జనవరి 25.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సినిమాల్లోనే ‘ఊపిరి’ వదిలారు!
కల్పన (వర్థంతి-2016)


తె
లుగు, తమిళ మలయాళ భాషల్లో 300 పైచిలుకు చిత్రాల్లో మెరిసిన నటి కల్పన. ప్రముఖ నటులైన కళారంజని, ఊర్వశిల సోదరి ఈమె. కమల్‌హాసన్‌తో కలిసి ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు కల్పన. బాలనటిగా ప్రయాణం మొదలుపెట్టి కథానాయికగా, సహనటిగా పలు పాత్రల్లో ఒదిగిపోయిన కల్పన అసలు పేరు కల్పన ప్రియదర్శిని. 13 అక్టోబరు 1965న కొల్లాం జిల్లా, చవరలో వి.పి.నాయర్, విజయలక్ష్మి దంతపులకి జన్మించారు. ‘విదరున్న మొట్టుకల్‌’ చిత్రంతో బాలనటిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆ తరువాత కథానాయికగా మారారు. సహనటిగా ఆమె ఎక్కువగా హాస్య ప్రధానమైన పాత్రల్లో మెరిశారు. ‘తనిచల్ల ఎంజాన్‌’ చిత్రంలో నటనకిగానూ ఉత్తమ సహ నటిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. ఉషా ఉతుప్‌తో కలిసి ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించిన ఆమె కె.ఎస్‌.చిత్రతో ‘కుడుంబ కొడతి’ అనే చిత్రంలో ఓ పాట పాడారు. ఆమె దర్శకుడు అనిల్‌కుమార్‌ని 1998లో వివాహం చేసుకొన్నారు. 2012లో ఆయన్నుంచి విడిపోయారు. ఈ దంపతులకి శ్రీమయి అనిల్‌ అనే ఓ పాప ఉన్నారు. ‘ఊపిరి’ చిత్రంలో నటించేందుకుగానూ హైదరాబాద్‌ వచ్చిన కల్పన జనవరి 25, 2016న హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో గుండెపోటుతో మరణించారు. పసి ప్రాయంలోనే కెమెరా ముందుకొచ్చి, తుదిశ్వాస వరకు సినిమాల్లోనే గడిపిన కల్పన వర్ధంతి ఈరోజు.

* కాసులు కురిపించిన కుక్కపిల్లలు!


కుక్క పిల్లల కథతో సినిమా...

అసలా ఆలోచనే విచిత్రం...
ఎవరైనా అయితే ‘నో’ అంటారు...
కానీ వాల్ట్‌డిస్నీ మాత్రం ‘ఎస్‌’ అన్నాడు!
నాలుగేళ్లు శ్రమపడ్డాడు...
వందలాది మంది చేత పని చేయించాడు...
3.6 మిలియన్‌ డాలరు ఖర్చుపెట్టాడు...అతడి శ్రమ వృధా పోలేదు...
ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంది!
215.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది!!
అప్పుల్లో ఉన్న వాల్ట్‌డిస్నీ సంస్థను ఒడ్డున పడేసింది!!!
ఆ సినిమా ‘101 డాల్మేషియన్స్‌’. యానిమేషన్‌ విధానంతో తీసిన ఈ సినిమా 1961లో విడుదలైంది.

డాల్మేషియన్‌ అనేది ఓ కుక్కల జాతి. ఇవి తెల్లని శరీరంపై నల్లని మచ్చలతో చాలా అందంగా ఉంటాయి. ఈ కుక్కపిల్లలతో ఓ చక్కని కథ అల్లి డోడీస్మిత్‌ అనే రచయిత్రి 1956లో పిల్లల కోసం ఓ నవల రాసింది. ఆ నవలను వాల్ట్‌డిస్నీ చదివి వెంటనే దాని హక్కులు కొన్నాడు, యానిమేషన్‌ సినిమా తీయాలని. కానీ అప్పటికి అతడి పరిస్థితి ఏంటో తెలుసా? అంతకు ముందు తీసిన ‘ద స్లీపింగ్‌ బ్యూటీ’ సినిమాకు నష్టాలు వచ్చాయి. యానిమేషన్‌ విభాగాన్ని అమ్మేయాలని కూడా అనుకున్నాడు. అయినా ఈ సినిమా తీయాలనుకున్నాడు. ఎందుకంటే కథ నచ్చి!

ఇంతకీ కథేంటి?
అనగనగా లండన్‌లో ఓ బ్రహ్మచారి. అతడికో డాల్మేషియన్‌ కుక్కపిల్ల. ఆ కుక్కపిల్లకి జీవితం బోర్‌ కొట్టింది. ఎలాగైనా తన యజమానికి ఓ అమ్మాయిని జత చేయాలనుకుంది. తానూ ఓ అందమైన ఆడకుక్కతో జంటగా మారాలనుకుంది. రోజూ కిటికీ లోంచి కుక్కల్ని షికారు తీసుకొచ్చే వారిని పరిశీలించింది. ఓ డాల్మేషియన్‌ కుక్కతో షికారుకొచ్చే అందమైన అమ్మాయిని చూసి, ఇంట్లోంచి పరుగెత్తి ఆ అమ్మాయి దగ్గర ఆగింది. బ్రహ్మచారి దాని వెంట పడ్డాడు. అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకున్నారు. కుక్కలు రెండూ ముచ్చట్లాడాయి. ఇంకేముంది? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇవి రెండూ జతగూడాయి. ఆపై అన్యోన్యంగా కాపురం చేసి 15 పిల్లల్ని కన్నాయి. అదే నగరంలో ఓ దుర్మార్గురాలైన ధనవంతురాలికి ఓ విచిత్రమైన కోరిక ఉంది. 101 డాల్మేషియన్‌ కుక్కపిల్లల చర్మంతో ఓ అందమైన బొచ్చుకోటు తయారు చేయించుకోవాలని. వేర్వేరు చోట్ల ఒకేరకమైన 84 కుక్కపిల్లల్ని కొంది. మరో 15 తక్కువయ్యాయి. కొత్తగా పెళ్లయిన బ్రహ్మచారి ఇంట్లో ఉన్న కుక్కపిల్లల్ని కొంటానంది. అతడు అమ్మనన్నాడు. దాంతో కోపం వచ్చి ఆమె తన మనుషుల చేత వాటిని కిడ్నాప్‌ చేయించి, తన పురాతన కోటలో దాచేసింది. ఆ కుక్కపిల్లలన్నీ కలిసి ఓ ప్లాన్‌ వేశాయి. లండన్‌లో ఉండే కుక్కలకు మాత్రమే అర్థమయ్యేలా ఓ కోడ్‌ భాషలో మొరిగాయి. దాంతో వందలాది కుక్కలు మరికొన్ని జంతువుల్ని కూడా తోడు తీసుకుని బయల్దేరాయి. చివరకి అన్నీ కలిసి సరిగ్గా ఆ దుర్మార్గురాలు కుక్కపిల్లల్ని చంపేసే వేళకి అన్నింటినీ రక్షించాయి. చివరకు పోలీసులు కూడా వచ్చి దుండగుల్ని అరెస్ట్‌ చేశారు. బాగుంది కదూ, కథ?
ఈ సినిమాను విడుదల చేసినప్పుడల్లా దేశదేశాల్లో పిల్లలు, పెద్దలు విరగబడి చూశారు. దీన్ని వీడియోగా విడుదల చేస్తే 11 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఆ తరువాత డీవీడీలుగా, బ్లూరేలుగా కూడా విడుదల చేశారు.  ఈ సినిమాకు రీమేక్‌గా 1996లో లైవ్‌ యాక్షన్‌తో మరో సినిమాను విడుదల చేస్తే అది కూడా హిట్‌ అయింది.

* కొసమెరుపు:
* ఈ నవల రాసిన డోడీస్మిత్‌కి కూడా డాల్మేషియన్‌ కుక్కే ఉండేది. అది కూడా 15 పిల్లల్ని కంది. వాటిని చూసినప్పుడే ఆమెకీ ఈ కథ స్ఫురించింది!
* ఈ సినిమాలోని కుక్కపిల్లల ఒంటి మీద మచ్చల్ని లెక్కపెడితే అవి 6,469,952 అని తేలింది!
* ఈ యానిమేషన్‌ సినిమా కోసం బొమ్మలు వేయడానికి ఏకంగా 800 గ్యాలన్ల (5 టన్నులు) రంగులు వాడారు! దాదాపు 1000 రకాల షేడ్స్‌ ఉపయోగించారు!

* అందాల ఆస్కార్‌ నటి!


అం
దాల నటిగా, గాయనిగా మూడు దశాబ్దాల పాటు హాలీవుడ్‌ తెరను ఏలిన తార అవా గార్డెనర్‌. ‘మొగాంబో’ (1953) సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న ఈమె, ‘ద హస్క్‌టర్స్‌’, ‘షోబోట్‌’, ‘ద స్నోస్‌ ఆఫ్‌ కిలిమంజారో’, ‘ద బైబిల్‌: ఇన్‌ ద బిగినింగ్‌’, ‘ఎర్త్‌ క్వేక్‌’, ‘ద కసండ్రా క్రాసింగ్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రాల మేటి తారగా పేరొందింది. కాలిఫోర్నియాలో డిసెంబర్‌ 24, 1922న పుట్టిన అవా, తన 67వ ఏట జనవరి 25, 1990న లండన్‌లో మరణించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.