జులై 14.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సుస్వరాల సినీ సంగీత చక్రవర్తి!
ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ 
(వర్థంతి-2015)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

* తెలుగు సినిమా ఆభరణం... 
తనికెళ్ల భరణి (పుట్టినరోజు)


నటుడు, రచయిత, దర్శకుడు, శివభక్తుడు... ఇలా తనికెళ్ల భరణిలో ఎన్నో రూపాలు. ప్రతినాయక పాత్రలైనా, కామెడీ పాత్రలైనా, క్యారెక్టర్‌ నటుడిగానైనా తన మార్క్‌ చూపించకుండా వదిలిపెట్టరు భరణి. ‘లేడీస్‌ టైలర్‌’తో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన 750 పైచిలుకు చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు. ‘శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’ చిత్రంలో దొరబాబుగా, ‘శివ’ చిత్రంలో నానాజీగా నటించిన తరువాత తనికెళ్ల భరణికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అవకాశాలు వరుసకట్టాయి. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘చెవిలో పువ్వు’, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘అప్పుల అప్పారావు’, ‘బలరామకృష్ణులు’, ‘మొండిమొగుడు పెంకిపెళ్లాం’, ‘గాయం’, ‘మనీ’, ‘యమలీల’, ‘శుభలగ్నం’, ‘మనీ మనీ’... ఇలా ఆయన నట ప్రయాణం దూసుకెళ్లింది. మరో పక్క రచనలోనూ తన ప్రావీణ్యం ప్రదర్శించారు భరణి. ‘కంచు కవచం’తో రచయితగా పరిచయమైన ఆయన ఆ తరువాత ‘శివ’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘చెట్టుకింద ప్లీడర్‌’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’, ‘స్వరకల్పన’ తదితర విజయవంతమైన చిత్రాలకి మాటలు సమకూర్చారు. ‘మన్మథుడు’, ‘ఒకరికి ఒకరు’, ‘సాంబ’, ‘మల్లీశ్వరి’, ‘గోదావరి’, ‘హ్యాపీ’ తదితర చిత్రాల్లో తనికెళ్ల భరణి పరిణతితో కూడిన పాత్రల్లో నటించారు. ‘మిథునం’తో దర్శకుడిగా కూడా విజయాన్ని అందుకొన్నారు భరణి. ‘సముద్రం’లో నటనకిగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా, ‘నువ్వు నేను’లో నటనకి ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా, ‘మిథునం’కిగానూ ఉత్తమ మాటల రచయితగా, ‘గ్రహణం’ చిత్రంలో నటనకి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాల్ని అందుకొన్నారు. శివభక్తుడైన భరణి శివుడి లీలలపై ‘ఆటకదరా శివ’, ‘శభాష్‌ శంకర’ అనే పుస్తకాల్ని రచించారు. 1954 జులై 14న సేతు తనికెళ్ల రామలింగేశ్వరరావు, తనికెళ్ల లక్ష్మీనరసమ్మ దంపతులకి జన్మించిన భరణికి... కుమారుడు తనికెళ్ల మహాతేజ, కుమార్తె మంగళంపల్లి సౌందర్యలహరి ఉన్నారు. ప్రముఖ నటుడు రాళ్లపల్లి ప్రోత్సాహంతో భరణి రచయితగా, నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగులు వేశారు. మేనరిజమ్‌లోనూ, సంభాషణలు పకలడంలోనూ ప్రత్యేకతని ప్రదర్శించే భరణి తెలుగు తెరపై గుర్తుండిపోయే ఎన్నో పాత్రల్ని పోషించి మెప్పించారు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* గబ్బిలం వీరుడి సంచలనం!


చిన్నప్పుడు ఓ కుర్రాడు కామిక్‌ పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. అందులోని ఓ కథ అతడికెంతో నచ్చింది. పెద్దయ్యాక ఆ కుర్రాడు ఆ కథ స్ఫూర్తితో ఓ సినిమా తీశాడు. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి కాసులు కురిపించడంతో పాటు ఆస్కార్‌ అవార్డులు కూడా సాధించింది. ఆ కుర్రాడి పేరు క్రిస్టోఫర్‌ నోలన్‌ అయితే అతడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ద డార్క్‌ నైట్‌’. సూపర్‌ హీరోల కథలతో వచ్చిన సినిమాల్లో ఉత్తమమైనదిగా పేరుతెచ్చుకున్న ఇది, 2008లో జులై 14న విడుదలైంది. 185 మిలియన్‌ డాలర్లతో తీస్తే, 100 కోట్ల డాలర్లకు పైగా ఆర్జించింది. గబ్బిలం మనిషిగా మారి అద్భుత శక్తులు ప్రదర్శించే బ్యాట్‌మన్‌ సినిమాల ట్రయాలజీలో ఇది రెండవది. మొదటి సినిమా ‘బ్యాట్‌మన్‌ బిగిన్స్‌’ (2005) అయితే మూడోది ‘ద డార్క్‌ నైట్‌ రైజెస్‌’ (2012).

* ప్రయాణంలో పదనిసలు


సినిమాల్లో ‘రోడ్‌ ఫిల్మ్స్‌’ అనే రకం ఉంది. రోడ్డుపై ప్రయాణమే ప్రధానాంశంగా సాగే కథ అన్నమాట. అలాంటి కథాంశంతో హాలీవుడ్‌లో 1969లోనే ఓ సినిమా వచ్చింది. అదే ‘ఈజీ రైడర్‌’. ఇద్దరు కలిసి రెండు బైక్స్‌పై లాస్‌ ఏంజెలిస్‌ నుంచి న్యూ ఓర్లియాన్స్‌కి చేసే ప్రయాణంలో ఎవరెవర్ని కలుసుకున్నారు, ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నారనేదే కథ. ఈ సినిమాను కేవలం 4 లక్షల డాలర్లతో తీస్తే ప్రపంచవ్యాప్తంగా 600 లక్షల డాలర్లను వసూలు చేసింది. అక్రమంగా మాదక ద్రవ్యాలను అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించిన ఇద్దరు హిప్పీలు, ఆ డబ్బును బైక్స్‌లో రహస్యంగా దాచి జల్సా చేయాలనే ఉద్దేశంతో బయలు దేరుతారు. దారిలో వారి మజిలీలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, పోలీసుల సోదాలు, అమ్మాయిలతో ప్రేమలు... ఇలా సినిమా నడుస్తుంది. అమెరికా సమాజంలో 1960 ప్రాంతంలో అంతర్లీనంగా మాదక ద్రవ్యాల సంస్కృతి ఎలా వ్యాపిస్తోందో, యువత ఎలా బలవుతున్నారో, నేరాలు ఎలా ప్రబలుతున్నాయో, దాని వల్ల జీవనశైలి ఎలా మారుతోందో ఇద్దరు నేరస్థుల కోణంలో చెప్పిన ఈ సినిమా, కేన్స్‌ చిత్రోత్సవంలో అవార్డును అందుకుంది. అమెరికా ‘వందేళ్లు.. వంద మేటి సినిమాలు’ జాబితాలో చోటు సంపాదించుకుంది. దీన్ని 2019 కేన్స్‌ చిత్రోత్సవంలో కూడా ప్రదర్శించడం విశేషం.

* అద్భుత పాత్రల సృష్టికర్త


టామ్‌ అండ్‌ జెర్రీ, స్కూబీడూ, స్మర్ఫ్స్, యోగి బేర్‌... ఈ పాత్రల గురించి తెలియని వారు ప్రపంచవ్యాప్తంగా ఉండరనడంతో అతిశయోక్తి లేదు. ఇలాంటి పాత్రలకు తన కుంచెతో ప్రాణం పోసిన చిత్రకారుడు విలియం హన్నా. యానిమేటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, వాయిస్‌ యాక్టర్‌గా, కార్టూన్‌ ఆర్టిస్ట్‌గా, సంగీత కారుడిగా తనదైన ముద్ర వేసిన సృజనశీలి. తన స్నేహితుడు జోసెఫ్‌ బర్బెరాతో కలిసి ‘హన్నా బార్బెరా’ స్టూడియోను నెలకొల్పి అద్భుతమైన పాత్రలతో కార్టూన్‌ స్ట్రిప్స్‌ నుంచి పుస్తకాలు, బొమ్మలు, టీవీ సీరియల్స్, వెండితెర సినిమాలతో వినోద ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. వీళ్లు సృష్టించిన పాత్రలు అమెరికా సంస్కృతిలో ఓ భాగమైపోవడం విశేషం. వీరి పాత్రలను అప్పటి రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మంది చూశారనేది ఓ అంచనా. ఈ పాత్రల కథలు దాదాపు 28 భాషల్లోకి తర్జుమా అయ్యాయి. మెక్సికోలో 1910 జులై 14న తల్లిదండ్రుల ఏడుగురి సంతానంలో ఏకైక మగపిల్లవాడిగా పుట్టిన విలియం హన్నా, పన్నెండేళ్ల వయసులో శాక్సాఫోన్‌ వాయించేవాడు. సంగీతంపై అప్పట్లో పెంచుకున్న మక్కువ భవిష్యత్తులో అతడి సినిమాలకు ఎంతగానో ఉపయోగపడింది. బొమ్మలు గీయడంలో ప్రావీణ్యం సాధించాడు. అదే అతడిని యానిమేటర్‌గా మార్చింది. వినోద రంగంలో తన పాత్రలతో చెరగని ముద్ర వేసిన ఈయన 2001 మార్చి 22న తన 90వ ఏట కాలిఫోర్నియాలో మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.