జనవరి 29.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మేటి పాటల కోయిల! వేటూరి(జయంతి)


నా
లుగు దశాబ్దాల సినీ ప్రస్థానం... వేలాది గీతాలతో పదాభిషేకం... ప్రతి గీతం భావగర్భితం... సినీ జన మనోరంజితం... అసమాన పద ప్రయోగాల మాధుర్యం... అల్లరి పాటలైనా, అద్భుత గీతాలైనా ఆయన కలం నుంచి జాలువారిన పారిజాతాలే. ఆయనే వేటూరి. జర్నలిస్ట్‌గానైనా, గీత రచయితగానైనా ఆయన ముద్ర ప్రస్ఫుటం... స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక తదితర పత్రికల్లో పాత్రికేయునిగా ఆయన ప్రతి రచన పాఠకులను అలరించినదే. ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్‌ ఆయన. విలేకరిగా జాతీయ నాయకులైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌లాంటి ఎందరి ప్రసంగాలనో ఆయన పాఠకులకు ఆసక్తికరంగా నివేదించారు. ఇక ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన రాసిన ప్రతి పాట ఎంతో కొంత చెబుతుంది. ఓ పాట కొంటెగా కవ్విస్తే, మరో పాట పండితులను సైతం అబ్బుర పరుస్తుంది. ఓ పాట ప్రేమను కొత్త కోణంలో చూపిస్తే, మరో పాట జీవిత సత్యాన్ని గుండెల్లో నాటుతుంది. ఓ పాట గిలిగింతలు పెడితే, మరో పాట కంటతడి పెట్టిస్తుంది. ‘ఓ సీత కథ’లో ‘భారత నారీ చరితము...’తో మొదలైన ఆయన గీత రచన, వందలాది పాటల్లో కదం తొక్కింది.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* వాల్ట్‌డిస్నీకి నష్టం... లాభం!


వాల్ట్‌డిస్నీ అంటే యానిమేషన్‌ చిత్రాలు గుర్తొస్తాయి... అద్భుతమైన లైవ్‌యాక్షన్‌ సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి... సృజనాత్మక సంస్థగా మరెన్నో మనసులో మెదులుతాయి. కానీ... ఎవరికైనా పరాజయాలు తప్పవని నిరూపించిన సినిమా ‘స్లీపింగ్‌ బ్యూటీ’ (1959). డిస్నీ సంస్థ తీసిన ఆఖరి ఫెయిరీ టేల్‌ సినిమా ఇది. అంతవరకు విజయ పరంపరతో సాగిన ఈ సంస్థ ఈ సినిమాతో నష్టాలను మూటగట్టుకుంది. ఓ అందాల రాకుమారి ఓ శాపం కారణంగా సుదీర్ఘంగా నిద్రపోవడం, ఓ రాకుమారుడి నిజమైన ప్రేమతో పెట్టిన ముద్దు వల్లనే నిద్ర లేస్తుందనే శాప విమోచనం నేపథ్యంలో సాగే ఈ కథ అమెరికా ఫెయిరీ టేల్స్‌లో ఒకటి. అప్పట్లోనే దీన్ని 6 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కించారు. వాల్ట్‌ డిస్నీ బతికుండగా దీన్ని రీరిలీజ్‌ చేయలేదు. అయితే 1970, 1979, 1986, 1995ల్లో దీన్ని రీరిలీజ్‌ చేస్తే విజయవంతమవడం విశేషం. ఇలా విడుదల చేయడం వల్ల అది మొత్తం మీద 51.6 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటి ధరలతో పోలిస్తే ఇది ఏకంగా 623.56 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో సమానం. ఆపై దీన్ని వీడియోలుగా విడుదల చేస్తే 10 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. తర్వాత దీన్ని డీవీడీలు, బ్లూరే సాంకేతిక విధానాల్లో కూడా విడుదల చేశారు.

* అమెరికా, రష్యా కోల్డ్‌వార్‌


చా
లా గంభీరమైన, బాధాకరమైన విషయాలను నవ్వించేలా, వినోదాత్మకంగా చెప్పే సినిమాలను ‘బ్లాక్‌ కామెడీ’ చిత్రాలంటారు. అలాంటిదే ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌లవ్‌’. దీనికి మరో పేరు కూడా ఉంది... ‘హౌ ఐ లెర్న్‌డ్‌ టు స్టాప్‌ వర్రీయింగ్‌ అండ్‌ లవ్‌ ద బాంబ్‌’ అని. ఒకప్పుడు అమెరికా, రష్యాల మధ్య జరిగిన ఆధిపత్య పోరును ‘కోల్డ్‌వార్‌’ అనేవారు. అప్పటి విషయాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్‌ రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవ్వులు పూయించింది. అగ్రదేశాల పోకడల నేపథ్యంలో బ్రిటిష్‌ రచయిత పీటర్‌ జార్జి రాసిన థ్రిల్లర్‌ నవల ‘రెడ్‌ అలెర్ట్‌’ (1958) ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లేను అల్లుకున్నారు. అమెరికా వాయు దళానికి చెందిన ఉన్నతాధికారి సోవియట్‌ యూనియన్‌ మీద న్యూక్లియర్‌ బాంబ్‌ వేయాలని ఆదేశాలు జారీ చేయడం, ఆ సంగతి తెలిసి అమెరికా అధ్యక్షుడు ఇతర అధికారులతో కలిసి ఆ బాంబు వేయడానికి బయల్దేరిన పైలట్లను వెనక్కి పిలిపించడానికి నానా పాట్లు పడడం నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా సినిమా నడుస్తుంది. ఆ హడావుడి మధ్యలోనే నవ్వుకునేలా చేస్తుంది. 1964లో ఇదే రోజు విడుదలైన ఈ సినిమా 1.8 మిలియన్‌ డాలర్ల వ్యయానికి 9.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో పాటు, ‘వంద సినిమాలు... వందల నవ్వులు’ జాబితాలో చోటు సంపాదించుకుంది.

* బొమ్మ దద్దరిల్లిపోయింది...


సినిమా...
- 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 1.35 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది!
- మూడు ఆస్కార్లు, రెండు గోల్డెన్‌ గ్లోబ్స్, రెండు యాక్టర్స్‌ గిల్డ్, మూడు క్రిటిక్స్‌ ఛాయిస్‌ సహా ఎన్నో అవార్డులు అందుకుంది!
- 2018లో విడుదలైన సినిమాల్లో మేటి పది జాబితాలో నిలిచింది!
- అనేక బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించింది!
- ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ప్రశంసలు సాధించింది!
ఇలా విడుదలైన చోటల్లా ‘బొమ్మ దద్దరిల్లిపోయింది’ అనిపించుకున్న ఆ సినిమా ‘బ్లాక్‌ పాంథర్‌’!

హాలీవుడ్‌ నుంచి వచ్చే అనేక సూపర్‌హీరో సినిమాల్లో అదొకటి. ఇందులో బ్లాక్‌ పాంథర్‌ అనే సూపర్‌హీరో తన అతీంద్రియ శక్తులతో విజృంభించి దుండగుల పనిపడతాడు. మార్వెల్‌ కామిక్స్‌ పుస్తకాల్లో పుట్టిన కథల ఆధారంగా రూపుదిద్దుకున్న పద్దెనిమిదో సినిమా ఇది. ర్యాన్‌ కూగ్లర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ వాకాండా అనే ఊహాజనిత లోకంలో జరుగుతుంది. సినిమాలో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ప్రేక్షకుల్ని అద్భుతమైన అనుభూతిని పంచేలా అమరాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.