జనవరి 24 (సినీ చరిత్రలో ఈరోజు)...

* బహుముఖ ప్రజ్ఞాశాలి..
సుభాష్‌ ఘయ్‌ (పుట్టినరోజు-1945)


సుభాష్‌ ఘయ్‌.. హిందీ సినిమాలను ఇష్టపడేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరిది. నటుడిగా వెండితెరపైకి దూకిన ఈ ప్రతిభాశాలి తర్వాతి కాలంలో రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్‌ సినీప్రియుల్ని అలరించారు. దర్శకుడిగా ఓ ఫిలింఫేర్‌ పురస్కారంతో పాటు.. నిర్మాతగా ఓ జాతీయ అవార్డును అందుకొని భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు సుభాష్‌. భారతీయ సినిమా అభివృద్ధికి అతను చేసిన కృషికిగానూ 2015లో ఐఫా పురస్కారాన్ని అందుకున్నారు. 1945 జనవరి 24న నాగపూర్‌లో జన్మించిన సుభాష్‌ ఘయ్‌.. మహారాష్ట్రలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో చేరి నటన, దర్శకత్వ శాఖల్లో ఓనమాలు దిద్దుకున్నారు. ఓ చిన్న నటుడిగా ‘తక్‌దీర్‌’ (1967) సినిమాతో వెండితెరపై తొలిసారి తళుక్కుమన్న సుభాష్‌.. ఆ తరువాత ‘ఆరాధన’ (1971), ‘ఉమాంగ్‌ అండ్‌ గుమ్రాహ్‌’ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి నటుడిగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తరువాత దర్శక, రచయితగా టర్న్‌ తీసుకున్న సుభాష్‌ తొలిసారి ‘కాళీ చరణ్‌’ (1976)తో దర్శకుడిగా మారారు. ఆయన తన సినీ కెరీర్‌లో మొత్తం 16 సినిమాలకు దర్శకరచయితగా పనిచేయగా.. వాటిలో ‘కర్రీ’, ‘హీరో’, ‘మేరీ జంగ్‌’, ‘కర్మ’, ‘రామ్‌ లఖన్‌’, ‘సౌదాగర్‌’, ‘కల్నాయక్‌’, ‘పర్దేశ్‌’, ‘తాల్‌’, ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ వంటివి మైలురాళ్లుగా నిలిచాయి. వీటిలో ‘హీరో’ (1983) సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా తొలి ఫిలింఫేర్‌ను, ‘పర్దేశ్‌’తో ఉత్తమ స్కీన్ర్‌ప్లే రైటర్‌గా మరో ఫిలింఫేర్‌ను అందుకోగా.. ఆయన సొంతంగా నిర్మించిన ‘ఇక్బాల్‌’ చిత్రంతో జాతీయ పురాస్కారాన్ని అందుకున్నారు. సుభాష్‌ 1982లో ముక్తా ఆర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభించగా.. 2000 సంవత్సరం నుంచి అది పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థగా అవతరించింది. దీంతో పాటు ముంబయిలో విస్లింగ్‌ వుడ్స్‌ అంతర్జాతీయ చలనచిత్ర మీడియా సంస్థను స్థాపించారు సుభాష్‌.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* హిచ్‌కాక్‌ తొలి సినిమా


ల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ పేరు ప్రస్తావించకుండా ప్రపంచ సినీ చరిత్రను చెప్పలేం. అంతగా ప్రభావం చూపిన దర్శక నిర్మాత ఆయన. ‘మాస్టర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌’గా పేరు పొంది ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆయన తీసిన 50కి పైగా చిత్రాలన్నీ వినూత్నమైన చిత్రీకరణ తీరుకి, నూతన ఒరవడికి, కొత్త టెక్నిక్‌కీ నిదర్శనంగా ఈనాటికీ సినీ ఔత్సాహికులకు పాఠ్యాంశాలుగా నిలిచేవే. సినీ రంగంలోకి టైటిల్‌ కార్డ్‌ డిజైనర్‌గా, టెక్నికల్‌ క్లర్క్‌గా, కాపీ రైటర్‌గా పనిచేసి సినిమాపై అవగాహన పెంచుకున్న హిచ్‌కాక్‌ దర్శకుడిగా తొలిసారి రూపొందించిన సినిమా ‘ద ప్లెజర్‌ గార్డెన్‌’ (1925). మ్యూజిక్‌ హాల్‌లో కోరస్‌ పాడే ఇద్దరు అమ్మాయిల కథగా ఇది సాగుతుంది. ఒకమ్మాయి అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఓ నాట్యతారగా ఎదిగితే, మరో అమ్మాయి ఓ ధనవంతుడి ప్రాపంకంతో ఎదగడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరి ప్రేమలు, సంబంధాలు, ఉద్వేగాలతో సాగే ఈ సినిమాలోనే హిచ్‌కాక్‌ తన ముద్రను చూపించాడు. ప్రారంభ దృశ్యం నుంచే ఈ సినిమా వినూత్నంగా నిలిచిందనే పేరు పొందింది.

* అందాల తార...
కాంచనమాల (వర్థంతి - 1981)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* వలస రైతుల కథ


రై
తుల సమస్యలు ఎక్కడైనా ఒకటే. అలా కరువు నేపథ్యంలో ఉన్న ఫార్మ్‌ల్యాండ్‌ను బ్యాంకులు జప్తు చేస్తే పిల్లాపాపలతో కొత్త జీవితం కోసం కాలిఫోర్నియా బయల్దేరిన ఓ అమెరికా రైతు కుటుంబం కథతో తెరకెక్కిన ‘ద గ్రేప్స్‌ ఆఫ్‌ ర్యాత్‌’ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఓ గొప్ప సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. జాన్‌ స్టీన్‌బెక్‌ అనే రచయిత 1939లో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఆ నవలకు ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్‌ పురస్కారం లభించింది. ఎనిమిది లక్షల డాలర్లతో తీసిన ఈ సినిమా మూడు రెట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాను నేషనల్‌ ఫిలిం లైబ్రరీలో భద్రపరిచారు.
...................................................................................................................................... 

నింగికెగసిన వెండితెర కలలరాణి (వర్థంతి - 2018)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* హత్యకు గురైన అందాల నటి! 


అం
దాల పోటీల్లో ఆమె గెలుచుకున్న ఎన్నో బహుమతుల్లో మొదటిదాన్ని ఆరు నెలల వయసులోనే పొందింది. ముద్దులు మూట గట్టే ఆ పాపకి ‘మిస్‌ టినీటాట్‌ ఆఫ్‌ డల్లాస్‌’ అనే బిరుదు నిచ్చారు. ఎదుగుతున్న కొద్దీ అందాల పాపగా, చూడచక్కని అమ్మాయిగా, సొగసుల భామగా ఎన్నో పతకాలు. ఆపై వెండితెరపై కూడా తారగా మెరిసింది. ఆమే షరాన్‌ టేట్‌. డల్లాస్‌లో 1943 జనవరి 24న అమెరికా సైనికాధికారి కూతురుగా పుట్టిన షరాన్‌ తండ్రి ఉద్యోగ రీత్యా ఎన్నో ప్రాంతాల్లో ఎదిగింది. అందం, ఆకట్టుకునే రూపం కలిగిన ఆమెకు ఫ్యాషన్‌ రంగం, బుల్లితెర, వెండితెర కూడా ఎర్రతివాచీలు పరిచాయి. మోడల్‌గా ఎన్నో పత్రికల ముఖపత్రాలపై మెరిసింది. ‘బరబ్బాస్‌’ (1961) సినిమాతో యాంటోనీక్విన్‌ సరసన తొలిసారిగా నటించిన షరాన్, ‘ఐ ఆఫ్‌ ద డెవిల్‌’, ‘వేలీ ఆఫ్‌ ద డాల్స్‌’, ‘ద ఫియర్‌లెస్‌ వేంపైర్‌ కిల్లర్స్‌’లాంటి సినిమాల్లో నటించింది. దర్శకుడు రోమన్‌ పొలాన్‌స్కీని 1968లో పెళ్లి చేసుకుంది. కానీ కేవలం తన 26 ఏళ్ల వయసులో ఎనిమిది నెలల గర్భిణిగా ఉండగా 1969 ఆగస్ట్‌ 9న కొందరు దుండగులు చేసిన దాడిలో మరో నలుగురు కుటుంబ సభ్యులతో సహా హత్యకు గురైంది.

* ఆరు దశాబ్దాల ప్రయాణం


టుడిగా అరవై ఏళ్ల పాటు అప్రతిహతంగా అలరించిన ఘనత ఎర్నెస్ట్‌ బొర్గ్‌నైన్‌కి చెందుతుంది. నాటకం, సినిమా, టీవీ రంగాల్లో దూసుకుపోయిన ఇతడు ఆస్కార్, ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీలాంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ‘చైనా కొర్సైర్‌’, ‘ఫ్రమ్‌ హియర్‌ టు ఎటర్నిటీ’, ‘వెరా క్రజ్‌’, ‘బ్యాడ్‌ డే ఎట్‌ బ్లాక్‌ రాక్‌’, ‘ద విండ్‌ బంచ్‌’, ‘మార్టీ’, ‘ఆల్‌ డాగ్స్‌ గోటు హెవెన్‌’లాంటి సినిమాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అమెరికాలో 1917 జనవరి 24న పుట్టిన ఇతడు, అమెరికా నావికా దళంలో సేవలందించి ఎన్నో పతకాలు పొందాడు. ఆ తర్వాత నాటక రంగంపై దృష్టి సారించాడు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసిన ఇతడిని సినీరంగం సాదరంగా ఆహ్వానించింది. నటుడిగా ప్రశంసలు, పురస్కారాలు పొందిన ఇతడు, కాలిఫోర్నియాలో 2012 జులై 8న తన 95వ ఏట మరణించాడు.

* ఆస్కార్‌ అందుకున్న దర్శకుడు


ప్ర
పంచ సినీ అభిమానులెవరూ ‘మై ఫెయిర్‌ లేడీ’ చిత్రాన్ని మర్చిపోలేరు. దేశదేశాల్లో మేటి చిత్రంగా ప్రాచుర్యం పొందిన ఈ సినిమా ఆధారంగా ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఆ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న దర్శకుడు జార్జి కుకర్, మరెన్నో మేటి చిత్రాలను అందించాడు. ‘గాన్‌ విత్‌ ద విండ్‌’, ‘ద ఫిలడెల్ఫియా స్టోరీ’, ‘గ్యాస్‌లైట్‌’, ‘ఆడమ్స్‌ రిబ్‌’, ‘బోర్న్‌ ఎస్టర్‌డే’, ‘భొవాని జంక్షన్‌’, ‘వాట్‌ ప్రైస్‌ హాలీవుడ్‌’, ‘ఎ బాల్‌ ఆఫ్‌ డివోర్స్‌మెంట్‌’, ‘లిటిల్‌ ఉమెన్‌’, ‘డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌’, ‘రోమియో అండ్‌ జూలియట్‌’, ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మన్‌హటన్‌లో 1899 జులై 7న పుట్టిన ఇతడు, చిన్నతనంలోనే నాటకాల్లో, నృత్య ప్రదర్శనల్లో చురుగ్గా పాలు పంచుకున్నాడు. ఆ ప్రతిభే అతడి సినీరంగ ప్రయాణానికి బాటలు పరిచింది. ఆస్కార్‌ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఇతడు, 1983 జనవరి 24న తన 83వ ఏట మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.