జూన్‌ 10.. (సినీ చరిత్రలో ఈరోజు)

* తండ్రికి తగ్గ తనయుడు

(బాలకృష్ణ పుట్టిన రోజు-1960)


చిత్రసీమలో వారసత్వం ఎంత మేలు చేస్తుందో, అంత బరువుని కూడా మోపుతుంది. ఏం చేసినా తండ్రిలా చేశాడా లేదా? అని పోల్చి చూసుకొంటారు. ఆ విషయంలో ఎప్పటికప్పుడు పెరిగిపోయే అంచనాల భారాన్ని మోయడం కత్తిమీద సామే. కానీ బాలకృష్ణ మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు. ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నాన్నలాగే ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలనని నిరూపించారు. కథ పౌరాణికమైనా... జానపదమైనా... సాంఘికమైనా... నేడు వాటిలో ఒదిగిపోయే నటుడు ఎవరంటే ఒక్క బాలకృష్ణ మాత్రమే కనిపిస్తారు. 1960 జూన్‌ 10న జన్మించిన బాలకృష్ణ 58 యేళ్ల వయసులోనే యువ కథానాయకులకి దీటుగా తెరపై సందడి చేస్తుంటారు. డ్యాన్సులతో అభిమానుల్ని అలరించే బాలకృష్ణ... పోరాట ఘట్టాల్లోనూ డూప్‌ లేకుండా నటిస్తుంటారు. 1974లో ‘తాతమ్మకల’తో తెరపైకొచ్చిన బాలకృష్ణ, తన 44యేళ్ల నట జీవితంలో మరపురాని చిత్రాలెన్నో చేశారు. ఒక పక్క మాస్‌ కథానాయకుడిగా అభిమానుల్ని అలరిస్తూనే, నటుడిగా స్ఫూర్తిదాయకమైన పాత్రల్లో నటించారు. ‘భైరవద్వీపం’లో ఆయన నటనకి కొలమానం లేదంటే అతిశయోక్తి కాదు. గత పదేళ్ల కాలాన్నే తీసుకొంటే... ‘పాండురంగడు’గా భక్తిపారవశ్యంతో అలరించిన ఆయనే, ‘సింహా’గా మాస్‌ అవతారాన్ని ప్రదర్శించారు. ‘లెజెండ్‌’ ఆయనే, ‘డిక్టేటర్‌’ ఆయనే. వందో చిత్రంగా చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో చారిత్ర అంటే మనదే అని నిరూపించారు. అందులో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రస్తుతం తన తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’లో బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలోనే నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంతోనే బాలకృష్ణ నిర్మాతగా మారారు. తన తనయుడు మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే బాలకృష్ణ 104వ చిత్రం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. నటుడిగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* వినోదంలో కొత్త ఒరవడి

(ఈవీవీ సత్యనారాయణ జయంతి-1956)


వినోదంలో ఓ ఠీవి జంధ్యాల తర్వాత ఆ స్థాయి హాస్యంతో ఇంటిల్లిపాదినీ మెప్పించేలా చిత్రాలు తీసిన దర్శకుడు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఈవీవీగా పేరుగాంచిన ఈయన తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. జంధ్యాల శిష్యుడైన ఈవీవీ ‘చెవిలోపువ్వు’తో దర్శకుడిగా మారారు. ఆ సినిమా విజయవంతం కాలేదు. కానీ ఆయన ప్రతిభని గుర్తించిన నిర్మాత డి.రామానాయుడు తన సంస్థలో ‘ప్రేమఖైదీ’ తీసే అవకాశాన్నిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు ఈవీవీ. ‘అప్పుల అప్పారావు’, ‘సీతారత్నంగారి అబ్బాయి’, ‘420’, ‘జంబలకిడిపంబ’, ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘వారసుడు’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘అబ్బాయిగారు’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘హలో బ్రదర్‌’, ‘మగరాయుడు’, ‘ఆమె’, ‘అల్లుడా మజాకా’ ఇలా వరుసగా విజయాలే. 20 యేళ్ల వ్యవధిలో 51 చిత్రాలు తీశారు. అగ్ర కథానాయకులతో పాటు.. యువతరంతోనూ సినిమాలు తీస్తూ ఇంటిల్లిపాదినీ థియేటర్‌కి రప్పించిన ఘనత ఆయనది. పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరులో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన (జూన్‌ 10, 1956) ఆయన చిన్నప్పుడే సినిమాలపై మక్కువ పెంచుకొన్నారు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో మద్రాసు వెళ్లి ‘ఓ ఇంటి భాగోతం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ఆరంభించారు. ఈవీవీకి ఇద్దరు తనయులు. ఒకరు ఆర్యన్‌ రాజేష్, మరొకరు అల్లరి నరేష్‌. ఇద్దరూ కథానాయకులే. అయితే ఆర్యన్‌ రాజేష్‌ కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటుండగా, అల్లరి నరేష్‌ మాత్రం తన జోరును ప్రదర్శిస్తున్నారు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* మెప్పించిన ఎలుగు


నిద్రపోని ఎలుగు కార్టూన్‌ పాత్రలతో ఏమాత్రం అనుబంధం ఉన్నా ‘బార్నీ బేర్‌’ గురించి తెలియకుండా ఉండదు. ‘ఎమ్‌జిఎమ్‌’గా ప్రసిద్ధి చెందిన మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ స్టూడియో వాళ్లు రూపొందించిన ఈ కార్టూన్‌ పాత్ర 1939లో తొలిసారిగా ఇదే రోజు ప్రపంచానికి పరిచయం అయింది. ‘ద బేర్‌ దట్‌ కుడ్‌ నాట్‌ స్లీప్‌’ చిత్రం ద్వారా దర్శకుడు రుడాల్ఫ్‌ ఇసింగ్‌ రూపొందించిన ఈ ఎలుగు బంటి పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షించింది. ఆస్కార్‌ నామినేషన్‌ కూడా పొందింది.

* సంచలన నటి...


అద్భుత గాయని... 45 ఏళ్లకి పైగా కొనసాగిన కళా ప్రస్థానం... అంతర్జాతీయ గుర్తింపు... ఇదీ జుడీ గార్లాండ్‌ అంటే. ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్, స్పెషల్‌ టోనీ, గ్రామీలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకున్న ఆమె ‘ద విజార్డ్‌ ఆఫ్‌ ఓజెడ్‌’ (1939) ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ‘మీట్‌ మీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’, ‘ద హార్వే గర్ల్స్‌’, ‘ఈస్టర్‌ పేరేడ్‌’, ‘సమ్మర్‌ స్టాక్‌’, ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’, ‘జడ్జిమెంట్‌ ఎట్‌ న్యూరెంబర్గ్‌’ లాంటి సినిమాల ద్వారా అభిమానులను అందంతో, నటనతో మెప్పించింది. ప్రతిష్ఠాత్మకమైన సెసిల్‌ బి. డెమిల్లీ జీవన సాఫల్య పురస్కారాన్ని 39 ఏళ్ల చిన్న వయసులో అందుకున్న నటిగా రికార్డు సృష్టించింది. క్లాసిక్‌ అమెరికన్‌ సినిమాల కాలంలో మేటి గొప్ప నటీమణుల్లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. మిన్నిసోటాలో 1922 జూన్‌ 10న పుట్టిన జుడీ గార్లాండ్, రెండున్నరేళ్లకే వేదికపైన ఇద్దరు అక్కలతో కలిసి డ్యాన్స్‌ ప్రదర్శన ఇవ్వడం విశేషం. గానంతో నాట్యంతో ఈ ముగ్గురూ కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అవన్నీ జుడీకి వేదికలు, రేడియో, సినిమాల్లో అవకాశాలను సుగమం చేశాయి. అలా చిన్నతనంలోనే స్టార్‌డమ్‌ వచ్చిన ఈమె వ్యక్తిగతంగా మానసిక ఆందోళనలకు గురై డ్రగ్స్‌కి అలవాటు పడి 47 ఏళ్ల వయసులోనే చనిపోయింది.

* నీలి కళ్ల సుందరి


లీలీ సోబీస్కీ అంటే గబుక్కున గుర్తు రాకపోవచ్చు కానీ, ఆమె నటించిన ‘డీప్‌ ఇంపాక్ట్‌’, ‘ఐస్‌ వైడ్‌ షట్‌’, ‘నెవర్‌ బీన్‌ కిస్డ్‌్’, ‘జోయ్‌ రైడ్‌’, ‘ద గ్లాస్‌ హౌస్‌’ అలాంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమాలను తల్చుకుంటే ఆమె ఇట్టే గుర్తొస్తుంది. నీలి కళ్లతో, అందంతో, అభినయంతో మెప్పించిన ఆమె బుల్లితెర ద్వారా కూడా మెప్పించిన అమెరికా నటి. న్యూయార్క్‌లో 1983 జూన్‌ 10న పుట్టిన లీలీ, చిన్నప్పుడే నటన రంగం కేసి అడుగులేసింది. ‘జంగిల్‌ టు జంగిల్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈమెను ‘డీప్‌ ఇంపాక్ట్‌’ సినిమా అంతర్జాతీయ స్టార్‌ను చేసేసింది.

* అందరినీ అలరించిన...

‘చిలకా గోరింక’


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.