జులై 21.. (సినీ చరిత్రలో ఈరోజు)

* నక్షత్రమండలంలో కాసుల వేట..


నక్షత్ర మండలాల్లో కోట్లాది తారలు. వాటి చుట్టూ తిరిగే అనేకానేక గ్రహాలు. వాటిలో రకరకాల గ్రహాంతరవాసులు, జీవులు. అలాంటి తారాలోకంలో అంతరిక్ష దొంగలు పేట్రేగిపోతే? అప్పుడు గెలాక్సీని కాపాడ్డానికి రక్షకులు రావద్దూ! అలాగే వచ్చారు, ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ద గెలాక్సీ’లో. వింత మనుషులు, విచిత్ర ఆయుధాలు, అద్భుత శక్తులతో కూడిన ఈ సినిమా 2014లో జులై 21న విడుదలై కాసులు కురిపించింది. త్రీడీ, ఐమాక్స్‌ ఫార్మట్స్‌లో విడుదలై 773 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా 2017లో మరో సినిమా వచ్చింది. ఇంకో సినిమా 2020లో రాబోతోంది.

* కామెడీ అయినా... క్యారెక్టర్‌ అయినా...


ఓ పక్క హాస్యం చిందించగలడు... మరో పక్క భావోద్వేగాలను పండించగలడు... అందుకే రాబిన్‌ విలియమ్స్‌ అంటే సినీ ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఓ ఆస్కార్‌ అవార్డు, రెండు ఎమ్మీ అవార్డులు, ఏడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు, రెండు స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు, నాలుగు గ్రామీ అవార్డులు అతడి ప్రతిభకు గీటురాళ్లు. 1951 జులై 21న షికాగోలో పుట్టిన రాబిన్‌ విలియమ్స్, అమ్మ నేర్పిన హాస్యప్రియత్వంతో చిన్నప్పుడే వేదికలపై హాస్య రూపకాలతో అలరించేవాడు. ఆ తర్వాత టీవీల్లో కామెడీ షోలతో ఆకట్టుకున్నాడు. ఓ పక్క నాటకాలలో నటిస్తూనే, మరో పక్క సినిమాల్లో రాణించాడు. ‘పాపియే’ (1980) సినిమాతో తొలిసారి సినీ ప్రేక్షకులను కీలకమైన పాత్రతో ఆకట్టుకున్న రాబిన్‌ విలియమ్స్, ‘గుడ్‌మార్నింగ్‌ వియత్నాం’, ‘డెడ్‌ పోయెట్స్‌ సొసైటీ’, ‘అలాద్దిన్‌’, ‘ద బర్డ్‌ కేజ్‌’, ‘గుడ్‌విల్‌ హంటింగ్‌’, ‘వరల్డ్స్‌ గ్రేటెస్ట్‌ డాడ్‌’, ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’, ‘జుమాంజీ’, ‘నైట్‌ ఎట్‌ ద మ్యూజియం’ లాంటి సినిమాలతో స్టార్‌డమ్‌ సాధించాడు. కమల్‌ హాసన్‌ నటించిన ‘భామనే సత్య భామనే’ సినిమాకు ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’ సినిమాయే స్ఫూర్తి. అందరినీ సున్నితమైన హాస్యంతో ఆకట్టుకున్న రాబిన్‌ విలియమ్స్‌ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల 2014 ఆగస్టు 11న ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతడి అభిమానులకు ఓ చేదు జ్ఞాపకం.

* ‘కొత్త బంగారు’లోకం హీరో

(వరుణ్‌ సందేశ్‌ పుట్టినరోజు - 1989)


తెరపైకి అడుగుపెట్టడంతోనే ‘హ్యాపీడేస్‌’ని చూసిన కథానాయకుడు వరుణ్‌సందేశ్‌. శేఖర్‌ కమ్ముల స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘హ్యాపీడేస్‌’ ఘన విజయం సాధించింది. అందులో నలుగురు కథానాయకులు నటించగా, అందులో వరుణ్‌ ఒకరు. తొలి చిత్రమే విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన్ని వరుసగా అవకాశాలు వరించాయి. దిల్‌రాజు నిర్మాణంలో, శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన ‘కొత్త బంగారులోకం’తో మరో విజయం లభించింది వరుణ్‌కి. అయితే ఆ స్థాయి విజయాల్ని ఆ తర్వాత నుంచి అందుకోలేకయారు వరుణ్‌. కొన్ని పరాజయాల తర్వాత ‘ఏమైందీ వేళ’ వంటి హిట్టు పడినప్పటికీ వరుణ్‌ కెరీర్‌ గాడిన పడలేదు. ‘ఎవరైనా ఎప్పుడైనా’, ‘కుర్రాడు’, ‘మరో చరిత్ర’, ‘హ్యాపీ హ్యాపీగా’ చిత్రాలు ఓ మోస్తరుగా ఆడాయంతే. ఆ తర్వాత చేసిన చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ‘డి ఫర్‌ దోపిడి’, ‘అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌’ చిత్రాలు కాస్తలో కాస్త ఫర్వాలేదనిపించాయి. ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడైన వరుణ్‌ సందేశ్‌ అమెరికాలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల ‘హ్యాపీడేస్‌’ కోసం ఇచ్చిన ఓ ప్రకటనని చూసి దరఖాస్తు చేసుకొన్నారు. అందులో ఎంపిక కావడంతో హ్యాపీడేస్‌లో కథానాయకుడిగా నటించారు. 2015 తర్వాత ఆయన్నుంచి సినిమాలేవీ రాలేదు. ‘పడ్డామండీ ప్రేమలో మరి’ అనే చిత్రంలో తన సరసన నటించిన కథానాయిక వితిక శేరుతో ప్రేమలో పడిన వరుణ్, ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకొన్నారు. ఈ సంవత్సరంలో ‘నువ్వు తోపురా’ అనే చిత్రంలో సందడి చేశారు. ఈ రోజు వరుణ్‌సందేశ్‌ పుట్టినరోజు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.