జనవరి 21.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కామెడీ స్థాయిని పెంచిన దర్శకుడు
..ఈవీవీ (వర్థంతి-2011)


తె
లుగు సినిమా కామెడీ గురించి ప్రస్తావన వచ్చాక అది ఈవీవీ పేరు లేకుండా పూర్తి కాదు. అగ్ర దర్శకుడు జంధ్యాల దగ్గర శిష్యరికం చేసిన ఈవీవీ, గురువు బాటలోనే ప్రయాణం చేసి విజయాల్ని అందుకొన్నారు. గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకొన్నారు. తెలుగు సినిమా కామెడీ స్థాయిని పెంచిన దర్శకుల్లో జంధ్యాల తరువాత ఈవీవీనే ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు తీసి విజయాల్ని అందుకున్న ఈవీవీ పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా, కోరుమామిడిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వెంకటరావు, వెంకటరత్నం దంపతులకి జూన్‌ 10, 1958న జన్మించారు. బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి కనబరిచేవారు. ఇంటర్మీడియట్‌ తప్పడంతో ఈవీవీ తండ్రి ఆయన్ను కాలేజీ మాన్పించి, పొలం పనులు అప్పజెప్పారు. 19వ ఏటే సరస్వతి కుమారితో ఆయనకి పెళ్లైంది. పిల్లలు రాజేష్, నరేష్‌ పుట్టాక కొన్నాళ్లకి, వ్యవసాయంలో నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అక్కడ ఉండటం ఇష్టం లేక... సినిమాలపై ఆసక్తితోనూ నవతా కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బరాజుని సంప్రదించి ఒక సిఫారసు ఉత్తరంతో మద్రాసు వెళ్లారు. నవతా కృష్ణంరాజుని కలిశాక సినీ రంగంలో జీవితం సులభం కాదని, సొంతూరికి వెళ్లిపొమ్మని సలహా ఇచ్చారట. కానీ ఆయన సినిమానే జీవితం అనుకొని నవత కృష్ణంరాజు కార్యాలయం గేటు దగ్గర రోజూ నుంచుని ఉండేవారట. ఒక నెల రోజుల తరువాత ఈవీవీ పట్టుదలని చూసి దేవదాస్‌ కనకాల దగ్గర ‘ఓ ఇంటి భాగోతం’ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం ఇప్పించారు. ‘చెవిలో పువ్వు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరువాత జంధ్యాల దగ్గర ఎనిమిదేళ్లు, 22 సినిమాలకి సహాయ దర్శకుడిగా పనిచేశారు. రాజేంద్రప్రసాద్‌ కథానాయకుడిగా నటించిన ‘చెవిలో పువ్వు’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే అది పరాజయాన్ని చవిచూసింది. దాంతో నిరాశ చెందిన ఈవీవీ తిరిగి ఊరు వెళ్లిపోదామనుకొన్నారట. కానీ ఆ వెంటనే డి.రామానాయుడు ఈవీవీని పిలిచి, ‘ప్రేమఖైదీ’ సినిమా చేసే అవకాశాన్నిచ్చారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈవీవీ ప్రయాణం తిరుగులేని రీతిలో సాగింది. తన గురువు తరహాలోనే కామెడీ ప్రధానమైన ‘అప్పుల అప్పారావు’, ‘ఆ ఒక్కటి అడక్కు’, ‘జంబలకిడి పంబ’ తదితర చిత్రాలు చేసి విజయాల్ని అందుకొన్నారు. ‘ఆమె’, ‘తాళి’, ‘కన్యాదానం’ వంటి సెంటిమెంట్‌ ప్రధానమైన సినిమాలతోనూ ఆయన సత్తా చాటారు. ‘హలో బ్రదర్‌’, ‘అల్లుడా మజాకా’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘వారసుడు’, ‘సూర్యవంశం’ తదితర విజయాలు ఆయన కెరీర్‌లో ఉన్నాయి. తనయులు ఆర్యన్‌ రాజేష్, అల్లరి నరేష్‌ కథానాయకులయ్యాక వారితోనే ఎక్కువ సినిమాలు చేశారు ఈవీవీ. ఈవీవీ సినిమా పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించిన ఆయన విజయవంతమైన నిర్మాతగా కూడా పేరు తెచ్చుకొన్నారు. కథానాయికలు రంభ, రచన, ఊహ, రవళిల్ని పరిచయం చేసిన దర్శకుడు ఈవీవీనే. ‘ఆమె’ చిత్రానికిగానూ నంది పురస్కారం అందుకున్న ఆయన జనవరి 21, 2011న గుండెపోటుతో మృతి చెందారు. ఈ రోజు ఈవీవీ వర్ధంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* పోరాట విద్యల ఆలయం


చై
నాలో 5వ శతాబ్దంలో స్థాపించిన ‘షావోలిన్‌ టెంపుల్‌’ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి. కఠోర శిక్షణ మధ్య పోరాట విద్యలను నేర్పే బౌద్ధ గురువుల విద్యాలయంగా పేరొందిన ఇక్కడ ఆయా సినిమాల్లో హీరోలందరూ చేరి కుంగ్‌ఫూ లాంటి పోరాట విన్యాసాలు నేర్చుకుని విలన్లపై ప్రతీకారాలు తీర్చుకున్నారు. అలా 1982లో వచ్చిన హాంగ్‌కాంగ్‌ సినిమా ‘షావోలిన్‌ టెంపుల్‌’. ఇందులో అంతర్జాతీయంగా పేరొందిన జెట్‌లి హీరోగా నటించాడు. చిత్ర కథ చైనాలో చక్రవర్తుల కాలం నాటిదిగా ఉంటుంది. ఓ చక్రవర్తి ఆధ్యర్యంలో తన తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకోడానికి షావోలిన్‌ టెంపుల్‌లో చేరి యుద్ధ విద్యలు నేర్చుకుని తిరిగివచ్చిన హీరో విలన్ల పని పట్టడమే కథాంశం. ఈ సినిమాకు రీమేక్‌గా 2011లో ‘షావోలిన్‌’ పేరుతో వచ్చిన సినిమాలో జాకీచాన్‌ నటించాడు.

* హాలీవుడ్‌ దిగ్దర్శకుడు..
సిసిల్‌ బి. డెమిల్లే (వర్థంతి-1959)


యన...‘ఫాదర్‌ ఆఫ్‌ ద సినిమా ఆఫ్‌ ద యునైటెడ్‌ స్టేట్'గా పేరొందాడు!
వ్యాపారాత్మకంగా విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శక నిర్మాతగా కీర్తి గడించాడు!
గొప్ప దృశ్యకావ్యాలుగా, భారీతనంతో కూడిన చిత్రాలను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాడు!

ఆయనే... సెసిల్‌ బి.డెమిల్లే. ఇలా చెబితే తెలియడం కష్టమే. కానీ ‘ద టెన్‌ కమాండ్‌మెంట్స్‌’, ‘ద కింగ్‌ ఆఫ్‌ కింగ్స్‌’, ‘క్లియోపాత్రా’, ‘శాంసన్‌ అండ్‌ డిలైలా’ లాంటి చిత్రాల రూపకర్తగా చెబితే జేజేలు పలుకుతారు. ఆగస్టు 18, 1881 జన్మించిన ఆయన 1914 నుంచి 1958 వరకు ఆయన మొత్తం 70 చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించాడు. తొలి సినిమా ‘ద స్క్వా మ్యాన్‌’తోనే హాలీవుడ్‌కే గుర్తింపు తెచ్చిన డెమిల్లే ఆ తరువాత భాగస్వాములతో కలిసి ‘ప్యారమౌంట్‌ పిక్చర్స్‌’ సంస్థను స్థాపించాడు. ‘ద గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌’ (1952) సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అందుకుంది. ‘ద టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ సినిమా ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 7వ స్థానంలో నిలించింది. సినీ రంగానికి సేవలకుగాను డెమిల్లే గౌరవ ఆస్కార్‌ అవార్డును అందుకున్నాడు. జనవరి 21, 1959న కాలిఫోర్నియాలో మరణించారు. 

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అభినయం విలక్షణం...
డేవిడ్ పౌల్ (జయంతి - 1922) 


‘‘అ
తడు పాత్రలో నటించడు. ఆ పాత్ర ఆత్మను ఆవాహన చేసుకుంటాడు. మనకున్న అత్యంత గొప్ప నటుల్లో ఒకడు. అతడిని కలిగి ఉండడం మన చిత్ర పరిశ్రమ అదృష్టం’’ అంటూ తోటి నటీనటుల, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న నటుడు అతడు. ‘అతడితో కలిసి నటించడమంటే... బాక్సింగ్‌ రింగ్‌లో మైక్‌ టైసన్‌తో తలపడినట్టే ఉంటుంది’’ అనేవారు సహనటులు. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి అత్యున్నతమైన ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ పురస్కారం అందుకున్నా విలక్షణ నటుడు. అతడే డేవిడ్‌ పౌల్‌ స్కొఫీల్డ్‌. అతడి రూపం తెరపై చాలా ప్రస్ఫుటంగా కనిపించేది. ఇక కంఠస్వరం గంభీరంగా ధ్వనించేది. వెరసి అతడు డైలాగులు పలికే తీరు, అభినయించే తీరు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసేవి. అతడిని తల్చుకోగానే ‘ఎ మ్యాన్‌ ఆఫ్‌ ఆల్‌ సీజన్స్‌’ సినిమా గుర్తొస్తుంది, సినీ అభిమానులకు. ఈ సినిమాలో సర్‌ థామస్‌ మోర్‌ పాత్రలో అతడి నటనకు ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, బాఫ్టా అవార్డులు వచ్చాయి. ఒకే పాత్రలకు ఇలా మూడు అవార్డులను సాధించడాన్ని ‘ట్రిపుల్‌ క్రౌన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌’ అంటారు. ఇది సాధించిన బహు కొద్ది మందిలో ఒకడిగా నిలిచాడు పౌల్‌ స్కొఫీల్డ్‌. ఇంగ్లండ్‌లో 1922 జనవరి 21న పుట్టిన ఇతడు, చిన్నతనంలోనే నాటకాల వైపు ఆకర్షితుడయ్యాడు. ‘దట్‌ లేడీ’, ‘ద ట్రైన్‌’, ‘టెల్‌మీ లైస్‌’, ‘కింగ్‌ లీర్‌’, ‘స్కార్పియో’, ‘1919’, ‘వెన్‌ ద వేల్స్‌ కమ్‌’, ‘హెన్రీ5’, ‘హ్యామ్లెట్‌’లాంటి సినిమాల్లో పాత్రలతో చెరగని ముద్ర వేసిన ఇతడు తన 86 ఏళ్ల వయసులో 2008 మార్చి 19న మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.