ఫిబ్రవరి 22 (సినీ చరిత్రలో ఈరోజు)...

* సంచలనాల దర్శకుడు...
తేజ (పుట్టినరోజు-1966)


ఛా
యాగ్రాహకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత... ఇలా తేజలో ఎన్నో కోణాలున్నాయి. సినిమానే ప్రపంచంగా పెరిగాడు తేజ. సినిమా ఆఫీసులో టీలు అందించడం మొదలుకొని... అగ్ర దర్శకుడి వరకు ఎదిగారాయన. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘శివ’ సినిమాకి పలు విభాగాల్లో పనిచేసిన తేజ, ‘రాత్రి’ చిత్రంతో ఛాయాగ్రాహకుడిగా పరిచయమయ్యాడు. అది కూడా వర్మ తీసిన చిత్రమే. ఆ తరువాత హిందీలోనూ పలు చిత్రాలకి పనిచేశాడు. ‘చిత్రం’తో దర్శకుడిగా ఘన విజయాన్ని సొంతం చేసుకొని... ఆ తరువాత ‘నువ్వు నేను’, ‘జయం’ చిత్రాలతో సంచలనాలు సృష్టించాడు. మధ్యలో పరాజయాలు ఎదుర్కొన్నా... 2017లో దగ్గుబాటి రానాతో తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 2019లో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘సీత’ చిత్రం చేశాడు. మద్రాసులో 1966 ఫిబ్రవరి 22న జన్మించిన తేజ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూశాడు. ఆయన జీవితం సినిమా కథని మరిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. తేజకి భార్య శ్రీవల్లి, పిల్లలు అమితోవ్‌ తేజ, ఐల తేజ ఉన్నారు. ఈ రోజు తేజ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
...........................................................................................................................................................

* తలకట్టు కనికట్టు...
కోడి రామకృష్ణ (వర్ధంతి-2019)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* పాత్రకు నిండుదనం!
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (వర్థంతి-2011) 


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఆస్కార్‌లతో అరుదైన రికార్డు...


ప్ర
తిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో మూడు సినిమాలు మాత్రం ఓ అరుదైన రికార్డు సాధించాయి. ఆస్కార్‌ విభాగాల్లో ప్రధానమైన మొదటి అయిదు అవార్డులనూ పొందడమే ఆ రికార్డు. అంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్కీన్ర్‌ప్లే అవార్డులు దానికే వస్తాయన్నమాట. ఆ మూడు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘ఇట్‌ హ్యాపెన్డ్‌ వన్‌ నైట్‌’. మిగతా రెండూ ‘వన్‌ ఫ్ల్యూ ఓవర్‌ ద కుకూస్‌ నెస్ట్‌’, ‘ద సైలెన్స్‌ ఆఫ్‌ ద ల్యాంబ్స్‌’ చిత్రాలు. ‘ఇట్‌ హ్యాపెన్డ్‌ వన్‌ నైట్‌’ (1934) సినిమాను 1933లో రచయిత శామ్యూల్‌ హాప్‌కిన్స్‌ ఆడమ్స్‌ రాసిన ‘నైట్‌ బస్‌’ అనే చిన్న కథ ఆధారంగా తీశారు. అవార్డు చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఫ్రాంక్‌ కాప్రా తీసిన ఈ చిత్రంలో ‘కింగ్‌ ఆఫ్‌ హాలీవుడ్‌’గా పేరొందిన క్లార్క్‌ గేబుల్, అందాల తార క్లాడెట్‌ కోల్బర్ట్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథ విషయానికి వస్తే... ఓ ధనవంతుడి కుమార్తె ఓ వ్యక్తిని ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకుంటుంది. ఆ వ్యక్తి కేవలం డబ్బు కోసమే కూతురి వెంట పడుతున్నాడని తెలిసిన తండ్రి ఆమెను ఓడ మీద దూరంగా తీసుకుపోదామనుకుంటాడు. అయితే ఆ కూతురు ఓడ నుంచి దిగి తప్పించుకుని తన భర్తను కలుసుకోడానికి ఏదో బస్‌ ఎక్కుతుంది. ఆ బస్‌లో ఉన్న ఓ పత్రికా విలేకరి ఆమెకు పరిచయం అవుతాడు. తన పత్రికను ఓ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇస్తానంటే భర్త దగ్గరకు చేరుస్తానని, లేకపోతే తండ్రికి ఫోన్‌ చేసి చెప్పేస్తానని షరతు పెడతాడు. అక్కడి నుంచి ఇద్దరి ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో ఆమె అతడితో ప్రేమలో పడుతుంది. అయితే ఒక దశలో అతడు కేవలం రివార్డు కోసమే తనతో ప్రేమ నటిస్తున్నాడని అపార్థం చేసుకుంటుంది. తనంతట తనే తండ్రికి ఫోన్‌ చేస్తే అతడు తన కూతురు వివాహాన్ని అధికారికంగా జరిపిస్తానని చెబుతాడు. విలేకరి ఆమెను వెతుక్కుంటూ తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు అతడి నిజాయితీ తండ్రికి అర్థమవుతుంది. ఈలోగా మొదటి భర్త పెళ్లికి తరలి వస్తాడు. చివరకి ఆ అమ్మాయి ఎవరిని చేసుకుందనేదే కథ. ఆసక్తికరమైన ఈ కథతో తీసిన ఈ సినిమా వంద మేటి చిత్రాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. మూడున్నర లక్షల డాలర్లతో తెరకెక్కిన ఇది, 25 లక్షల డాలర్లను అందుకుంది.

* తాత కోపం తీర్చిన మనవరాలు


కూ
తురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని మిలటరీలో కల్నల్‌ అయిన ఓ తండ్రి కూతురి మొహం చూడ్డా మానేశాడు. కూతురు అల్లుడు దూర ప్రాంతంలో స్థిరపడ్డారు. కొన్నాళ్లకు వాళ్లకో కూతురు పుట్టింది. ఆమెకు ఆరేళ్ల వయసులో కూతురు, అల్లుడు కలిసి తండ్రి ఇంటికి దగ్గర్లోనే కాపురం పెట్టారు. అప్పుడా ముద్దుల చిన్నారి తాత కోపాన్ని తగ్గించి దారిలో పెడుతుంది. ఈ కథతో మానవ సంబంధాలను ఆకట్టుకునేలా చిత్రీకరించిన సినిమానే ‘ద లిటిల్‌ కలోనెల్‌’ (1935). అమెరికా రచయిత్రి అన్నీ ఫెలోస్‌ జాన్‌స్టన్‌ రాసిన పిల్లల నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంది.

* ఎదురులేని... ‘ఇ.టి’ పాప!


ప్ర
పంచ వ్యాప్తంగా ‘ఇ.టి’ సృష్టించిన సంచలన ఇంతా అంతా కాదు. ‘ఎక్స్‌ట్రా టెర్రెస్టియ్రల్‌’ సంక్షిప్త రూపంగా ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తీసిన ఈ సినిమాలో ఆకట్టుకున్న ఆరేళ్ల చిన్నపాప, ఆ తరువాత హాలీవుడ్‌లో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, మోడల్‌లో, వ్యాపార వేత్తగా దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులు అందుకుంది. ఆమే డ్యూ బ్య్రారీమోర్‌. తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటకుటుంబంలో పుట్టిన ఈమె, చిన్నతనం నుంచీ చురుకే. ఈమె తల్లితండ్రులే కాదు, నాన్నమ్మ, తాతయ్యలు కూడా నటులే కావడం విశేషం. చిన్న వయసులోనే సంచలన తారగా ప్రఖ్యాతి పొందిన ఈమె, వ్యసనాలకు బానిసై పతనం లోతుల్లోకి దిగజారినా, తిరిగి తేరుకుని ఆత్మకథ ‘లిటిల్‌ గర్ల్‌ లాస్ట్‌’ రాసింది. కాలిఫోర్నియాలో 1975 ఫిబ్రవరి 22న పుట్టిన ఈమె ‘పాయిజన్‌ ఐవీ’, ‘బాయిస్‌ ఆన్‌ ద సైడ్‌’, ‘మ్యాడ్‌ లవ్‌’, ‘స్కీమ్ర్‌’, ‘ఎవర్‌ ఆఫ్టర్‌’, ‘ద వెడ్డింగ్‌ సింగర్‌’, ‘50 ఫస్ట్‌ డేట్స్‌’, ‘బ్లెండెడ్‌’, ‘నెవర్‌బీన్‌ కిస్స్‌డ్‌’, ‘చార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ డేంజరస్‌ మైండ్‌’, ‘ఫీవర్‌ పిచ్‌’, ‘బిగ్‌ మిరకిల్‌’, ‘విప్‌ ఇట్‌’ లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆరేళ్ల వయసులోనే స్టార్‌గా పేరొచ్చిన నేపథ్యంలో డ్యూబ్య్రారీమోర్‌ పదమూడేళ్లకల్లా డ్రగ్స్‌కు అలవాటు పడి ‘రీ హ్యాబిటలైజేషన్‌ సెంటర్‌’లో చేరాల్సి వచ్చింది. పద్దెనిమిది నెలల పాటు మానసికంగా నరకం అనుభవించి, ఓసారి ఆత్మహత్యకు పాల్పడింది కూడా. పదిహేనేల్ల కల్లా వ్యసనాల గుప్పిటి నుంచి బయటపడి తిరిగి కీర్తి శిఖరాలు చేరుకుని స్ఫూర్తిదాయకంగా ఎదిగింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.