జులై 3 (సినీ చరిత్రలో ఈరోజు)..

* నట విదుషీమణి!
 ఎస్‌.వి. రంగారావు  (జయంతి-1918)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* స్టైలిష్‌ రాజ్‌కుమార్‌...

  (వర్థంతి- 1996)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* కాలంలోకి ప్రయాణం..

ఉన్న కాలం నుంచి భవిష్యత్తులోకో, గతంలోకో ప్రయాణం చేయించే ‘టైమ్‌ మిషన్‌’ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో ‘ఆదిత్య 369’లాగా ఇవన్నీ సరదా ఊహలను ఆవిష్కరించి విజయవంతమయ్యాయి. అలాంటి సినిమాయే హాలీవుడ్‌ నుంచి వచ్చిన ‘బ్యాక్‌ టుది ఫ్యూచర్‌’. 1985లో ఇదే రోజు విడుదలైన ఈ చిత్రం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రోబర్ట్‌ జెమెకిస్, రచయిత బాబ్‌ గేల్‌ కలిసి ఓసారి కబుర్లు చెప్పుకుంటుంటే టైమ్‌ మిషన్‌ ప్రస్తావన వచ్చింది. అప్పుడు గేల్‌ ‘ఆహా... టైమ్‌ మిషన్‌లో వెనక్కి వెళ్లి మా నాన్న చదివిన స్కూలో చేరి, నాన్నతో స్నేహం చేస్తే బాగుంటుంది కదా?’ అన్నాడు. ఆ ఆలోచనలోంచే ఈ సినిమా పుట్టుకొచ్చింది. ఇందులో ఓ యువకుడు వర్తమానమైన 1985 కాలం నుంచి 1955లోకి గతానికి ప్రయాణం చేస్తాడు. అక్కడ అతడికి తనకు కాబోయే అమ్మ పరిచయం అవుతుంది. చిత్రంగా ఆమె అతడిని ఇష్టపడుతుంది. ఆమె తనకు భవిష్యత్తులో అమ్మ కాబోతోందని తెలిసిన అతడేం చేశాడు, చివరకి ఏమైందనేదే కథ. దాదాపు 19 మిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా 1985లో ఇదే రోజు విడుదలై 381 మిలియన్‌ డాలర్లు రాబట్టింది. ఆస్కార్‌ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు పొందింది. మేటి పది సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా రెండు సినిమాలు వచ్చాయి.

* పేదరికం నుంచి పెద్ద నటుడై...

అరకొర సంపాదనతో నెట్టుకొచ్చే ఓ కుటుంబంలో పుట్టి, కోపిష్టి అయిన తండ్రి చేత దెబ్బలు తింటూ పెరిగిన కుర్రాడు... సరదా కోసం స్కూల్లో డ్రామాలు వేస్తూ నటన పట్ల ఆసక్తి పెంచుకుని... హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా ఎదిగాడు. అతడి సినిమాలన్నీ కలిపి 9 బిలియన్‌ డాలర్లకు పైగా కాసులు కురిపించి నిర్మాతలకు లాభాలు పంచిపెట్టాయి. అతడే టామ్‌క్రూయిజ్‌. మూడు ఆస్కార్‌ నామినేషన్లు, మూడు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు సాధించిన ఇతడి నట ప్రస్థానం 19 ఏళ్ల వయసులో ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ సినిమాతో మొదలైంది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిత్రాలతో దేశదేశాల్లో అభిమానులను ఆకట్టుకున్నాడు. అతడు నటించి 16 చిత్రాలు 100 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించాయి. 23 సినిమాలు 200 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేశాయి. ‘బోర్న్‌ ఆన్‌ ద ఫోర్త్‌ జులై’, ‘జెర్రీ మాగ్వైర్‌’, ‘మేగ్నోలియా’, ‘ద లాస్ట్‌ సమురాయ్‌’, ‘వనిల్లా స్కై’, ‘మైనారిటీ రిపోర్ట్‌’, ‘కొల్లేటరల్‌’, ‘వార్‌ ఆప్‌ ద వరల్డ్స్‌’, ‘నైట్‌ అండ్‌ డే’, ‘ఓబ్లివియన్‌’, ‘ఎడ్జ్‌ ఆఫ్‌ టుమారో’ లాంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. న్యూయార్క్‌లో 1962 జులై 3న పుట్టిన టామ్‌ క్రూయిజ్‌ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడినా, పద్దెనిమిదేళ్ల వయసులో తన తల్లి, సవతి తండ్రి ప్రోత్సాహంతో టీవీల్లో పాత్రల కోసం ప్రయత్నించి సఫలమయ్యాడు. ఆపై అంచెలంచెలుగా ఎదిగి కోట్లకు పడగలెత్తాడు.

* బీమా సొమ్ము కోసం భర్త హత్య


ఓ భార్యకు తన భర్తంటే ఇష్టం ఉండదు. అతడిని చంపేయాలనుకుంటుంది. ఆ సంగతిని తనకు సన్నిహితుడైన ప్రియుడికి చెబుతుంది. అతడొకు బీమా కంపెనీ ఏజెంట్‌. కొన్ని అరుదైన ప్రమాదాల్లో చనిపోతే రెట్టింపు బీమా డబ్బు వస్తుందనే విషయాన్ని చెబుతాడు. ఆ ఇద్దరూ కలిసి అలాంటి అరుదైన పరిస్థితులను కల్పించి ఆమె భర్తను హత్య చేస్తారు. బీమా బిల్లు పాసైపోతుంది. కానీ ఆ కంపెనీలో పనిచేసే ఉన్నతాధికారికి అనుమానం వస్తుంది, అదొక హత్య అని. పరిశోధన మొదలవుతుంది. చివరికేమైంది? అదే సినిమా కథ. ఈ కథతో వచ్చిన ‘డబుల్‌ ఇండెమ్నిటీ’ (1944) సినిమా, హాలీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. జేమ్స్‌ ఎమ్‌. కైన్స్‌ అనే రచయిత లిబర్టీ పత్రికలో రాసిన ఎనిమిది వారాల సీరియల్‌ ఆధారంగా ఈ సినిమాను తీశారు. దీన్ని 9.8 లక్షల డాలర్ల వ్యయంతో తెరకెక్కిస్తే, 50 లక్షల డాలర్లను వసూలు చేసింది. ఇది ‘వంద మేటి అమెరికా సినిమాలు’ జాబితాలో చోటు సంపాదించుకుంది. దీన్ని అమెరికా ‘నేషన్‌ ఫిల్మ్‌ రిజిస్ట్రీ’లో భద్రపరిచారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.