జులై 13 (సినీ చరిత్రలో ఈరోజు)...

 కొండెక్కిన ‘హాలీవుడ్‌’ సంతకం!


త్తయిన కొండ... దానిపై తళతళలాడుతూ, సుదూరానికి కూడా కనిపించే ‘హాలీవుడ్‌’ అనే ఆంగ్ల అక్షరాలు... అమెరికా అనగానే గుర్తొచ్చే ప్రస్ఫుటమైన చిహ్నాల్లో ఈ హాలీవుడ్‌ కొండ ఒకటి. దీన్ని ‘హాలీవుడ్‌ సైన్‌’ అంటారు. దీనికీ ఓ చరిత్ర ఉంది. 1923లో ఇదే రోజు ఈ హాలీవుడ్‌ సంతకం అధికారికంగా ప్రజలకు అంకితం అయింది. మొదట్లో ‘హాలీవుడ్‌ ల్యాండ్‌’ అనే అక్షరాలు ఉండేవి. తర్వాత 1949లో మరమ్మతులు చేసినప్పుడు కేవలం హాలీవుడ్‌ అనే అక్షరాలనే ఉంచారు. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెలిస్‌లో హాలీవుడ్‌ హిల్స్‌ ప్రాంతంలో శాంటా మోనికా కొండల్లో మౌంట్‌లీ అనే కొండమై ఇది కనిపిస్తుంది. హాలీవుడ్‌ సంతకంలోని ఒకో అక్షరం 44 అడుగుల ఎత్తుగా ఉంటుంది. మొత్తం అన్ని అక్షరాలు కలిపి 352 అడుగుల పొడవుగా అమరి ఉంటాయి. ఇంతకీ దీన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటో తెలుసా? 1923లో ఆ చుట్టుపక్కల రియల్‌ఎస్టేట్‌ పెరగడానికి ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌గా ఉండడం కోసమే దీన్ని నెలకొల్పాలనుకున్నారు. తరువాత దీనికి విపరీతంగా ప్రాచుర్యం పెరిగిపోవడంతో దీన్ని కాపాడడానికి ఓ ట్రస్ట్‌ కూడా ఏర్పడింది. ‘ఫాదర్‌ ఆఫ్‌ హాలీవుడ్‌’గా తరువాత పేరు తెచ్చుకున్న హెచ్‌.జె.వైట్లీ అనే రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ ఆలోచన ఇది. తరవాత మరికొందరు కలిసి 4000 విద్యుత్‌ బల్బులతో వెలిగేలా ఈ అక్షరాలను అప్పట్లో 21,000 డాలర్ల వ్యయం (ఇప్పుడు సుమారు 3 లక్షల డాలర్లు)తో నెలకొల్పారు. మొదట్లో కేవలం ఓ ఏడాదిన్నర కాలం పాటు ఉండాలని అనుకున్నా, తరువాత లాస్‌ఏంజెలిస్‌లో అమెరికా సినిమా రంగం విస్తరించడంతో దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దాంతో వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌ సైన్‌లో ఒకో అక్షరానికి వేర్వేరు వ్యక్తులు విరాళాలు ఇచ్చి దాతలుగా కొనసాగుతున్నారు.

 600 కోట్ల డాలర్లు

కురిపించిన కథానాయకుడు!


స్టార్‌వార్స్‌... ఇండియానా జోన్స్‌... బ్లేడ్‌ రన్నర్‌... చిత్రాల్లో దేన్ని తల్చుకున్నా వెంటనే గుర్తొచ్చే హాలీవుడ్‌ హీరో హారిసన్‌ ఫోర్డ్‌. నిర్మాతగా, నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇతడు బాక్సాఫీస్‌ హీరోగా గుర్తింపు పొందాడు. 60 ఏళ్ల పాటు సాగిన సినీ ప్రస్థానంలో ‘ఎపోకలిప్స్‌ నౌ’, ‘ప్రెస్యూమ్డ్‌ ఇన్నోసెంట్‌’, ‘ద ఫ్యుగెటివ్‌’, ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’, ‘వాట్‌ లైస్‌ బినీత్‌’, ‘అమెరికన్‌ గ్రాఫిటీ’, ‘ద కన్వర్‌జేషన్‌’, ‘విట్‌నెస్‌’, ‘పేట్రియట్‌ గేమ్స్‌’, ‘క్లియర్‌ అండ్‌ ప్రెసెంట్‌ డేంజర్‌’, ‘స్టార్‌వార్స్‌’ లాంటి చిత్రాలెన్నో బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇతడి సినిమాలన్నీ కలిసి 6 బిలియన్‌ డాలర్లను ఆర్జించడం విశేషం. ఇల్లినాయిస్‌లో 1942 జులై 13న పుట్టిన ఇతడు కాలేజీ రోజుల్లోనే నటన పట్ల ఆకర్షితుడయ్యాడు. సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలు పెట్టి క్రమేణా స్టార్‌డమ్‌ సంపాదించాడు.

 మూడు రంగాల నటుడు


నాటక రంగం, టెలివిజన్‌ రంగం, సినిమా రంగాల్లో విలక్షణ నటుడిగా ఆరు దశాబ్దాల పాటు పేరు పొందడం ఆసక్తికరం. అలాంటి నటుడే ప్యాట్రిక్‌ స్టివార్ట్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ‘సర్‌’ బిరుదును పొందడంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న నటుడితడు. ‘ఎక్స్‌మెన్‌’ సినిమా చూస్తే అందులో ప్రొఫెసర్‌ చార్లెస్‌ జేవియర్‌ పాత్రలో కనిపించేది ఇతడే. ‘స్టార్‌ ట్రెక్‌: ద నెక్స్‌ట్‌ జెనరేషన్‌’ సినిమాల్లో కెప్టెన్‌ జీన్‌లుక్‌ పికార్డ్‌ పాత్ర ద్వారా ఈతరం ప్రేక్షకులనూ మెప్పించాడు. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’ గౌరవాన్ని, ఎలిజబెత్‌ రాణి ద్వారా ‘నైట్‌హుడ్‌’ గౌరవాన్ని పొందాడు. ఇంగ్లండ్‌లో 1940 జులై 13న పుట్టిన ఇతడు బాల్యంలో పేదరికాన్ని, తండ్రి నుంచి హింసను అనుభవించాడు. చదువుకునే రోజుల్లో ఇంగ్లిష్‌ టీచర్‌ షేక్స్‌పియర్‌ పుస్తకాన్ని ఇచ్చి అందలోని పాత్రల్లో నటించమని ప్రోత్సహించడంతో ఇతడు అడుగులు అభినయ రంగంకేసి పడ్డాయి. పదిహేనేళ్ల కల్లా నాటకాల్లో మంచి పాత్రలు ధరించి ఆకట్టుకున్నాడు. కొనాళ్లు విలేకరిగా ఉద్యోగం చేసినా నటనకు స్వస్తి పలకమని యాజమాన్యం శాసించడంతో ఉద్యోగాన్నే వదులుకుని నటనను కొనసాగించాడు. నాటకాలు, టీవీ సీరియల్స్‌ ద్వారా ప్రాచుర్యం పొందిన ఇతడు ‘స్టార్‌ ట్రెక్‌’ సినిమా ద్వారా వెండితెర నటుడయ్యాడు. ఇతడి నటనా ప్రస్థానం ఆరు దశాబ్దాల నుండి కొనసాగింది.

 మేటి దర్శకులలో ఒకడు!


రవై ఒకటవ శతాబ్దంలో ప్రభావశీలురైన చిత్ర రూపకర్తల్లో ఒకడిగా క్రిస్టోఫర్‌ ఎడ్వార్డ నోలన్‌ను చెప్పుకోవాలి. దర్శకుడిగా, నిర్మాతగా, స్కీన్ర్‌ప్లే రచయితగా పేరొందిన ఇతడు తీసిన చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ఆయన తీసిన పది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 4.7 బిలియన్‌ డాలర్లు ఆర్జించాయి. 34 ఆస్కార్‌ నామినేషన్‌లను పొంది పది ఆస్కార్‌ అవార్డులను సాధించిన దర్శకుడితడు. 2017లో ఆస్కార్‌ పొందిన ‘డన్‌కిర్క్‌’ ఇతడు తీసిందే. ‘ఇన్‌సోమ్నియా’, ‘ద ప్రెస్టేజ్‌’, ‘ద డార్క్‌ నైట్‌ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’ చిత్రాలు అంతర్జాతీయంగా ప్రేక్షకులను మెప్పించాయి. ఇతడు తీసిన డన్‌కిర్క్‌ చిత్రం 2017లో జులై 13న లండన్‌లో విడుదలైంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసిన సినిమా. డన్‌కిర్క్‌ అనేది ఫ్రాన్స్‌లోని ఓ నగరం. ఇక్కడ మొహరించి ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం సైనికులను జర్మన్‌ సైన్యం అనూహ్యంగా చుట్టుముడుతుంది. భూమి, జల, వాయు మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ఆ సైనికుల మధ్య పోరాటం ఎలా జరిగిందనే విషయాలను చరిత్ర ఆధారంగా ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. దాదాపు 150 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా, 526.9 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. మూడు ఆస్కార్‌ అవార్డులతో పాటు, క్రిటిక్స్‌ ఛాయిస్, బ్రిటిష్‌ అకాడమీ, గోల్డెన్‌ గ్లోబ్‌ లాంటి అవార్డులను అందుకుంది. ఈ సినిమా కోసం 1940 నాటి ఓడలు, విమానాలను, అప్పటి ఆయుధాలను వాడుతూ వాస్తవికంగా తీశారు. వేలాది మంది ఎక్స్‌ట్రాలను సైనికులుగా ఉపయోగించారు. తక్కువ మాటలతో ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తీసిన ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నింటిలోకీ ఉత్తమమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.