జులై 18 (సినీ చరిత్రలో ఈరోజు)

మరపురాని మహానటుడు
ఎస్వీ రంగారావు (వర్థంతి-1974)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 అభినయ ‘సౌందర్యం’


చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చి, అచిరకాలంలోనే అందాల తారగా మారి, అభినయంతో అందరినీ ఆకట్టుకుని, అంతలోనే... కనుమరుగైన సౌందర్యను సినీ అభిమానులు ఎప్పటికీ మరువలేరు. అందం, చిలిపితనం, పరిధులు దాటని అభినయాలతో హుందా అయిన తారగా ఆమె ఆకట్టుకున్నారు. జులై 18 ఆమె జయంతి.


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

చలాకీ అందం... చక్కని అభినయం!
(ప్రియాంక చోప్రా పుట్టిన రోజు)ప్రియాంకచోప్రా అంటే ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. మిస్‌ ఇండియా నుంచి మిస్‌ వరల్డ్‌గా ఎదిగి, తన అంద చందాలతో సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రియాంకచోప్రా, ఇప్పుడు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. ఒక్క నటిగానే కాదు, గాయని, నిర్మాత, మానవతావదిగా బాహుముఖ ప్రజ్ఞశాలి అనిపించుకుంది. బిహార్‌లోని జెంషెడ్‌పూర్‌లో 1982 జులై 18న సైన్యంలో వైద్య సేవలు అందించే తల్లితండ్రులకు పుట్టిన ప్రియాంక, తాను కూడా సైన్యంలో చేరాలనే ఉద్దేశంతో ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరింది. కానీ సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో మనసంతా వెండితెరపైకి మళ్లింది. తొలుత ‘తమిళన్‌’ అనే చిత్రంతో అరంగేట్రం చేసింది. అందులో ఒక పాట కూడా పాడింది. ఆ తరువాత సన్నిడియోల్‌తో ‘ది లవ్‌స్టోరీ: ఆఫ్‌ ది స్పై’తో బాలీవుడ్‌కి పరిచయమైంది. కెరీర్‌ మొదట్లో అడుగులు తడబడినా, ‘ఐత్రాజ్‌’ సినిమాకు ఉత్తమ నటిగా ప్రశంసలు అందుకుంది. ఆపై అనేక అవార్డులు ప్రియాంకను వరించాయి. ఇక భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మశ్రీ’ అవార్డును ప్రియాంకకు అందించింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒకరిగా ‘ఫోర్బ్స్‌’ జాబితాలో స్థానం సంపాదించింది. బాలీవుడ్‌ కథానాయకులైన హృతిక్‌రోషన్‌తో కలిసి ‘క్రిష్‌’, క్రిష్‌ సిక్వెల్‌ చిత్రాల్లో, షారుఖ్‌తో ‘డాన్‌’, ‘డాన్‌2’, అభిషేక్‌ బచ్చన్, రితేష్‌దేశ్‌ముఖ్‌లతో ‘దోస్తానా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. తొలి నుంచి సంగీతం అంటే ఇష్టమే ఆ ఇష్టమే మ్యూజిక్‌ వీడియో - ఆడియో ఆడిపాడేలా చేసింది. తెలుగులో ‘అపురూపం’ చిత్రంలో మధుకర్, ప్రసన్నలతో కలిసి నటించింది. ఇక ఆ మధ్య వచ్చిన ‘తుఫాన్‌’లో రామ్‌చరణ్‌తో కలిసి నటించింది. మహిళా ప్రాధాన్యంతో వచ్చిన బాక్సర్‌ మేరీకోమ్‌ హ్మంగేట్‌ బయోపిక్‌ ‘మేరీకొమ్‌’, ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో వచ్చిన ‘గంగాజల్‌’లో మెప్పించింది. మధ్యలో చారిత్రక చిత్రం ‘బాజీరావు మస్తానీ’లాంటి వైవిధ్యమైన చిత్రాల్లోనూ నటించింది. ఇక టెలివిజన్‌ సిరీస్‌లోకి వస్తే మొదటి అక్షయ్‌కుమార్‌ యాంకర్‌గా ‘కత్రోం కే కిలాడి’లో చేసింది. అదే అనుభవంతో అమెరికన్‌ టెలివిజన్‌ టీవి షో ‘క్వాంటికో’లాంటి ప్రఖ్యాత టీవి సిరీస్‌లో నటించి ప్రపంప వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సమాజసేవలోనూ తీసిపోలేదు. యునిసెఫ్‌ రాయభారిగా, సామాజిక కార్యకర్తగా ‘ప్రియాంక చోప్రా ఫౌండేషన్‌’ పేరుతో గ్రామీణ పేదలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తూ తనలోని మానవతను చాటుకొంటుంది. హాలీవుడ్‌లో టాడ్‌ స్టాస్‌ షుల్సన్‌ దర్శకత్వంలో ‘ఈజ్‌నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌’లో యోగా ప్రచారకర్త ఇసాబెల్లాగా నటించింది. ప్రియాంక తన కంటే చిన్నవాడైన హాలీవుడ్‌ నటుడు, గాయకుడు నిక్‌ జోనాన్‌తో (డిసెంబర్‌ 2018) పెళ్లైయింది.


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 తొలి సూపర్‌ స్టార్‌...
రాజేష్‌ఖన్నా! (వర్థంతి-2012)


బాలీవుడ్‌లో తొలి సూపర్‌స్టార్‌... అమ్మాయిల మనసు దోచిన వెండితెర ప్రేమికుడు... అతడే రాజేష్‌ ఖన్నా. అతడి పేరిట ఉన్న ఓ రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదు... అదేంటో తెలుసా? అతడు నటించిన 15 వరస సినిమాలు సూపర్‌హిట్లు అయ్యాయి. 1969 నుంచి 1971 మధ్య జరిగిన అద్భుతమిది. అతడు బస చేసిన హోటల్స్‌ ముందు వందలాది మంది అమ్మాయిలు క్యూ కట్టి నిలబడిన స్టార్‌డమ్‌ అతడిది. అభిమానులు అతడి కారును ముద్దులతో ముంచెత్తిన ప్రాచుర్యం అతడిది. అమ్మాయిలు రక్తంతో ఉత్తరాలు రాసిన చరిత్ర అతడిది. ఓసారి హౌరా బ్రిడ్జి దగ్గర పడవలో షూటింగ్‌ జరపడానికి అధికారులు అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? అతడిని చూడ్డానికి వచ్చే అభిమానుల వల్ల హౌరాబ్రిడ్జి కుప్పకూలిపోతుందనే భయం చేత! బీబీసీ వాళ్లు అతడి మీద ‘బాంబే సూపర్‌ స్టార్‌’ పేరుతో ఓ సినిమా తీశారు. రాజేష్‌ఖన్నా నటించిన 168 సినిమాల్లో అత్యధిక భాగం హిట్లే. నటుడిగా, నిర్మాతగానే కాక లోక్‌సభ సభ్యుడిగా కూడా ఎదిగిన రాజేష్‌ ఖన్నా ప్రస్థానం 1966లో ‘ఆఖరీ ఖత్‌’తో మొదలైంది. ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్‌’ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అతడి సొంతం. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1942 డిసెంబర్‌ 29న పుట్టిన రాజేష్‌ ఖన్నా 1965లో నిర్మాతలు నిర్వహించిన టాలెంట్‌ హంట్‌లో పదివేల మందిలో ఒకడుగా నిలిచి, గెలిచాడు. అతడు నటించిన సినిమాలను, వాటిలోని పాటలను అభిమానులు ఎప్పటికీ మరువలేరు. ‘బాబీ’ సినిమాలో నటించిన డింపుల్‌ కపాడియాను 1973లో ఆ సినిమా విడుదలకు ఎనిమిది నెలల ముందు పెళ్లాడిన రాజేష్‌ఖన్నాకు ట్వింకిల్‌ ఖన్నా, రింకీ ఖన్నా కూతుళ్లు. రాజేశ్‌ ఖన్నా 2012 జూలై 18న అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 పాటలో తోటలో ఓ కోయిల!
(నేపథ్య గాయని ముబారక్‌ బేగం వర్థంతి)


బాలీవుడ్‌లో గాయనులు ఎందరున్నా ప్రత్యేక గుర్తింపు పొందిన వారు కొందరే. అలాంటివారిలో ముబారక్‌ బేగం ఒకరు. ఆలిండియా రేడియోలో లైట్‌ మ్యూజిక్‌ విభాగంలో ఉద్యోగినిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, 1950-60 దశకంలో బాలీవుడ్‌ చిత్రాల్లో నేపథ్యగాయనిగా పేరు తెచ్చుకొంది. ముబారక్‌ బేగం 178 హిందీ గీతాలను ఆలపించింది. ఆమె ఆఖరి చిత్రం ‘నై ఇమ్రాత్‌’ 1981లో విడుదలైంది. 1936లో పుట్టిన ముబారక్‌ బేగం నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధి కారణంగా అస్వస్థతకు గురై 2016 జులై 18న కన్నుమూసింది.


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 మరోసారి బాండ్‌ హంగామా


ఈ ప్రపంచంలో చంపడానికి ఎవరికైనా లైసెన్స్‌ ఉందంటే అది ఒక్కడికే. అతడే జేమ్స్‌బాండ్‌. అందుకే ఆ సినిమా పేరును ‘లైసెన్స్‌ టు కిల్‌’ అని పెట్టారు. దేశదేశాల్లో సినీ ప్రేమికులను ఆకర్షించే బాండ్‌ సినిమాల్లో ఇది పదహారో చిత్రం. బాండ్‌గా టిమోటీ డాల్టన్‌ చివరి సినిమా కూడా ఇదే. 1988లో జులై 18న శ్రీకారం చుట్టుకున్న ఇది, బాండ్‌ సినిమాల్లోనే తొలిసారిగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కాకుండా వేరే చోట షూటింగ్‌ జరుపుకుంది. అలాగే రచయితగా ఇయాన్‌ ఫ్లెమింగ్‌ పేరును టైటిల్స్‌లో వేయని తొలి బాండ్‌ చిత్రమిదే. ఫ్లెమింగ్‌ రాసిన రెండు చిన్న కథలు, ఒక నవలలోని కొన్ని అంశాలను తీసుకుని ఈ సినిమా కథను అల్లారు. కేవలం 32 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 156.1 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.