్తున్న వేళ..ఆమెకు దీటుగా దేశవ్యాప్తంగా అంతే క్రేజ్‌ సంపాదించుకున్న ముద్దుగుమ్మ దివ్యభారతి. దివి నుంచి భువికి నడిచొచ్చిన దేవకన్యలా.. పాలరాతి శిల్పంలాంటి దేహంతో. మత్తెక్కించే చూపులతో అచ్చు శ్రీదేవికి జిరాక్స్‌లా ఆకట్టుకునే అందం, అలరించే అభినయాలతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ అతిలోక సుందరిలాగే 16 ఏళ్లకు చిత్రసీమలోకి వచ్చి 90వ దశకంలో వరుస సినిమాలతో ఇటు టాలీవుడ్‌ అటు బాలీవుడ్‌లలో ఓ ప్రభంజనం సృష్టించింది. ఒకానొక దశలో శ్రీదేవి స్థానాన్ని దివ్యభారతి భర్తీ చేయబోతుందనే సినీవర్గాల్లో గుసగుసలు వినిపించాయి. కానీ, ఆమె అకాల మరణం పాలై సినీప్రియులను నివ్వెరపోయేలా చేసింది. 1990లో వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘బొబ్బిలి రాజా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన దివ్యభారతి... మూడేళ్ల స్వల్ప కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అనేక హిట్‌ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్‌బాబు వంటి అగ్రనాయకులతో కలిసి ఏడు చిత్రాల్లో నటించగా.. దాదాపుగా అన్నీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌లుగానే నిలిచాయి. వీటిలో ‘బొబ్బిలిరాజా’, ‘రౌడీ అల్లుడు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘చిట్టెమ్మ మొగుడు’, ‘ధర్మక్షేత్రం’ చిత్రాల్లో దివ్యభారతి కనబర్చిన నటన తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఓవైపు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉండగానే.. నషీరుద్దిన్‌ షా, సన్నీడియోల్‌ వంటి స్టార్‌ల సరసన ‘విశ్వామిత్ర’లో నటించే అవకాశాన్ని దక్కించుకొంది. ఇది బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో హిందీ నుంచి కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ‘షోలా ఔర్‌ షబ్నమ్‌’, దీవానా’, ‘దిల్‌ హై తో హై’ వంటి హిట్లను ఖాతాలో వేసుకొంది. ఈ జోరులోనే కేవలం మూడేళ్ల కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 20 చిత్రాలను చేసి శ్రీదేవి లాంటి అగ్రతారకే సవాల్‌ విసిరింది. ఊహ తెలియని వయసుకే టీనేజి సూపర్‌స్టార్‌గా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. కానీ, దురదృష్టవశాత్తు 1993 ఏప్రిల్‌ 5న తన 19 ఏళ్ల వయసులో అనుమానాస్పద పరిస్థితుల మధ్య కన్నుమూసింది. మద్యం మత్తులో ఆరో అంతస్తులోని తన బాల్కానీ నుంచి కింద పడి తుదిశ్వాస విడిచింది. ఆమె చనిపోవడానికి కొద్ది నెలల ముందే 1992 మేలో నిర్మాత షాజిద్‌ నడియాడ్‌ వాలాను పెళ్లి చేసుకొంది. 1974 ఫిబ్రవరి 25న మహారాష్ట్రలో జన్మించింది దివ్యభారతి.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.