జులై 11 (సినీ చరిత్రలో ఈరోజు)...

* మెలోడీ బ్రహ్మ..
మణిశర్మ (పుట్టినరోజు)


బా
ణీలో బీటు కావాలన్నా... మెలోడీ అయినా మణిశర్మ తనదైన మార్క్‌ని ప్రదర్శిస్తూ స్వరాలు సమకూరుస్తారు. దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన స్వర ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో మరిచిపోలేని గీతాలు. తెలుగులో ‘అంతం’, ‘రాత్రి’ చిత్రాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. ‘ప్రేమించుకుందాం రా’, ‘బావగారూ బాగున్నారా?’, ‘గణేశ్‌’, ‘చూడాలని ఉంది’, ‘మనసిచ్చి చూడు’, ‘సమరసింహారెడ్డి’, ‘అనగనగా ఓ అమ్మాయి’, ‘నరసింహానాయుడు’, ‘చిరునవ్వుతో’, ‘ఖుషి’, ‘ప్రేమతో రా’, ‘భలే వాడివి బాసూ’, ‘సుబ్బు’, ‘సీమసింహం’, ‘టక్కరిదొంగ’, ‘ఆది’, ‘ఇంద్ర’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఒక్కడు’, ‘లక్ష్మీనరసింహ’, ‘ఆంజనేయం’, ‘అర్జున్‌’, ‘గుడుంబాశంకర్‌’, ‘చిరుత’, ‘పోకిరి’, ‘అతడు’, ‘ఖలేజా’... ఇలా ఎన్నో చిత్రాలున్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడాపలు చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. మెలోడీ బ్రహ్మగా మణిశర్మకి పేరుంది. పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన ఆయన అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరు మణిశర్మగా మారింది. ఈయన తండ్రి వై.ఎన్‌.శర్మ వయొలిన్‌ విధ్వాంసులు. సంగీతంలో తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదిగారు మణిశర్మ. తన కెరీర్‌లో ఎక్కువ గీతాల్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్‌.చిత్రలతో పాడించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్‌ కూడా సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. జులై 11న మణిశర్మ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

* హే రాజన్‌... శృంగార వీరన్‌...
సీఎస్సార్‌ (జయంతి)


తొ
లి తరం నటుడు సీఎస్సార్‌. శకుని పాత్ర అనగానే గుర్తుకొచ్చే నటుల్లో మొదటివారాయన. ‘మాయాబజార్‌’లో ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధానం ఎప్పటికీ మరిచిపోలేం. ‘చక్కగా ఉన్నావు సిగ్గులేకుండా...’ అని మాయా శశిరేఖతో వ్యంగ్యంగా అన్నా, ‘నా కన్నేమైనా మసకేసిందా... లేక శశిరేఖ ఏమైనా కనికట్టు నేర్చిందా అని...’ అయోమయాన్ని అభినయించినా ఆయనకే చెల్లింది. అంతే కాదు...‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులుగా, ‘ఇల్లరికం’లో మేనేజరుగా, ‘జయం మనదే’లో మతిమరుపు రాజుగా, ‘కన్యాదానం’లో పెళ్లిళ్ల పేరయ్యగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లోచెక్కు చెదరని స్థానం సంపాదించుకొన్న నటుడాయన. ‘హే రాజన్‌... శృంగార వీరన్‌’ అన్నా... ‘ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో...’ అనే సంభాషణ చెప్పినా... ‘అప్పు చేసి పప్పు కూడు’లో అప్పుఅనే మాటకి కొత్త అర్థాన్ని చెప్పి నవ్వించినా... అది ఒక్క సీఎస్సార్‌కే చెల్లింది. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా భిన్న పాత్రల్లో పోషించి నటుడిగా తన శైలిని ప్రదర్శించారు. పదకొండేళ్లకే రంగస్థలంపైకి అడుగుపెట్టిన ఆయనకి మెథడ్‌ యాక్టర్‌గా పేరుంది. పదాల్ని ఎక్కడ విరచాలో అక్కడ విరుస్తూ, ఒక్కొక్క సంభాషణని స్పష్టంగా పలుకతూ ఆయన నటనలో తనకి తానే సాటి అని నిరూపించుకొన్నారు. రంగస్థలంపై కృష్ణుడిగా, శివుడిగా, రాముడిగా, రామదాసు, తుకారాం, సారంగధర తదితర పాత్రల్లో నటించడమే కాకుండా, తన గాత్రమాధుర్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేవారు. 1907 జులై11న నరసరావుపేటలో జన్మించిన ఆయన అసలు పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. అప్పట్లో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి వరకు చదువుకొన్న ఆయనకి మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ నాటకాలపై మక్కువతో నటనపైనే దృష్టిపెట్టారు. 1933లో ఈస్టిండియా ఫిల్మ్‌ కంపెనీ నిర్మించిన ‘రామదాసు’లో కథానాయకుడిగా నటించారు. ‘ద్రౌపదీ వస్తాభ్రరణం’ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించారు. సారథి సంస్థ నిర్మించిన ‘గృహప్రవేశం’ సీఎస్సార్‌ జీవితాన్ని మలుపుతిప్పింది. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామెడీ విలన్‌ పాత్రలో నటించారు సీఎస్సార్‌. ‘మై డియర్‌ తులసమ్మక్కా...’ అంటూ అక్కను బుట్టలోవేసుకొనే పాత్రలో ఆయన కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘జీవితం’, ‘జగదేకవీరుని కథ’, ‘అప్పుడు చేసి పప్పుకూడు’ చిత్రాల్లోనూ సీఎస్సార్‌ పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. నటుడిగా విజయవంతమైన సీఎస్సార్‌ దర్శకత్వంలో మాత్రం రాణించలేకపోయారు. మూడు చిత్రాల్ని పట్టాలెక్కించినప్పటికీ, వాటిని పూర్తి చేయలేకపోయారు. తన జీవితంలో దాదాపుగా నటనాప్రయాణాన్నే కొనసాగించిన సీఎస్సార్‌ 1963, అక్టోబరు 8న చెన్నైలో కన్నుమూశారు. ఈ రోజు సీఎస్సార్‌ జయంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

* ‘గుండు’ వేషం...
గొప్ప అభినయం!


ప్ర
పంచవ్యాప్తంగా గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ‘యుల్‌ బ్రైనర్‌’ తెలుసా? - అని అడిగితే... ఎవరూ చెప్పలేరు! అదే... ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటైన ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’లో ఈజిప్టు చక్రవర్తి పరోవా రామెసెస్‌2 పాత్రధారుడు... అని చెబితే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆస్కార్, టోనీ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న ఇతడి ‘గుండు వేషం’ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఇతడి అభిమానులు చాలా మంది ఇతడిలాగే గుండు కొట్టించుకోవడం విశేషం. ఈ ఫ్యాషన్‌ ‘యుల్‌ బ్రైనర్‌ లుక్‌’గా పేరొందడం చిత్రం. రష్యాలో ఓ మారుమూల ప్రాంతంలో 1920లో ఇదే రోజు పుట్టిన బ్రైనర్‌ను విధి చైనాకి, ప్యారిస్‌కి, న్యూయార్క్‌కి తిప్పి హాలీవుడ్‌లో మేటి నటుడిగా మార్చింది. నాన్న మరొకరిని పెళ్లిచేసుకుని కుటుంబాన్ని వదిలేస్తే, అమ్మతోపాటు చైనా వచ్చేసి, రెండో ప్రపంచ యుద్ధ భయంవల్ల ప్యారిస్‌కి మారిన బాల్యం ఇతడిది. ప్యారిస్‌ క్లబ్బుల్లో గిటార్‌ వాయించినా, ఫ్రెంచి సర్కస్‌లో ఐదేళ్లు పనిచేసినా అదంతా పొట్టకూటి కోసమే. ఆ సమయంలోనే లుకేమియా బారిన పడిన ఇతడిని తీసుకుని అమ్మ న్యూయార్క్‌ వలస వచ్చింది. విలక్షణ కంఠస్వరం ఉన్న బ్రైనర్‌ రేడియో ఎనౌన్సర్‌గా, నాటకాల్లో వేషధారుడిగా పనిచేశాడు. టీవీ కార్యక్రమాలకు దర్శకుడిగా కూడా మారాడు. అప్పుడే అతడికి ‘ద కింగ్‌ అండ్‌ ఐ’ అనే నాటకంలో కింగ్‌ మోంగ్‌కట్‌ వేషం వచ్చింది. ఆ పాత్ర కోసమే అతడు తొలిసారి ‘గుండు’ కొట్టించుకున్నాడు. ఆ నాటకం విజయవంతం కావడంతో అదే పాత్రను వేదికలపై ఏకంగా 4,625 సార్లు ప్రదర్శించడం విశేషం. ‘గుండు’ నచ్చడంతో నిజ జీవితంలో కూడా అలాగే ఉండిపోయిన బ్రైనర్, అదే కింగ్‌ పాత్రతో 1956లో వెండితెర నటుడిగా మారాడు. ఆ సినిమాకి ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు. వెంటనే ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ సినిమాలో ఈజిప్టు చక్రవర్తి పాత్ర లభించింది. దీంతో అతడి ఖ్యాతి ప్రపంచమంతా పాకింది. ఆపై ఇతడు ‘ద మ్యాగ్నిఫియంట్‌ సెవెన్‌’, ‘రిటర్న్‌ ఆఫ్‌ ద సెవెన్‌’, ‘వెస్ట్‌ వరల్డ్‌’, ‘అనస్టాషియా’, ‘ద జర్నీ’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నాడు. నటుడిగా, దర్శకుడిగానే కాక ఫొటోగ్రఫీలో కూడా కృషి చేసి రెండు పుస్తకాలు కూడా రచించాడు.

* మాంత్రికుల బడిలో మాయల కథ


హో
గ్‌వార్ట్స్‌ అని చెబితే చాలు... ప్రపంచవ్యాప్తంగా మాయలు నేర్పే బడి అని అందరూ చెప్పగలుతారు. అంతలా అందరికీ నచ్చిన కథే ‘హ్యారీపాటర్‌’ కథ. జెకే రౌలింగ్‌ రాసిన ఈ కథలలో ఐదవ నవలైన ‘హ్యారీపాటర్‌ అండ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫీనిక్స్‌’ ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా 2007లో ఇదే రోజు విడుదలైంది. 150 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 940 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.

* హాలీవుడ్‌కే ‘రాజు’


నటుడు గొప్పగా పేరు తెచ్చుకోవడం వేరు. కానీ ఓ సినీ పరిశ్రమకే ‘రాజు’గా కీర్తి పొందడం చాలా అరుదైన విషయమే. దాన్ని సాధించిన నటుడే విలియం క్లార్క్‌ గేబుల్‌. ‘ద కింగ్‌ ఆఫ్‌ హాలీవుడ్‌’గా గురింపు పొందిన ఇతడు మూడు దశాబ్దాల పాటు చిత్రపరిశ్రమను ఏలాడనే చెప్పవచ్చు. మొదట్లో బస్‌బాయ్‌గా పనిచేసి, నిశ్శబ్ద చిత్రాల్లో ఎక్స్‌ట్రా వేషాలు వేసి, కొన్ని చిత్రాల్లో చిన్నాచితకా సహాయ పాత్రలు ధరిస్తూ నెట్టుకొచ్చిన గేబుల్, ఆ తరువాత 60 గొప్ప చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ‘ఇట్‌ హ్యాపెన్డ్‌ వన్‌ నైట్‌’ (1934) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ గెలుచుకున్నాడు. కాసులు కురిపించగలిగే మేటి పది నటుల్లో ఒకడిగా ఏకంగా 16 సార్లు ఎంపికవడం విశేషం. ‘మ్యూటినీ ఆన్‌ ద బౌంటీ’ (1935), ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ (1939) లాంటి ఎన్నో చిత్రాల్లో గొప్ప నటుడిగా పేరు పొందాడు. అప్పట్లో అందాల తారలుగా పేరొందిన జోవాన్‌ క్రాఫోర్డ్, మిర్నాలాయ్, లానా టర్నర్, నార్మాషేరర్, మార్లిన్‌ మాన్రోలతో కలిసి నటించాడు. ఇతడు 1955లో ఇదే రోజు నటి కే స్పెక్రిల్స్‌ను పెళ్లాడాడు.

* అవార్డుల నటుడు


నాలుగు ఆస్కార్‌ అవార్డులు...

రెండు బ్రిటిష్‌ అకాడమీ అవార్డులు...
అయిదు ఎమ్మీ అవార్డులు...
మూడు గోల్డెన్‌ గోల్డ్‌ అవార్డులు...
బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’, నైట్‌హుడ్, లైఫ్‌ పీరేజ్‌ పురస్కారాలు...
ఇవి కాక బ్రిటన్‌లో అతిపెద్ద ఆడిటోరియానికి అతడి పేరు... అతడి పేరిట ఎలా అఆర్డుల ప్రదానం...
-ఇవన్నీ ఓ నటుడి ప్రస్థానంలో మైలురాళ్లు. విలక్షణ నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నటుడే లారెన్స్‌ ఆలివర్‌. నాటక రంగం, సినిమా, బుల్లితెర రంగాల్లో అతడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌ పట్టణంలో 1907 మే 22న పుట్టిన ఇతడు తండ్రి ప్రోత్సాహంతో నటనారంగంలోకి వచ్చాడు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పదేళ్ల వయసులో నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆపై వెండితెరపై వెలిగాడు. ‘ఒథెల్లో’, ‘ద మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌’, ‘ఊదరింగ్‌ హైట్స్‌’, ‘రెబెక్కా’, ‘హామ్లెట్‌’, ‘ద షూస్‌ ఆఫ్‌ ద ఫిషర్‌మేన్‌’, ‘మారథాన్‌ మేన్‌’, ‘ద బాయిస్‌ ఫ్రమ్‌ బ్రెజిల్‌’లాంటి ఎన్నో సినిమాల ద్వారా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ విలక్షణ నటుడు 1989 జులై 11న మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.