జులై 15.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సరస సంభాషణల రచయిత!
 డి.వి.నరసరాజు (జయంతి)


సినిమాల్లో అవకాశం కోసం ఆయన ప్రయత్నించలేదు. అవకాశమే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఓ సినిమాలోని మాటల్ని పదే పదే తల్చుకుని ప్రేక్షకులు మురిసిపోయారంటే అది ఏ రచయితకైనా గర్వకారణమే. ఆ ఘనతను తొలి సినిమాతోనే సాధించారాయన. ఎన్నో హిట్‌ సినిమాల్లో ఆయన రాసిన సంభాషణలు ఆనాటి చిత్రాలను తల్చుకున్న వారికి ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. ఆయనే డి.వి.నరసరాజు. ఆయన సంభాషణలు కృతకంగా ఉండవు. సహజంగా ఉంటూనే చమక్కులు ఒలికిస్తాయి. చమత్కారాన్ని చవి చూపిస్తాయి. సున్నితమైన హాస్యంతో హాయిగా నవ్విస్తాయి. చురుకైన వ్యంగ్యంతో నవ్వుకునేలా చేస్తాయి.

(ప్రత్యేక వార్తకోసం క్లిక్‌ చేయండి)

* కాసులు కురిపించిన యాక్షన్‌ చిత్రం..


ఓ సినిమా... ఎన్నో వీడియో గేమ్స్‌కీ, మరెన్నో కామిక్‌ పుస్తకాలకీ, ఇంకా ఎన్నో ఆట బొమ్మల తయారీకీ కారణమై ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలకు నాంది పలికింది. ఆ చిత్రమే ‘డై హార్డ్‌’. 1988లో జులై 15న విడుదలైన ఇది హాలీవుడ్‌ నటుడు బ్రూస్‌విల్లీస్‌కి యాక్షన్‌ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. అంతేకాదు అయిదు సినిమాల సీక్వెల్స్‌కి కారణమైంది. ఓ ఆకాశహర్మ్యంలో జరుగుతున్న పార్టీలోకి ఉగ్రవాదులు జొరబడి అందరినీ బందీలుగా మారుస్తారు. 640 మిలియన్‌ డాలర్లను బాండ్ల రూపంలో ఇవ్వకపోతే అందరినీ చంపేస్తామంటారు. అయితే ఆ పార్టీలో న్యూయార్క్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌కి చెందిన డిటెక్టివ్‌ జాన్‌ మెక్లేన్‌ కూడా ఉంటాడు. అతడే హీరో బ్రూస్‌విల్లీస్‌. అతడు రహస్యంగా తప్పించుకుని ఉగ్రవాదుల ఆటను ఎలా కట్టించాడనేదే సినిమా కథ. 1979లో రోడెరిక్‌ థార్ప్‌ రాసిన ‘నథింగ్‌ లాస్టస్‌ ఫరెవర్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను 28 మిలియన్‌ డాలర్లతో తీయగా, 140 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. దీన్ని నేషనల్‌ ఫిలిం రిజిస్ట్రీలో భద్రపరిచారు. 500 గొప్ప చిత్రాల్లో ఒకటిగా దీన్ని గుర్తించారు. ఈ సినిమా కథకు కొనసాగింపుగా మరో నాలుగు సీక్వెల్స్‌ వచ్చాయి.

* మంత్రాల కుర్రాడు మళ్లీ వచ్చాడు..


హ్యారీపాటర్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. జేకే రౌలింగ్‌ రాసిన ఈ నవలలు అత్యధికంగా అమ్ముడు పోవడంతో పాటు వాటి ఆధారంగా తీసిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. అలాంటి హ్యారీపాటర్‌ సినిమాల్లో ఆరవదిగా వచ్చిన ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద హాఫ్‌ బ్లడ్‌ ప్రిన్స్‌’ సినిమా 2009లో జులై 15న విడుదలైంది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 47వ స్థానంలో నిలిచింది. 250 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీసిన ఇది, 934 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

* కుర్రాళ్ల పెళ్లి సందడి


ఎక్కడ 40 మిలియన్‌ డాలర్లు...

ఎక్కడ 285.2 మిలియన్‌ డాలర్లు!

పెట్టుబడికి ఇంతలేసి లాభాలు తెచ్చిన సినిమా ఇద్దరు కుర్రాళ్ల కథ. వాళ్ల కుర్ర వేషాల కథ. వాళ్ల ప్రేమల కథ. అదే ‘వెడ్డింగ్‌ క్రాషర్స్‌’ (2005). ప్రపంచ వ్యాప్తంగా నవ్వులు పంచిన ఈ సినిమాలో ఇద్దరు కుర్రాళ్లు ఎక్కడ ఏ పెళ్లి జరిగినా ఎలాగోలా హాజరైపోతుంటారు. ఎందుకో తెలుసా? అమ్మాయిలకు లైన్‌ వేయడం కోసం. అలా ఇద్దరూ కలిసి ఓసారి అమెరికా ట్రెజరీ సెక్రటరీ కూతురి పెళ్లిలో దూరిపోతారు. అక్కడ వాళ్లకి నిజమైన ప్రేమ దొరుకుతుంది. ఇద్దరు అమ్మాయిలతో పీకల్లోతు ప్రేమలో పడిపోతారు. ఆ అమ్మాయిలు ఎవరు? వీళ్ల నేపథ్యం ఏమిటి? వీళ్ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేదే సినిమా. ఈ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. ఎమ్‌టీవీ మూవీ అవార్డ్స్,‌ లాంటి పురస్కారాలు అందుకుంది. దర్శకుడు డేవిడ్‌ డొబ్కిన్‌. నటీనటులు ఓవెన్‌ విల్సన్, విన్స్‌ వాగన్, క్రిస్టోఫర్‌ వాల్కెన్, రాచెల్‌ మెక్‌ ఆడమ్స్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.