ఫిబ్రవరి 26.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కళ్లు చిత్రంతో మెరిసి..
శివాజీరాజా (పుట్టినరోజు-1962)

థానాయకుడిగా... సహ నటుడిగా పలు చిత్రాల్లో మెరిశాడు శివాజీరాజా. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపుగా 300 చిత్రాలు చేశాడు. గొల్లపూడి రాసిన ‘కళ్ళు’ నాటిక ఆధారంగా, అదే పేరుతో ఎం.వి.రఘు తెరకెక్కించిన చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ రాజా. ఆ చిత్రంతో నంది అవార్డు కూడా స్వీకరించాడు. ఆ తరువాత ఆయన ప్రయాణం మరింత ఊపందుకుంది. ‘సముద్రం’, ‘పెళ్ళిసందడి’, ‘సిసింద్రీ’, ‘ఘటోత్కచుడు’, ‘మురారి’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘విరోధి’... ఇలా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఆయన కథానాయకుడిగా, నటుడు రంగనాథ్‌ దర్శకత్వం వహించిన ‘మొగుడ్స్‌ పెళ్లామ్స్‌’ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. వెండితెరతో పాటు... బుల్లితెరతోనూ ఆయన అనుబంధాన్ని పెంచుకున్నాడు. పలు ధారావాహికల్లో నటించి ఇంటింటికీ చేరువయ్యాడు. ముఖ్యంగా ‘అమృతం’ ధారావాహిక ఆయనకి మంచి పేరును తీసుకొచ్చింది. గతంలో ఆయన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా కొనసాగారు. కళాకారుల సంక్షేమం కోసం పాటు పడుతున్నాడు. శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి భీమవరంలోని డి.ఎన్‌.ఆర్‌ కళాశాలలో అటెండరుగా పని చేసేవాడు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్‌ పూర్తి చేసి నటనలో శిక్షణ తీసుకున్నాడు. నటుడిగా కెరీర్‌ని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఒక సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. శివాజీరాజాకి భార్య అరుణ, కూతురు మేఘన, కుమారుడు విజయ్‌ ఉన్నారు. ఈ రోజు శివాజీరాజా పుట్టినరోజు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.