జులై 26... (సినీ చరిత్రలో ఈరోజు)

 ప్రపంచ మొట్టమొదటి సినిమా హాలు!


ఇప్పటికీ సినిమా ఓ చక్కని వినోదమే. సన్నిహితులతో కలిసి సినిమా హాలుకు వెళ్లి సినిమా చూడ్డం ఇప్పటికీ ఓ మంచి అనుభూతే. మరి ప్రపంచలో తొలిసారిగా ఆ అనుభూతిని అందించిన సినిమాహాలు ఏంటో తెలుసా? అది తెలియాలంటే 122 ఏళ్ల వెనక్కి వెళ్లాలి. 1896లో జులై 26న ఇదే రోజు ఆ ‘ప్రపంచ సినిమా హాలు’ ప్రారంభమైంది. ఇప్పుడంటే సినిమా అంటే ఏమిటో అందరికీ తెలుసు కానీ, ఆ నాటి రోజుల్లో ఆ సాంకేతికత కొత్త. అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో సినిమా ప్రదర్శన ద్వారా సంపాదన ఆర్జించడానికి కట్టిన తొలి హాలుగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. న్యూయార్క్‌కి చెందిన వ్యాపారవేత్త విలియమ్‌ రాక్, తన భాగస్వామి వాల్టర్‌ వైన్‌రైట్‌తో కలిసి ఒక హాలు నిర్మించి దానికి ‘విటాస్కోప్‌ హాల్‌’ అని పేరు పెట్టారు. అప్పట్లో సినిమా రీళ్లలు తిప్పే ప్రొజెక్టర్‌ పేరే అది. అప్పటికి ఆ ప్రొజెక్టర్‌ను రూపొందించి మూడు నెలలే అయింది. ఆ ప్రొజెక్టర్‌ హక్కులను వాళ్లు 2,500 డాలర్లకు (ఇప్పటి విలువ ప్రకారం 60 వేల డాలర్లు) కొన్నారు. రాళ్లతో నిర్మించిన ఈ హాలులో 400 సీట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ హాలుగా ప్రదర్శించిన సినిమాల నిడివి కొన్ని నిమిషాలే. ‘నయాగరా ఫాల్స్‌’, ‘షూటింగ్‌ ద చూట్స్‌’ లాంటి సినిమాలను ప్రదర్శించారు. టికెట్‌ వెల ఒక ‘డైమ్‌’ (డాలర్‌లో పదో వంతు ఉండే నాణెం). మరో డైమ్‌ ఇస్తే ప్రొజెక్టర్‌ గదిలోకి వెళ్లి చూడనిచ్చేవారు. అవి ‘సినిమా’ ప్రక్రియ పుట్టిన తొలి రోజులు. సినిమాను కనిపెట్టిన లూమియర్‌ బ్రదర్స్‌ ఫ్రాన్స్‌లో తొలిసారిగా సినిమాను ప్రదర్శించిన ఏడు నెలలకే ఈ ‘విటాస్కోప్‌ హాలు’ను నిర్మించడం విశేషం. అయితే చిత్రమేమిటంటే ఈ హాలును అదే సంవత్సరం అక్టోబర్‌లో మూసేశారు. చిత్ర ప్రదర్శనను వేర్వేరు చోట్ల నిర్వహించాలనే ఉద్దేశమే దీనికి కారణం. అమితాబ్‌ గాయపడిన వేళ...


ప్రఖ్యాత నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘కూలీ’ చిత్రాన్ని తల్చుకుంటే చాలు, ఆయన అభిమానుల గుండెలు కలుక్కుమంటాయి. ఆ సినిమా షూటింగ్‌లోనే అమితాబ్‌ తీవ్రంగా గాయపడి దాదాపు మరణం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చారు. ఆయన గాయపడింది సరిగ్గా 37 ఏళ్ల క్రితం ఇదే రోజు... 1982 జులై 26న. ఆ సినిమాలో ఓ పోరాట సన్నివేశాన్ని బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో చిత్రీకరిస్తున్నారు. అమితాబ్, పునీత్‌ ఇస్సార్‌ ఫైటింగ్‌ దృశ్యాలవి. ఆ ఫైట్‌లో భాగంగా అమితాబ్‌ ఒక టేబుల్‌ మీద పడాల్సిన సన్నివేశం అది. అమితాబ్‌ దూకారు... కానీ కొంచెం అంచనా తప్పింది. ఫలితంగా టేబుల్‌ అంచు ఆయన కడుపుకి బలంగా తాకింది. అంతే... అది ‘ఇంటర్నెల్‌ ఎబ్డామినల్‌ ఇంజ్యూరీ’గా పరిణమించింది. వెంటనే ఆయన్ను ముంబై ఆసుపత్రికి తరలించారు. దాదాపు కోమాలాంటి స్థితిలోకి వెళ్లిపోయారు అమితాబ్‌. రెండు నిమిషాల పాట ‘క్లినికల్లీ డెడ్‌’ కండిషన్‌ అది. ఆ వార్త దావాలనంలా దేశమంతా పాకింది. ఆయన కోలుకోవాలని అభిమానులు దేశవ్యాప్తంగానే కాదు, దేశదేశాల్లో కూడా దైవ ప్రార్థనలు జరిపారు. అమితాబ్‌కు 200 రక్తదాతల నుంచి సేకరించిన 60 బాటిల్స్‌ రక్తం ఎక్కించాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఆ రక్తదాతల్లో ఒకరికి ‘హెపటైటిస్‌ బి’ వైరస్‌ ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడినా ఆ వైరస్‌ కారణంగా అమితాబ్‌కు 2000 సంవత్సరంలో లివర్‌ పాడైంది. ‘కూలీ’ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత 1983 జనవరి 7 నుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘కూలీ’ సినిమాలో అమితాబ్‌ గాయపడిన దృశ్యాన్ని ఫ్రీజ్‌ చేసి చూపించారు. పైగా ఆ సినిమా ముగింపును కూడా మార్చారు. మొదట ఆ సినిమాను విషాదాంతం చేయాలనుకున్నారు. అయితే అమితాబ్‌ ప్రమాదం తర్వాత వెలువడిన స్పందనను చూశాక, ఆ సినిమా క్లైమాక్స్‌లో అమితాబ్కు బులెట్‌ గాయాలు అయినట్టు, ఆసుపత్రిలో శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నట్టు చిత్రీకరించి సుఖాంతం చేశారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది. వసూళ్లలో ‘ఆల్‌టైమ్‌ రికార్డు’ సాధించింది. ఒకో ప్రాంతానికి పది మిలియన్ల వంతుల ఆర్జించింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 హాలీవుడ్‌ మేటి దర్శకుడు!


ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే గొప్ప దర్శకుల జాబితా తయారు చేస్తే అందులో స్టాన్లీ కుబ్రిక్‌ పేరు తప్పకుండా ఉండాల్సిందే. ఆశ్చర్యపరిచే వాస్తకవికత, అద్భుతమైన సెట్టింగులు, మర్చిపోలేని సినీమాటోగ్రఫీలతో ఆయన సినిమాలు అలరించాయి. సినీ అభిమానులకు క్లాసిక్‌ సినిమాలుగా ఎప్పటికీ గుర్తుండిపోయే ‘స్పార్ట్‌కస్‌’, ‘ద కిల్లింగ్‌’, ‘పాథ్స్‌ ఆఫ్‌ గ్లోరీ’, ‘వన్‌ ఐడ్‌ జాక్స్‌’, ‘లొలితా’, ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌ లవ్‌’, ‘2001: ఎ స్పేస్‌ ఒడిస్సీ’, ‘బ్యారీ లిండన్‌’, ‘ద షైనింగ్‌’ లాంటి సినిమాలు ఆయన రూపొందించినవే. 1928 జులై 26న పుట్టిన ఈ మేటి దర్శకుడు తన ఆఖరి సినిమా ‘ఐస్‌ వైడ్‌ షట్‌’ తీసిన కొన్నాళ్లకు 1999లో తన 70వ ఏట మరణించాడు. ‘స్పీడ్‌’ నటి... అందాల తార!

  

ఆమె ఆస్కార్‌ గెల్చుకుంది... గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు గెలుచుకుంది... అన్నింటినీ మించి ప్రపంచ సినీ ప్రేక్షకుల అభిమానాన్ని గెల్చుకుంది. అందుకే ఆమె హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికాన్ని పొందిన నటిగా ఎదిగింది. ‘మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఉమన్‌’ గుర్తింపు పొందింది. ఆమే శాండ్రా బుల్లక్‌. ఆమె నటించిన ‘స్పీడ్‌’ సినిమాను అభిమానులు మర్చిపోలేరు. స్పీడ్‌ తగ్గితే చాలు పేలిపోయేలా బాంబును అమర్చిన బస్‌ను నడుపుతూ సాహసవనిత పాత్రలో శాండ్రా ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటించిన ‘డిమోలిషన్‌ మ్యాన్‌’ (1993), ‘వైల్‌ యు వర్‌ స్లీపింగ్‌’ (1995), ‘ఎ టైమ్‌ టు కిల్‌’ (1996), ‘ప్రాక్టికల్‌ మ్యాజిక్‌’ (1998) ‘మిస్‌ కాంజెనిలియాలిటీ’ (2000), ‘క్రాష్‌’ (2004) ‘ఓషన్స్‌ 8’ (2018) లాంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇవాళ ఆమె పుట్టినరోజు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.