జనవరి 27.. (సినీ చరిత్రలో ఈరోజు)

థ్రిల్లర్లతో హల్‌చల్‌ చేసిన నటుడు
(బాబీ డియోల్‌ పుట్టినరోజు - 1969)


సూయతో నిండిన హృదయం అతనిది. ఎలాంటి వారినైనా వంచించడం.. ప్రతికారంతో నేరాలకు పాల్పడడం, ముక్కోణపు ప్రేమకథలు నడుపుతూ జాలీగా గడపేయడం ఆ నటుడి నైజం. అయితే ఇదంతా నిజ జీవితంలో చేసినవి కాదులెండి. ఇవన్నీ అతను తెరపై పండించిన పాత్రల తీరు తెన్నులే. ఎక్కువగా ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేసే బాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాబీ డియోల్‌. సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఇలా ఏ తరహా థ్రిల్లర్‌లకైనా కేరాఫ్‌ అడ్రస్‌ బాబీ డియోల్‌. దాదాపు 20 దశాబ్దాల సినీ కెరీర్‌లో 40కు పైగా సినిమాల్లో నటించగా.. వాటిలో ఎక్కువ శాతం థ్రిల్లర్‌ సినిమాలే ఉండటం అతనికీ పేరును తెచ్చిపెట్టింది. తన తండ్రి ధర్మేంద్ర డియోల్‌ నట వారసత్వంతో వెండితెరపై మెరిసిన ఈ నట కుసుమం.. 1977లో వచ్చిన ‘ధరం వీర్‌’ చిత్రంతో బాలనటుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా వచ్చిన పద్దెనిమిదేళ్ల తర్వాత ‘బర్సాత్‌’ (1995) చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రంగానూ నిలిచింది. ఈ చిత్రంతోనే బాబీ ఉత్తమ నటుడిగా (డెబ్యూ) తొలి ఫిలింఫేర్‌ను అందుకున్నాడు. దీని తర్వాత ‘గుప్త్‌’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్, ‘సోల్జర్‌’ అనే యాక్షన్‌ థ్రిల్లర్లు చేయగా రెండూ కమర్షియల్‌గా మంచి విజయాల్ని అందుకున్నాయి. ‘బాదల్‌’, ‘బిచ్హో’, ‘అజ్నాబీ’, ‘హమ్రాజ్‌’, ‘దిల్లగి’, ‘దోస్తానా’, ‘హీరోస్‌’, ‘అప్నే’, ‘యమ్లా పగ్లా దీవానా’, ‘నఖాబ్‌’ వంటి చిత్రాలు బాబీ డియోల్‌ సినీ కెరీర్‌లో మంచి హిట్లుగా నిలిచాయి. అయితే కొంత కాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న బాబీకి గతేడాది ‘రేస్‌ 3’ ద్వారా హిట్‌ ఇవ్వాలని చూశాడు సల్మాన్‌ ఖాన్‌. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు దారుణ పరాజయాన్ని చవిచూసింది. బాబీ ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’లో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. 1996లో తాన్య డియోల్‌ను పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులున్నారు. 1969 జనవరి 27న నటులు ధర్మేంద్ర డియోల్, ప్రకాష్‌ కౌర్‌ దంపతులకు జన్మించాడు బాబీ డియోల్‌. ఇతని అసలు పేరు విజయ్‌ సింగ్‌ డియోల్‌. నేడు 51వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు.(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.