జులై 28.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కుందేలు బిలంలోంచి...
మాయా ప్రపంచంలోకి!


అనగనగా ఓ పాప నది ఒడ్డున ఆడుకుంటుంటే, కోటు వేసుకున్న కుందేలు కనిపిస్తుంది. పైగా అది, ‘అబ్బో... ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే వెళ్ళాలి’ అనుకుంటూ హడావుడిగా వెళ్లిపోతూ ఉంటుంది. ఆ పాప, ‘అరె...కుందేలేమిటి? కోటేసుకోవడమేంటి? పైగా మాట్లాడ్డమేంటి?’ అని తెగ ఆశ్చర్యపోయి దాన్ని వెంబడిస్తుంది. ఆ కుందేలు ఓ చెట్టు కింద ఉన్న ఓ బిలంలోకి దూరిపోతుంది. ఆ పాప అందులోకి తొంగి చూస్తూ అనుకోకుండా ఆ బిలంలోకి పడిపోతుంది. లేచి చూస్తే ఏముంది? అదొక మాయా ప్రపంచం. ‘నన్ను తిను’ అని రాసి ఉన్న ఓ బిస్కట్‌ తింటే చాలా పెద్దగా ఎదిగిపోతుంది. భయపడి ఏడుస్తుంటే, ‘నన్ను తాగు’ అని రాసి ఉన్న డ్రింక్‌ తాగగానే, మరీ చిన్నగా మారిపోయి, తన ఏడ్చినప్పుడు కారిన కన్నీళ్లలోనే ఈదాల్సి వస్తుంది. ఇక అక్కడ కనిపించే పువ్వులు, లతలు, జంతువులు అన్నీ ఆశ్చర్యకరమైనవే...

 -ఇంత వరకు చదివాక ‘అలైస్‌ ఇన్‌ ద వండర్‌ ల్యాండ్‌’ గుర్తొస్తే మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉన్నట్టే. లూయిస్‌ కరోల్‌ ఆంగ్ల రచయిత 1865లో రాసిన ‘అలైస్‌ అడ్వెంచర్స్‌ ఇన్‌ వండర్‌ల్యాండ్‌’ నవలలోని అద్భుతమైన కథ ఇది. ప్రపంచంలోనే మంచి పుస్తకాల్లో ఒకటిగా పేరొందిన దీన్ని ఓ స్కూలు కుర్రాడు చదివాడు. ఆ కథ అతడి మనసులో ముద్రించుకుపోయింది. అతడు పెరిగి పెద్దవాడయ్యాక ‘ఎలాగైనా సరే, ఈ కథ ఆధారంగా ఓ మంచి యానిమేషన్‌ సినిమా తీయాల్సిందే’ అనుకున్నాడు. ఆ కుర్రాడెవరో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన సృజనశీలిగా పేరొందిన వాల్ట్‌డిస్నీ. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతడు 1951లో ‘ఎలైస్‌ ఇన్‌ వండర్‌ల్యాండ్‌’ అనే యానిమేటెడ్‌ మ్యూజికల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ సినిమాను వాల్ట్‌డిస్నీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తీయగలిగాడు. ఆ సినిమా 1951 జులై 28న విడుదలైంది.

* ఓ గొప్ప సినిమా... ఓ గొప్ప నటుడు!


ఎనిమిది ఆస్కార్‌ అవార్డులు గెల్చుకున్న ఆ సినిమా వంద గొప్ప సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది... అందులో నటించి ఆస్కార్‌ గెలుచుకున్న నటుడు ప్రపంచంలోని గొప్పనటుల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్నవాడు. ఆ సినిమా ‘ఆన్‌ ద వాటర్‌ ఫ్రంట్‌’ అయితే, ఆ నటుడు మార్లన్‌ బ్రాండో. ఆ సినిమా 1954 జులై 28న విడుదలై అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ‘న్యూయార్క్‌ సన్‌’ దినపత్రికలో 1948లో మాల్కమ్‌ జాన్సన్‌ అనే పరిశోధనాత్మక పాత్రికేయుడు న్యూయార్క్, న్యూజెర్సీ ఓడరేవుల కేంద్రంగా జరుగుతున్న అవినీతి, నేర కార్యకలాపాలను వెలికి తెస్తూ ‘క్రైమ్‌ ఆన్‌ వాటర్‌ఫ్రంట్‌’ పేరిట రాసిన 24 వార్తా కథనాలలోని అంశాల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఆ వ్యాసాలకు ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్‌ బహుమతి లభించింది. వాటి ఆధారంగా నిర్మించిన ఈ సినిమా 12 ఆస్కార్‌ నామినేషన్లు పొంది, 8 అవార్డులు అందుకుంది. ఎలియా కజన్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమాను 9 లక్షల డాలర్లకు పైగా బడ్జెట్‌తో తీయగా, 90 లక్షల డాలర్లకు పైగా రాబట్టింది. ఉత్తమ నటుడిగా ఆస్కార్‌కు ఎంపికైన మార్లన్‌ బ్రాండో వాస్తవిక నటనకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు. ఇది కాక ‘ద గాడ్‌ఫాదర్‌’ (1972) సినిమాకు కూడా ఆస్కార్‌ పొందిన నటుడితడు. అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా కూడా ఇతడు మూడుసార్లు ఎంపికయ్యాడు. శతాబ్దంలోనే అతి ముఖ్యమైన వందమంది వ్యక్తుల్లో ఒకడిగా నిలిచాడు కూడా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.