జులై 17.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఎన్టీఆర్‌ ప్రయోగం!


వెండితెరకు పరిచయమైన తొలి రోజుల్లోనే ప్రయోగాత్మక పాత్ర పోషణకు ఎవరూ సిద్ధం కారు. కానీ ఎన్టీఆర్‌ ఆ పని చేశారు. 1951లో సినిమా నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్‌ 1953లోనే ఓ అమాయకుడి వేషం వేయడానికి సాహసించారు. ఆ సినిమానే ‘పిచ్చిపుల్లయ్య’. ఎన్టీఆర్‌ సొంత సంస్థ ఎన్‌.ఎ.టి. బ్యానర్‌పై తీసిన తొలి సినిమా ఇది. ఆ సినిమా 1953, జులై 17న విడుదలైంది.

(ప్రత్యేక వార్తకోసం క్లిక్‌ చేయండి)

* పాత్రలకు... ఓ నిండుదనం రంగనాథ్‌!

(జయంతి-1949)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* హిచ్‌కాక్‌ దెబ్బకి...

అమాయకుడు పరుగో పరుగు!


దేశ రహస్యాలన్నీ ఓ మైక్రోఫిలింలో నిక్షిప్తమై ఉన్నాయి. దేశద్రోహులు కొందరు దాన్ని చేజిక్కుంచుకోవాలని చూస్తారు. వాళ్లను అడ్డుకోడానికి ప్రభుత్వం ‘కల్పన్‌’ అనే వ్యక్తిని పంపుతోందని తెలుస్తుంది. అతడు రాగానే కిడ్నాప్‌ చేసి చంపేయాలని దుండగులు పథకం వేస్తారు. ఓ రెస్టారంట్‌లో ఎదురుచూస్తుండగా ఓ అమాయకుడు అందులోకి వస్తాడు. దుండగులు అతడినే తమకు కావలసిన వ్యకిగా పొరబడతారు. కిడ్నాప్‌ చేసి ఎక్కడికో తీసుకుపోయి ప్రశ్నిస్తారు. ‘మీరనుకుంటున్న వ్యక్తిని నేను కాదు మొర్రో...’ అని మొత్తుకున్నా, అతడు అబద్ధం ఆడుతున్నాడనుకుంటారు. చంపేద్దామనుకుంటే వారి నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఇక మొదలవుతుంది వేట. తప్పించుకునే ప్రయత్నంలో అమాయకుడు ఓ కారును వేగంగా నడుపుతుంటే పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. తన కిడ్నాప్‌ సంగతి చెప్పినా వాళ్లు నమ్మరు. వాళ్ల నుంచీ తప్పించుకుంటాడు. ఓ హోటల్‌ గదిలోకి వెళితే అనుకోకుండా ఓ హత్యకేసు మీద పడుతుంది. అలా ఇటు దుండగులు, అటు పోలీసుల నుంచి తప్పించుకుంటూ పాపం... ఆ అమాయకుడు పడరాని పాట్లు పడతాడు. అసలు ‘కల్పన్‌’ అనే వ్యక్తి ఎవరో తెలుసుకుంటే తనకి తిప్పలు తప్పుతాయని అతడి కోసం ప్రయత్నిస్తాడు. ఆఖరికి ‘కల్పన్‌’ అనే వ్యక్తి లేడని, దుండగుల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వమే అతడిని సృష్టించిందని తెలుస్తుంది. ఇంతకీ మైక్రోఫిలిం ఎక్కడున్నట్టు? దాన్ని అమెరికా అధ్యక్షుల ముఖాలను చెక్కిన ‘రష్‌మోర్‌’ పర్వతంలో దాచారని తెలుస్తుంది. క్లైమాక్స్‌ శిఖరాగ్రానికి చేరుతుంది. మధ్యలో చేజింగ్‌లు, హత్యలు, ఎత్తులు, పైఎత్తులు... ఇంతకంటే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాకి ఏం కావాలి? అందుకనే ఈ కథతో వచ్చిన ‘నార్త్‌ బై నార్త్‌వెస్ట్‌’ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. దీని దర్శకనిర్మాత ఎవరో తెలుసా? ప్రఖ్యాత దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌. 1959 జులై 17న విడుదలైన ఈ సినిమా, తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రంగా పేరుతెచ్చుకుంది. ఈ సినిమాలోని ఎన్నో సన్నివేశాలను బాండ్‌ సినిమాలతో సహా చాలా చిత్రాల్లో అనుకరించారు. ప్రపంచ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఇది పేరొందింది. స్కీన్ర్‌ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్‌... ఇలా అనేక అంశాల్లో ఇప్పటికీ ఇది సినీరూపకర్తలకు ఓ పాఠంలాగా ఉపయోగపడుతోంది.

* డాలర్లు కురిపించిన చీమగాడు!


గబ్బిలం... సాలీడు... చీమ... కందిరీగ... ఇలా ఏ జీవైనా సరే హాలీవుడ్‌లో కాసులు కురిపించినవే. ఎలాగంటే ఆ జీవుల లక్షణాలతో రూపొందే సూపర్‌హీరోల సినిమాలుగా అవి అలరించడమే. ‘బ్యాట్‌మాన్‌’, ‘స్పైడర్‌ మాన్‌’లాగా ‘యాంట్‌ మ్యాన్‌’ కూడా వెండితెరపై విజృంభించిన కథే. అన్ని సూపర్‌ హీరోల కథల్లాగే ఈ ‘చీమగాడి’ కథ కూడా అమెరికాలోని కామిక్‌ పుస్తకాల్లో ప్రాచుర్యం పొందినదే. ఓ శాస్త్రవేత్త రూపొందించిన స్యూట్‌ వేసుకుంటే ఎవరైనా కుంచించుకుపోయి చీమంత అయిపోతారు. వాళ్లకప్పుడు కొన్ని శక్తులు కూడా వస్తాయి. ఈ కథతో 2015లో వచ్చిన ‘యాంట్‌మ్యాన్‌’ సినిమా అమెరికాలో జులై 17న విడుదలైంది. 109 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ ‘చీమగాడు’ ప్రపంచ వ్యాప్తంగా 519 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించి సాలీడు, గబ్బిలాలకు తానేమీ తీసిపోనని నిరూపించాడు.

* మురిపించిన ముసుగు వీరుడు


పాలకుల అన్యాయాలు పెచ్చుమీరినప్పుడు ఓ ముసుగు వీరుడు ఉద్భవిస్తాడు. అక్రమాలను ఎదిరించి ప్రజలకు ఆరాధ్యుడవుతాడు. అలాంటి ముసుగువీరుల కథలు అన్ని భాషల సినిమాల్లోను కనిపిస్తాయి. అలాంటి వీరుడే ‘జోరో’ కూడా. జాన్‌స్టన్‌ మెక్‌కుల్లే అనే రచయిత 1919లో రాసిన నవలలో ముసుగు వీరుడే జోరో. నల్లటి ముసుగు వేసుకుని, నల్లటి గుర్రంపై తిరిగే ఈ కత్తి వీరుడి కథ ఆధారంగా ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్‌ వచ్చాయి. అలా జోరో చేసే సాహసాలతో 1998లో ‘ద మాస్క్‌ ఆఫ్‌ జోరో’ విడుదలై ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 95 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా 250 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇందులో అసలైన జోరోగా ఆంథోనీ హాప్కిన్స్, అతడి దగ్గర శిక్షణ పొందిన యువ జోరోగా ఆంటోనియో బాండెరాస్, అతడి జోడీగా అందాల తార కేథరీన్‌ జెటా జోన్స్‌ నటించారు. ప్రముఖ దర్శకనిర్మాత స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ నిర్మించిన ఈ సినిమాకి మైకేల్‌ సోలోమన్, రాబర్ట్‌ రోడ్రిగ్వెజ్‌ దర్శకులుగా వ్యవహరించారు.

కథలోకి వస్తే 1821 నాటి కాలంలో మెక్సికన్‌ యుద్ధ సమయంలో పాలకుల అక్రమాలను ఎదిరించే ముసుగు వీరుడు జోరోపై కుట్ర పన్నుతారు. భార్యను చంపేసి అతడిని జైల్లో పెడతారు. కూతురు ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో 20 ఏళ్లు జైల్లో మగ్గిపోతాడు. చివరకి జైల్లోంచి తప్పించుకున్న అతడికి ఓ యువకుడు పరిచయమవుతాడు. అతడు కూడా తన సోదరుడిని, తండ్రిని చంపిన పాలకులపై పగ తీర్చుకోవాలని తపిస్తూ ఉంటాడు. అప్పుడు జోరో, అతడికి శిక్షణ ఇచ్చి తిరిగి ముసుగు వీరుడిగా మారుస్తాడు. ఇతడు జోరో కూతుర్ని కనుగొనడంతో పాటు దుర్మార్గుడైన పాలకుడిపై పగ సాధిస్తాడు. తర్వాత జోరో కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమాకి సీక్వెల్‌గా 2005లో ‘ద లెజెండ్‌ ఆఫ్‌ జోరో’ వచ్చింది.


                                                                * గిన్నెస్‌ రికార్డు పట్టేశాడు! డేవిడ్‌ హసెల్‌హోఫ్‌ అంటే తెలియకపోవచ్చు. కానీ ‘బేవాచ్‌’ టీవీ సీరియల్‌ నటుడంటే చటుక్కున గుర్తు పడతారు. అందులో లాస్‌ఏంజెలిస్‌ కౌంటీ లైఫ్‌గార్డ్‌ మిచ్‌ బుచన్నన్‌ పాత్రలో అందరికీ మెప్పించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ఆ సీరియల్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువైన ఇతడు నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణించాడు. టీవీలో అత్యధికులు వీక్షించిన నటుడిగా గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించాడు. అనేక టీవీ సీరియల్స్‌తో పాటు వెండితెరపై ‘క్లిక్‌’, ‘డాడ్జ్‌బాల్‌’, ‘ద స్పాంజ్‌బాబ్‌ స్క్వేర్‌ ప్యాంట్స్‌ మూవీ’, ‘హాప్‌’లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల్టిమోర్‌లో 1952 జులై 17న పుట్టిన ఇతడు ఏడేళ్ల నుంచే నాటకాల్లో వేషాలు ధరించడం విశేషం.


              బెంగాలీ చిత్ర తొలి కథానాయకి ...

కానన్ దేవి (
వర్థంతి)

 


(ప్రత్యేక వార్తకోసం క్లిక్‌ చేయండి)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.