ఫిబ్రవరి 8 (సినీ చరిత్రలో ఈరోజు)...

* ఓ దేశం పుట్టింది...

అమెరికా చరిత్ర గురించి చెప్పుకోవాలంటే వర్ణవివక్ష నేపథ్యంలో తలెత్తిన సివిల్‌ వార్‌ను ప్రస్తావించక తప్పదు. నలుపు, తెలుపు రంగుల ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లి అమెరికాలో 1861 నుంచి ఘర్షణలు, పోరాటాలు, ఉద్యమాలు పెల్లుబికాయి. ఈ అశాంతికర పరిస్థితుల నుంచి అమెరికా ఒక శాంతియుత దేశంగా అవతరించడానికి కొన్నేళ్లు పట్టింది. ఆ దేశ చరిత్ర నేపథ్యంలో ఇద్దరు స్నేహితులు, రెండు కుటంబాల మధ్య కథతో అప్పటి సమాజం స్థితిగతులకు అద్దం పట్టిన సినిమా ‘ద బర్త్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’ (1915). ప్రముఖ దర్శకుడు డి. డబ్ల్యూ. గ్రిఫిత్‌ దీన్ని తెరకెక్కించాడు. గ్రిఫిత్‌ ఈ సినిమాను తెరకెక్కించడంలో ఉపయోగించిన వినూత్నమైన టెక్నిక్‌ కారణంగా దీన్ని సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిలాంటిదని చెబుతారు. థామస్‌ డిక్సన్‌ రాసిన ‘ద క్లాన్స్‌మన్‌’, డిక్సన్‌ రాసిన ‘ద లెపర్డ్స్‌ స్పాట్స్‌’ నవలల ఆధారంగా తీసిన ఈ చిత్రం విజయవంతమై, ఓ గొప్ప సినిమాగా పేరొందింది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌లో ప్రదర్శితమైన తొలి సినిమా కూడా ఇదే. దీన్ని అప్పటి అధ్యక్షుడు ఊడ్రో విల్సన్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అమెరికాలో తీసిన తొలి 12 రీళ్ల (నిడివి మూడు గంటలు) సినిమా ఇది. ఈ సినిమాను 1946 కల్లా ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది చూశారని అంచనా.

* అవార్డులు గెలుచుకున్న టాక్సీడ్రైవర్‌


నేరాల నేపథ్యంలో కథ... ఓ టాక్సీడ్రైవర్‌ దృష్టి కోణంలో సాగే సన్నివేశాలు... పైగా ఆ టాక్సీడ్రైవర్‌ మానసిక రోగి... ఇలా చూస్తే ఇదొక మామూలు మసాలా, కాలక్షేపం సినిమానే. కానీ దాన్ని తెరకెక్కించిన తీరు ఆ సినిమాను ప్రపంచంలోనే గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిపింది. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులతో పాటు, పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. ఆ సినిమానే ‘టాక్సీడ్రైవర్‌’ (1976). సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన దీనికి హాలీవుడ్‌లోనే ప్రముఖుడు మర్టిన్‌ స్కోర్సెసే దర్శకుడు. ప్రముఖ నటుడు రోబర్ట్‌ డెనిరో, అందాల తార జోడీ ఫాస్టర్‌ ప్రధాన పాత్రల్లో నటించాడు. దేశం తరఫున యుద్ధ సైనికుడిగా పనిచేసిన వ్యక్తి తనకు నిద్ర పట్టని జబ్బు ఉండడంతో రాత్రి వేళల్లో న్యూయార్క్‌లో టాక్సీ నడుపుతూ, నగరంలో జరుగుతున్న నేరాలను, వ్యభిచారాన్ని, నాగరికత ముసుగులో జరుగుతున్న మోసాలను గ్రహించి వాటిని చక్కదిద్దాలని చేసే ప్రయత్నంగా సినిమా సాగుతుంది. మధ్యలో ఓ యువతితో అతడి స్నేహం, ప్రేమ, కలహాలను కూడా ఆసక్తికలిగేలా కలిపారు.

* ఆసియాలోనే బ్లాక్‌బస్టర్‌
హాంగ్‌కాంగ్‌లో తీసిన ఓ సినిమా ఆసియా ఖండంలోనే అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మేటి వంద చైనా సినిమాల జాబితాలో రెండోస్థానం సంపాదించింది. తక్కువ బడ్జెట్‌లో ప్రచారం కూడా లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు తిరగరాసింది. హాంగ్‌కాంగ్, హాలీవుడ్‌ సినీ రంగాలపై ప్రభావం చూపించిన సినిమాగా గుర్తింపు పొందింది. ఆ సినిమనే ‘ఎ బెటర్‌ టుమారో’ (1986). దీని విజయంతో సీక్వెల్స్‌గా మరో రెండు సినిమాలు, ప్రీక్వెల్‌గా ఇంకో సినిమా వచ్చాయి. ఓ అన్నదమ్ముల కథగా ఇది నడుస్తుంది. అన్న మాఫియా ప్రపంచంలో నేరగాడైతే, తమ్ముడు పోలీసు అధికారి. ఇద్దరి మధ్య అనుబంధం, అన్న నేరస్తుడని తమ్ముడు తెలుసుకోవడం, అన్నని మార్చాలనుకోవడం, ఇద్దరి మధ్య విభేదాలు, అన్న మారాలనుకున్నా మారలేని పరిస్థితులు... ఇలాంటి నేపథ్యంలో సినిమా సాగుతుంది. బాలీవుడ్‌లో ‘దీవార్‌’లాంటి ఎన్నో సినిమాలను గుర్తు చేసే ఇది యువతపై ఎంతో ప్రభావం చూపించింది. ఇందులో స్మగ్లర్‌గా నటించిన వ్యక్తి ధరించిన లాంగ్‌కోట్‌లను ఒక ఫ్యాషన్‌గా యువత అనుసరించారు. ఆ నటుడు ధరించిన కళ్లజోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. హాంగ్‌కాంగ్‌ మొత్తంగా ఆ కంపెనీ కళ్లజోళ్లు మొత్తం అమ్ముడైపోయాయి.

* హాలీవుడ్‌ స్వీటీ!
హైస్కూలు చదువుతున్న ఓ అమ్మాయి కోక్‌ కొనడానికి ఓ దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆమె అందాన్ని చూసి ఓ వ్యక్తి ఆమెను సినీరంగానికి పరిచయం చేశాడు. ఫలితంగా ఆమె ‘హాలీవుడ్‌ స్వీటీ’, ‘గోల్డెన్‌ గర్ల్‌’ అనిపించుకునేంతగా ఎదిగింది. గ్లామర్‌కి చిరునామాగా పేరొందింది. ఆమే లానా టర్నర్‌. మోడలింగ్, రేడియో, నాటక రంగం, టెలివిజన్, సినీ రంగాల్లో అందాల తారగా ఆమె పేరు మార్మోగిపోయింది. అమెరికాలో అత్యధిక పారితోషికం అందుకునే తారగా వెలిగిపోయింది. పేదరికంలో పుట్టి తండ్రి మరణంతో అగచాట్లు పడుతూ పెరిగిన ఆమెకు అందమే వరమైంది. చూడగానే ఆకట్టుకునే ఆమె పదహారేళ్లకే వార్నర్‌ బ్రదర్స్, ఎమ్‌జీఎమ్‌ లాంటి చిత్ర నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని నటిగా మారింది. తొలిసినిమా ‘దే వోన్ట్‌ ఫర్గెట్‌’ (1937)తోనే అందంతో పాటు, అభినయంతో కూడా ఆకట్టుకుంది. ‘జానీ ఈగర్‌’, ‘జీగ్‌ఫీల్డ్‌ గర్ల్‌’, ‘డాక్టర్‌ జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్‌’, ‘సమ్‌వేర్‌ ఐ విల్‌ ఫైండ్‌ యు’, ‘ద పోస్ట్‌మ్యాన్‌ ఆల్వేజ్‌ రింగ్స్‌ ట్వైస్‌’, ‘ద బ్యాడ్‌ అండ్‌ ద బ్యూటిఫుల్‌’, ‘పీటన్‌ ప్లేస్‌’, ‘ఇమిటేషన్‌ ఆఫ్‌ లైఫ్‌’, ‘మేడమ్‌ ఎక్స్‌’లాంటి చిత్రాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను మెప్పించింది. అమెరికాలో 1921 ఫిబ్రవరి 8న పుట్టిన ఈమె, 1995 జూన్‌ 29న కాలిఫోర్నియాలో తన 74వ ఏట క్యాన్సర్‌తో మరణించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.