జులై 8.. (సినీ చరిత్రలో ఈరోజు)

ఆశ పుట్టింది... రేవతి అయ్యింది..


టిగా, దర్శకురాలిగా, సామాజిక కార్యకర్తగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు రేవతి. తన ఏడో సంవత్సరం నుంచే భరతనాట్యం నేర్చుకొన్న ఆమె ఆ తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చారు. 1983లో తెరంగేట్రం చేసిన ఆమె, తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. తెలుగులో ఆమె నటించిన పలు చిత్రాలు ఘన విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. 1984లో ‘మానసవీణ’లో అనే చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ఆమె ‘సీతమ్మ పెళ్ళి’, ‘రావుగారిల్లు’, ‘ప్రేమ’, ‘లంకేశ్వరుడు’, ‘అంకురం’, ‘గాయం’, ‘గణేశ్‌’, ‘ఈశ్వర్‌’, ‘గాయం2’, ‘అనుక్షణం’, ‘లోఫర్‌’, ‘సైజ్‌ జీరో’, ‘బ్రహ్మోత్సవం’, ‘యుద్ధం శరణం’ చిత్రాల్లో నటించారు. దర్శకురాలిగా ‘మిత్‌ మై ఫ్రెండ్‌’, ‘ఫిర్‌ మిలింగే’, ‘కేరళ కేఫ్‌’, ‘ముంబై కట్టింగ్‌’ చిత్రాల్ని తెరకెక్కించారు. తమిళం, మలయాళంలో పలువురు కథానాయికలకి ఆమె డబ్బింగ్‌ కూడా చెప్పారు. టెలివిజన్‌తోనూ ఆమెకి మంచి అనుబంధం ఉంది. పలు ధారావాహికల్లో నటించారు. వివిధ విభాగాల్లో మూడు జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకొన్నారు రేవతి. మేజర్‌గా పలు ప్రాంతాల్లో పనిచేసిన కెలున్ని నాయర్‌ రేవతి తండ్రి. రేవతి అసలు పేరు ఆశా. సినిమా కోసం రేవతిగా మార్చుకొన్నారు. 1986లో సురేష్‌చంద్ర మేనన్‌ అనే ఛాయాగ్రాహకుడిని వివాహమాడిన రేవతి ఆయన్నుంచి 2013లో విడిపోయారు. వివిధ భాషల్లో లెక్కలేనన్ని పురస్కారాలు సొంతం చేసుకొన్న రేవతి 1966లో జులై 8న పుట్టింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

కలల దొంగ కథ..


నగనగా ఒక దొంగ. ఏం దోచుకుంటాడో తెలుసా? ఇతరుల మెదడుల్లో ఉన్న సమాచారాన్ని. ఆ శక్తి అతడికి ఎలా వచ్చింది? శత్రు సైనికులను మత్తులోకి దింపి వాళ్ల మెదడులోని రహస్యాలను కనిపెట్టే ఓ ప్రయోగాత్మక సాంకేతికత ద్వారా. దేశ సైనిక విభాగం నుంచి అనుకోకుండా దొరికిన ఈ సాంకేతికత ద్వారా అతడు ఇతరుల మెదడులోని ఊహాలోకాల్లోకి కలలోలాగా వెళ్లిపోగలడు. ఆ శక్తిని జపాన్‌లోని ఓ వ్యాపారవేత్త మీద ప్రయోగించి కోట్లకు పడగెత్తాలనుకుంటాడు. దాన్ని కనిపెట్టిన ఆ వ్యాపారవేత్త ఇతడితో ఎదురు బేరం పెడతాడు. ఆ సాంకేతికతతో తనకి సహాయపడితే ఆ దొంగ నేర చరిత్రనంతా చెరిపివేసేలా చేస్తానని మాట ఇస్తాడు. ఇంతకీ ఈ కలల దొంగ ఏంచేయాలంటే, ఆ వ్యాపారవేత్త పోటీదారుడి కొడుకు మెదడులోకి దూరి అతడి వ్యాపారాలను మూసేసే ఆలోచనను ప్రవేశపెట్టాలి... ఇలా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ సినిమాగా రూపొందిన ‘ఇన్‌సెప్షన్‌’ సినిమా 2010లో ఇదే రోజు విడుదలైంది. ఇందులో దొంగగా టైటానిక్‌ హీరో లియొనార్డో డికాప్రియో నటించాడు. 160 మిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 828 మిలియన్‌ డాలర్లు ఆర్జించడంతో పాటు ఎనిమిది ఆస్కార్‌ నామినేషన్లు పొంది నాలుగింటిని సాధించింది.

ఆమెది ఆస్కార్‌ కుటుంబం


మె తండ్రి ఆస్కార్‌ అందుకున్న దర్శకుడు... ఆమె తాత ఆస్కార్‌ పొందిన నటుడు... అలాంటి కుటుంబంలో పుట్టిన ఆమె ఆస్కార్‌ అందుకోకుండా ఉంటుందా? ఆమే ఏంజెలికా హస్టన్‌. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా, ఫ్యాషన్‌ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ‘ప్రిజీస్‌ ఆనర్‌’ (1985) సినిమాలో నటనకి ఆస్కార్‌ అందుకున్న ఈమె, ‘ఎనిమీస్‌: ఎ లవ్‌ స్టోరీ’, ‘ద గ్రిఫ్టర్స్‌’, ‘క్రైమ్స్‌ అండ్‌ మిస్‌డెమీనర్స్‌’, ‘మన్‌హట్టన్‌ మర్డర్‌ మిస్టరీ’, ‘ద విచెస్‌’, ‘ద ఆడమ్స్‌ ఫ్యామిలీ’, ‘ఎవర్‌ ఆఫ్టర్‌’, ‘బ్లడ్‌ వర్క్‌’ లాంటి సినిమాలతో ఆకట్టుకుని బాఫ్టాలాంటి అవార్డులు అందుకుంది. కాలిఫోర్నియాలో 1951 జులై 8న పుట్టిన ఈమె చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలోనే పెరిగింది. తండ్రి జాన్‌ హస్టన్‌ దర్శకుడు, నిర్మాత. తల్లి మోడల్‌. తాత వాల్టర్‌ హస్టన్‌నటుడు. తండ్రి సినిమాల్లోనే చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ అంచెలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసింది. మోడలింగ్‌తో పాటు బుల్లితెరపై కూడా వెలిగింది. తన అనుభవాలు, జ్ఞాపకాలను క్రోడీకరిస్తూ ‘ఎ స్టోరీ లేట్‌లీ టోల్డ్‌’, ‘వాచ్‌ మి’ పుస్తకాలు రాసింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.