ఫిబ్రవరి 17.. (సినీ చరిత్రలో ఈరోజు)

* రాను రానంటూనే చిన్నదో.. 
(సదా పుట్టిన రోజు)

వెళ్లవయ్యా వెళ్లూ... అంటూ తన తొలి సినిమా ‘జయం’తోనే బోలెడంత సందడి చేసింది సదా. ఆ సందడి కుర్రాళ్లకి భలే నచ్చేసింది. అందులోని ‘రాను రానంటూనే చిన్నదో...’ అనే పాట విశేష ప్రాచుర్యం పొందింది. ఈ పాటతో పాటు... వెళ్లవయ్యా వెళ్లూ... అనే సంభాషణ కొన్నాళ్లపాటు జనం నోళ్లలో నానింది. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సదాకి అవకాశాలు వెల్లువెత్తాయి. మరుసటి యేడాదే ఎన్టీఆర్‌తో కలిసి ‘నాగ’లో నటించే అవకాశం అందుకొంది. అల్లరి నరేష్‌తో కలిసి ‘ప్రాణం’లో నటించింది. మరోపక్క ‘జయం’ రీమేక్‌తో తమిళంలోకీ అడుగుపెట్టి విజయాన్ని సొంతం చేసుకొంది. ‘మోనాలీసా’ అనే చిత్రంతో కన్నడలోకీ అడుగుపెట్టింది. అలా ఆమె దక్షిణాది భాషలన్నింటిలోనూ అవకాశాలు అందుకొని, ‘లవ్‌ కిచిడీ’ చిత్రంతో హిందీలోనూ మెరిసింది. విక్రమ్‌తో కలిసి నటించిన ‘అపరిచితుడు’ చిత్రంతో ఆమెకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు దక్కినప్పటికీ ‘అపరిచితుడు’ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. 2014లో ‘యమలీల2’లో ఒక ప్రత్యేకపాత్రలో సందడి చేశాక ఆమె మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ బుల్లితెరపై రియాలిటీ షోలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ గ్లామర్‌ రంగంలో కొనసాగుతున్నారు. ఈ రోజు సదా పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* తొలి సూపర్‌హీరో పుట్టిన రోజు!సూపర్‌హీరోలెవరు? అని అడిగితే సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్, బర్డ్‌మ్యాన్‌... అంటూ చకచకా బోలెడు పేర్లు చెబుతారు ఎవరైనా. మరి ప్రపంచంలోనే తొలి సూపర్‌హీరో ఎవరో తెలుసా? ‘ఫాంటమ్‌’. కామిక్‌ స్ట్రిప్‌లైనా, బొమ్మల పుస్తకాలైనా, యానిమేషన్‌ సీరియల్స్‌ అయినా, వెండితెర సినిమాలైనా రకరకాల మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫాంటమ్‌ 1936లో ఫిబ్రవరి 17న ఇదే రోజు ప్రాణం పోసుకున్నాడు. అమెరికా రచయిత, దర్శకుడు, నిర్మాత అయిన లీ ఫాల్క్‌ అనే వ్యక్తి ఫాంటమ్‌ కథను ఓ కామిక్‌ స్ట్రిప్‌గా సృష్టించాడు. దిన పత్రికలో ప్రతి రోజూ బొమ్మలతో వచ్చే కథగా వచ్చిన ఇది, ఇప్పటికి కూడా కొనసాగుతుండడం విశేషం. నేరస్థులపై దాడి చేస్తూ సమాజాన్ని కాపాడే ఫాంటమ్‌ కథలు 1966కల్లా ప్రపంచ వ్యాప్తంగా 583 పత్రికల్లో ప్రచురితం అయ్యేవి. ప్రతి రోజూ 10 కోట్ల మంది దీన్ని చదువుతున్నారని అంచనా. మిగతా సూపర్‌హీరోల్లా ఫాంటమ్‌కి అతీత శక్తులుండవు. తన శక్తితో, యుక్తితో దుండగుల పని పడుతూ ఉంటాడు. ఒంటికి అంటిపెట్టుకుని ఉండే దుస్తులు వేసుకుని, కళ్లు కనబడకుండా గంతలు కట్టుకునే ఇతడి వేషమే రకరకాల రంగుల్లో మిగతా సూపర్‌హీరోలకు కూడా గుర్తుగా మారిపోయింది. ఆ తర్వాత ఫాంటమ్‌ కథలు వెండితెరపై కూడా విజయవంతమైన సినిమాలుగా మారిన సంగతి తెలిసిందే.

* అందాల సంచలనం


గాయని... నటి... మోడల్‌... డీజే... సెక్స్‌ సింబల్‌... వ్యాపార వేత్త... రచయిత్రి... ఫ్యాషన్‌ డిజైనర్‌... సామాజిక కార్యకర్త... మీడియా పెర్సనాలిటీ... ఇవన్నీ ఓ అందాల యువతి విశేషణాలే. పేరు ప్యారిస్‌ హిల్టన్‌. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హిల్టన్‌ హోటల్స్‌’ వ్యవస్థాపక అధినేత కొన్‌రాడ్‌ హిల్టన్‌ మనవరాలు. టీనేజిలోనే మోడలైంది. టాబ్లాయిడ్‌ పత్రికలకి జర్నలిస్ట్‌గా చేసింది. ఆమెకి సంబంధించిన ఓ పోర్న్‌ వీడియో ‘1 నైట్‌ ఇన్‌ ప్యారిస్‌’తో రాత్రికిరాత్రి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖురాలైపోయింది. టీవీ రియాలిటీ షోలతో ఆకట్టుకుంది. ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఏన్‌ హైరెస్‌’ పుస్తకంతో బెస్ట్‌ సెల్లర్‌ రచయిత్రిగా మారింది. ‘హౌస్‌ ఆఫ్‌ వ్యాక్స్‌’ (2006) సినిమాతో వెండితెర నటిగా ఆకట్టుకుంది. ఆపై ‘రైజింగ్‌ హెలెన్‌’, ‘రెపో ద జెనెటిక్‌ ఒపేరా’, ‘ద బ్లింగ్‌ రింగ్‌’ లాంటి సినిమాలతో అందాల తారగా ముద్ర వేసింది. ‘ప్యారిస్‌’, ‘స్టార్స్‌ ఆర్‌ బ్లైండ్‌’ లాంటి ఆల్బమ్‌లతో గాయనిగా ఉర్రూతలూగించింది. పాప్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో డీజేగా యువతను వెర్రెక్కించింది. అత్యధిక పారితోషికం తీసుకున్న డీజేగా గుర్తింపు పొందింది. తన పేరునే బ్రాండ్‌గా మార్చుకుని ఫెర్‌ఫ్యూమ్స్‌తో వ్యాపారవేత్తగా మారి 3 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఇంకా హ్యాండ్‌బ్యాగ్‌లు, వాచీలు, స్కిన్‌కేర్‌లాంటి 19 రకాల ఉత్పత్తులతో ప్రపంచ వ్యాప్తంగా 50 చోట్ల ప్యారిస్‌ హిల్టన్‌ స్టోర్స్‌తో ఫ్యాషన్‌ డిజైనర్‌గా లాభాలు ఆర్జించింది. ఈ 37 ఏళ్ల అందాల సంచలనం న్యూయార్క్‌లో 1981 ఫిబ్రవరి 17న పుట్టింది.

* హ్యారీపాటర్‌ అమ్మాయి


ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హ్యారీపాటర్‌’ సినిమాలు చూసే వాళ్లు బోనీ రైట్‌ను వెంటనే గుర్తు పట్టేస్తారు. ఆ సినిమాల్లో జిన్నీ వీస్లే పాత్రలో నటించి ఈమె, నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్‌ రైటర్‌గా, మోడల్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకుంది. లండన్‌లో 1991 ఫిబ్రవరి 17న పుట్టిన ఈమె, హైస్కూలు రోజుల్లోనే అన్నయ్య ప్రోత్సాహంతో హ్యారీపాటర్‌ సినిమాలో పాత్ర కోసం జరిగిన ఆడిషన్స్‌లో పాల్గొని ఎంపికైంది. వీటితో పాటు టీవీ మూవీస్, నాటకాలతో ఆకట్టుకుంది. వెండితెరపై ‘బిఫోర్‌ ఐ స్లీప్‌’, ‘ద సీ’, ‘ఆఫ్టర్‌ ద డార్క్‌’లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. మోడల్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ఎదిగింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.